బీజేపీలో చేరిన నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు.. ఎంపీల ‘విలీనం’పై లీగల్ యాక్షన్ తీసుకుంటామన్న టీడీపీ

ఫొటో సోర్స్, facebook/BJP4India
బీజేపీలో చేరిన తమ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నామని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు గల్లా జయదేవ్ అన్నారు.
తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కానీ, పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ఉన్న తనకు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారు తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు.
కాగా, తమ పార్టీ ఎంపీలు చేసిన విలీనం చెల్లదని, వారిది ఫిరాయింపేనని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. న్యాయపరంగా ఏం చేయాలనేది తాము చూసుకుంటామని ఆయన చెప్పారు. బీజేపీ ఇలాంటి ఫిరాయింపులకు పాల్పడటం సరికాదన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరడమే మూడ్ ఆఫ్ ది నేషనా? అని ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు.
ఈ అంశంపై సహచర ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్, తోట సీతారామలక్ష్మిలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
బీజేపీలో చేరిన సుజనా, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాజ్యసభాపక్ష నాయకుడుగా ఉన్న సుజనా చౌదరి, ఎంపీలు సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు బీజేపీలో చేరారు. రాజ్యసభలోని తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ ఈ నలుగురు ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడును కోరారు.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుటుంబంతో పాటు విదేశీ యాత్రలో ఉన్న సంగతి ఈ సందర్భంగా గమనార్హం.
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వీరికి బీజేపీ కండువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే, పార్లమెంటులో కాలికి గాయమైన గరికపాటి మోహనరావు చికిత్స తీసుకుంటున్నారని, అందుకే రాలేకపోయారని బీజేపీ నాయకులు భూపేందర్ చెప్పారు.

ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ..
‘‘సుజనా, రమేశ్, టీజీ, మోహనరావులు చాలా కాలంగా ఈ విషయం గురించి ఆలోచిస్తున్నారు. మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధికి చేపట్టిన చర్యలు, అమిత్ షా వ్యవస్థీకృత నైపుణ్యాలతో పార్టీ ఎదిగిన తీరు చూసి ఏపీ అభివృద్ధి కోసం, సానుకూల దృక్ఫథంతో బీజేపీలో విలీనం కావాలని భావించారు. ఈ రోజు ఉదయమే చర్చ జరిగింది. తమ పార్టీని బీజేపీలో విలీనం చేయాలనుకుంటున్నట్లు వారు చెప్పారు. ఈ మేరకు అమిత్ షాతో చర్చించి చర్యలు తీసుకున్నాం. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడును కలిసి లేఖ కూడా ఇచ్చాం. టీడీఎల్పీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు వారు, స్వీకరిస్తున్నట్లు మేమూ వెంకయ్యకు లేఖలు ఇచ్చాం. ఇక వీళ్లు బీజేపీ సభ్యలు. భారతీయ జనతా పార్టీ సానుకూల, సమీకృత రాజకీయాలను విశ్వసిస్తుంది. అందరితో పాటు, అందరి అభివృద్ధి, అందరి విశ్వాసం.. అలా అందరి విశ్వాసంతో ముందుకెళ్తున్నాం. నాకు నమ్మకం ఉంది.. ఈ నలుగురూ ఏపీలో క్షేత్రస్థాయి నాయకులు. వీరితో పాటు సానుకూలంగా పనిచేస్తే ఏపీలో బీజేపీకి మద్దతు లభిస్తుంది. తద్వారా ఏపీలో బీజేపీని బలోపేతం చేస్తాం’’ అన్నారు.

‘సహకారం, సమన్వయంతోనే పనిచేయాలి తప్ప పోటీ పడి, గొడవలు పడి పనిచేయకూడదు’ - సుజనా చౌదరి
‘‘తాజా ఎన్నికల ద్వారా దేశం మూడ్ ఎలా ఉందో అంతా చూశారు. దాంతో మేం కూడ దేశ నిర్మాణంలో భాగం కావాలనుకున్నాం. అది ఒక కారణం. నా వరకూ నేను మూడున్నరేళ్ల పాటు కేంద్ర సహాయ మంత్రిగా ప్రధాని నేతృత్వంలో పనిచేశాను. దేశ నిర్మాణం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. పలు కారణాల వల్ల ఏపీ ఇబ్బంది పడింది. ఏపీ అభివృద్ధికి, విభజన చట్టంలో చేసిన హామీలను వీలైనంత త్వరగా అమలు చేసేందుకు ఇదే సరైన వేదిక అని మేం భావించాం. సహకారం, సమన్వయంతోనే పనిచేయాలి తప్ప పోటీ పడి, గొడవలు పడి పనిచేయకూడదని నిర్ణయించుకున్నాం’’ అని సుజనా చౌదరి చెప్పారు.

టీడీపీ రాజ్యసభాపక్షం బీజేపీలో విలీనం
రాజ్యసభలోని తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ నలుగురు తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడును కోరారు.
ఈ మేరకు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో వెంకయ్య నాయుడును కలిసి స్వయంగా లేఖ ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ రాజ్యసభాపక్ష నాయకుడు వైఎస్ చౌదరి, ఉప నాయకుడు సీఎం రమేశ్, ఎంపీలు గరికపాటి మోహనరావు, టీజీ వెంకటేశ్ ఈ లేఖపై సంతకాలు చేశారు.
అయితే, ఇప్పటి వరకు సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ తమ నిర్ణయాన్ని స్వయంగా మీడియాకు వెల్లడించారు.
‘బీజేపీలో చేరుతున్నాను. టీడీపీకి వీడుతున్నాను. 7 గంటలకు విలేకరుల సమావేశంలో అన్ని విషయాలూ వెల్లడిస్తా’ అని సుజనా చౌదరి చెప్పారు.
‘‘రాజ్యసభలో ఆరుగురు ఎంపీలం ఉన్నాం. రాజ్యసభలో బీజేపీకి ఎంపీల బలం కావాలి. మాది వెనుకబడిన ప్రాంతం. దాన్ని అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. నాకు బీజేపీతో ఎన్నో దశాబ్ధాలుగా అనుబంధం ఉంది. మేం బీజేపీలో చేరుతున్నాం. అంటే దాని అర్థం తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లే కదా..’ అని టీజీ వెంకటేశ్ ఏఎన్ఐ వార్తా సంస్థతో అన్నారు.

సుజనా చౌదరిపై ఈడీ, సీబీఐ కేసులు
మూడు బ్యాంకులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా 2017లో సీబీఐ బ్యాంకింగ్ సెక్యూరిటీస్, ఫ్రాడ్ సెల్ సుజనా చౌదరి కంపెనీలపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది.
సీబీఐ వేసిన కేసుల తరువాత ఈడీ కూడా కేసులు నమోదు చేసి సుజనా చౌదరి ఆస్తులు అటాచ్ కూడా చేసింది. సీబీఐ వేసిన ఈ మూడు ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా మనీ లాండరింగ్ చట్ట ప్రకారం అక్టోబర్ 2018లో విచారణ మొదలు పెట్టింది.
ఈడీ ఇచ్చిన ప్రకటన ప్రకారం బీఈసీపీఎల్, ఇతర సుజనా గ్రూప్ కంపెనీలు సుజనా చౌదరి అధ్యక్షతన పని చేస్తున్నాయి.
మళ్లీ నవంబర్ 23, 2018లో హైదరాబాద్‌లోని 7 స్థానాల్లో, దిల్లీలో ఒక స్థానంలో సోదాలు నిర్వహించింది ఈడీ. ఈ సోదాల్లో సుజనా గ్రూప్ కంపెనీలు రూ. 5,700 కోట్ల పైగా బ్యాంకులను మోసం చేసినట్టు వెల్లడైందని దర్యాప్తు సంస్థ తెలిపింది.
నవంబర్ 27, 2018న విచారణకు హాజరు కావాలని సమన్లు కూడా జారీ చేసింది ఈడీ.
అయితే, సుజనా చౌదరి సీబీఐ విచారణకు హాజరు కాలేదు.
''ఈడీ చేసిన సోదాలపై లీగల్‌గా వెళ్తా.. చర్చలు జరుపుతున్నాం. 2009 ఎన్నికల తరువాత నాపై ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి. నిజంగా ఏదైనా అక్రమాలు జరిగితే చట్టపరంగా ఎదుర్కొంటాం. పీఎంఎల్ఐ యాక్ట్ ప్రకారం మాత్రమే సమన్లు ఇచ్చారు. నా ఆస్తుల విలువ అప్పుల కంటే ఎక్కువగానే ఉంది. నా కంపెనీల్లో శ్రీనివాస్ ఎలాంటి పెట్టుబడులూ పెట్టలేదు. ఈడీ చేసిన సోదాలు తొందరపాటు చర్యగా కనిపిస్తోంది'' అని సుజనా చౌదరి అప్పట్లో తెలిపారు.
సీఎం రమేశ్ ఇంటిపై ఐటీ దాడులు
2018 అక్టోబర్ 12వ తేదీన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి.
కడప జిల్లాలోని స్వగ్రామం పొట్లదుర్తి, హైదరాబాద్ నగరంలో ఉన్న ఆయన నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి:
- ‘టీడీపీని బీజేపీలో విలీనం చేయండి’ - వెంకయ్య నాయుడిని కోరిన సుజనా, సీఎం రమేశ్, గరికపాటి, టీజీ
- మహాకూటమి చంద్రబాబు వల్ల నష్టపోయిందా?
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం
- అభిప్రాయం: చంద్రబాబు అంటేనే కూటమి రాజకీయాలు
- బీజేపీకి ఇది స్వర్ణయుగమా?
- మోదీ-అమిత్ షా ద్వయాన్ని ఎదుర్కోగల ప్రతిపక్షమేదీ?
- టీకాలు ఎలా పనిచేస్తాయి? టీకాల విజయం ఏమిటి? టీకాలపై కొందరిలో సంశయం ఎందుకు?
- ప్రపంచకప్ నుంచి శిఖర్ ధావన్ ఔట్
- 14 ఏళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు ఉత్తర కొరియాకు ఎందుకు వెళ్తున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








