యుఎన్‌హెచ్‌సీఆర్: 2018లో ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల మంది వలస.. 70 ఏళ్లలో ఇదే అత్యధికం

వెనెజ్వెలా నుంచి వలస వెళుతున్న ప్రజలు

ఫొటో సోర్స్, LUIS ACOSTA/AFP/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, 2018లో వెనెజ్వెలా సంక్షోభం కారణంగా 40 లక్షలమంది వెనెజ్వెలా నుంచి వలస పోయారు. ఇది ప్రపంచంలో ఈమధ్య జరిగిన అతిపెద్ద వలసల సంక్షోభం.

యుద్ధం, ఘర్షణ, హింస.. వివిధ కారణాలతో గతేడాది ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల మందికిపైగా ప్రజలు వలస పోయారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. 70 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యధికం అని శరణార్థుల సంరక్షణ కోసం ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి శరణార్థుల సంస్థ యు.ఎన్‌.హెచ్.సి.ఆర్ సంస్థ పేర్కొంది.

యుఎన్‌హెచ్‌సీఆర్ వార్షిక నివేదిక ప్రకారం, 2017 సంవత్సరం కంటే 23 లక్షల మంది ఎక్కువగా వలసపోయారు. 20 ఏళ్ల కిందటి పరిస్థితుల కంటే ప్రస్తుతం వలసపోయినవారి సంఖ్య రెట్టింపు. ప్రస్తుత గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రోజుకు 37వేల మంది కొత్తగా వలస పోతున్నారు.

''యుద్ధం, హింస, నుంచి ప్రాణ రక్షణ కోసం వలస పోతున్న ప్రజల సంఖ్య భవిష్యత్తులో ఇంకా పెరగొచ్చని ప్రస్తుత గణాంకాలు చూస్తే అర్థమవుతోంది'' అని ‘ఐక్యరాజ్య సమితి హై కమిషనర్ ఫర్ రెఫ్యుజీస్’(యున్‌హెచ్‌సీఆర్) ఫిలిప్పో గ్రాన్డి అన్నారు.

శరణార్థ బాలిక

ఫొటో సోర్స్, EPA

ఈ విషయంపై మాట్లాడుతూ.. ''శరణార్థులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినపుడు, వారికి ఆశ్రయం కల్పించిన ప్రాంత ప్రజలు శరణార్థుల పట్ల చూపుతున్న ఔదార్యంను మనం చూస్తున్నాం'' అని ఆయన అన్నారు.

పెరుగుతోన్న ప్రపంజ జనాభాతోపాటు, వలస పోతున్న శరణార్థుల జనాభా కూడా పెరుగుతోంది. 1951 సంవత్సరం నుంచి వలస పోయిన శరణార్థుల జనాభాను గమనిస్తే, 1992లో ప్రతి వెయ్యిమందిలో శరణార్థులు, వలస పోయినవారి సంఖ్య 3.7గా నమోదైంది. 2017 వరకు ఇదే అత్యధికం. కానీ 2018లో ఇందుకు రెట్టింపు కంటే ఎక్కువగా ప్రతి వెయ్యిమందిలో 9.3 మంది వలస పోయారు.

వెనెజ్వెలా సంక్షోభం కారణంగా వలస పోయినవారి సంఖ్య, 2018 గణాంకాలపై ప్రభావం చూపింది. వెనెజ్వెలా నుంచి వలసపోయిన వారికి ఆశ్రయం కల్పించిన దేశాల గణాంకాల ఆధారంగా, మొత్తం 40లక్షల మంది వెనెజ్వెలాను వీడారు. ఇది ప్రపంచంలో ఈమధ్య జరిగిన అతిపెద్ద వలసల సంక్షోభం.

ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన కొళాయి వద్ద నీళ్లు తాగుతున్న శరణార్థ బాలిక

ఫొటో సోర్స్, Reuters

ఐక్యరాజ్య సమితి వార్షిక నివేదిక.. ఈ వలసలను మూడు వర్గాలుగా విభజించింది.

అందులో మొదటి రకం... యుద్ధం, ఘర్షణల కారణంగా బలవంతంగా దేశం వదిలి వలసపోయినవారు. 2018లో ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల సంఖ్య 2.5 కోట్లకు చేరింది. 2017 కంటే 5లక్షల మంది ఎక్కువ! వీరిలో 50 లక్షలమందికిపైగా పాలస్తీనా శరణార్థులు ఉన్నారు.

స్వదేశం వీడి, అంతర్జాతీయ రక్షణ కోసం విదేశాలకు వెళ్లినవారు రెండో రకం. వీరు ఆశ్రయం పొందిన దేశాలు, వీరికింకా శరణార్థి హోదా ఇచ్చివుండవు. ఇలాంటి వలసలు ప్రపంచవ్యాప్తంగా 35 లక్షలు నమోదయ్యాయి.

ఇక మూడవ వర్గం వలసలు.. అంతర్జాతీయ నిర్వాసితుల వలసలు. వీరు స్వదేశంలోనే వలస పోయుంటారు. వీరి సంఖ్య 4.1 కోట్లు.

పడవ ప్రమాదంలో శరణార్థులు

ఫొటో సోర్స్, ITALIAN NAVY/AP

ఫొటో క్యాప్షన్, యూరప్‌కు వలస వెళుతున్న సందర్భంలో ఇలాంటి ప్రమాదాల్లో చాలామంది శరణార్థులు మరణించారు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థుల్లో మూడులో రెండో వంతుకు పైగా వలసలు సిరియా, అఫ్ఘానిస్తాన్, దక్షిణ సూడాన్, మయన్మార్, సోమాలియా దేశాల్లోనే జరిగాయి. ఈ దేశాల్లో 60.7 లక్షల వలసలతో సిరియా అగ్రస్థానంలో ఉంటే, ఆ తర్వాతి స్థానంలో 20.7లక్షల వలసలతో అఫ్ఘానిస్తాన్ నిలిచింది.

2018లో 92,400 మందికి మాత్రమే పునరావాసం కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా బలవంతంగా నిర్వాసితులైనవారి జనాభా 2009లో 4.3 కోట్లు ఉంటే, ప్రస్తుతం వారి జనభా గణనీయంగా పెరిగింది. సిరియా యద్ధం కారణంగా 2012-2015 సంవత్సరాల మధ్య వలసలు పెరిగాయి.

ఈ పెరుగుదలకు, ఆ సమయంలో జరిగిన సిరియా యుద్ధం ప్రధాన కారణం అని చెప్పొచ్చు.

ప్రపంచవ్యాప్తంగా జరిగిన యుద్ధాలు, ఘర్షణల వల్ల కూడా వలసలు పెరిగాయి. ఇరాక్, యెమెన్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, దక్షిణ సూడాన్ దేశాలే అందుకు ఉదాహరణలు.

శరణార్థ శిబిరంలోని పిల్లలు

ఫొటో సోర్స్, Getty Images

2017 చివర్లో మిలిటరీ అణిచివేత కారణంగా మయన్మార్ నుంచి రొహింజ్యాలు బంగ్లాదేశ్‌కు పెద్దఎత్తున వలస వెళ్లారు.

2018లో కొత్తగా నిర్వాసితులైనవారిలో ఎక్కువ మంది ఇథియోపియా ప్రజలు ఉన్నారు. 2018లో ఇథియోపియాలో 2018లో చోటుచేసుకున్న మత ఘర్షణల కారణంగా 15లక్షల ఇథియోపియన్లు వలస వెళ్లారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)