భారత్‌లో పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువుల పరిస్థితి ఎలా ఉంది?

ఫొటో సోర్స్, NARAYAN BARETH/BBC
- రచయిత, నారాయణ్ బారెఠ్
- హోదా, బీబీసీ కోసం
పాకిస్తాన్ నుంచి శరణార్థులుగా వచ్చి భారత పౌరసత్వం పొందిన హిందువులు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. అయితే, అందరి పరిస్థితీ అలా లేదు.
ఏళ్ల క్రితం భారత్‌కు వచ్చినా పౌరసత్వం దక్కని హిందూ శరణార్థులు వేల సంఖ్యలోనే ఉన్నారు. వారి జీవితాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. ఎన్నికల వేళ అలాంటి వారి సమస్యలు మరోసారి తెర మీదకు వచ్చాయి.
ఎన్నికల ప్రచార సభల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతూ కాంగ్రెస్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల విమర్శలు చేశారు.
మరోవైపు శరణార్థులను బీజేపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని, ఐదేళ్లలో వారి కోసం ఏమీ చేయలేదని కాంగ్రెస్ అంటోంది.
పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూ శరణార్థుల కోసం 'సీమాంత్ లోక్ సంఘటన్' అనే సంస్థ పోరాడుతోంది.
ఆ సంస్థ అంచనా ప్రకారం ఇంకా పౌరసత్వం దక్కని హిందూ శరణార్థులు రాజస్థాన్‌లో 35 వేల మంది దాకా ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పౌరసత్వం పొందినవారి మాటేంటి?
గత ఐదేళ్లలో భారత పౌరసత్వం పొందిన హిందూ శరణార్థుల సంఖ్య కేవలం వందల్లోనే ఉంది.
వారిలో పాక్‌లోని సింధ్ ప్రావిన్స్ నుంచి వచ్చిన డాక్టర్ రాజ్‌కుమార్ భీల్ కూడా ఒకరు. భారత పౌరసత్వం కోసం ఆయన 16 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. ఇన్నాళ్లకు ఇక్కడ ఆయనకు ఓటు వేసే అవకాశం వచ్చింది.
''ఈ ఆనందాన్ని నేను మాటల్లో వర్ణించలేను. నాకిది దీపావళి కన్నా పెద్ద పండుగ. అది ఏడాదికోసారి వస్తుంది. నాకు ఓటు వేసే అవకాశం 16 ఏళ్లకు వచ్చింది'' అంటూ భీల్ ఆనందం వ్యక్తం చేశారు.
పాకిస్తాన్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేసి వచ్చిన చేతన్ దాస్‌కు కూడా కొన్ని నెలల క్రితమే భారత పౌరసత్వం లభించింది. అయితే, ఆయన అసంతృప్తితో ఉన్నారు.
''మా కుటుంబంలో 12 మంది ఉన్నాం. నాకు ఒక్కడికే పౌరసత్వం వచ్చింది. ఇందుకోసం 19 ఏళ్లు వేచిచూడాల్సి వచ్చింది. మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని భయంగా ఉంది. నా కుమార్తె ఇక్కడే బీటెక్ వరకూ చదువుకుంది. ఉద్యోగం కోసం వెళ్లినప్పుడు పౌరసత్వం ఉన్నట్లు పత్రాలు తెమ్మనేవారు. ఈ ఇబ్బందులన్నీ భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. భరోసా ఇచ్చే మాటలు అందరూ చెబుతుంటారు. కానీ వాటితో పని జరగదు'' అని చేతన్ చెప్పారు.

ఫొటో సోర్స్, NARAYAN BARETH/BBC
'మధ్యవర్తుల వసూళ్లు'
రెండేళ్ల క్రితం పౌరసత్వం జారీ చేసే అధికారాన్ని జిల్లా అధికారులకు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అయితే ప్రక్రియలు మాత్రం నత్తనడకన సాగుతున్నాయని సీమాంత్ లోక్ సంఘటన్ అధ్యక్షుడు హిందూ సింగ్ సోఢా అన్నారు.
''పౌరసత్వం కోసం వేచిచూస్తున్నవారు ప్రస్తుతం 35 వేల మంది దాకా ఉన్నారు. వీరిలో కేవలం వెయ్యి మందికే అది దక్కే అవకాశాలున్నాయి. భవిష్యత్తుపై నిరాశ, ఆందోళనలతో జనం బతుకుతున్నారు. ఈ పరిస్థితిని అదనుగా చేసుకుని ప్రభుత్వ శాఖల్లో మధ్యవర్తుల ముఠాలు తయారయ్యాయి. శరణార్థుల నుంచి వాళ్లు డబ్బు వసూళ్లు చేస్తుంటారు. వెనక్కి పంపిస్తామంటూ బెదిరిస్తుంటారు'' అని సోఢా చెప్పారు.
రెండేళ్ల క్రితం ఇలాంటి ఓ ముఠా దొరికిపోయింది. అందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కూడా సభ్యుడిగా ఉన్నారు.
పాక్ నుంచి శరణార్థులుగా వచ్చిన హిందువుల్లో చాలా మంది జోధ్‌పూర్‌లో ఉంటున్నారు. బికనేర్, జాలోర్‌లతోపాటు హరియాణాలోనూ వీరు నివసిస్తున్నారు.
ఏళ్లుగా భారత్‌లో ఉంటున్నా కొందరు ఇంకా తమను పాకిస్తానీలని పిలుస్తుంటారని మహేంద్ర అనే హిందూ శరణార్థి ఆవేదన వ్యక్తం చేశారు.
''మేం భారత్‌కు వచ్చి 20 ఏళ్లు గడిచాయి. ఇంకా కొందరు మమ్మల్ని పాకిస్తానీలని పిలుస్తుంటారు. చాలా బాధగా అనిపిస్తుంది. మా పిల్లలు ఇక్కడే పుట్టారు. వాళ్లనీ పాకిస్తానీలని అంటుంటారు'' అని మహేంద్ర అన్నారు.
పూర్ణదాస్ మేఘ్వాల్ పాక్‌లోని రహీమ్యారఖా జిల్లాలో ఉండేవారు. సుమారు 20 ఏళ్ల క్రితమే ఆయన భారత్‌కు వచ్చేశారు. ఇంకా ఆయనకు భారత పౌరసత్వం రాలేదు.
ఎప్పటికైనా భారత ఎన్నికల్లో ఓటు వేసే హక్కు తనకు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, NARAYAN BARETH/BBC
'సవ్యంగా ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తారు?'
2017లో చందూ భీల్ అనే శరణార్థి కుటుంబాన్ని పోలీసులు బలవంతంగా పాక్‌కు తిప్పిపంపారు.
ఆ కుటుంబాన్ని భారత్‌లో ఉండనివ్వాలంటూ అప్పుడు సీమాంత్ లోక్ సంఘటన్ హైకోర్టును ఆశ్రయించింది.
కోర్టు స్టే విధిస్తూ ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే అప్పటికే చందూను, ఆయన కుటుంబానికి చెందిన తొమ్మిది మందిని థార్ ఎక్స్‌ప్రెస్ రైలులో పోలీసులు పాక్‌కు పంపించేశారు.
పాక్‌కు తిప్పిపంపితే అక్కడ వారెలాంటి పరిస్థితులు అనుభవించాల్సి ఉంటుందన్నది ఆలోచించాలని భారత ప్రభుత్వానికి చేతన్ విజ్ఞప్తి చేశారు.
''సొంత ఇల్లు, ఊరును శాశ్వతంగా విడిచిపెట్టి రావడానికి ఎవరికైనా ఎంత బాధగా ఉంటుంది? అక్కడ అంతా సవ్యంగా ఉంటే వారు ఇక్కడికి ఎందుకు వస్తారు?'' అని చేతన్ మేఘవాల్ అన్నారు.

'కాంగ్రెస్ పట్టించుకోలేదు'
హిందూ శరణార్థులకు పౌరసత్వం కల్పించే విషయంపై కృషి చేస్తానని బార్మర్, జోధ్‌పూర్ ఎన్నికల సభల్లో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
వారి సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహరించిందని ఆయన అన్నారు.
అయితే ప్రధాని నిరాధారమైన ఆరోపణలు చేశారని రాజస్థాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పంకజ్ మెహతా విమర్శించారు.
''చందూ భీల్ కుటుంబాన్ని బలవంతంగా పాక్‌కు తిప్పిపంపింది బీజేపీ ప్రభుత్వ హయాంలోనేనని వారికి తెలిసే ఉంటుంది. కాంగ్రెస్ ఇలా ఎప్పుడూ చేయలేదు. శరణార్థుల విషయాన్ని బీజేపీ మధ్యవర్తులకు వదిలేసింది. ఎన్నికలు రాగానే ఇప్పుడు మళ్లీ వారి నామస్మరణ చేస్తోంది'' అని అన్నారు.
2004-05లో రాజస్థాన్‌లో దాదాపు 13 వేల మంది హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం లభించింది. అందుకున్నవారిలో దళితులు, ఆదివాసీ భీల్ వర్గం వారు ఎక్కువగా ఉన్నారు.
పశ్చిమ రాజస్థాన్‌లో హిందూ శరణార్థులు, వారి బంధువులు పెద్ద సంఖ్యలో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
''మా కష్టనష్టాలను పట్టించుకునేవారికే మా వాళ్లు ఓట్లు వేస్తారు. పౌరసత్వం కోసం మేమెంతో కష్టపడాల్సి వచ్చింది. మిగతావారూ ఇలాంటి ఇబ్బందులు పడకూడదు'' అని డాక్టర్ రాజ్‌కుమార్ భీల్ అన్నారు.
ఇవి కూడా చదవండి
- అందరికీ మరుగుదొడ్లు కల్పిస్తామన్న మోదీ హామీ నెరవేరిందా...
- Reality Check: రుణ మాఫీ పథకాలతో రైతుల కష్టాలు తీరుతాయా?
- BBC Reality Check: విమానాశ్రయాల నిర్మాణాలపై బీజేపీ లెక్కల్లో నిజమెంత?
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
- అంతరిక్షంలో అత్యధికంగా చెత్త నింపే దేశం ఏదో తెలుసా...
- BBC Reality Check: భారత దేశంలో నిరుద్యోగం పెరిగిందా? లేక తగ్గిందా?
- ఈ మరుగుజ్జు గ్రహానికి పేరు పెట్టే ఛాన్స్ మీదే
- 1.. 2.. 3.. సంగతి సరే.. అసలు సున్నా ఎలా పుట్టింది? దీన్ని భారతీయులు ఎలా కనిపెట్టారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








