చెర్నోబిల్: భారీ అణు విషాదానికి 33 ఏళ్లు.. అసలు ప్రమాదం ఎలా జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
సరిగ్గా 33 ఏళ్ల క్రితం 1986 ఏప్రిల్ 26న కొన్ని సెకన్ల వ్యవధిలోనే ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర అణు ప్రమాదం సంభవించింది. చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో 1986 ఏప్రిల్ 25 అర్ధరాత్రి దాటాక 1:23 గంటలకు విద్యుత్ కేంద్రం భద్రతను పరీక్షించేందుకు చేపట్టిన ప్రయోగం విఫలమవడంతో ఇది తలెత్తింది.
విద్యుత్ సరఫరా ఆగిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేసేందుకు ఇంజినీర్లు ఈ కీలక ప్రయోగాన్ని చేపట్టారు.
ఇందులో భాగంగా - అణు విద్యుత్ కేంద్రంలోని నాలుగో నంబరు రియాక్టర్‌లో కొన్ని వ్యవస్థలకు విద్యుత్ సరఫరాను నిలిపేశారు. ప్రయోగం చేపట్టడానికి ముందు, రియాక్టర్ అప్పటికే అస్థిరంగా పనిచేస్తోందన్న విషయం ఇంజినీర్లకు తెలియదు.
కరెంటు సరఫరా నిలిపేయడంతో రియాక్టర్‌కు కూలింగ్ వాటర్‌ను పంపే టర్బైన్లు నెమ్మదించాయి. కూలింగ్ వాటర్ సరఫరా తగ్గిపోయింది, అదే సమయంలో రియాక్టర్లో ఆవిరి కారణంగా పీడనం పెరిగిపోయింది. ఆపరేటర్లు ఏం జరుగుతోందో గుర్తించి, రియాకర్ట్ ఆపేద్దామని ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది.

ఆవిరి కారణంగా జరిగిన పేలుడుతో రియాక్టర్ లిడ్ (మూత) తొలగిపోయింది. రియాక్టర్‌లోని 'కోర్' బయటి వాతావరణంపై ప్రభావం చూపడం మొదలైంది. విద్యుత్ కేంద్రంలోని ఇద్దరు చనిపోయారు. గాలి కారణంగా మంటలు రేగాయి. అవి పది రోజులపాటు కొనసాగాయి.
రియాక్టర్ నుంచి వెలువడుతున్న ప్రమాదకర పొగను నియంత్రించేందుకు అత్యవసర సేవల సిబ్బంది రంగంలోకి దిగారు.
రేడియోధార్మికత వల్ల 134 మంది తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 28 మంది కొన్ని నెలల్లోనే చనిపోయారు. ఆ తర్వాత మరో 19 మంది మరణించారు.
చెర్నోబిల్ నుంచి వెలువడిన రేడియో ధార్మికతతో కూడిన పొగ, వ్యర్థాలు గాల్లో కలిసిపోయి ఐరోపా వ్యాప్తంగా కొన్ని వేల కిలోమీటర్ల మేర విస్తరించాయి.
చెర్నోబిల్ నాటి సోవియట్ యూనియన్‌లో భాగమైన ప్రస్తుత యుక్రెయిన్‌లోని ఉత్తర ప్రాంతంలో ఉంది.

ఫొటో సోర్స్, Reuters
లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
ప్రమాదం అనంతరం అణు విద్యుత్ కేంద్రానికి సమీప ప్రాంతాల నుంచి సుమారు లక్షా 16 వేల మందిని హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అణు విద్యుత్ కేంద్రానికి 30 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని ప్రవేశ నిషేధ ప్రాంతం (ఎక్స్‌క్లూజన్ జోన్)గా ప్రకటించారు. తర్వాత మరింత ప్రాంతాన్ని దీని పరిధిలోకి తీసుకొచ్చారు.
కొన్ని నెలల తర్వాత 2.34 లక్షల మందిని చెర్నోబిల్ ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
దాదాపు అందరూ ఉన్నఫళంగా ఖాళీ చేయాల్సి వచ్చింది. కొంత మందికైతే అధికారులు కొన్ని గంటల సమయమే ఇచ్చారు.
మరికొందరికి కొన్ని రోజుల్లో తిరిగి వస్తారని చెప్పి తరలించారు. కానీ వారు ఎన్నటికీ తిరిగి స్వస్థలాలకు రాలేకపోయారు.

నిర్వాసితుల్లో చాలా మంది రైతులు
అతి కొద్ది మంది మాత్రమే నిషేధిత జోన్ నుంచి వేరే చోటకు వెళ్లకుండా ఉండిపోయారు.
ఈ జోన్‌లో నివసించడం నిబంధనలకు విరుద్ధం. అయినప్పటికీ నేటికీ దాదాపు 130 మంది ఇందులోనే ఉంటున్నారు. వీరిలో చాలా మంది మహిళలు.
ఈ జోన్ యుక్రెయిన్‌తోపాటు బెలారస్‌లో మొత్తం నాలుగు వేలకు పైగా చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. లండన్ విస్తీర్ణంతో పోలిస్తే ఇది రెండింతల కన్నా ఎక్కువ.
ఈ జోన్‌లో ఆహారోత్పత్తి కోసం సాగు చేయకూడదు. ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలూ చేపట్టకూడదు.

చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే అందులో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబాల కోసం ప్రిప్యత్ అనే పట్టణాన్ని నిర్మించారు. అప్పట్లో 50 వేల మంది అక్కడ నివాసం ఉండేవారు. ప్రమాదం జరిగాక వారందరినీ రాత్రికి రాత్రి ఖాళీ చేయించారు. తర్వాత ఒక్కరినీ తిరిగి అక్కడ ఉండేందుకు అనుమతించలేదు.
స్వల్ప కాలిక సందర్శనకు ప్రిప్యత్ సురక్షితమేనని ఇటీవల నిపుణులు తేల్చారు. ఇప్పుడు యుక్రెయిన్‌లో ఎక్కువ మంది వెళ్లాలనుకొనే పర్యటక ప్రదేశాల్లో ఇది ఒకటి.
గత ఏడాది ఎక్స్‌క్లూజన్ జోన్‌ను సుమారు 60 వేల మంది సందర్శించినట్లు అంచనా.
వాస్తవానికి ప్రమాదం జరిగిన అణు విద్యుత్ కేంద్రం చెర్నోబిల్ పట్టణం కంటే ప్రిప్యత్‌కే దగ్గరగా ఉంటుంది. అణు ప్రమాదంతో తక్కువ కలుషితమైన ప్రాంతంలో చెర్నోబిల్ ఉంది. ఇక్కడ జనాభా పెరిగింది.
అణు విద్యుత్ కేంద్రం మూసివేత కార్యక్రమాలకు సంబంధించిన శాస్త్రవేత్తలు, సిబ్బంది, పర్యటకులు ఇందులో ఉంటారు.
చెర్నోబిల్ ప్రమాద దీర్ఘకాలిక పర్యవసానాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ 2006లో విడుదల చేసిన ఒక నివేదికలో కీలక అంశాలు వెల్లడించింది. రేడియోధార్మిక ముప్పు గురించి భయాందోళన, జీవితాలు కకావికలం కావడం వల్ల ప్రభావిత ప్రాంతాలకు చెందిన చాలా మంది ప్రజల మానసిక ఆరోగ్యం దెబ్బతిందని తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- లోక్‌సభ ఎన్నికలు 2019: 24 సార్లు ఓటమి.. ‘ఇవే నా చివరి ఎన్నికలు కావొచ్చు’
- అమిత్ షా ప్రస్థానం: పోస్టర్లు అంటించే స్థాయి నుంచి పోస్టర్లపై చిత్రాల వరకూ
- బీజేపీ ‘ఆర్టికల్ 370, 35ఎ రద్దు' హామీని వ్యతిరేకిస్తున్న జమ్ముకశ్మీర్ పార్టీలు
- రఫేల్ తీర్పు సమీక్షపై కేంద్రం అభ్యంతరాలను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
- ‘బీజేపీ వ్యతిరేకులు దేశద్రోహులు కారు’ - అడ్వాణీ
- రాజకీయ పార్టీల నుంచి ముస్లిం మహిళలు ఏం కోరుకుంటున్నారు...
- అంతరిక్షంలో అత్యధికంగా చెత్త నింపే దేశం ఏదో తెలుసా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









