ఒకప్పటి బార్ డ్యాన్సర్ల జీవితాలు ఇప్పుడెలా ఉన్నాయి

బార్ డ్యాన్సర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, శివ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ముంబయిలో డ్యాన్స్ బార్లపై 2005లో ప్రభుత్వం నిషేధం విధించడంతో అనేకమంది బార్ డ్యాన్సర్లు ఉపాధి కోల్పోయారు. మరి, ఇప్పుడు వాళ్లు ఎలా బతుకుతున్నారు? రోజువారీ జీవితంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారు?

ఒకప్పుడు బార్ డ్యాన్సర్లుగా పనిచేసిన కొందరు తమిళనాడు మహిళలతో మేం ముంబయిలో మాట్లాడాం.

వీడియో క్యాప్షన్, బార్లలో కస్టమర్లు మాతో తప్పుగా మాట్లాడేవారు. అయినా, మేము ఓ నవ్వు నవ్వి వెళ్లిపోయేవాళ్లం.

"తప్పని పరిస్థితిలో ఈ వృత్తిలోకి వచ్చిన మాకు ఎలాంటి హక్కులూ లేవు. నాయకులు ఓట్లకోసం మా దగ్గరకు వస్తారు. మేం ఓటేస్తాం, అంతే. ఆర్థిక సమస్యల కారణంగా ఈ వృత్తిలోకి వచ్చాను. బార్ డ్యాన్సులను నిషేధించిన తర్వాత ఏం చేయాలో మాకు తెలియలేదు. బతుకుదెరువు కోసం మరేదైనా పనిలో చేరితే, అందరూ మావైపు తప్పుడు దృష్టితో చూస్తారు. నా భర్త, బంధువులు నన్ను దూరంపెట్టినప్పుడు కొందరు అమ్మాయిలు ఈ పని చూపించి నాకు సాయం చేశారు. దాంతో నా నలుగురు పిల్లలకు తిండి పెట్టగలుగుతున్నా. ఇంకెవరూ మాకు సాయం చేయలేదు" అని ఒక మహిళ చెప్పారు.

బార్ డ్యాన్సర్లు

ఫొటో సోర్స్, Getty Images

బార్ డ్యాన్సర్ల వృత్తిని వారి కుటుంబాలు ఎలా చూస్తాయి?

"మగపిల్లలు వాళ్ల తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడంలేదు. ఆడపిల్లలే చూస్తున్నారు. నేను బార్ డ్యాన్సర్‌గా ఉంటూనే మా అమ్మ బాగోగులు చూసేదాన్ని. నేను చేసే పనిగురించి మా అమ్మకు తెలిసినా తను ఎవరికీ చెప్పేదికాదు. బార్లలో కస్టమర్లు మాతో తప్పుగా మాట్లాడేవారు. అయినా, మేము ఓ నవ్వు నవ్వి వెళ్లిపోయేవాళ్లం. మేం ఎదిరించి మాట్లాడితే వాళ్లు డబ్బులివ్వరు. వాళ్లు అసభ్యకరంగా మాట్లాడినా మేం వారితో మామూలుగానే స్పందించాలి. అప్పుడే మాకు వందో రెండొందలో అదనంగా వచ్చేవి. నేను చేసే పని మా పిల్లలకు తెలుసు. బార్ నుంచి డబ్బులతో పాటు ఆహారం తెచ్చేదాన్ని. ముంబయిలో ఇళ్లల్లో పని చేద్దామన్నా దొరకవు. ఈ నిషేధం వల్ల డబ్బులు సంపాదించే మార్గంలేదంటూ నాకు తెలిసిన ఒకమ్మాయి నా కళ్లముందే ఆత్మహత్య చేసుకుంది. ప్రభుత్వం ఆదుకోలేదు. ఇళ్లల్లో పనులకు వెళ్తే మా పాత వృత్తి గురించి అక్కడ చెడుగా మాట్లాడతారు. ఆ ఇళ్ల కంటే బార్లే నయం" అని మరో మహిళ అన్నారు.

బార్ డ్యాన్సర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

బార్ డ్యాన్సులపై నిషేధంతో వచ్చిన ఆర్థిక ఇబ్బందులతో కొందరు మహిళలు బలవంతంగా వ్యభిచారంలోకి వెళ్లారని వారు చెబుతున్నారు.

"డ్యాన్స్ బార్లు మూతపడ్డాయి. దాంతో, కొంతమంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. కొందరు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. మరికొందరు బలవంతంగా వ్యభిచారంలోకి కూడా వెళ్లారు. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం మాతో మాట్లాడి, మా కష్టాలను చూసి, మాకు ఉపాధి కల్పిస్తే మా బతుకులు బాగుపడతాయి" అని ఇంకో మహిళ కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.