ఇండోనేషియా: బ్యాలట్ పేపర్ ఓట్లు లెక్కిస్తూ 272 మంది ఎన్నికల సిబ్బంది మృతి

ఇండోనేషియా ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచంలో ఒకేరోజు జరిగిన అతిపెద్ద ఎన్నికల్లో ఇండొనేషియా ఎన్నికలు ఒకటి

ఇండొనేషియాలో ఓట్ల లెక్కింపులో పాల్గొంటున్న సిబ్బంది 272 మంది చనిపోయారు. సుదీర్ఘ సమయం బ్యాలట్ పేపర్లను చేతితో లెక్కించడం వల్ల తీవ్రమైన అలసటకు లోనవడం, సంబంధిత అనారోగ్యం వల్లే వీరిలో అత్యధికులు చనిపోయారని జనరల్ ఎలక్షన్స్ కమిషన్(కేపీయూ) తెలిపింది.

మరో 1,878 మంది సిబ్బంది అనారోగ్యం పాలయ్యారని కమిషన్ అధికార ప్రతినిధి అరీఫ్ ప్రియో సుశాంతో చెప్పారు.

ఓట్ల లెక్కింపు, పర్యవేక్షణలో సుమారు 70 లక్షల మంది పాల్గొంటున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత లాంటి ప్రతికూల పరిస్థితుల్లో వారు పనిచేస్తున్నారు. రాత్రి వేళల్లోనూ లెక్కింపును కొనసాగించాల్సి వస్తోంది.

ఇండోనేషియా ఎన్నికలు

ఫొటో సోర్స్, BBCKarishma

ఫొటో క్యాప్షన్, ఓటు హక్కు వినియోగించుకున్న మహిళ

ఇండొనేషియా చరిత్రలోనే తొలిసారిగా అధ్యక్ష ఎన్నికలతోపాటు పార్లమెంటు, స్థానిక సంస్థలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఖర్చును తగ్గించేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు.

ఇండొనేషియా జనాభా 26 కోట్లు. అర్హులైన ఓటర్లు 19.2 కోట్ల మంది ఉన్నారు. వీరిలో దాదాపు 80 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఎనిమిది లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 17న పోలింగ్ జరిగింది.

అన్ని సీట్లు కలిపి 20 వేలు ఉండగా, అభ్యర్థులు 2.45 లక్షల మందికి పైగా ఉన్నారు.

ఇండోనేసియాలో ఓటు వేస్తున్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images

ఈ భారీస్థాయి ఎన్నికలు సివిల్ సర్వెంట్లతో పోలిస్తే తాత్కాలిక సిబ్బందిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పని ప్రారంభించే ముందు తాత్కాలిక సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించరు.

ఓట్ల లెక్కింపు విధుల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు 2,500 డాలర్ల చొప్పున చెల్లించేందుకు ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తోందని నిక్కీ ఏసియన్ రివ్యూ తెలిపింది.

అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం సరిగా ఆలోచించకుండా తీసుకుందని, తాత్కాలిక సిబ్బందిపై మోయలేని భారం మోపిందని విమర్శకులు తప్పుబడుతున్నారు.

అధ్యక్ష ఎన్నికల్లో విజయం తమదేనని ప్రస్తుత అధ్యక్షుడు జోకో విడోడో, ఆయన ప్రత్యర్థి ప్రబోవో సుబియాంతో ఇద్దరూ ధీమా వ్యక్తంచేస్తున్నారు.

ఇండోనేసియా ఎన్నికలు
ఫొటో క్యాప్షన్, అంకెల్లో ఇండోనేసియా ఎన్నికలు
అధ్యక్షుడు విడోడోనే

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అధ్యక్షుడు విడోడోనే గెలవనున్నట్లు ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపు సూచిస్తోంది

దాదాపు తొమ్మిది నుంచి పది శాతం ఓట్ల మెజారిటీతో అధ్యక్షుడు విడోడోనే గెలవనున్నట్లు ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపు సూచిస్తోంది.

ఎన్నికల కమిషన్ ఓట్ల లెక్కింపును పూర్తిచేసి, వచ్చే నెల 22న అధ్యక్ష, పార్లమెంటు ఎన్నికల విజేతలను ప్రకటించనుంది.

ఇవి కూడా చదవండి.

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.