పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ: 'మేం ఎవరికీ మద్దతు ఇవ్వం... సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం'

మోదీ, చంద్రబాబు మీద ఉన్న కోపాన్ని రాష్ట్రం మీద చూపిస్తున్నారని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విమర్శించారు. బీబీసీ న్యూస్ ప్రతినిధి దీప్తి బత్తినితో మాట్లాడిన పవన్ కల్యాణ్, వచ్చే ఎన్నికల్లో తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనీ, ఎవరికీ మద్దతివ్వబోమని చెప్పారు.
జనసేన భావజాలం:
నాన్నగారు ఉద్యోగ రిత్యా వివిధ ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు నేను ఆయనతోపాటూ తిరిగాను. నాన్నకు సోషలిస్టు భావజాలం ఉండేది. ఇంట్లో రాజకీయ వాతావరణం ఉండేది. ఆయనతో ఎక్కువ సమయం గడిపే అవకాశం రావడంతో, నాకు ఆ భావజాలం తెలిసింది. చిన్నప్పటి నుంచే చెట్లు కొట్టేయడం గురించి, కుల వివక్ష గురించీ ప్రశ్నించేవాడిని. అది మార్చాలని తపించేవాడిని. నేను ఏది పాటిస్తానో, ఎలా ఉన్నానో జనసేన భావజాలం అలాగే ఉంది. ఇప్పుడు నేను ఏ భావజాలంలో బతుకుతున్నానో, అదే చెబుతున్నాను.
సంక్షేమ పథకాలు:
రేషన్ బదులు నెలకు 2,500 రూపాయలు నేరుగా ఇస్తామని చెప్పాం. నేరుగా నగదు బదిలీ వల్ల ఎంతో డబ్బు సేవ్ అవుతుంది. సివిల్ సప్లైస్‌లో జరిగే తతంగంతో కోట్లు వృథా అవుతున్నాయి. తీరా చూస్తే జనం ఆ బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. దానికంటే నగదు బదిలీ మేలు. దీనివల్ల రాష్ట్రంపై భారం పడదు. నేరుగా డబ్బులిస్తే జనం బద్దకస్తులవుతారనే వాదన తప్పు. అంతర్జాతీయ స్థాయి అధ్యయనాలు కూడా ఆ వాదనతో ఒప్పుకోవడం లేదు. డబ్బు వస్తే వారికి కోరిక, ఆసక్తి పెరిగి మరింత పని చేస్తారు. జీవన ప్రమాణం కాస్త పెంచితే, తనకు తానుగా ఇంకాస్త పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు.
(ఇంటర్వ్యూ పూర్తి వీడియో)
మోదీ - బీజేపీ గురించి:
ప్రత్యేక హోదా ఇస్తాను, లేకపోతే ఇవ్వను, ఇవీ కారణాలు అని ఆయన నేరుగా వచ్చి చెప్పేసి ఉంటే ఎంతో బావుండేది. కానీ ఆయనలా చేయలేదు. మీరెందుకు చెప్పలేదంటే, ప్రధాని కాకముందు కలవడం వేరు. ప్రధాని అయ్యాక బోలెడు ప్రోటోకాల్స్ వస్తాయి.
చంద్రబాబు మీద కోపం రాష్ట్రం మీద చూపిస్తే ఎలా? పోలవరం ఇస్తే ఎనీ టైం మనీ చేస్తారని అప్పుడు మోదీ గారికి తెలియదా? అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలా ఇప్పుడు ఒకలా అయితే ఎలా? మీకు కుదరనప్పుడు ఏవేవో మాట్లాడుతున్నారు.
బీజేపీ ఇతరులను ఎదగనివ్వదు. వాళ్లకు అందరూ రా మెటీరియల్‌గా ఉపయోగపడాలే తప్ప, వారు ఎవర్నీ ఎదగనివ్వరు. వ్యక్తి శ్రమకు గుర్తింపు ఉండదు. ఆ క్రమంలో వాళ్లు తప్పుమీద తప్పు చేస్తున్నారు. నేను బీజేపీ నుంచి ఏమీ ఆశించలేదు. ఆశించేవాడిని అయితే వేరేలా ఉండేది.
నాకు బీజేపీ మీద వ్యక్తిగతంగా ఏమీ లేదు. రాష్ట్రానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనే కోపం. నేను బీజేపీకి ఇష్టంతో మద్దతిచ్చాను తప్ప, ఏదో ఆశించి కాదు. సినిమాల నుంచే ఏమీ ఆశించలేదు. ప్రజారాజ్యం సమయంలో కూడా అన్నయ్యొక్కడే ఉండాలని నేను పోటీ చేయలేదు.
పార్టీలతో పొత్తులు:
నేను కొత్త రాజకీయ వ్యవస్థ కోరుకున్నాను. ప్రజాస్వామ్యంలో భిన్న స్వరాలు వినిపించాలి. అందుకే బీఎస్పీ, వామపక్షాలకు అత్యధిక సీట్లు ఇచ్చాను. జాతీయవాదం పేరుతో ప్రాంతీయతను విస్మరిస్తున్నారు. ప్రతి ప్రాంతానికీ ఒక సంస్కృతి ఉంటుంది. దాన్ని గౌరవించాలి. అందుకే ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం అంటున్నాను. ఆర్థిక అసమానతలు తొలగించడానికి నా వాదన్ని బలంగా వినిపించడానికి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకుంటున్నాను.
వారసత్వాల గురించి:
వారసత్వం తప్పు అనలేం. అలాగని అది సరి అని కూడా కాదు. వచ్చిన వాళ్లంతా తమను తాము నిరూపించుకుని నిలబడి తమ స్థానాలను సంపాయించుకోవాలి. నేను వారసత్వం గురించి చాలా మధనపడ్డాను. నాగబాబు విద్యార్థి సంఘ నాయకుడిగా ఉండేవారు. పీఆర్పీ సమయంలో తెర వెనుక కష్టపడ్డారు. నేనే నరసాపురం నుంచి పోటీ చేయయమని అడిగాను.

ఎవరికి మద్దతిస్తారు:
మేం ఎవరికీ మద్దతివ్వం. జనసేన స్వతంత్రంగా ఉంటుంది. మేం ప్రభుత్వాన్ని సొంతంగా ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతానికి ఇదొక్కటే ఆలోచన ఉంది. దీనికి ప్లాన్ బీ అంటూ ఏమీ లేదు. ఫలితాలు వచ్చాక చూద్దాం.
ప్రసంగాల గురించి:
నాది ఆవేశం కాదు. అదో వ్యక్తీకరణ. సమయం, సందర్భం, విషయాన్ని బట్టి మాట్లాడతాను. ఇప్పుడు మీతో అరుస్తూ మాట్లాడడం లేదు కదా. పది వేల మంది జనం కేకలు వేస్తుంటే వారి మధ్య నా మాటలు వినిపించాలంటే గట్టిగానే మాట్లాడాలి. ఇక్కడ మీతో మాట్లాడుతున్నట్టు బహిరంగ సభల్లో మాట్లాడితే కుదరదు.
ట్రోలింగ్:
సోషల్ మీడియా ఓపెన్ బజార్. అక్కడ ఎవరికీ కంట్రోల్ ఉండదు. నన్ను కూడా ట్రోల్ చేస్తున్నారు. గిట్టనివారుంటారు. ఒక వేళ లక్షల మందిని కంట్రోల్ చేయగలిగే మెకానిజం నా దగ్గర ఉంటే దేశమంతా నా దగ్గరే ఉండేది కదా.
ఇష్యూస్ రైజ్ చేస్తాం ప్రబుత్వం పాలో అప్ చేయాలి.

ఫొటో సోర్స్, FACEBOOK/JanaSena Party
టీడీపీ బీ టీమ్ అనే విమర్శలు:
మేము వాళ్లతో కలవలేదని వైయస్సార్సీపీకి బాధ. ఒకవేళ వాళ్లతో కలసి నడిచుంటే, అప్పుడు టీడీపీ వాళ్లు నన్ను వైయస్సార్ బీ టీమ్ అనేవారు. అంటే వీళ్ళిద్దరే ఉండాలా? మూడో శక్తి రావడం వారికి ఇష్టం లేదు.
సక్సెస్ ఫార్ములా:
సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చేప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి. ఒక దాంట్లో విపరీతమైన బలం ఉన్నంత మాత్రన రెండో రంగానికి అది ఆటోమేటిగ్గా రాదు. రెండో రంగంలో సున్నా నుంచే మొదలు పెట్టాలి. మనం యాక్టర్ అన్న సంగతే మర్చిపోవాలి.
ఇవి కూడా చదవండి:
- జనసేన మేనిఫెస్టో: రైతులకు ఏటా రూ.8,000, రేషన్‌కు బదులుగా నగదు బదిలీ
- ప్రజలు ఏం చూసి ఓటు వేస్తారు..? పార్టీయా, ముఖ్యమంత్రి అభ్యర్థా, స్థానిక అభ్యర్థా... ఏడీఆర్ సర్వే ఏం చెబుతోంది...
- ‘మోదీ చౌకీదార్ కాదు చోర్... పవన్ కల్యాణ్ అధికారంలోకి రావడం ఖాయం’
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: ఎక్కడ ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు?
- 'అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా': కల్యాణదుర్గం సభలో రాహుల్ గాంధీ
- పవన్ కల్యాణ్, రాహుల్ గాంధీల తరహాలో రెండు స్థానాల్లో పోటీ చేసిన నేతలెవరు?
- ఇందిరాగాంధీని కాంగ్రెస్ నుంచి బహిష్కరించిన ఆంధ్రా లీడర్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








