ఫోర్బ్స్ సంపన్న తారల జాబితా: సౌతిండియాలో నెంబర్.1 రజినీకాంత్.. టాలీవుడ్‌లో నెం.1 పవన్ కల్యాణ్ - ప్రెస్ రివ్యూ

రజినీకాంత్, పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, KaalaTheMovie/janasenaparty/facebook

భారత్‌లో సంపన్న తారల ర్యాంకులను ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించినట్టు సాక్షి సహా ప్రధాన పత్రికలన్నీ కథనం ప్రచురించాయి.

ఫోర్బ్స్ ఈ ఏడాది కూడా తన టాప్‌ 100 జాబితాను విడుదల చేసింది. 2017 అక్టోబర్‌ 1 నుంచి 2018 సెప్టెబర్‌ 30 వరకూ తారల సినిమాల రిలీజ్‌లు, చేసిన బ్రాండ్‌ ప్రమోషన్స్‌ అన్నింటినీ లెక్కకట్టి ఎక్కువగా సంపాదించే వంద మంది ఇండియన్‌ సెలబ్రిటీల లిస్ట్‌ ఇచ్చింది.

ఈ ఏడాది అత్యంత సంపాదించిన వాళ్లలో సల్మాన్‌ ఖాన్‌ నిలిచారు. వరుసగా మూడోసారి ఈ లిస్ట్‌లో టాప్‌లో నిలిచారు సల్మాన్‌ ఖాన్‌. ఈ కండలవీరుడు సుమారు 253 కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నట్టు పేర్కొంది ఫోర్బ్స్‌.

మూడో స్థానంలో అక్షయ్‌ కుమార్‌ (రూ.185 కోట్లు) ఉన్నారు. ఈ జాబితాలో సౌతిండియా హీరోల్లో రజినీకాంత్‌ టాప్‌లో ఉన్నారు. రూ.50 కోట్లు సంపాదిస్తూ 14వ పొజిషన్‌లో నిలిచారు రజనీ.

ఆ తర్వాత రూ.31కోట్ల సంపాదనతో పవన్‌ కల్యాణ్‌ 24వ పొజిషన్‌లో నిలిచారు. రూ.28 కోట్లు సంపాదిస్తూ ఎన్టీఆర్‌ 28వ స్థానంలో నిలిచినట్టు ఇందులో తెలిపారు.

33, 34, 36 స్థానాల్లో మహేశ్‌బాబు (రూ.24.33 కోట్లు), సూర్య (రూ.23. 67 కోట్లు), నాగార్జున (రూ.22.25 కోట్లు) నిలిచారు.

దర్శకుడు కొరటాల శివ కూడా ఈ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నారు. ఆయన రూ.20 కోట్ల సంపాదనతో 39వ స్థానంలో ఉన్నారు.

ఆ తర్వాత అల్లు అర్జున్‌ (రూ.15.67 కోట్లు), రామ్‌చరణ్‌ (రూ.14 కోట్లు), లేటెస్ట్‌ సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండ (రూ.14 కోట్లు) 64,72, 72 స్థానాల్లో ఉన్నారు.

రూ.112.8 కోట్లతో దీపికా పదుకోన్‌ నాలుగో స్థానంలో నిలిచారు. 2012 నుంచి ఫోర్బ్స్‌ విడుదల చేస్తున్న ఈ జాబితాలో టాప్‌ 5లో చోటు సంపాదించుకున్న తొలి మహిళగా దీపికా పదుకోన్‌ రికార్డ్‌ సృష్టించారు.

సౌత్‌ నుంచి హీరోయిన్స్‌లో నయనతార మాత్రమే ఈ లిస్ట్‌లో నిలవడం విశేషం. రూ.15.17 కోట్లు సంపాదించి ఆమె 69వ స్థానంలో నిలిచారు.

గతేడాది రెండో స్థానంలో నిలిచిన షారుక్‌ ఈ ఏడాది 13వ స్థానంలోకి వెళ్లగా. గతేడాది 7వ స్థానంలో నిలిచిన ప్రియాంక చోప్రా ఈ సంవత్సరం 49వ స్థానానికి చేరుకున్నట్లు సాక్షి కథనం పేర్కొంది..

నీతి ఆయోగ్ లేఖ

ఫొటో సోర్స్, Getty Images

ఏపీ నిధుల విడుదల కోసం నీతి ఆయోగ్ లేఖ

ఏపీలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు వెంటనే విడుదల చేయండని కేంద్రానికి నీతి ఆయోగ్ లేఖ రాసినట్లు ఈనాడు కథనం ప్రచురించింది.

విభజన చట్టంలోని హామీ మేరకు రాష్ట్రంలోని ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఏటా రూ.350 కోట్లు చొప్పున ఇవ్వాల్సిన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే విడుదల చేయడం లేదని మరోసారి బయటపడిందని ఈ కథనంలో చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం వినియోగ పత్రాలు (యూసీ) ఇవ్వనందునే నిధులు విడుదల చేయడం లేదంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పడం ఒక సాకు మాత్రమేనని రుజువైందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన యూసీలు నిర్దిష్ట విధానం(ఫార్మాట్‌)లోనే ఉన్నాయని నీతి ఆయోగ్‌ మరోసారి ధ్రువీకరించింది.

ఈ విషయాన్ని తాము ఇది వరకే చెప్పినా...కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు నిధులు విడుదల చేయలేదని నీతి ఆయోగ్‌ స్పష్టం చేసింది.

రూ.946.47 కోట్ల నిధుల వినియోగానికి సంబంధించిన యూసీల వివరాల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మరోసారి అందజేసిందని చెబుతూ కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన వ్యయ విభాగాని(డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎక్స్‌పెండిచర్‌)కి నీతిఆయోగ్‌ ఇటీవల లేఖ పంపింది.

ఆ లేఖ సారాంశం ఇలా ఉంది. ''ఆంధ్రప్రదేశ్‌ సమర్పించిన యూసీలు నిర్దేశిత ఫార్మాట్‌లోనే ఉన్నాయని, 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు రూ.350 కోట్లు విడుదల చేయాలని కోరుతూ 2018 ఫిబ్రవరి 2న మేము(నీతి ఆయోగ్‌) డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎక్స్‌పెండిచర్‌కు లేఖ రాశాం.

కానీ తమకు ఆ నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదని, వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాల్ని వేగవంతం చేసేందుకు ఆ నిధులు ఎంతైనా అవసరమని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాకు మళ్లీ లేఖ రాసింది.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ప్రణాళికా విభాగం కార్యదర్శి 2018 నవంబరు 22న మాకు మళ్లీ ఓ లేఖ రాశారు. రూ.946.47 కోట్ల నిధుల వినియోగానికి సంబంధించిన యూసీల వివరాల్ని ఆ లేఖకు జతజేశారు.

వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద 2017-18, 2018-19 సంవత్సరాలకుగాను ఏటా రూ.350 కోట్లు చొప్పున నిధులు తక్షణం విడుదల చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని పరిశీలించి, వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవలసిందిగా ఆర్థిక శాఖను కోరుతున్నాం'' అని ఆ లేఖలో నీతి ఆయోగ్‌ పేర్కొన్నట్లు ఈనాడు తెలిపింది.

మాల్య

ఫొటో సోర్స్, Getty Images

అసలు చెల్లిస్తానంటున్న మాల్యా

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా బ్యాంకుల వద్ద తీసుకున్న అసలు తిరిగి బ్యాంకులకు చెల్లిస్తానని సోషల్ మీడియా ద్వారా చెప్పినట్టు నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.

తను తీసుకున్న ప్రజల సొమ్మును 100 శాతం తిరిగి బ్యాంకులకు చెల్లించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా బ్యాంకులకు, కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేసినట్టు తెలిపింది.

మాల్యాను భారత్‌కు అప్పగించేదానిపై బ్రిటన్ కోర్టు త్వరలో తీసుకోనున్న నిర్ణయానికి ముందే మాల్యా నుంచి ఇలాంటి ప్రతిపాదన రావడం విశేషం.

62 ఏళ్ల కింగ్‌ఫిష్ ఎయిర్‌లైన్స్ యజమాని గతేడాది ఏప్రిల్‌లో అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన బెయిల్‌పై బ్రిటన్‌లో నివసిస్తున్నారు.

దేశీయ బ్యాంకులకు రూ.9 వేల కోట్లకు పైగా ఎగ్గొట్టిన ఆయనపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద పలు కేసులు నమోదయ్యాయి.

మాల్యాకు వ్యతిరేకంగా నమోదైన కేసుపై ఈ నెల 10న లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును వెలవరించనున్నది.

దీంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న మాల్యా.. బ్యాంకులతో బేరసారాలకు సిద్ధమయ్యారని ఈ కథనం తెలిపింది.

‘చాలా కీలకమైన అంశం.. ప్రజల సొమ్మును 100 శాతం తిరిగి చెల్లింపులు జరుపడానికి సిద్ధంగా ఉన్నా.. బ్యాంకులకు, ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నది ఒక్కటే దీనిని తిరస్కరించకండి’ అని ట్విట్టర్‌లో మాల్యా వరుసగా పోస్ట్‌చేశారని నమస్తే తెలంగాణ చెప్పింది.

ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

ఐపీఎల్ వేలానికి ఆటగాళ్లు సిద్ధం

ఐపీఎల్ వేలానికి వెయ్యి మందికి పైగా ఆటగాళ్లు రెడీ అయినట్లు నవ తెలంగాణ కథనం ప్రచురించింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2019 వేలానికి మొత్తం 1003 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొనేందుకు తమ పేర్లను రిజస్టర్ చేసుకున్నారని బీసీసీఐ బుధవారం వెల్లడించింది.

అందులో 232 మంది విదేశీ ఆటగాళ్లున్నారని వారంతా వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి కనబర్చారని తెలిపింది.

రాజస్థాన్‌లోని జైపూర్‌లో డిసెంబర్ 18న ఆటగాళ్ల వేలం జరగనుంది.

ఆయా ఫ్రాంఛైజీలు ఇంకా 70 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో 200 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు..800మంది అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్‌తో పాటు ముగ్గురు అనుబంధ దేశాలకు చెందిన ఆటగాళ్లు పాల్గొంటున్నారు.

800 అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్‌లో 746 మంది ఆటగాళ్లు భారతీయులే ఉన్నారని నవ తెలంగాణ కథనం పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)