అగస్టా ‌వెస్ట్‌ల్యాండ్: సీబీఐ అరెస్ట్ చేసిన క్రిస్టియన్ మైకేల్ ఎవరు? అసలు హెలికాప్టర్ల కుంభకోణం ఏమిటి?

అగస్టావెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్

ఫొటో సోర్స్, Getty Images

అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న బ్రిటిష్ జాతీయుడైన క్రిస్టియన్ జేమ్స్ మైకేల్‌ను.. దుబాయ్ ప్రభుత్వం తాజాగా భారత ప్రభుత్వానికి అప్పగించింది.

మైఖేల్‌ను డిసెంబర్ 4వ తేదీ రాత్రి దుబాయ్ నుంచి రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ విమానంలో దిల్లీ తీసుకువచ్చి సీబీఐ కార్యాలయానికి తరలించారు. ఆయనను కస్టడీలోకి తీసుకోవటానికి కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆయన్ను ఐదు రోజుల కస్టడీకి పంపింది.

వీవీఐపీల ప్రయాణానికి వినియోగించే హెలికాప్టర్ల కొనుగోలు కోసం 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అగస్టా వెస్ట్‌ల్యాండ్ సంస్థతో చేసుకున్న ఒప్పందం... ముడుపుల ఆరోపణలతో పెను దుమారం సృష్టించింది.

ఆ ఒప్పందంలో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మైకేల్.. అవకతవకల్లో కీలక పాత్రధారి అని సీబీఐ ఆరోపిస్తోంది. ఆయన మీద ఈడీ కూడా కేసు నమోదు చేసింది.

మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్.పి.త్యాగి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అగస్టా ముడుపుల ఆరోపణలకు సంబంధించి మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్.పి.త్యాగి సహా పలువురిపై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది

అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ స్కాం ఏమిటి?

భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇతర ప్రముఖ వ్యక్తుల ప్రయాణాల కోసం ఉపయోగించటానికి.. భారత వైమానిక దళం ఉపయోగించే ఎం8 హెలికాప్టర్ల స్థానంలో కొత్త హెలికాప్టర్లు కొనాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకోసం ఇటలీ కేంద్రంగా ఉన్న ఆంగ్లో-ఇటాలియన్ హెలికాప్టర్ల తయారీ కంపెనీ అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ నుంచి 12 ఏడబ్ల్యూ101 చాపర్ల కొనుగోలుకు 2010 ఫిబ్రవరిలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆ కాంట్రాక్టు విలువ రూ. 36,000 కోట్లు.

ఒప్పందం ప్రకారం 2013 నాటికి మూడు హెలికాప్టర్లను భారత్‌కు సరఫరా చేసింది అగస్టా. అయితే.. 2013 ఫిబ్రవరిలో అగస్టావెస్ట్‌ల్యాండ్ సీఈఓ బ్రూనో స్పగ్నోలిని, అగస్టా మాతృసంస్థ ఫిన్‌మెకానికా చైర్మన్ గిసెప్ ఓర్సీని ఇటలీ అధికారులు అరెస్ట్ చేశారు. భారత ప్రభుత్వం నుంచి అగస్టా చాపర్ల ఒప్పందం పొందటానికి ముడుపులు చెల్లించారన్నది వారిపై ఆరోపణలు.

ఈ పరిణామం జరిగిన వెంటనే అప్పటి భారత రక్షణమంత్రి ఎ.కె.ఆంటోని ఈ ముడుపుల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించారు. భారత వాయుసేన మాజీ చీఫ్ ఎస్.పి.త్యాగి, ఆయన బంధువులు ముగ్గురితో సహా మరో ఇద్దరి మీద.. అగస్టా, ఫిన్‌మెకానికా, చండీగఢ్‌లోని ఐడీఎస్ ఇన్ఫోటెక్, ఏరోమాట్రిక్స్ నాలుగు కంపెనీల పైనా సీబీఐ ప్రాధమికంగా కేసు నమోదు చేసింది.

అగస్టాతో హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందాన్ని 2014 జనవరిలో భారత ప్రభుత్వం రద్దు చేసుకుంది. కంపెనీకి చెల్లించిన మొత్తాన్ని బ్యాంకు గ్యారంటీల ద్వారా రికవరీ చేసుకుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

క్రిస్టియన్ మైకేల్ పాత్ర ఏమిటి..?

భారత ప్రభుత్వం నుంచి హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం తమ సంస్థకు వచ్చేలా చూడటానికి అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ క్రిస్టియాన్ మైఖేల్ జేమ్స్‌, గిడో హాస్చెక్, కార్లో గెరోసా అనే ముగ్గురు వ్యక్తులను మధ్యవర్తిగా నియమించుకుంది. మైకేల్‌కు ఫిన్‌మెకానికా సంస్థ 4.227 కోట్ల యూరోలు ముడుపులుగా చెల్లించిందని సీబీఐ ఆరోపించింది.

బ్రిటన్‌కు చెందిన కన్సల్టెంట్ అయిన మైకేల్‌.. భారత వైమానిక దళం, రక్షణ శాఖల్లో తనకు సంబంధాలున్న అప్పటి అధికారులు, మాజీ అధికారుల ద్వారా అగస్టాకు అనుకూలంగా ఒప్పందం కుదిరేలా, అందుకోసం ఒప్పందం విధివిధానాలను మార్చేలా ప్రయత్నాలు చేశారన్నది సీబీఐ ఆరోపణ.

ఈ కేసులో సీబీఐ 2017 సెప్టెంబర్‌లో చార్జ్‌షీట్ నమోదు చేసింది. మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్.పి.త్యాగి, ఆయన బంధువులు, మాజీ ఎయిర్ మార్షల్ జె.ఎస్.గుజ్రాల్, మధ్యవర్తులుగా చెప్తున్న మైఖేల్, గెరోసా, గిడోలతో పాటు.. అగస్టా వెస్ట్‌ల్యాండ్ అప్పటి సీఈఓ బ్రూనో, ఫిన్‌మెకానికా చైర్మన్ ఓర్సీలను నిందితులుగా పేర్కొంది. ఈ కుంభకోణం వల్ల భారత ఖజానాకు రూ. 2,666 కోట్లు నష్టం వాటిల్లిందని పేర్కొంది.

క్రిస్టియన్ మైకేల్, మరికొందరి మీద భారత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది.

అగస్టా వివాదం.. నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అగస్టా ఒప్పందంపై ఇటలీలో ఆరోపణలతో భారతదేశంలో తీవ్ర రాజకీయ దుమారం రేగింది

సోనియా, మన్మోహన్‌ల పేర్లు ఎలా వచ్చాయి?

అగస్టా ముడుపుల ఆరోపణల మీద ఇటలీలో జరిగిన దర్యాప్తులో భాగంగా మిలాన్ కోర్టులో ప్రవేశపెట్టిన పత్రాల్లో.. అగస్టా వెస్ట్‌ల్యాండ్ ప్రతినిధిని ఉద్దేశించి మధ్యవర్తులు మైఖేల్, గిడోలు 2008లో రాసినట్లుగా ఆరోపిస్తున్న ఒక నోట్‌ కూడా ఉంది. అది 2014 ఫిబ్రవరిలో ఇటలీ మీడియాలో ప్రచురితమైంది.

ఆ నోట్‌లో.. చాపర్ ఒప్పందం దక్కాలంటే సోనియా గాంధీకి సన్నిహితులుగా ఉన్న వారిని ''లక్ష్యంగా'' చేసుకోవాలని సూచించినట్లు ఉందన్నది ఆరోపణ. ఆ సన్నిహితుల్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ పేరుతో పాటు అహ్మద్ పటేల్, ప్రణబ్‌ ముఖర్జీ, వీరప్ప మొయిలీ, ఆస్కార్ ఫెర్నాండెజ్, ఎం.కె.నారాయణన్, వినయ్‌సింగ్‌ల పేర్లు కూడా ఉన్నాయి.

ఇదిలావుంటే.. అగస్టా కుంభకోణంలో తన మీద క్రిమినల్ విచారణ జరపకుండా ఉండాలంటే, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఈ కేసులో ఎలాగోలా ఇరికించాలంటూ భారత దర్యాప్తు సంస్థలు తన మీద ఒత్తిడి తెస్తున్నాయని మైకేల్ 2016లో ఆరోపించారు.

అగస్టా‌వెస్ట్‌ల్యాండ్

ఫొటో సోర్స్, Getty Images

దుబాయ్‌లో మైకేల్ అరెస్ట్.. భారత్‌కు అప్పగింత...

మైఖేల్ మీద 2015లో ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీస్ జారీ చేసింది. దీంతో 2017 ఫిబ్రవరిలో దుబాయ్ పోలీసులు తమ దేశంలో మైకేల్‌ను అరెస్ట్ చేశారు. ఆయనను విచారణ నిమిత్తం అప్పగించాలంటూ సీబీఐ 2017 మార్చిలో దౌత్యమార్గంలో దుబాయ్ అధికారులను కోరింది.

ఈ అంశంపై దుబాయ్ కోర్టులో విచారణ అనంతరం ఆయనను భారతదేశానికి అప్పగించటానికి 2018 నవంబర్ 19న అంగీకారం లభించింది. ఆమేరకు డిసెంబర్ 4వ తేదీన భారత అధికారులకు మైఖేల్‌ను అప్పగించారు. అదే రోజు రాత్రి ఆయనను దుబాయ్ నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ తీసుకువచ్చారు.

సీబీఐ కార్యాలయానికి తరలించిన మైకేల్‌ను కస్టడీ కోరుతూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

అయితే యూఏఈలో నిర్బంధంలోకి తీసుకున్న తమ దేశస్తుడి కుటుంబానికి తమ మద్దతు కొనసాగుతుందని యూఏఈలోని బ్రిటిష్ హై కమిషన్ ప్రతినిధి తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులతోను, యూఏఈ అధకారులతోను తాము ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని, భారత అధికారుల నుంచి ఆయన పరిస్థితిపై సమాచారాన్ని కోరుతున్నట్లు వెల్లడించారు.

ఇటలీలో కేసు కొట్టేసిన మిలాన్ అప్పీల్ కోర్టు...

ఇటలీలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరిమీద.. భారత వాయుసేన మాజీ చీఫ్ ఎస్.పి.త్యాగి, ఫిన్‌మెకానికా సీఈఓ ఓర్సీ, అగస్టావెస్ట్‌ల్యాండ్ మాజీ అధిపతి బ్రూనో తదితరులందరిపై.. మిలాన్‌లోని కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ 2018 జనవరి 8న కేసును కొట్టివేసింది. ఆరోపణలకు సరైన సాక్ష్యాధారాలు లేవని విడుదల చేసింది.

రాఫేల్

ఫొటో సోర్స్, Getty Images

‘రఫేల్ డీల్‌’ వివాదానికి కౌంటరా?

నాడు యూపీఏ ప్రభుత్వాన్ని అగస్టా కుంభకోణం ఆరోపణలు తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం రఫేల్ డీల్ ఆరోపణలతో ఆత్మరక్షణలో పడింది.

ఫ్రాన్స్ సంస్థ నుంచి రఫేల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో భారీ అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ కొంత కాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ ఒప్పందంలో యుద్ధ విమానాల ధరలు భారీగా పెంచేశారని.. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థకు లబ్ధి చేకూరేలా చేశారని రాహుల్‌గాంధీ ఆరోపిస్తున్నారు.

ఈ ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. ఒప్పందం పూర్తి వివరాలను గోప్యంగా ఎందుకు ఉంచారని ప్రశ్నిస్తున్నారు. ఆ ఆరోపణలను ఎన్‌డీఏ ప్రభుత్వం బలంగా ఖండిస్తోంది. నిరాధార ఆరోపణలని ఉద్ఘాటిస్తోంది.

అయితే.. రఫేల్ డీల్‌పై ఆరోపణలను తిప్పికొట్టటానికి.. కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలో పడవేయటానికి ‘చాపర్ డీల్’ను మళ్లీ తెరపైకి తెస్తున్నట్లు పలువురు పరిశీలకులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)