వారణాసి: మోదీపై ప్రియాంకా గాంధీ ఎందుకు పోటీ చేయట్లేదు?

ప్రియాంకా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రియాంకా గాంధీ

వారణాసికి వెళ్లినప్పడు తనను తాను 'గంగా మాత పుత్రుడి'గా వర్ణించుకుంటుంటారు ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీని కూడా 'గంగా పుత్రిక' అని కీర్తిస్తూ ఫూల్‌పుర్‌లో ఆ పార్టీ కార్యకర్తలు ఆమెకు స్వాగతం పలుకుతుంటారు.

ప్రచార సభల్లో ఒకరినొకరు విమర్శించుకుంటూ వస్తున్న ఈ ఇద్దరు నేతలూ.. వారణాసి లోక్‌సభ స్థానంలో నేరుగా తలపడతారని ఇటీవల వదంతులు వినిపించాయి.

కానీ, వారణాసిలో ప్రియాంకను కాకుండా అజయ్ రాయ్‌ను అభ్యర్థిగా ప్రకటించి కాంగ్రెస్ ఈ ఊహాగానాలకు తెరదించింది.

మోదీపై ప్రియాంక పోటీ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కోరుకున్నారు. పోటీ చేసే అవకాశాలను ప్రియాంక స్వయంగా ఎప్పుడూ కొట్టిపారేయలేదు.

కొన్ని రోజుల క్రితం వారణాసిలో పోటీ చేస్తారా అని మీడియా ప్రశ్నించినప్పుడు.. పార్టీ ఆదేశిస్తే అందుకు తాను సిద్ధమేనని ఆమె ప్రకటించారు.

ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా వారణాసి వెళ్లినప్పుడు కూడా ప్రియాంకకు అక్కడ మంచి స్వాగతం లభించింది.

అయినా, మోదీపై కాంగ్రెస్ ఆమెను పోటీకి దించలేదు.

దీని వెనుకున్న కారణాలను ప్రముఖ పాత్రికేయుడు నవీన్ జోషి విశ్లేషించి చెప్పారు.

కేవలం సంచలనం రేపేందుకే ప్రియాంకను నిలబెడతారన్న ప్రచారం చేశారని ఆయన అభిప్రాయపడ్డారు.

''ఒకవేళ ఎన్నికల రాజకీయాలకు ప్రియాంక సిద్ధమై ఉంటే.. మోదీపై పోటీతో మొదలుపెట్టాలని మాత్రం కోరుకోరు. చాలా అంశాలు కలిసివస్తాయనుకున్నా ఆమె గెలుస్తారని చెప్పలేం. ఎన్నికల్లో దిగాలనుకుంటే రాయ్‌బరేలీనో, మరో సీటునో ప్రియాంక ఎంచుకుంటారు. వారణాసిని మాత్రం కాదు. అప్పుడే పార్లమెంటుకు వెళ్లడం ఆమెకు సులువవుతుంది'' అని నవీన్ జోషి అన్నారు.

ప్రియాంకా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

'రెండో స్థానమూ కష్టమే'

ప్రియాంకను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించి తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌ బాధ్యతలను అప్పగించింది కాంగ్రెస్. ఈ ప్రాంత పరిధిలో 29 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. వీటిలో 27 స్థానాలపై భాజపాకు పట్టుంది. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి సీటు కూడా వీటిలోనే ఉంది.

ప్రియాంక ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అందుకున్నాక మోదీ కంచుకోట గుజరాత్‌లోనే తన మొదటి ప్రసంగం చేశారు. ఇందులో మోదీనే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.

అయితే విమర్శలు చేయడానికి, పోటీ చేయడానికి చాలా తేడా ఉందని ప్రముఖ పాత్రికేయుడు జతిన్ గాంధీ అన్నారు.

''ఎన్నికల్లో పోటీ చేయాలంటే క్షేత్ర స్థాయిలో కార్యకర్తల సైన్యం కావాలి. వారణాసిలో కాంగ్రెస్‌కు ఆ పరిస్థితి లేదు. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీల మధ్య కుదిరిన పొత్తు కూడా ప్రియాంక పోటీ చేయకపోవడానికి మరో కారణం. శాలినీ యాదవ్‌ను ఆ కూటమి అభ్యర్థిగా ప్రకటించి కాంగ్రెస్‌ కోసం ఆ స్థానాన్ని వదలబోమని స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో ప్రియాంక పోటీ చేస్తే రెండో స్థానం దక్కడం కూడా అనుమానమే'' అని జతిన్ అన్నారు.

ప్రియాంకా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ప్రియాంక వస్తే లెక్కలు మారేవా?

2014 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసిలో మోదీపై ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేశారు.

మోదీకి 5.8 లక్షల ఓట్లు రాగా, కేజ్రీవాల్‌కు దాదాపు 2 లక్షల ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ సుమారు 75వేల ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

ప్రియాంక పోటీ చేస్తే కాంగ్రెస్‌ పరిస్థితి కచ్చితంగా మెరుగుపడేదని, విజయం సాధించేందుకు మాత్రం అది తోడ్పడేది కాదని నవీన్ జోషి అన్నారు.

''పొరుగున ఉన్న జోన్‌పుర్, మవూ, ఆజమ్‌గఢ్ తదితర సీట్లపై ప్రియాంక ప్రభావం ఉండేది. అయితే, అందుకు ప్రియాంక ఓటమి రూపంలో కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేది'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

తమ భావి నేత ప్రారంభం ఇలా ఉండాలని ఏ పార్టీ కూడా కోరుకోదని జతిన్ గాంధీ అన్నారు.

''కాంగ్రెస్‌ ప్రముఖ నేతల్లో ప్రియాంక ఒకరు. ఆమెకు ఇందిరా గాంధీ పోలికలున్నాయి. ఆమే ఆ పార్టీ భవిష్యత్తు. ఆమెపై పెద్ద అంచనాలు ఉంటాయి. మొదట్లోనే ఆమె ఓడిపోవడాన్ని కాంగ్రెస్ ఇష్టపడదు. ఈ ఎన్నికల్లో ప్రియంక పార్టీని బలోపేతం చేయలేకపోవచ్చు. కార్యకర్తల్లో ఉత్సాహమైతే నింపుతారు'' అని చెప్పారు.

భారత రాజకీయాల్లో ప్రముఖ నేతలపై ప్రత్యర్థి పార్టీలు పెద్దగా గట్టి ప్రత్యర్థులను నిలపవు.

''పెద్ద నేతలు ఒకరితో ఒకరు తలపడటం చూడాలని జనాలకు ఆసక్తి ఉండొచ్చు. కానీ, అలాంటి నేతలు చట్ట సభలకు చేరాలి. అప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది'' అని నవీన్ జోషి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)