వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ దక్షిణ భారత్‌లో మాస్టర్ స్ట్రోక్ అవుతుందా: అభిప్రాయం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కృష్ణ ప్రసాద్
- హోదా, బీబీసీ కోసం
ఉత్తర కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేయాలన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయంపై రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి.
రాహుల్ హిందువుల నుంచి పారిపోతున్నారని భారతీయ జనతా పార్టీ ఎద్దేవా చేసింది. 2011 గణాంకాల ప్రకారం వయనాడ్ కన్నా రాహుల్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ నియోజకవర్గంలోనే ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నారు.
వయనాడ్ నియోజకవర్గంలో ముస్లింల జనాభా 28.65 శాతం కాగా, అమేఠీలో వీరి జనాభా 33.04 శాతం.
రాహుల్ తమపైనే పోటీకి దిగుతున్నారని కేరళలోని పాలక వామపక్షాలు భావిస్తున్నాయి.
వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇక్కడ సీపీఐపై కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించింది.
అయితే 2009తో పోలిస్తే 2014లో కాంగ్రెస్ మెజారిటీ బాగా తగ్గిపోయింది.
వయనాడ్ కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఉంది. రాహుల్ వయనాడ్ నుంచి పోటీచేయడం వల్ల చుట్టుపక్కల నియోజకవర్గాల్లో తమ పార్టీ విజయావకాశాలపై సానుకూల ప్రభావం పడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.
అయితే ఈ వాదన కాంగ్రెస్ తనను తాను సమర్థించుకొనేందుకు చెప్పే వాదనలా ఉంది.
ఎందుకంటే వయనాడ్ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో మూడు స్థానాల్లో సీపీఎం, మరో స్థానంలో సీపీఎం మద్దతున్న స్వతంత్ర ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తమిళనాడులోని తేని నియోజకవర్గంలో అన్నాడీఎంకే కూటమి తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం కుమారుడిని కాంగ్రెస్ అభ్యర్థి, పెరియార్ మనవడు ఈవీకేఎస్ ఎలంగోవన్‌పై పోటీకి దింపింది.
కర్ణాటకలోని చామరాజనగర్ స్థానం నుంచి కాంగ్రెస్ నేత ధ్రువ నారాయణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుత 16వ లోక్‌సభలో బాగా రాణించిన ఎంపీల్లో ఆయన ఒకరు.

ఫొటో సోర్స్, ATUL LOKE/GETTY IMAGES
దక్షిణాదికి గాంధీ కుటుంబం
చరిత్రను గమనిస్తే దిల్లీలో అధికారం కోరుకున్న ప్రతిసారీ గాంధీ కుటుంబం దక్షిణం వైపు దిగివచ్చింది.
ఎమర్జెన్సీ తర్వాత ఓటమి పాలైన ఇందిరాగాంధీ తిరిగి పార్లమెంటుకు ఎన్నికవడానికి 1978లో చిక్‌మగళూరు నుంచి, 1980లో మెదక్ స్థానం నుంచి పోటీ చేశారు.
ఆమె కోడలు సోనియాగాంధీ మొదటిసారి బళ్లారి నుంచే బరిలోకి దిగారు.
నానమ్మ, అమ్మలాగే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా దక్షిణాది నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తూ అదే సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు కనిపిస్తోంది.
పుల్వామా దాడి తర్వాత మార్చిలో 'దిన తంతి' నిర్వహించిన పోల్‌లో తమిళనాట రాహుల్ గాంధీ పాపులారిటీ గడిచిన ఒక నెలలో మోదీ కంటే పెరిగినట్టు తేలింది.
మోదీకి 26 శాతం ఉంటే, రాహుల్‌కు 41 శాతానికి పెరిగింది.
ఇండియా టుడే చేసిన మరో సర్వేలో 64 శాతం మంది కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే అని తెలిపారు. 22 శాతం మంది మాత్రం ప్రధాని మోదీనే అన్నారు.
కానీ 2019లో కాంగ్రెస్ కథలో ఎన్నో మలుపులు ఉన్నాయి.
ఒకప్పుడు కంచుకోటగా ఉన్న కర్ణాటక కాంగ్రెస్ చేజారిపోయింది.
ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. తమిళనాడు ఇప్పటికీ బయటి పార్టీలకు అనుకూలంగా లేదు.
అందుకే, రాహుల్ బహుశా కేరళను ఎంచుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గతవారం నామినేషన్ దాఖలు చేసిన తర్వాత రాహుల్ గాంధీ "ఆర్ఎస్ఎస్, బీజేపీ, నరేంద్ర మోదీ నుంచి తమ భాష, చరిత్ర, సంస్కృతికి ముప్పు ఎదురవుతున్నట్లు దక్షిణ భారతీయులు భావిస్తున్నారని" అన్నారు.
"నేను, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడతామని మేం దక్షిణ భారత్‌కు చూపించాలనుకుంటున్నాను" అని రాహుల్ చెప్పారు.
అప్పటి నుంచి చాలా మంది కాంగ్రెస్ నేతలు "మోదీ ప్రభుత్వం దక్షిణ భారతదేశాన్ని నిర్లక్ష్యం చేయడానికి సమాధానంగానే రాహుల్ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారని" చెబుతూ వచ్చారు.
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తన పుస్తకం 'ద ప్రింట్'లో "బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పాలనలో దక్షిణ భారత రాష్ట్రాలు, కేంద్రం పరస్పర సంబంధాలు నాశనమయ్యాయి" అని రాశారు.
అటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా "రాహుల్ గాంధీ ఉత్తర, దక్షిణ భారత్ మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయగలరని" అన్నారు.
మరో మాటలో చెప్పాలంటే, నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయవాదాన్నే నమ్ముకున్నారు. అందులో బలమైన నేత, బలమైన సరిహద్దులు, బలమైన దేశం గురించి చెబుతున్నారు.
దానికి సమాధానంగా కాంగ్రెస్ దక్షిణ భారత ప్రాంతీయ గుర్తింపును బలోపేతం చేస్తామంటూ ప్రత్యామ్నాయ జాతీయవాదాన్ని పెంచుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ వ్యూహంలో దమ్ముందా
అయితే, గణాంకాలు మాత్రం కాంగ్రెస్ వ్యూహంలో బలం ఉన్నట్టు చెబుతున్నాయి.
మోదీ గాలి వీయడంతో 2014 ఎన్నికల్లో బీజేపీకి ఐదు దక్షిణ భారత రాష్ట్రాల్లోని మొత్తం 112 స్థానాల్లో 20 సీట్లు లభించాయి.
వాటిలో 17 స్థానాలు కోస్తా, ఉత్తర కర్ణాటకలో లభించాయి. బీజేపీ ఈ రాష్ట్రాల్లోని 67 స్థానాల్లో పోటీచేసింది.
ఇక దేశవ్యాప్తంగా బీజేపీ స్ట్రయిక్ రేట్ 60 శాతం ఉంటే, దక్షిణ భారత రాష్ట్రాల్లో మాత్రం అది కేవలం 19 శాతం మాత్రమే.
గత ఐదేళ్లలో 'సహకార సమాఖ్యవాదం' గురించి చాలా మాటలు చెప్పిన బీజేపీ ప్రభుత్వం, దక్షిణ భారత దేశాన్ని మాత్రం కాంగ్రెస్, వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలకు వదిలేసింది.

ఫొటో సోర్స్, Reuters
ఉదాహరణ చూస్తే
- మోదీ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్‌కు స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత వెనకడుగు వేసింది. దానితో తెలుగుదేశం ఎన్డీయే నుంచి బయటికొచ్చింది.
- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కేరళ వరద బాధితులకు సాయం కోసం 700 కోట్ల రూపాయలు సాయం అందిస్తామని ప్రకటించింది. కానీ కేంద్ర ప్రభుత్వం దానిని అడ్డుకుంది.
- తమిళనాడులో తుపాను వల్ల నిరాశ్రయులైన వారికి సాయం అందించడంలో విఫలమైంది. ఆ తర్వాత ట్విటర్‌లో గోబ్యాక్ మోదీ ట్రెండ్ కావడం మొదలైంది.
- కరువు ప్రభావిత కర్ణాటక కోసం కేంద్రం కేవలం 950 కోట్లు విడుదల చేసింది. అయితే అధికారిక నిబంధనల ప్రకారం ఆ రాష్ట్రానికి 4500 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. అంతే కాదు మన్రేగా కింద 70 శాతం ఫండ్ విడుదల చేయలేదు.
15వ ఫైనాన్స్ కమిషన్ దీనికి 2011 జనాభా గణాంకాలను ఎంచుకున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అదే 14వ ఫైనాన్స్ కమిషన్‌ను చూస్తే అది 1971 గణాంకాలను తీసుకుంది. దాంతో విద్యావంతులు చాలా ఎక్కువగా ఉన్న దక్షిణ భారత రాష్ట్రాల్లో మెరుగైన కుటుంబ ప్రణాళిక, తక్కువ జనాభా కారణంగా రాయితీలు కూడా తక్కువ ఇచ్చారు.
బీజేపీ ఈ ప్రశ్నలకు సమాధానాన్ని నిధుల కేటాయింపులతో జోడిస్తుంది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి, దక్షిణ భారత రాష్ట్రాలకు చాలా ఎక్కువ నిధులు ఇచ్చామని చెబుతూనే ఉన్నారు. అయితే ఆయన అలా చెప్పేటపుడు దక్షిణ భారత రాష్ట్రాలు, జాతీయ ఆదాయంలో ఎంత భాగస్వామ్యం అందిస్తాయో మర్చిపోతున్నారు. కర్ణాటక, తమిళనాడు ఆదాయం సమీకరించే టాప్ నాలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ ప్రొఫెసర్ నరేంద్ర పాణీ "15వ ఫైనాన్స్ కమిషన్ ఉత్తర భారత దేశానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ఎందుకంటే అక్కడ చాలా ఎక్కువ జనాభా ఉంది. అందువల్ల కూడా దిల్లీ పట్టించుకోకపోయినా, దక్షిణ భారత రాష్ట్రాలు మెరుగ్గా ఉన్నాయనే భావన చాలా పెరిగింది" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణ భారత రాష్ట్రాలపై వివక్ష
అంతే కాదు, కీలక అంశాలపై మాట్లాడ్డానికి ప్రధాన మంత్రి సమయం ఇవ్వడం లేదని దక్షిణ భారత రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలాసార్లు ఫిర్యాదు చేశారు.
దానితోపాటు కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ కూడా కేంద్రం ఆడించినట్టు ఆడుతున్నారు.
ఇక ఆయా రాష్ట్రాలకు కొన్ని సమస్యలు ఉన్నాయి.
తమిళనాడులో ఎన్ఈఈటీ, జల్లికట్టు, స్టార్‌లైట్-కేరళలో శబరిమల ఆలయ ప్రవేశం, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యల ఆరోపణలు-గోవా, కర్ణాటక, తమిళనాడు మధ్య మాండ్వీ, కావేరీ నదీ జలాల పంపిణీ లాంటి అంశాలు బీజేపీ యాంటీ సౌత్ అనే సెంటిమెంట్‌ను పెంచాయి.
కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రి కృష్ణ బైరే గౌడ "ప్రధాన మంత్రి దక్షిణాది రాష్ట్రాలను తక్కువ అంచనా వేస్తున్నానే భావన ఉంది" అన్నారు.
ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో ఈ అసమాన సమస్యల పాత్ర చాలా భిన్న స్థాయిల్లో ఉంది. వాటికి ఒకదానికొకటి సంబంధం ఉన్నట్టే కనిపిస్తుంది.
కానీ రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయడం కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలకు మ్యాజిక్‌లా పనిచేస్తుందా. బీజేపీ ప్రచారాన్ని అది ఎదురొడ్డి నిలవగలదా?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు ఇలాంటి ప్రాంతీయత, భాషా వాదం అండ లభించింది.
మెట్రో ట్రెయిన్ స్టేషన్లలో హిందీ భాషా ఉపయోగం, కర్ణాటకలో కన్నడ మాట్లాడే వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్ ఒక విధంగా స్మార్ట్ వ్యూహంలో భాగమే.
కానీ చివరికి కర్ణాటకలో కాంగ్రెస్ 120 నుంచి మూడో వంతు తగ్గింది. 80 స్థానాలకు పడిపోయింది.
వయనాడ్‌లో నామినేషన్ తర్వాత రాహుల్ గాంధీ ఓటర్లను ఆకర్షించడానికి మిగతా పార్టీలను దక్షిణ భారత వ్యతిరేకులుగా ప్రచారం చేయడాన్ని కొనసాగిస్తారు.
అటు నరేంద్ర మోదీ, చెన్నై ఎయిర్‌పోర్ట్ నుంచి ఐఐటీ మద్రాస్ వరకూ ఐదు కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్లో వెళ్లాల్సివచ్చింది.
ఆయన నల్ల జెండాల తిరుగుబాటును తప్పించుకోడానికి అలా చేసినా, హెలికాప్టర్లో వెళ్తున్నప్పుడు నల్ల బెలూన్లు చూడాల్సి వచ్చింది.
అయితే, దక్షిణ భారత్‌లోనే కాదు మొత్తం దేశంలోనే ఎక్కువ ప్రాంతాల్లో 'కనీస ఆదాయం', 'సంకల్పిత్ భారత్', 'సశక్త్ భారత్' ప్రభావం ఏమాత్రం లేదనే విషయం దేశంలోని రెండు అతిపెద్ద పార్టీలూ మర్చిపోతున్నాయి.
(కృష్ణ ప్రసాద్ అవుట్‌లుక్ వీక్లీ మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్, భారత ప్రెస్ కౌన్సిల్ మాజీ సభ్యులు)
ఇవి కూడా చదవండి:
- లోక్‌సభ: పెరుగుతున్న బీజేపీ ప్రాబల్యం.. తగ్గుతున్న ముస్లిం ప్రాతినిధ్యం
- ఏడీఆర్ సర్వే: కేసీఆర్ పాలనకు తెలంగాణ ప్రజలు ఇచ్చిన రేటింగ్ ఎంత?
- రవీంద్రనాథ్ ఠాగూర్: ‘జాతీయవాదం ప్రమాదకారి. భారతదేశ సమస్యలకు అదే మూలం’
- అన్నదాత సుఖీభవ పథకం: ఎవరు అర్హులు? కౌలు రైతుల్ని ఎలా గుర్తిస్తారు?
- మీకు ప్రభుత్వం నేరుగా డబ్బిస్తే మంచిదేనా, కాదా?
- కాళేశ్వరం ప్రాజెక్టు: కలల నిర్మాణం ఒక వైపు... కడతేరని విషాదం మరో వైపు
- Reality Check: నరేంద్ర మోదీ హామీలు నిలబెట్టుకున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








