లోక్‌సభ: పెరుగుతున్న బీజేపీ ప్రాబల్యం.. తగ్గుతున్న ముస్లిం ప్రాతినిధ్యం - అభిప్రాయం

ఫొటో సోర్స్, AFP
- రచయిత, యూసఫ్ అన్సారీ
- హోదా, సీనియర్ జర్నలిస్ట్, బీబీసీ కోసం
17వ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ మొదలై కొంతకాలమైంది.
దేశంలోని రెండో అధిక సంఖ్యాక మతస్తులైన ముస్లింలు ఈసారి ఎన్నికలలో దాదాపు పూర్తి మౌనంగా ఉండడం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
ముస్లిం సంస్థలేవీ తమ డిమాండ్లతో ముందుకు రాకపోవడమే కాదు, ఓట్ల కోసం తరచూ వారికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడే రాజకీయ పార్టీలు సైతం ఈసారి వాటి గురించి ఏమీ మాట్లాడడం లేదు.
సహజంగానే ఒక ప్రశ్న వస్తుంది. ఎన్నికల సమయంలోనే వారి సమస్యలు చర్చకు రానపుడు ఎన్నికల తర్వాత అవి పార్లమెంట్‌లో చర్చల్లో భాగమవుతాయని ఎలా అనుకోగలం అని.
అసలు లోక్‌సభలో వారి సమస్యలను లేవనెత్తడానికి గాని, వారి ప్రయోజనాల గురించి మాట్లాడడానికి గాని తగినంతమంది సభ్యులు ఉంటారా అని మరో సందేహం.
స్వాతంత్ర్యానంతరం బహుశా ఇదే మొదటిసారేమో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీల ఎజెండాలో ముస్లింల సమస్యలు లేకపోవడం! అంతే కాదు, లోక్ సభలో వారికి తగినంత ప్రాతినిధ్యం కల్పించాలని కూడా పార్టీలేవీ అనుకోకపోవడం!
ముస్లింల సమస్యలు లేవనెత్తితే అది (హిందూ) రాజకీయ ఏకీకరణకు దారి తీసి బీజేపీకి లాభదాయకంగా మారుతుందన్న భయం కాంగ్రెస్, సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీ, రాష్ట్రీయ జనతా దళ్ వంటి అనేక పార్టీలలో ఉంది.
ఈ కారణంగానే వారు ముస్లిం మెజారిటీ నియోజకవర్గాలలో సైతం ముస్లిం అభ్యర్ధులను నిలబెట్టడానికి భయపడుతున్నారు.

ఫొటో సోర్స్, SAMIRATMAJ MISHRA
వీరి భయాలు ఎంత వాస్తవమో ఒకసారి చూద్దాం. లోక్ సభ ఎన్నికల సరళిని పరిశీలిస్తే బీజేపీ సభ్యులు పెరిగే కొద్దీ ముస్లిం సభ్యుల సంఖ్య తగ్గడం గమనించవచ్చు.
8వ లోక్‌సభలో బీజేపీకి ఇద్దరే ఇద్దరు సభ్యులున్నపుడు ఆ సభలో వివిధ పార్టీలకు చెందిన ముస్లిం సభ్యులు మొత్తం 46 మంది ఉండేవారు.
2014లో బీజేపీకి 282 సీట్లు వచ్చినప్పుడు ముస్లిం ఎంపీల సంఖ్య 22 కి తగ్గింది. అయితే తర్వాత 2018లో యూపీలోని కైరానా స్థానానికి ఉపఎన్నిక జరిగినప్పుడు రాష్ట్రీయ జనతా దళ్ అభ్యర్ధి తబస్సుమ్ హసన్ గెలుపొందడంతో ఈ సంఖ్య 23కి పెరిగింది.
ఆమె గెలవకపోతే ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఒక్క ముస్లిం ఎంపీ కూడా లోక్ సభలో ఉండేవారు కాదు. ఆ రాష్ట్రంలో 80 లోక్‌సభ నియోజకవర్గాలున్నా 2014 ఎన్నికల్లో ఒక్క ముస్లిం అభ్యర్ధి కూడా గెలవలేకపోయారు.
2011 గణాంకాల ప్రకారం భారతదేశ జనాభాలో ముస్లింలు 14.2 శాతం మంది ఉన్నారు.
జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం ఉండాలని వాదించేవారి ప్రకారం 545 మంది ఉండే లోక్‌సభలో ముస్లింలు 77 మంది ఉండాలి. కాని ఏ ఎన్నికల్లోనూ వారు ఆ సంఖ్యను చేరుకోలేదు.
449 మంది సభ్యులుండే మొదటి లోక్‌సభలో ముస్లిం సభ్యుల సంఖ్య 21. అంటే 4.29 శాతం. ఇటీవల రద్దయిన 16వ లోక్‌సభలో ఈ సంఖ్య 23. కాని 545 మంది సభ్యుల్లో 23 అంటే 4.24 శాతం. స్వాతంత్ర్యానంతరం ముస్లింల ప్రాతినిధ్యం అతి తక్కువ ఉన్న లోక్‌సభ ఇదే.

ఫొటో సోర్స్, EPA
స్వాతంత్ర్యానంతరం
మొదటి లోక్‌సభలో ముస్లింల ప్రాతినిధ్యం తక్కువ ఉండడం అప్పుడే జరిగిన దేశ విభజన కారణంగా సహజమే అనిపించవచ్చు. పాకిస్తాన్ రూపంలో ముస్లింలకు దక్కాల్సింది దక్కింది అని మెజారిటీ ప్రజలు అనుకుని ఉండొచ్చు.
కానీ 67 ఏళ్ళ తర్వాత 2014లో కూడా అతి తక్కువ మంది ముస్లింలు లోక్‌సభకు ఎన్నికవడం మాత్రం రాజకీయపరంగా వారి పట్ల ఉన్న చిన్నచూపును స్పష్టం చేస్తోంది.
ఎంతో కాలంగా ముస్లింల సమస్యల గురించి మాట్లాడుతూ వచ్చిన అనేక రాజకీయ పార్టీలు ఇవ్వాళ తమ హిందూ ఓటర్లు బీజేపీ వైపు వెళతారన్న భయంతో ముస్లింలను అభ్యర్ధులుగా నిలబెట్టడానికి సైతం సుముఖంగా లేవు. వాళ్ళ భయాలను అర్ధం చేసుకోవచ్చు కాని ముస్లింలకు జరిగే అన్యాయం మాటేమిటి?
గణాంకాలు ఏమి చెబుతున్నాయి?
2014 పార్లమెంటరీ ఎన్నికలను చూస్తే ఇది స్పష్టంగా అర్ధమైపోతుంది.
16వ లోక్‌సభలో 7 రాష్ట్రాల నుంచి మాత్రమే ముస్లింలు ఎన్నికయ్యారు. 8 మందితో పశ్చిమ బెంగాల్ ఈ విషయంలో అగ్రస్థానంలో ఉంది. మిగతా వారిలో బిహార్ నుంచి నలుగురు, కేరళ, జమ్మూ కశ్మీర్‌ల నుంచి ముగ్గురేసి చొప్పున, అస్సాం నుంచి ఇద్దరు, తమిళనాడు, తెలంగాణ, కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. దేశంలోని మొత్తం ముస్లిం జనాభాలో 46 శాతం మంది 179 నియోజకవర్గాలు గల ఈ 8 రాష్ట్రాలలో (ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో సహా) నివసిస్తున్నారు.
అంటే 28 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి లోక్‌సభకు ఒక్క ముస్లిం కూడా ఎన్నికవ్వలేదు. దేశ ముస్లిం జనాభాలో 54 శాతం మంది నివసించే ఈ 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 364 నియోజకవర్గాల నుంచి ఒక్క ముస్లిం అభ్యర్ధి కూడా లోక్‌సభకు ఎన్నిక అవలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ముస్లింల ప్రాతినిధ్యం
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లోక్‌సభకు ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. అన్ని లోక్‌సభల్లోనూ ముస్లింల ప్రాతినిధ్యం ఎంత శాతం ఉంటూ వచ్చిందో పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి.
మొదటి లోక్‌సభ నుంచి ఆరో లోక్‌సభ వరకు ముస్లింల ప్రాతినిధ్యం క్రమేణా పెరుగుతూ వచ్చింది.
మొదటి లోక్‌సభకు 21 మంది ముస్లింలు ఎన్నికైతే ఆరో లోక్‌సభ నాటికి వారి సంఖ్య 34 కి పెరిగింది. అంటే ముస్లింల ప్రాతినిధ్యం 4.29 నుంచి 6.2 శాతానికి పెరిగింది.
సీట్లు ఎలా తగ్గాయి?
ఏడో లోక్‌సభలో ముస్లింల ప్రాతినిధ్యం ఒక్కసారి అమాంతంగా పెరిగింది. 49 మంది గెలవడంతో వారి శాతం 9.26 అయింది. 1984 లో జరిగిన 8 వ లోక్‌సభ ఎన్నికలలో ఈ సంఖ్య కొద్దిగా తగ్గి 46 మంది ఎన్నికయ్యారు.
కానీ 1989 లో ఎప్పుడైతే బీజేపీ 86 సీట్లు గెలుచుకుందో ఆ ఎన్నికలలో లోక్‌సభకు ఎన్నికైన ముస్లింల సంఖ్య 33 కి తగ్గింది. అక్కడ్నించి బీజేపీ సభ్యుల సంఖ్య పెరగడం, ముస్లింల సంఖ్య తగ్గడం గమనించవచ్చు.
1991 లో బీజేపీకి 120 సీట్లు వచ్చినప్పుడు ముస్లిం ఎంపీల సంఖ్య 28.
1996 లో బీజేపీకి 163 సీట్లు వచ్చినప్పుడు కూడా ముస్లిం ఎంపీల సంఖ్య అదే 28.
1998 లో బీజేపీకి 182 సీట్లు వచ్చినప్పుడు ముస్లిం ఎంపీల సంఖ్య 29.
1999 లో బీజేపీకి మళ్ళీ 182 సీట్లే వచ్చాయి కాని ఈసారి ముస్లింల సంఖ్య 32 కి పెరిగింది.
2004 లో బీజేపీ సీట్లు 138 కి పడిపోయినప్పుడు ముస్లిం ఎంపీల సంఖ్య 36 కి పెరిగింది.
మళ్ళీ 2009 లో జరిగిన 15 వ లోక్ సభ ఎన్నికలలో ముస్లిం ఎంపీల సంఖ్య 30 కి తగ్గింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆందోళన కలిగించే అంశం
లోక్‌సభలో ముస్లింల ప్రాతినిధ్యం తగ్గడం చాలా ఆందోళన కలిగించాల్సిన అంశం. కానీ ఎవరూ దాని గురించి పట్టించుకుంటున్నట్టు లేరు.
బడుగు, బలహీన వర్గాల వారందరికీ జనాభాలో వారి వారి శాతాలకు అనుగుణంగా లోక్‌సభలో ప్రాతినిధ్యం కల్పిస్తున్నపుడు ఈ సూత్రాన్ని ముస్లింలకు ఎందుకు వర్తింపజేయడం లేదన్నది ప్రశ్న.
ఈ దేశంలో ముస్లింల పరిస్థితి దళితుల కంటే హీనంగా ఉందని 2006 లోనే సచార్ కమిటీ చెప్పింది. దళితులకు వారి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించినప్పుడు మరి ముస్లింలకు ఎందుకు ఆ సదుపాయం కల్పించలేదు?
రిజర్వేషన్ ప్రాతిపదిక
భారత సమాజంలోని అట్టడుగు వర్గాలైన దళిత, ఆదివాసీ సమూహాలకు లోక్‌సభలో వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించారనేది అందరికీ తెలిసిందే.
దాని ప్రకారం దళితులకు 84 సీట్లు, ఆదివాసీలకు 47 సీట్లు రిజర్వ్ అయి ఉన్నాయి. ఇవి కాక రెండు సీట్లకు ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేస్తారు. ఏ ఒక్క నియోజకవర్గంలోనూ వారి జనాభా ఎక్కువగా ఉండదు కాబట్టి వారికి ఎక్కడా గెలిచే అవకాశం ఉండదన్న ఉద్దేశంతో రాజ్యాంగం రాసినపుడే ఆ ప్రత్యేక ఏర్పాటు చేశారు.
గత పాతికేళ్ళుగా స్త్రీలకు లోక్‌సభలో 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కాని అవి ఇంకా ఫలించలేదు. రాజకీయాలలో, ప్రభుత్వంలో వారికి ఆ విధమైన ప్రాతినిధ్యం కల్పించినప్పుడే మహిళా సాధికారతను సాధించగలమన్న ఎరుకే ఈ ప్రయత్నానికి కారణం.
17 వ లోక్‌సభలో ముస్లింల ప్రాతినిధ్యం పెరుగుతుందా తరుగుతుందా అనేది ఫలితాలు వెలువడ్డాకే తెలుస్తుంది కానీ ఎప్పటికైనా ఈ విషయం మాత్రం చర్చకు రాక మానదు.
ఇవి కూడా చదవండి:
- నూర్ ఇనాయత్ ఖాన్: బ్రిటన్ కీర్తించే గూఢచారి ఈ భారతీయ యువరాణి
- భారతీయ యువతులు చైనా యువకుల్ని ఎందుకు పెళ్లి చేసుకోరు?
- ‘20 లక్షల మంది' ముస్లింలు కర్నూలుకు ఎందుకు వచ్చారు
- ముస్లిం పాలకులు విదేశీయులైతే మరి మౌర్యులు?
- జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్: ‘ఒకప్పుడు పాకిస్తాన్లో ముస్లిం’ ఎందుకయ్యారు?
- 'మంచి ముస్లిం' అనేది ఎవరు నిర్ణయిస్తారు?
- సౌదీ కథలు: 'ఆ నరకం భరించలేక ఏదన్నా తాగి సచ్చిపోదాం అనిపిస్తుంది సార్’
- ‘బీజేపీ వ్యతిరేకులు దేశద్రోహులు కారు’ - అడ్వాణీ
- రాజకీయ పార్టీల నుంచి ముస్లిం మహిళలు ఏం కోరుకుంటున్నారు...
- భరించలేని ఎండలు... తగ్గిపోతున్న మార్కులు
- ఉత్తరాంధ్ర వలసలు: ‘ఏ దేశం వెళ్లినా ఈ మూడు జిల్లాల వలస కార్మికులు కనిపిస్తారు’
- ధవళేశ్వరం ఆనకట్ట: గోదావరి జిల్లాలను కరువు నుంచి సంపదలోకి తెచ్చిన ప్రాజెక్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








