మొహమ్మద్ రంజాన్: భారతీయుడినే అయినా నన్ను 'పాకిస్తానీ' అంటూ కొట్టారు!

వృద్ధుడు
    • రచయిత, అరవింద్ ఛాబ్రా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశం 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్న తరుణంలో, హరియాణాలోని పంచకుల ప్రాంతంలో 64 ఏళ్ల మొహమ్మద్ రంజాన్ పోలీసులు కొట్టిన దెబ్బలకు నొప్పితో మంచంపై మూలుగుతూ ఉన్నారు.

రంజాన్ మనసును కొన్ని ప్రశ్నలు తొలిచివేస్తున్నాయి. అవేంటంటే- ''పోలీసులు నన్ను 'పాకిస్తానీ' అని ఎందుకన్నారు? ఎందుకు కొట్టారు?''

ఈ నెల 21న ఆదివారం రాత్రి రంజాన్ తాను పనిచేసే దుకాణం నుంచి ఒక సహాయకుడితో కలిసి కారులో ఇంటికి తిరిగి వెళ్తుండగా, హరియాణా పోలీసులు ఇద్దరు రంజాన్‌ను అదుపులోకి తీసుకొని, పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి, చొక్కా చించేసి తీవ్రంగా కొట్టారు.

పంచకుల జిల్లా సాకేత్రిలో ఈ ఘటన జరిగింది. రంజాన్ ఓ సరకుల దుకాణంలో వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.

''ఆదివారం రాత్రి మేం ఇంటికి తిరిగి వస్తుంటే పోలీసులు వారి వాహనంలో మమ్మల్ని అనుసరించారు. మా కారు ఆపాలని నాకు సూచించారు. తర్వాత మమ్మల్ని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. బట్టలు విప్పేయండన్నారు.. నేను విప్పనని చెప్పాను. 'నువ్వు పాకిస్తానీయుడివి, ముస్లిం ఛాందసవాదివి, దుర్మార్గుడివి' అంటూ నా బట్టలు చించేసి, కొట్టడం మొదలుపెట్టారు. శరీరమంతా కొట్టారు.. ఫుట్‌బాల్‌ను తన్నినట్లు తన్నారు'' అని రంజాన్ బీబీసీ ప్రతినిధికి వివరించారు.

పోలీసు వాహనం

నేను పాకిస్తానీయుడిని ఎట్లయితా?

రంజాన్ తన ఐదుగురు కుమారులతో కలిసి ఉంటున్నారు. నలుగురు కుమారులకు పెళ్లిళ్లు అయ్యాయి.

''పుట్టినప్పటి నుంచి పంచకులలోనే ఉంటున్నాను. నా బంధువులు కొందరు భారత సైన్యంలో పనిచేస్తున్నారు. ఈ పోలీసులేమో నన్ను 'పాకిస్తానీయుడివి, ముస్లిం ఛాందసవాదివి' అంటున్నారు. నేను భారతీయుడినేనని చెప్పే ధ్రువపత్రాలు చూపించినా, వారు అసలు పట్టించుకోనేలేదు'' అని ఈ వృద్ధుడు చెప్పారు.

తనతో ఇలా వ్యవహరించిన, హింసించిన పోలీసులకు పోలీసు సర్వీసులో కొనసాగే అర్హత లేదని, వారిని ఉద్యోగంలోంచి తీసేయాలని రంజాన్ డిమాండ్ చేశారు.

తన తండ్రికి సహాయంగా ఆయన పక్కనే ఉన్న మొహమ్మద్ అస్లాం(27) మాట్లాడుతూ- ''మేం భారతీయులం. పోలీసులు అన్నట్లు మేం పాకిస్తానీలం కాదు. ఆ పోలీసులిద్దరినీ డిస్మిస్ చేయాలి'' అన్నారు.

రంజాన్‌ను కొట్టిన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశామని పంచకుల పోలీసు కమిషనర్ ఏఎస్ చావ్లా బీబీసీతో చెప్పారు. ''తనకు న్యాయం జరగలేదని బాధితుడు రంజాన్‌కు అనిపిస్తే, ఆయన డీసీపీని కలిసి మాట్లాడాలి. ఆయనకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని నేను హామీ ఇస్తున్నా'' అని కమిషనర్ చెప్పారు.

సస్పెండైన పోలీసుల్లో ఒకరు ప్రత్యేక పోలీసు అధికారి అని, ఆయన తొలగింపుపై ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడొచ్చని చావ్లా తెలిపారు. మరొకరు అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నారని, ఆయనపై శాఖాపరమైన విచారణ జరుగుతోందని, ఆయన చేసిన తప్పు తీవ్రమైనదని తేలితే, ఆయన్ను కూడా తొలగించే అవకాశముందని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)