ఉత్తరాంధ్ర వలసలు: ‘ఏ దేశం వెళ్లినా ఈ మూడు జిల్లాల వలస కార్మికులు కనిపిస్తారు’
- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
2016-17 ఆర్థిక సర్వే ప్రకారం భారతదేశంలో పది కోట్ల మంది వలస కార్మికులున్నారు. వారిలో 22 లక్షల మంది ఉత్తరాంధ్ర వారే. మరి, ఉత్తరాంధ్ర నుంచి వారంతా ఎక్కడికి వెళ్తారు?
ఆంధ్రకు 974 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం ఉంది. గుజరాత్ తరువాత ఇదే పెద్దది. అందులో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు 320 కిలోమీటర్ల సముద్ర తీరం కలిగి ఉన్నాయి. ఆంధ్రలో ఉన్న నాలుగు పెద్ద చేపల రేవుల్లో ఉత్తరాంధ్ర రేవు ఒకటి.
ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 80 వేల కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి బతుకుతున్నాయని మత్స్యకార సంఘాలు చెబుతున్నాయి. ఏప్రిల్ రాగానే వారిలో చాలా మంది తమ కుటుంబాన్ని వదిలి వలస వెళ్లిపోతుంటారు.

"బతుకు తెరువు కోసం తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్ర వంటి చోట్లకు వెళ్తాం. నేనే కాదు, మా ఊళ్లో చాలా మందిమి వెళతాం. ఇంకే చేయాలి? ఇక్కడ చేపల పట్టే వసతుల్లేవు. ఇక్కడుంటే బతకలేం. మేం వలస వెళ్లాల్సిందే" అని శ్రీకాకుళం జిల్లావాసి చెప్పారు.
మత్స్యకారులే కాదు, చాలా కులాల వారు ఇలా వలస వెళ్తుంటారు. 2017-18 ప్రభుత్వ లెక్కల ప్రకారం వ్యవసాయం, పరిశ్రమలు, రెండింటిలోనూ శ్రీకాకుళం, విజయనగరం బాగా వెనుకబడి ఉన్నాయి. ఈ రెండు జిల్లాలనూ ఆర్థికంగా వెనుకబడ్డ జిల్లాలుగా నీతి ఆయోగ్ గుర్తించింది. కానీ, ఈ జిల్లాల అభివృద్ధికి కేటాయించిన నిధులు కేంద్ర రాష్ట్ర రాజకీయాల మధ్య ఇరుక్కుపోయాయి.

బతుకుదెరువు కోసం మన దేశ, విదేశాలకు వెళ్లిపోతున్న శ్రీకాకుళం జిల్లాలోని లొడ్డపుట్టి గ్రామస్తులను కలవడానికి వెళ్లాము. తమ గ్రామస్తులు ప్రపంచంలోని ప్రతిదేశంలోనూ ఉన్నారని చెప్పారు. విదేశాలకు వలసవెళ్లి అక్కడ పనులు చేస్తున్న కొంతమందితో వీడియో కాల్ ద్వారా మాట్లాడించారు.
ఇక్కడి వారు భవన నిర్మాణంలో నైపుణ్యం కలిగిన వాళ్ళు. మన దేశంలో కన్నా ఇతరదేశాలలో తమ పనికి ఆదాయం మెరుగ్గా ఉండటంతో వీరంతా తమ కుటుంబానికి దూరంగా విదేశాలకు వెళ్లి తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు.
33 ఏళ్ల శేఖర్ సింగపూర్, దుబాయ్, అజర్ బైజాన్, రష్యా దేశాల్లో వెల్డర్‌గా పనిచేసి తిరిగొచ్చి సొంతూరిలో ఇల్లు కట్టుకున్నారు. కానీ, ఇప్పుడు తన భార్యను వదిలి బతుకు తెరువుకోసం మళ్లీ వలస వెళ్లడం తప్పదని అంటున్నారు ఆయన.

"మా జిల్లాలో పరిశ్రమల్లేవు. వ్యవసాయం చేయడానికి కూడా ఏమీ లేదు. ఇక్కడ ఇంటికి 30 సెంట్ల కంటే ఎక్కువ భూమి లేదు. నలుగురున్న కుటుంబం గడవడానికి ఆ భూమి ఏమాత్రం సరిపోదు. ఇలాంటప్పుడు మేమేం చేయాలి? అందుకే వలసపోతాం" అని శేఖర్ చెప్పారు.
ఉత్తరాంధ్రలో 60 లక్షల ఎకరాల భూమి ఉంది. ఇందులో 30 లక్షల ఎకరాలు సారవంతమైనది. కానీ, ప్రస్తుతం 10 లక్షల ఎకరాలే సాగులో ఉంది.

మహారాష్ట్ర, గుజరాత్, కోల్‌కతా, గోవా, చెన్నై వెళ్లే రైళ్లతో కిటకిటలాడే శ్రీకాకుళం జిల్లాలోని ప్రతీ రైల్వే స్టేషనూ ఇక్కడి బతకు చిత్రాన్ని పట్టి చూపుతుంది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: కట్టలు తెంచుకున్న కరెన్సీ.... ఏరులై పారుతున్న లిక్కర్
- ఆంధ్రప్రదేశ్: రాజధాని అమరావతి నగర నిర్మాణం ఎంతవరకు వచ్చింది...
- మానవ కంప్యూటర్ శకుంతలా దేవి మెదక్ నుంచి ఎందుకు పోటీ చేశారు?
- వైసీపీ మేనిఫెస్టో: 'రెండు లక్షల 30 వేల ఉద్యోగాల భర్తీ ... మూడు దశల్లో మద్య నిషేధం'
- టీడీపీ మేనిఫెస్టో: ‘చంద్రన్న బీమా’ రూ.10 లక్షలు.. మరో అయిదేళ్లు ‘అన్నదాత సుఖీభవ’
- హలో.. మిమ్మల్నే.. వినిపిస్తోందా? లేదంటే వెంటనే పరీక్షించుకోవాలి
- హైదరాబాద్: బాలాపూర్‌లో ఉన్న రోహింజ్యాలు బర్మాకు వెళ్లాల్సిందేనా?
- రేణూ దేశాయ్: స్త్రీ గౌరవం రెండు కాళ్ల మధ్య లేదు
- ధవళేశ్వరం ఆనకట్ట: గోదావరి జిల్లాలను కరువు నుంచి సంపదలోకి తెచ్చిన ప్రాజెక్టు
- భరించలేని ఎండలు... తగ్గిపోతున్న మార్కులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









