టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో: ‘చంద్రన్న బీమా’ రూ.10 లక్షలు.. మరో అయిదేళ్లు ‘అన్నదాత సుఖీభవ’

నారా చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, tdp.ncbn.official/facebook

అవగాహన లేకుండా కొన్ని పార్టీలు మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయని, కానీ తమ పార్టీ చెప్పిందే చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ మేనిఫెస్టోను ఈ రోజు ఆయన ప్రకటించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆర్థిక అసమానతలు తగ్గించేలా తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని అన్నారు. తాము చెప్పినదాని కంటే 50 శాతం ఎక్కువే చేశామని తెలిపారు. కేసీఆర్ స్క్రిప్ట్ ప్రకారమే జగన్ నడుచుకుంటున్నారని విమర్శించారు. నదుల అనుసంధానం, నీటి పారుదలపై వైసీపీ మానిఫెస్టోలో ఏమి చెప్పలేదని అన్నారు.

మేనిఫెస్టోలోని కీలకాంశాలు

వ్యవసాయం అనుబంధ రంగాలు..

* వచ్చే అయిదేళ్లూ అన్నదాత సుఖీభవ పథకం అమలు. రానున్న ఖరీఫ్ సీజన్ నుంచి కౌలు రైతులకూ వర్తింపు.

* రైతులందరికీ ఉచిత పంటల బీమా పథకం.

* రైతులకు ఉచితంగా 12 గంటల పాటు పగటిపూట సరఫరా.

* రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి.

* గిరిజన రైతులకు విత్తనాలు, తదితర ఇన్‌పుట్స్ ఐటీడీఏ ద్వారా ఉచితం.

* ఏపీని హార్టీ కల్చర్ హబ్‌గా మార్చడానికి ఉద్యాన పంటలను కోటి ఎకరాలకు విస్తరణ.

* మరో 50 లక్షల ఎకరాలలో సూక్ష్మసేద్య వ్యవస్థల ఏర్పాటు

* ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ వద్ద కొత్తగా కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు

* గోపాలమిత్రల వ్యవస్థను బలోపేతం చేసి ఖాళీలు భర్తీ చేయడం

* ప్రపంచ బ్యాంకు సహాయంతో గ్రామ సమృద్ధి యోజన కింద చిన్నచిన్న ఆహార పరిశ్రమల ఏర్పాటు

* మామిడి, అరటి రైతుల కోసం మ్యాంగో, బనానా బోర్డుల ఏర్పాటు

మైక్రో ఇరిగేషన్
ఫొటో క్యాప్షన్, మైక్రో ఇరిగేషన్

నీటిపారుదల రంగం

* 2 కోట్ల ఎకరాలకు భూమిని సాగులోకి తేవడం లక్ష్యం.

* 2019లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం. 960 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టును పూర్తి చేయడం.

* పోలవరం ద్వారా విశాఖ నగరానికి తాగునీరు.

మహిళలు

మహిళా సాధికారత-బాలికల భవిష్యత్తు

* డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ పథకం కొనసాగింపు

* డ్వాక్రా మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు.

* వడ్డీలేని రుణాల పథకాన్ని కొనసాగిస్తూ అర్హత పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు

* మహిళా ఉద్యోగినులకు స్కూటర్ కొనుగోలుకు రాయితీ

* ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు.

* రానున్న అయిదేళ్లలో మహిళలకు రూ.2 లక్షల కోట్ల ఆర్థిక సహాయం.

* రాష్ట్రంలో 15,358 అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణం.

పేదరికంపై గెలుపు

* చంద్రన్న భరోసా కింద పింఛన్లు రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంపు

* వృద్దాప్య పింఛన్ల అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గింపు

* చంద్రన్న బీమా సొమ్ము రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు

* చంద్రన్న పెళ్లి కానుక రూ. లక్షకు పెంపు

* ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.20 వేల ఆదాయ కల్పనకు ప్రణాళిక

ఎస్సీ, ఎస్టీల సంక్షేమం

* ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కాలపరిమితి 2033 వరకు పొడిగింపు

* గిరిజన ప్రాంతాల్లో గర్భిణుల కోసం ‘హోం ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్’ల ఏర్పాటు

* విదేశీ విద్య స్కాలర్‌షిప్ రూ.25 లక్షలకు పెంపు

* కొత్తగా ఏడు జిల్లాల్లో అంబేడ్కర్ స్టడీ సర్కిళ్ల ఏర్పాటు

వేటకు సిద్ధంగా ఉన్న పడవలు
ఫొటో క్యాప్షన్, చేపల వేటకు వాడే పడవలు

వెనుకబడిన తరగతుల సంక్షేమం

* ఉన్నత విద్య, వృత్తి విద్య కోర్సులు చదివే పేద విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయంబర్స్‌మెంట్

* 200 రెసిడెన్సియల్ పాఠశాలల ఏర్పాటు

* ఏపీఐఐసీ ద్వారా కేటాయించే ఇండస్ట్రియల్ ఎస్టేట్లలో 25 శాతం ప్లాట్లు బీసీలకు

* కళింగ కోమట్లకు కార్పొరేషన్

* స్వయం ఉపాధికి కారు లోన్లపై 25 శాతం రాయితీ

* బ్యాంకులతో సంబంధం లేకుండా బీసీలకు కార్పొరేషన్ల ద్వారా రూ.లక్ష వరకు రుణాలు

* తీర ప్రాంతాల్లో పలు చోట్ల ఫిషింగ్ జెట్టీల ఏర్పాటు

* మత్స్యకారులకు క్రాప్ హాలిడే సహాయం రూ.10 వేలు

* ఆధునిక టెక్నాలజీతో షాపులు, షోరూంలు పెట్టుకునే బీసీలకు రూ.5 లక్షల వరకు రుణం.

* విదేశీ విద్యాదరణ పథకాన్ని రూ.15 లక్షలకు పెంపు

* ప్రతి చేనేత కుటుంబానికి రూ.4 వేల భృతి ఏటా ఖాతాలో జమ

కాపుల సంక్షేమం

* రానున్న అయిదేళ్లలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు విధానం ప్రకారం విద్య, ఉద్యోగ రంగాల్లో అమలు

* రానున్న అయిదేళ్లలో కాపుల సంక్షేమానికి రూ. 5 వేల కోట్లు

మైనారిటీల సంక్షేమం

* ఇమామ్‌లకు రూ. 5 వేల నుంచి రూ. 7 వేలకు.. మౌజన్‌లకు రూ.3 వేల నుంచి రూ. 5 వేలకు పారితోషికం పెంపు

* ఖాళీగా ఉన్న ఉర్దూ టీచర్ పోస్టులను ప్రత్యేక రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ

* క్రిస్టియన్ మైనారిటీలు జెరూసలెం యాత్రకు బడ్జెట్ పెంపు

దివ్యాంగుల సంక్షేమం

* విభిన్న ప్రతిభావంతులకు 3 చక్రాల మోటరైజ్డ్ సైకిళ్లు

* అన్ని ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో రాయితీ ప్రయాణం

* అర్హులైన విభిన్న ప్రతిభావంతులకు గృహవసతి

* మానసిక వికలాంగులకు నెలకు రూ. 3 వేల పింఛన్

యువతకు

* 18 నుంచి 22 ఏళ్ల యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తూ రూ.2 వేల భృతి

* యువత రూ.10 లక్షల లోపు పెట్టుబడితో స్థాపించే పరిశ్రమలకు పూర్తి వడ్డీ రాయితీ

* యువ ఎంటర్‌ప్రెన్యూవర్లకు రాయితీ రుణాలు

* టీడీపీ నిర్ణాయక కమిటీలలో యువతకు పదవులు

గ్రామీణాభివృద్ధి- మౌలిక సదుపాయాలు

* 2020 నాటికి ప్రతి మనిషికి 70 లీటర్ల చొప్పున రక్షిత మంచినీటి సరఫరా

* అన్ని గ్రామాలకు తారు రోడ్లు

* 2 వేలకు పైగా జనాభా ఉన్న గ్రామాలకు భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ

* అన్ని గ్రామ పంచాయతీల్లో అంగన్‌వాడీలకు శాశ్వత భవనాలు

పట్టణాభివృద్ధి

* పట్టణాల్లో ప్రతి ఇంటికీ మంచినీటి సరఫరా

* మున్సిపల్ సేవలన్నీ ఆన్‌లైన్ విధానంలో ప్రజలకు అందుబాటులోకి తేవడం

* అన్ని పట్టణాల్లో అన్న క్యాంటీన్లు

పరిశ్రమలు

* పారిశ్రామిక రంగంలో 30 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి

* ప్రకాశం జిల్లాలో రూ.24,500 కోట్లతో కాగితం పరిశ్రమ

* తూర్పుగోదావరి జిల్లాలో మెగా పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు. 5 వేల మందికి ఉద్యోగాలు

* కడపజిల్లా మైలవరంలో రూ.18 వేల కోట్లతో రాయలసీమ స్టీల్ ప్లాంట్

* విజయనగరం, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మెగా ఫుడ్ పార్కులు.

* తిరుపతిలో 2 ఎలక్ట్రానిక్ క్లస్టర్లు.

* విశాఖలో అతిపెద్ద డాటా సెంటర్

ఐటీ రంగం

* రానున్న అయిదేళ్లలో ఐటీ రంగంలో కనీసం 2.5 లక్షల ఉద్యోగాల కల్పన. ఎలక్ట్రానిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో 3 లక్షల ఉద్యోగాలు

* అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని ముఖ్య కూడళ్లలో ఉచిత వైఫై ఏర్పాటు

విద్యుత్

* 17 లక్షల సంప్రదాయ వ్యవసాయ పంపుసెట్లను సోలార్ పంపుసెట్లుగా మార్చడం.

* స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని 2029 నాటికి 56 వేల మెగావాట్లకు పెంచడం. ప్రస్తుతం ఇది 9,529 మెగా వాట్లుగా ఉంది.

* 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో 4 సోలార్ పార్కుల ఏర్పాటు

* రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల విద్యుత్ వాహనాలు నడవాలన్నది లక్ష్యం.

విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

విద్యా రంగం

* అన్ని పాఠశాలలకు కంప్యూటర్ ల్యాబ్‌లు

* 2019 ఫిబ్రవరి 28 నాటికి తీసుకున్న అన్ని ఉన్నత విద్యారుణాలపై వడ్డీ మాఫీ

* అన్ని సామాజిక వర్గాల కాలేజీ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు రీయంబర్స్ మెంట్

* ఇంటర్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు

వైద్యురాలు

ఫొటో సోర్స్, iStock

వైద్యం

* అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాన్సర్ ఆసుపత్రుల నిర్మాణం

* వైద్యులు, నర్సుల పోస్టులన్నీ భర్తీ

* రాష్ట్ర, జాతీయ రహదారుల వెంట ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్

* వైద్య విద్యలో పోస్టుగ్రాడ్యుయేట్ సీట్లను ఎంబీబీఎస్ సీట్లకు సమానంగా పెంచేందుకు కృషి

* మెడికల్ పోస్టుగ్రాడ్యుయేట్లకు స్టైఫండ్ రూ.50 వేలకు పెంపు

ఉద్యోగులకు

* ప్రభుత్వ రంగంలోని అన్ని శాశ్వత పోస్టులను షెడ్యూల్ ప్రకటించి భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తాం.

* ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఆయా జిల్లాల్లో ఇళ్ల స్థలాల కేటాయింపు

* ఉద్యోగినులకు 5 రోజుల అదనపు క్యాజువల్ లీవ్

* ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)