హైదరాబాద్‌లో రోహింజ్యాలు: మయన్మార్‌కు తిరిగి వెళ్లాల్సిందేనా?

- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో రోహింజ్యాల గణన మొదలైంది. రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్‌లోని ఒక ఫంక్షన్ హాల్‌లో రాచకొండ, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నారు.
బాలాపూర్ ప్రాంతంలో రెండు రోహింజ్యా క్యాంపులున్నాయి. అలాగే బహుదూర్‌పుర, కంచన్‌బాగ్ ప్రాంతాలలో రోహింజ్యాలు నివాసం ఉంటున్నారు.
బాలాపూర్‌లోని మేఘ ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న ఈ గణన కార్యక్రమంలో నమోదు చేసుకునేందుకు వచ్చిన అబ్దుల్లా అనే రోహింజ్యా 'బీబీసీ న్యూస్ తెలుగు'తో మాట్లాడుతూ.. "గత వారం నుంచి ఇది జరుగుతోంది. నేను ఈవాళ వచ్చాను. నాలాగే చాలామంది వస్తున్నారు" అని తెలిపారు.
బిలాల్ అనే మరో రోహింజ్యా ఇప్పటికే తన వివరాలు నమోదు చేయించుకున్నారు.
"మేం ఎక్కడి నుంచి వచ్చాం, అక్కడ ఏం చేసేవాళ్లం, భారతదేశానికి ఎలా వచ్చాం, హైదరాబాద్ ఎలా చేరాం, ఇక్కడ ఏం చేస్తున్నాం.. ఎక్కడ ఉంటున్నాం, ఇక్కడికి రావడానికి ఎవరన్నా సహాయం చేశారా? వంటి ఎన్నో ప్రశ్నలు అడిగి ఒక ఫారంపై సంతకం చేయించుకున్నారు. ఈ వివరాలన్నీ తీసుకున్న తరువాత మమ్మల్ని ఏం చేస్తారన్నది మాత్రం చెప్పలేదు'' అన్నారు బిలాల్.
మరో 150 కుటుంబాలతో కలిసి బాలాపూర్‌లోని ఒక క్యాంపులో బిలాల్ ఉంటున్నారు.

కేంద్ర హోం శాఖ శాఖ ఆదేశాలతో ఈ గణన చేపడుతున్నామని సర్వేలో పాలుపంచుకుంటున్న అధికారి ఒకరు చెప్పారు.
''రోహింజ్యాలు 2012 నుంచి హైదరాబాద్‌లో ఉంటున్నారు కానీ వారి వివరాలేవీ పోలీస్ శాఖ దగ్గర లేవు. అందుకే ఇప్పుడీ సర్వే'' అని చెప్పారు.
వివరాలన్నీ సేకరించాక రోహింజ్యాలను తిప్పి పంపుతారా అని అడగగా.. అది కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.
ఈ ఏడాది జులైలో లోక్‌సభలో ఒక సభ్యుడి ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు.. దేశంలో ఉన్న రోహింజ్యాలను లెక్కించాలని రాష్ట్రాలకు సూచించినట్లు చెప్పారు.
''ఫారినర్స్ యాక్ట్, 1946- సెక్షన్ 3(2)(c) ప్రకారం అక్రమంగా నివసిస్తున్న ఇతర దేశస్థులను తిప్పిపంపే అధికారం భారత దేశానికి ఉంది. దాని ప్రకారం రాష్ట్రాలు రోహింజ్యాలను గుర్తించి తిప్పి పంపించే ప్రక్రియకు ఆదేశాలు జారీ చేస్తాం'' అని మంత్రి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్‌లోని రోహింజ్యాలు తప్పుడు పద్ధతుల్లో ఓటర్ కార్డు, ఆధార్ కార్డు వంటివి సంపాదించి మలేసియా, మధ్యప్రాచ్య దేశాలకు వలస వెళ్తున్నారని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ బీబీసీ న్యూస్ తెలుగుతో చెప్పారు.
ఈ విషయాన్ని కేంద్రం కూడా ఇటీవల తెలిపింది. ఈ నెల 11న లోక్ సభలో కిరణ్ రిజిజు.. ''రోహింజ్యాలు తప్పుడు పద్ధతుల్లో భారతదేశ గుర్తింపు కార్డులు పొందుతున్నారు' అని చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో ఎంతమంది రోహింజ్యాలున్నారన్న లెక్క తమ వద్ద లేదని, మయన్మార్‌తో చర్చలు జరిపి రోహింజ్యాలను తిరిగి వారి దేశానికి పంపించే ప్రక్రియ వేగవంతం చేస్తామన్నారు.
హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న సుమారు 5 వేల మంది రోహింజ్యాలు ఉండొచ్చని అంచనా. ప్రస్తుత గణన తరువాత వారినేం చేయబోతున్నారన్న అంశంపై స్పష్టత లేదు. దీనిపై మాట్లాడేందుకు అధికారులెవరూ సుముఖత చూపలేదు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: లగడపాటి పోల్‌లో కాంగ్రెస్ కూటమి, మిగిలిన పోల్స్‌లో టీఆర్ఎస్
- ఎగ్జిట్ పోల్స్: మధ్యప్రదేశ్‌లో హోరాహోరీ, రాజస్థాన్ కాంగ్రెస్‌కు
- నన్ను స్పీకర్ లేని టీవీ అంటూ విమర్శలు చేశారు : మిస్ డెఫ్ ఆసియా నిష్టా
- ‘‘కొన్ని నెలలు కోమాలో ఉన్నా.. రెండు సార్లు ఉరివేసుకున్నా’’
- సిక్కోలు మత్స్యకారులు బంగాళాఖాతాన్ని వదిలి పాక్ తీరం దాకా ఎందుకెళ్తున్నారు? అక్కడ అరెస్టయ్యే పరిస్థితి ఎందుకొచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









