రోహింజ్యాలు: వెనక్కు పంపిన ఆ ఏడుగురి ప్రాణాలు ఎంతవరకు సురక్షితం?

రోహింజ్యా

ఫొటో సోర్స్, MANIPUR POLICE

    • రచయిత, వినీత్ ఖరే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఏడుగురు రోహింజ్యా ముస్లింలను గురువారంనాడు భారత్ తిరిగి మయన్మార్‌కు అప్పగించింది. కానీ అక్కడ వాళ్ల ప్రాణాలు ఎంతవరకూ సురక్షితం అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా వలస వచ్చిన కేసులో వాళ్లు 2012 నుంచి పోలీసుల అదుపులో ఉన్నారు. ఇప్పుడు భారత అధికారులు వాళ్లను మళ్లీ మయన్మార్‌కు పంపించేశారు. కానీ వాళ్ల భద్రత గురించి భారత్‌లో రోహింజ్యాల కార్యకర్తలు, కొన్ని ముస్లిం సంస్థలతో పాటు ఐక్యరాజ్య సమితికి చెందిన శరాణార్థుల విభాగం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

‘అక్కడికి వెళ్లాక వాళ్ల పరిస్థితి ఏంటో, వాళ్లకేం జరుగుతుందో ఎవరికీ తెలీదు. వాళ్ల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. అక్కడ ఉన్నవాళ్లే బయటకు వచ్చే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు, వీళ్లను అక్కడకు పంపించడం సరికాదు’ అన్నారు అలీ జౌహర్ అనే రోహింజ్యా కార్యకర్త.

వాళ్ల ప్రాణాలకు, స్వేచ్ఛకు ప్రమాదం ఉందని తెలిసినప్పుడు శరణార్థులను స్వేదేశాలకు పంపే ప్రయత్నం చేయకూడదు అని ఐరాస శరణార్థుల విభాగం వ్యాఖ్యానించింది.

మయన్మార్ ప్రభుత్వం ఆ ఏడుగురి గుర్తింపును ధృవీకరించిందని అసోం హోమ్ శాఖ ప్రధాన కార్యదర్శి ఎల్ఎస్ చాంగ్సన్ తెలిపారు. వాళ్లు అందించిన వివరాల ప్రకారం ఆ ఏడుగురి పేర్లు... మొహమ్మద్ ఇనస్, మొహమ్మద్ సాబిర్ అహ్మద్, మొహమ్మద్ జమాల్, మొహమ్మద్ సలామ్, మొహమ్మద్ మక్బూల్ ఖాన్, మొహమ్మద్ రోహిముద్దీన్, మొహమ్మద్ జమాల్ హుసేన్.

వీడియో క్యాప్షన్, కళ్ల ముందే నా తల్లిదండ్రులను చంపేశారు. అడవిలో నడుస్తూ వచ్చేశా.

మయన్మార్ వాసులను ఆ దేశం వెనక్కు స్వీకరించడం ఇటీవలి కాలంలో ఇది రెండోసారని, రెండు నెలల క్రితం కూడా ఇద్దరు పౌరులను స్వీకరించిందని చాంగ్సన్ తెలిపారు.

ఈ ఏడుగురిని వెనక్కు పంపడంపై కొందరి నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ, సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని చెప్పింది.

వీరిని వెనక్కు పంపడంపై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఆ ఏడుగురు తమ ఇష్టప్రకారమే స్వదేశానికి తిరిగి వెళ్లారని అధికారులు చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, రోహింజ్యా ముస్లింలతో పాటు హిందువులూ హింసలో చిక్కుకుపోయారు

‘వాళ్లందరూ మయన్మార్ తిరిగి వెళ్లడానికి ఇష్టపడ్డారు. దానికోసం సంయుక్తంగా ఓ పిటిషన్ కూడా వేశారు. కానీ పౌరసత్వాన్ని ధ్రువీకరించే ప్రక్రియకు కాస్త సమయం పడుతుంది. వాళ్లు సంతోషంగా ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం వాళ్లు అయిష్టంగా స్వదేశానికి వెళ్తున్నారని చెబుతున్నారు. అది నిజం కాదు’ అని ఎల్ఎస్ చాంగ్సన్ చెప్పారు.

‘తిరిగి వెళ్లాక వాళ్లకూ, మాకూ ఏ సంబంధం ఉండదు. వాళ్లు మయన్మార్ పౌరులు. వాళ్లపైన నిఘా పెట్టాల్సిన అవసరం మాకు లేదు’ అని ఆయన అన్నారు.

మరోపక్క దక్షిణాసియా మానవ హక్కుల కేంద్రానికి చెందిన రవి నాయర్ అధికారుల మాటలతో ఏకీభవించట్లేదు.

‘ఒకవేళ నిజంగా వాళ్లంతట వాళ్లే వెళ్లాలనుకుంటే, ఐరాస శరణార్థుల విభాగం ముందు ప్రమాణ పత్రం రాయించాల్సింది. కానీ, అలా చేయలేదు. వాళ్లను న్యాయవాదుల ముందుకు తీసుకెళ్లలేదు. ఏ న్యాయవాదీ వాళ్ల తరఫున పోరాడలేదు. తమంతట తాముగానే వెళ్తున్నారనడానికి సాక్ష్యాలేంటి? ఎందుకిలా మభ్య పెడుతున్నారు?’ అని రవి ప్రశ్నిస్తున్నారు.

రోహింజ్యా

ఫొటో సోర్స్, MANIPUR POLICE

భారత్‌లో రోహింజ్యాలు

భారత్‌లో ప్రస్తుతం 40వేల దాకా రోహింజ్యాలు నివశిస్తున్నారని అంచనా.

ప్రతి రాష్ట్రంలో ఎంతమంది రోహింజ్యాలుంటున్నారో గుర్తించాలని, వాళ్ల సంఖ్యను లెక్కించాలని, వాళ్ల బయోమెట్రిక్ వివరాలు సేకరించాలని, భవిష్యత్తులో భారత పౌరసత్వం పొందడానికి అనువైన ఎలాంటి పత్రాలూ వాళ్ల దగ్గర లేకుండా చూడాలని గతంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోంది.

ఈ ఏడుగురిని వెనక్కు పంపడం ద్వారా సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ కన్వెన్షన్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ రైట్స్ కన్వెన్షన్, మహిళా కన్వెన్షన్ లాంటి అనేక ఒప్పందాలను భారత్ ఉల్లంఘించిందని రవినాయర్ చెబుతున్నారు.

కానీ, హోమ్ మంత్రి రాజనాథ్ సింగ్ మాత్రం అలాంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. శరణార్థిగా గుర్తింపు పొందడానికి ఒక పద్ధతి ఉంటుందనీ, కానీ వీళ్లెవరూ దాన్ని పాటించలేదనీ చెప్పారు. వాళ్లను వెనక్కు పంపడం ద్వారా భారత్ ఎలాంటి అంతర్జాతీయ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని అన్నారు.

వీడియో క్యాప్షన్, డ్రోన్ కెమెరాలో వేలాది రోహింజ్యాల శిబిరాలు

‘ఆ ఏడుగురూ మయన్మార్ పౌరులే. ఆ విషయాన్ని వాళ్ల ప్రభుత్వం ధ్రువీకరించింది. 2012లో అక్రమంగా అసోంలోకి ప్రవేశించే సమయంలో వాళ్లను అదుపులోకి తీసుకున్నాం. తరువాత మయన్మార్ ఎంబసీకి సమాచారమిచ్చాం. ఆ ప్రభుత్వంతో మాట్లాడాకే వాళ్లకు ట్రావెల్ పర్మిట్ అందించాం’ అని రాజనాథ్ వివరించారు.

2017 ఆగస్టులో మయన్మార్‌లో హింస చెలరేగిన అనంతరం దాదాపు 7 లక్షలమంది రోహింజ్యా ముస్లింలు సరిహద్దు దాటి బంగ్లాదేశ్, భారత్‌లాంటి పొరుగు దేశాల్లో అడుగుపెట్టారు.

రోహింజ్యా

ఫొటో సోర్స్, MANIPUR POLICE

మయన్మార్‌లో పరిస్థితి

మయన్మార్ సైన్యం తమ ఇళ్లను ధ్వంసం చేస్తూ, తమను హతమారుస్తోందని ఉత్తర రఖైన్ ప్రాంతంలోని రోహింజ్యాలు ఆరోపిస్తున్నారు.

కానీ, తాము రోహింజ్యా తీవ్రవాదులనే తప్ప సామాన్యులను లక్ష్యంగా చేసుకోలేదని సైన్యం చెబుతోంది.

వీడియో క్యాప్షన్, శిబిరాల్లో తలదాచుకుంటున్న రోహింజ్యాలు ఇంకా భయంభయంగానే బతుకుతున్నారు.

మయన్మార్ సైన్యం చేసే దాడులను జాత్యహంకార నరమేధానికి స్పష్టమైన ఉదాహరణగా ఐక్య రాజ్య సమితి అభివర్ణించింది.

గురువారంనాడు వెనక్కు పంపిన ఏడుగురిని మినహాయిస్తే ఇంకా 25మంది రోహింజ్యాలు భారత నిర్బంద కేంద్రాల అధీనంలో ఉన్నారు.

‘వీళ్లందరినీ మయన్మార్‌లో కూడా తమ సొంత గ్రామాలకు వెళ్లనివ్వట్లేదు. మళ్లీ తిరిగి జైలుకే పంపుతున్నారు. అంటే... ఒక జైలు నుంచి మరో జైల్లో అడుగుపెడుతున్నారు. ప్రజాస్వామ్య దేశాల్లో ఇలా జరగడం సరైనదేనా?’ అని దక్షిణాసియా మానవ హక్కుల కేంద్రానికి చెందిన రవి నాయర్ ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)