ఆంధ్రప్రదేశ్ నేలల్లో తేమ లోటు ఎందుకు? రబీ సాగుకు నీటి కష్టాలు తప్పవా?

ఫొటో సోర్స్, Getty Images
రబీ సీజన్ రానున్న ప్రస్తుత తరుణంలో.. దక్షిణ ఆంధ్రప్రదేశ్‌తో పాటు.. తమిళనాడు, గుజరాత్, బిహార్, జార్ఖండ్‌లలో నేలలో తేమ పరిస్థితులు లోటులో ఉన్నాయి. ఈ మేరకు ఐఐటీ గాంధీనగర్, ఐఎండీలు సంయుక్తంగా రూపొందించిన ముందస్తు అంచనాలు చెప్తున్నాయని 'ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ఒక కథనంలో తెలిపింది.
ఆ పత్రిక కథనం ప్రకారం.. ఐఐటీ గాంధీనగర్, భారత వాతావరణ విభాగం (ఐఎండీ)లు సంయుక్తంగా చేసిన కృషితో.. దేశవ్యాప్తంగా వారం రోజుల నుంచి నెల రోజుల వరకూ నేలలో తేమ ఎలా ఉండబోతోందో ముందుగా తెలుసుకునే వెసులుబాటు మొట్టమొదటిసారిగా అందుబాటులోకి వచ్చింది.
ఐఎండీ వెబ్‌సైట్‌లో ఉన్న తాజా అంచనాల ప్రకారం.. రాబోయే రబీ సీజన్‌లో పశ్చిమ ఉత్తరప్రదేశ్, బుందేల్‌ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లలో నేలలో తేమ సాధారణంగా కానీ, సాధారణంకన్నా అధికంగా కానీ ఉండే అవకాశముంది.

ఫొటో సోర్స్, IMD/IIT Gandhinagar
పంటల సాగుకు నేలలో తేమ చాలా ముఖ్యం. పంటల ఎదుగుదల మీద అది నేరుగా ప్రభావం చూపుతుంది. అలాగే ఆయా ప్రాంతాల్లో సాగునీటికి ఎంత నీరు సరఫరా చేయాల్సిన అవసరమున్నదనేది కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుంది.
ఐఐటీ గాంధీనగర్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ విమల్ మిశ్రా.. నేలలో తేమను ముందస్తుగా అంచనా వేయటానికి 'వారియబుల్ ఇన్‌ఫిల్ట్రేషన్ కెపాసిటీ' నమూనాను ఉపయోగిస్తున్నారు. ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసిన ఈ సాంకేతిక విధానాన్ని మరింత మెరుగుపరుస్తామని చెప్పారు.
అధికారిక వివరాల ప్రకారం.. రబీ సీజన్‌లో మొత్తం 6.25 కోట్ల హెక్టార్లలో పంటలు సాగు చేస్తారు. అందులో దాదాపు 3.00 కోట్ల హెక్టార్లలో గోధుమలు పండిస్తారు. నేలలో తేమ శాతం ఎలా ఉంటుందనేది ముందుగా తెలిసినట్లయితే.. ఈ పంటల సాగు కోసం ఎటువంటి రకం విత్తనాలు వాడాలి తదితర అంశాలపై ఇంకా ఉత్తమ ప్రణాళికలు రూపొందించటానికి వీలుకలుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
''ప్రస్తుతం పరిశీలించిన పరిస్థితులను బట్టి.. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, తమిళనాడు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో నేలలో తేమ లోటులో ఉంది. అంటే.. ఒకటి, రెండు నెలల్లో తగినంత వర్షపాతం లేకపోతే.. ఈ ప్రాంతాల్లో సాగునీటి సరఫరా డిమాండ్ అత్యధికంగా ఉంటుంది. ఈ అవసరాన్ని భూగర్భ జలాల నుంచి కానీ, జలాశయాల నుంచి కానీ తీర్చాల్సి ఉంటుంది'' అని ప్రొఫెసర్ మిశ్రా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు వివరించారు.
''తమిళనాడులో ప్రస్తుతం పొడి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈశాన్య రుతుపవనాలతో ఈ రాష్ట్రానికి మంచి వర్షాలు వచ్చే అవకాశముంది. అలా జరిగితే నేలలో తేమ లోటు తీరిపోతుంది'' అని పేర్కొన్నారు.
''వ్యవసాయానికి అవసరమైన కీలక సమాచారం కేవలం వర్షపాతం వివరాలతోనే తెలియదు. సాధారణ వర్షపాతం ఉన్నప్పటికీ.. ఉష్ణోగ్రతలు అసాధారణంగా ఉన్నట్లయితే నేలలో తేమ వేగంగా పడిపోగలదు. అంటే.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పంటల సాగుకోసం ఏం అవసరమనే సమాచారం నేలలో తేమ వివరాల ద్వారా తెలుస్తుంది'' అని ఆయన చెప్పారు.
వర్షపాతం వివరాలు - నేలలో తేమకు గల సంబంధం చాలా ముఖ్యమని భూశాస్త్ర మంత్రిత్వశాఖ కార్యదర్శి డాక్టర్ ఎం.రాజీవన్ చెప్పారు. నేలలో తేమను ముందుగా అంచనా వేసే ఈ ప్రాజెక్టును పూర్తిగా ఐఎండీకి అప్పగించటానికి.. ఆ సంస్థ సిబ్బందికి ఐఐటీ గాంధీనగర్ బృందం శిక్షణనిస్తుందని చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- వందేళ్లలో తొలిసారి: ఇండోనేసియాలో కొత్త కోతుల గుర్తింపు
- ఇండోనేసియా సునామీ: ఊహించని రీతిలో విషాదం.. భారీగా పెరిగిన మృతుల సంఖ్య
- ఇండోనేసియా: ‘సిరియా నుంచి వచ్చి చర్చిలో పేలుళ్లు జరిపారు’
- పీఎంఎస్: పీరియడ్లకు ముందు ఆత్మహత్యా ఆలోచనలు ఎందుకొస్తాయి?
- ‘నా బాగోగులు చూడని నాన్న పేరు నా గుర్తింపు పత్రాల్లో అవసరం లేదు..’
- మహిళలకు జుట్టు లేకపోతే ఏమవుతుంది?
- కొరియాల సరిహద్దుల్లో లక్షలాది ల్యాండ్ మైన్ల తొలగింపు
- భారత్‌లో షాడో బ్యాంకింగ్ సంక్షోభం.. రూ.88504 కోట్ల అప్పుల్లో ఐఎల్ఎఫ్ఎస్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








