కొరియాల సరిహద్దుల్లో లక్షలాది ల్యాండ్ మైన్ల తొలగింపు

ఉత్తర కొరియా, దక్షిణ కొరియా సరిహద్దులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా సరిహద్దుల వద్ద భారీగా ల్యాండ్ మైన్లు ఉన్నాయి

ఉత్తర, దక్షిణ కొరియాల సరిహద్దులోని ఉమ్మడి భద్రతా ప్రాంతం(జేఎస్‌ఏ)లో భూమిలో పాతిన 8 లక్షలకు పైగా ల్యాండ్ మైన్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది.

పాన్‌మున్‌జోమ్‌ గ్రామ సమీపంలో భారీ భద్రత మధ్య ల్యాండ్ మైన్లను తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

గత నెల ఉత్తర, దక్షిణ కొరియాల నేతలు కిమ్ జోంగ్ ఉన్, మూన్ జే యిన్‌లు సమావేశమైనపుడు వీటిని తొలగించాలని నిర్ణయించారు.

కొరియా యుద్ధం సందర్భంగా వందలాది మంది సైనికులు మరణించిన మరో చోట కూడా ల్యాండ్ మైన్లను తొలగిస్తారు.

ఇరుదేశాల సైనికులు ముఖాముఖి నిలబడే డీమిలిటరైజ్డ్ ప్రదేశంలోని జేఎస్‌ఏలో రాబోయే 20 రోజుల్లో మిలటరీ సిబ్బంది వీటిని తొలగిస్తారని దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఒకసారి ఈ పని పూర్తయ్యాక.. సైనిక పోస్టులను కూడా తొలగిస్తారు. ఆ తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తొలగించేందుకు అక్కడ కేవలం ఆయుధాలు లేని సిబ్బందిని మాత్రం ఏర్పాటు చేస్తారు.

గత ఏప్రిల్‌లో ఉభయ కొరియాల మధ్య ఉద్రిక్తతలను తొలగించే చర్యల్లో భాగంగా సరిహద్దుల వద్ద లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రచారాన్ని నిలిపేసినట్లు దక్షిణ కొరియా ప్రకటించింది.

మూన్ జే యిన్, కిమ్ జోంగ్ ఉన్

ఫొటో సోర్స్, Getty Images

ఉభయ కొరియాల మధ్య 250 కి.మీ. పొడవు, 4 కి.మీ. వెడల్పు ఉన్న డీమిలిటరైజ్డ్ ప్రాంతంలో ల్యాండ్ మైన్లు భారీ సంఖ్యలో ఉన్నాయి. ఈ ప్రాంతం మొత్తం విద్యుత్తు కంచెను ఏర్పాటు చేశారు. నిరంతరం వేలాది సీసీ కెమెరాల ద్వారా అక్కడ పహారా కాస్తుంటారు.

గత ఏడాది నవంబర్‌లో ఇక్కడ దక్షిణ కొరియాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఉత్తర కొరియా సైనికుడిపై అదే దేశానికి చెందిన మరో సైనికుడు కాల్పులు జరపడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.

అయితే ఏడేళ్ల క్రితం కిమ్ అధికారంలోకి వచ్చిననాటి నుంచి తమ దేశంలోకి పారిపోయి వచ్చే ఉత్తర కొరియా ప్రజల సంఖ్య తగ్గిందని దక్షిణ కొరియా అధికారులు చెబుతున్నారు.

1953లో కొరియా యుద్ధం జరిగిన నాటి నుంచి ఉప్పునిప్పుగా ఉన్న ఉత్తర, కొరియాల మధ్య ఇటీవలి కాలంలో సంబంధాలు గణనీయంగా మెరుగుపడ్డాయి.

ఇటీవల ఉభయ కొరియాల నేతలు ప్యాంగ్యాంగ్‌లో సమావేశమై అణునిరాయుధీకరణపై చర్చలు కూడా జరిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)