మహాత్మా గాంధీ 150వ జయంతి: మహాత్ముడి గురించి ఆయన వారసులు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, Gandhi Museum Durban
- రచయిత, జుబేర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇవాళ మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ 150వ జయంతి. మహాత్ముడిగా మన్ననలు అందుకున్న గాంధీజీని ప్రజలు ప్రేమగా 'బాపూ' అని పిలిచారు. భారతదేశం ఆయనను 'జాతిపిత' అని గౌరవించింది.
అహింసకు, సత్యాగ్రహానికి ఆద్యుడు గాంధీజీ. బ్రిటిష్ పాలకులకు పక్కలలో బల్లెంలా మారిన సత్యాగ్రహ ఆయుధం ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నపుడే పుట్టింది.
గాంధీజీ 21 ఏళ్లు గడిపిన దక్షిణాఫ్రికాలో ఇంకా ఆయన వారసత్వం మిగిలి ఉందా? అక్కడి ప్రజలు ఇంకా ఆయనను తల్చుకుంటున్నారా?
దీనిని తెలుసుకోవడానికి మేం కొన్నాళ్ల క్రితం భారతదేశం నుంచి అక్కడికి వెళ్లాం.
డర్బన్, జోహాన్స్‌బర్గ్ లాంటి పెద్ద నగరాలలో గాంధీజీని మరవడం అంత సులభం కాదు. ఆ నగరాల్లోని కొన్ని రహదారులకు, చౌరస్తాలకు గాంధీజీ పేరు పెట్టారు. ఆయన విగ్రహాలు, ఆయన పేరుతో మ్యూజియం కూడా అక్కడ ఉన్నాయి.
గాంధీజీ 1893లో దక్షిణాఫ్రికాకు వెళ్లి, 1914లో భారతదేశానికి తిరిగి వచ్చారు.
భారత సంతతి ఎక్కువగా ఉన్న డర్బన్‌లోని ఫీనిక్స్ సెటిల్మెంట్‌లో గాంధీజీ వారసత్వం ఎక్కువగా కనిపిస్తుందని చరిత్రకారులు అంటారు. ఫీనిక్స్ సెటిల్మెంట్‌లో గాంధీజీ 1903లో ఒక ఆశ్రమాన్ని ప్రారంభించారు.

ఆయన మనుమరాలైన 87 ఏళ్ల ఈలా గాంధీ, గాంధీజీ వ్యక్తిత్వంలో గొప్ప మార్పు ఇక్కడే వచ్చిందని అంటారు.
ఈలా గాంధీ 1940లో ఫీనిక్స్ సెటిల్మెంట్‌లోని ఆశ్రమంలో జన్మించారు. ఆమె బాల్యం కూడా అక్కడే గడిచిపోయింది.

‘గాంధీజీ జాత్యహంకారి కాదు’
గాంధీజీ సూట్ వేసుకుని, టై కట్టుకుని బారిస్టర్ పని చేయడానికి దక్షిణాఫ్రికాకు వచ్చారు.
ఆశ్రమం స్థాపించడానికి ముందు ఆయన జీవిత విధానం ఆంగ్లేయుల తరహాలో ఉండేదని, స్థానికులైన నల్లవాళ్లకు ఆయన దూరంగా ఉండేవారని అంటారు. అందుకే కొందరు ఆయనను జాత్యహంకారి అని కూడా అంటారు.
కానీ ఈలా గాంధీ దానితో అంగీకరించరు. దక్షిణాఫ్రికాకు వచ్చినపుడు ఆయన వయస్సు కేవలం 24 ఏళ్లని మరవకూడదని ఆమె అంటారు. ఆయన ఇంగ్లండ్‌లో న్యాయవిద్యను అభ్యసించినప్పటికీ, ఆయన ఇంకా అప్పటికి పూర్తిగా వ్యావహారిక జీవితంలో నిమగ్నం కాలేదు.
గాంధీజీపై ఉన్న జాత్యహంకార ఆరోపణల గురించి ఆమెను ప్రశ్నించినపుడు, ''ఆయన యువకుడిగా ఉన్నపుడు చేసిన ఒకటి రెండు వ్యాఖ్యలను పట్టుకుని, వాటిని ఆయన ఏ పరిస్థితుల్లో అన్నాడన్నది చూడకుండా వాటిని విశ్లేషించి, ఆయన 'జాత్యహంకారి' లాంటి ఆరోపణలు చేస్తున్నారు'' అని ఆమె అన్నారు.
ఆయన స్థాపించిన ఆశ్రమాన్ని ఇప్పుడు ఒక మ్యూజియంగా మార్చేశారు. అక్కడ గోడపై ఉన్న కొన్ని గాంధీ సూక్తులను చూపుతూ ఆమె, ''వాటిని చదివితే గాంధీజీ జాత్యహంకారి కాదన్న విషయం మీకు తెలుస్తుంది'' అన్నారు.

ఈలా గాంధీ మహాత్మా గాందీ రెండో కుమారుడు మణిలాల్ గాంధీ కుమార్తె. ఆమె నేడు ఒక సామాజిక కార్యకర్తగా పని చేస్తున్నారు. ఆమె రిటైర్డ్ ప్రొఫెసర్. ఎంపీగా కూడా పని చేశారు. ఏడేళ్ల వయసులో గాంధీజీ ఒళ్లో పెరిగిన ఆమె దక్షిణాఫ్రికాలో గాంధీజీ శాంతి మిషన్‌ను ఇంకా సజీవంగా ఉంచారు.
ఈలా గాంధీ సోదరి సీతా ధుపేలియా మరణించారు. సీతా కుమార్తె కీర్తి మీనన్, కుమారుడు సతీష్‌లు గాంధీ కుటుంబంలో నాలుగో తరం వారు.
మేం కీర్తి మీనన్‌ను కలిసినపుడు ఆమె భారతదేశంలో పెరిగిపోతున్న హింస పట్ల, సమాజం చీలిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
గాంధీజీ కుటుంబానికి చెందిన ఐదో తరం డర్బన్, కేప్ టౌన్, జోహాన్నెస్ బర్గ్ లాంటి నగరాలలో ఉన్నారు. వారిలో ముగ్గురిని మేం డర్బన్‌లోని కీర్తి మెనన్ ఇంటిలో కలిశాం.
వారంతా సాధారణ జీవితాన్ని గడుపుతూ, జీవితంలో సంతోషంగా ఉన్నారు. వారిలో ఆత్మవిశ్వాసం మెండుగా కనిపించింది.

ఆ ముగ్గురిలో 27 ఏళ్ల కబీర్ ధుపేలియా డర్బన్‌లో ఓ బ్యాంక్‌లో పని చేస్తున్నారు. ఆయన సోదరి మిషా ధుపాలియా ఆయనకన్నా పదేళ్లు పెద్ద. ఆమె స్థానిక రేడియో స్టేషన్‌లో పని చేస్తున్నారు. వీరిద్దరూ కీర్తి మీనన్ సోదరుడు సతీష్ పిల్లలు. వీరిద్దరి కజిన్ సునీతా మీనన్ ఒక జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
వీళ్లంతా తమను తాము భారతీయులుగా భావించుకుంటారా లేక దక్షిణాఫ్రికా పౌరులుగానా?
కబీర్ వెంటనే, తమను తాము దక్షిణాఫ్రికా వారిగానే భావించుకుంటామని తెలిపారు. మిషా, సునీతలు తమను తాము మొదట దక్షిణాఫ్రికా పౌరులుగా భావిస్తామని, తర్వాతే తాము భారత సంతతికి చెందిన వారిగా భావిస్తామని తెలిపారు.
వీరంతా గాంధీజీని 'జాతిపిత'గా గౌరవించడాన్ని గర్వంగా భావిస్తున్నారు.

'గాంధీజీ ఒక మనిషిగా చూడండి'
కబీర్, ''ఆయన అన్ని కష్టాలను ఎంత శాంతియుతంగా ఎదుర్కొన్నారో చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి వాళ్లు ఇప్పుడు కనిపించడం కష్టం'' అన్నారు.
తాను గాంధీజీ వారసుణ్ని అని చెప్పుకోవడం గర్వకారణం అంటూనే, అది కొన్నిసార్లు భారంగా మారుతుందని తెలిపారు.
సునీత, ''గాంధీజీని ఒక సాధారణ మానవుడికన్నా ఉన్నతుడిగా చూస్తారు. ఆ వారసత్వాన్ని మోయడం ఒక రకంగా భారమని కూడా అనిపిస్తుంది'' అన్నారు.
తమ స్నేహితుల్లో చాలా మందికి తమది గాంధీ కుటుంబం అని తెలీదన్నారు.
''మేమెవరమో తెలుసా అని మేం ఎవ్వరికీ కావాలని చెప్పుకోం'' అని మిష అన్నారు.

వాళ్ల నేపథ్యం తెలిసినప్పుడు వాళ్ల స్నేహితుల ప్రతిస్పందన ఎలా ఉంటుంది?
వాళ్లు చాలా ఆశ్చర్యపోతారు, కానీ అది తమ స్నేహంపై ఎలాంటి ప్రభావం చూపదని సునీత అంటారు.
తమ జీవితంలో గాంధీజీ మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తున్నామని అంటూనే.. గాంధీజీ కాలంలో పోలిస్తే ప్రస్తుతం తాము జీవిస్తున్న దశ భిన్నమైనదని ఆమె అన్నారు.
తన వ్యక్తిత్వాన్ని అనేక మంది ప్రభావితం చేశారని, వారిలో గాంధీజీ కూడా ఒకరని ఆమె అంటారు.

ఫొటో సోర్స్, Gandhi Aashram, Durban
గాంధీజీ అంటే మూఢభక్తి లేదు
గాంధీజీ నేటి తరం వారసులు గాంధీజీకి మూఢభక్తులు కారు. గాంధీజీలోని అనేక లోటుపాట్లను వారు అంగీకరిస్తారు. అయితే, వాటికి కారణాలను కూడా చూడాలని వారంటారు.
భారతదేశంలో కూడా గాంధీజీని విమర్శించే వాళ్లుంటారని ఈ వారసులకు తెలుసు. కానీ దానిని వాళ్లేమీ పెద్దగా పట్టించుకోరు.
''చాలామంది అహింసను సమర్థించాలంటే మీరు గాంధేయవాది అయి ఉండాలని భావిస్తారు. మీరు గాంధీజీ బోధించిన అహింస నుంచి ప్రేరణ పొందవచ్చు. కానీ మీరు అహింసామార్గానికి వ్యతిరేకంగా వెళుతూ, గాంధేయవాదులు అంటే మాత్రం దానిని ఒప్పుకోను'' అని కబీర్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ప్రధాని మోదీ మాట నిజమేనా? మిగతా వారికన్నా ఎక్కువ విమానాశ్రయాలు కట్టించారా?
- 2018 నోబెల్ బహుమతులు: విప్లవాత్మక క్యాన్సర్ చికిత్స విధానం కనుగొన్న శాస్త్రవేత్తలకు వైద్యంలో నోబెల్ బహుమతి
- 'సర్జికల్ స్ట్రయిక్స్'కు రెండేళ్ళు: కశ్మీర్లో హింస ఏమైనా తగ్గిందా?
- గర్భనిరోధక మాత్రలు వాడితే మహిళకు మగ లక్షణాలు వస్తాయా?
- ఇండోనేసియా సునామీ: బాధితుల కోసం అన్వేషణ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









