ఈ చైనా మహిళ గాంధీ ప్రభావంతో శాకాహారిగా మారారు, పాత దుస్తులు ధరిస్తారు, ఇంకా..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వినీత్ ఖరే
- హోదా, బీబీసీ ప్రతినిధి, చైనా నుంచి
1920లలో మహాత్మాగాంధీ ప్రభావం క్రమంగా భారతదేశమంతటా వ్యాపిస్తోంది. అదే సమయంలో చైనాలో కూడా అనేక మంది ప్రేరణ కోసం ఆయన గురించి తెలుసుకుంటున్నారు. సత్యాగ్రహం, అహింసామార్గం తమ దేశానికీ మేలు చేస్తాయా అన్నవి వాళ్ల ప్రశ్నలు.
ఆ సమయంలో భారతదేశంలో బ్రిటిష్ పాలన ఉండగా.. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాల ప్రభావం కింద చైనా ఉంది. చైనాలోని భిన్న వర్గాల మధ్య పోరాటాలు జరుగుతూ అక్కడ అంతర్యుద్ధం లాంటి పరిస్థితి ఉండేది.
గాంధీ భావాలను అభిమానించే వారిలో 57 ఏళ్ల వూ పెయి ఒకరు. ఆమె తూర్పు అన్హుయి ప్రావిన్స్‌లోని హ్యుయాంగ్ గ్రామంలో నివసిస్తున్నారు.
గాంధీ ప్రభావంతో ఆమె శాకాహారిగా మారారు. ఆమె పాత దుస్తులు ధరిస్తారు. ఏసీ కానీ, వాషింగ్ మెషీన్ కానీ ఉపయోగించరు.

ఫిజిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన వూ పెయి షాంఘాయ్‌లో జన్మించారు. ఆమె లండన్‌లో రెండేళ్లు వాల్డార్ఫ్‌లో అభ్యసించారు. చదువు ద్వారా మానసిక, కళాభివృద్ధికి దోహదం చేస్తుందని వాల్డార్ఫ్‌కు చాలా పేరుంది.
''చైనాలో మార్కులకు, గ్రేడ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఉపాధ్యాయులు మానవీయ విలువల గురించి ఎక్కువగా పట్టించుకోరు'' అని వూ పెయి వెల్లడించారు.
2002లో బీజింగ్‌లో ఒక భారతీయుడు మాట్లాడుతుండగా విన్న నాటి నుంచి ఆమె ఆలోచనల్లో మార్పు వచ్చింది.
నిజానికి ఆమె గాంధీ గురించి పాఠ్యపుస్తకాలలోనే చదవినా గాంధీజీ భావాల గురించి ఆమెకు ఎక్కువగా తెలియదు.
అయితే క్రమంగా గాంధీజీ భావాల పట్ల ఆకర్షితురాలైన వూ.. స్నేహితుల బలవంతంతో గాంధీ గురించి రెండు పుస్తకాలను అనువదించారు కూడా.
''ఈ భూమికి ప్రజల అవసరాలను తీర్చగలిగే శక్తి ఉంది కానీ వారి అత్యాశను కాదు అన్నారు గాంధీ. ఈ మాటలు నా జీవితంపై ఎంతో ప్రభావం చూపించాయి'' అంటారు వూ.

గత ఏడాది ఆగస్టులో గాంధీ ఆలోచనా విధానాన్ని వ్యాప్తి చేయడానికి గ్రామంలో ఆమె ఒక పాఠశాలను ప్రారంభించారు.
''నేను సూటిగా పిల్లలకు గాంధీ ఆలోచనా విధానాన్ని బోధించను. కానీ ప్రతి ఒక్కరినీ ప్రేమించమని, గ్రామానికి ఏదైనా మేలు కలిగే పని చేయమని, ఎవరైనా ఒంటరిగా నివసిస్తుంటే, వెళ్లి వాళ్లతో కొంత సమయం గడపమని చెబుతాను'' అని వూ తెలిపారు.
తొమ్మిదేళ్ల డాన్యు తల్లి రియు నియాన్ గత ఏడాది డిసెంబర్‌లో తన కుమారుణ్ని ఆ పాఠశాలలో చేర్పించారు.
''సాధారణ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల మానసిక అభివృద్ధిపై అంతగా దృష్టి పెట్టరు. గతంలో మా వాడు ఐఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ బొమ్మలతో ఆడుకునేవాడు. ఇప్పుడు అవన్నీ లేవు'' అని లియాన్ తెలిపారు.
''ఒకరోజు నేను అహింస గురించి, గాంధీ గురించి మాట్లాడుతుండగా, అలాంటి ఆదర్శాలు చైనాకు పని రావన్నారు. భారతదేశలో మాదిరే ఇక్కడ కూడా చాలా మంది అహింసను విశ్వసించరు'' అని వూ తెలిపారు.
ఏదో ఒకరోజు గాంధీ జన్మస్థలాన్ని సందర్శించాలనేది వూ కల.

చైనాలో గాంధీ ప్రభావం
చైనాలో 1904 నుంచి 1948 వరకు వెలువడిన 'ఓరియంటల్ మ్యాగజీన్'లో మహాత్మా గాంధీ గురించి అనేక వ్యాసాలు ప్రచురితమయ్యాయి.
1921లో ప్రచురితమైన ఒక వ్యాసంలో ''గాంధీ లక్ష్యం పాశ్చాత్య సంస్కృతిని విడనాడి, భారతీయ విలువలను పరిరక్షించడం. న్యాయం కోసం హింసను ఉపయోగించడాన్ని ఆయన వ్యతిరేకించారు'' అని వూ తెలిపారు.
ఆ రోజుల్లో చైనాపై సోవియట్ యూనియన్ ప్రభావం చాలా ఉండేది.

చైనా-మహాత్మా గాంధీ అన్న అంశంపై పరిశోధన చేస్తున్న దక్షిణ చైనా నార్మల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షాంగ్ చుయాన్యు.. చైనాలో గాంధీ గురించి సుమారు 800 పుస్తకాలు వెలువడ్డాయని తెలిపారు.
''1920లో లెనిన్ భారత స్వాతంత్ర్యోద్యమంలో గాంధీ పాత్రను కొనియాడారు. ఆయన నిజమైన విప్లవకారుడు అని లెనిన్ అన్నారు. కానీ 1930లలో స్టాలిన్ గాంధీజీ సామ్రాజ్యవాదులతో కలిసిపోయారని ఆరోపించారు'' అని చువాన్యు వివరించారు.
ప్రొఫెసర్ షాంగ్ భారత, చైనా సంబంధాలపై అనేక వ్యాసాలు రాశారు. ఆయన భారతదేశంలో కూడా పర్యటించారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే చైనాలోని చాలా మంది గాంధీ ఆలోచనా విధానాన్ని అంగీకరించరు.
గాంధీ అహింస విధానంపై కూడా చైనాలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఖాదీ ఉద్యమం ప్రజలను ఏకం చేయడానికి తోడ్పడిందని కొందరంటే, మరికొందరు మాత్రం ఆయనను ఆధునికతకు వ్యతిరేకి అంటారు.
1948లో గాంధీ మరణించిన సందర్భంగా ఓరియంటల్ మ్యాగజీన్, ''ఆయన మరణం చైనా ప్రభుత్వాన్ని, ప్రజలను నిశ్చేష్టులను చేసింది'' అని పేర్కొంది.
చైనాలో ఉన్న ఒక్కగానొక్క గాంధీ విగ్రహం బీజింగ్‌లోని చావోయాంగ్ పార్క్‌లో ఉంది.
ప్రొఫెసర్ షాంగ్ చుయాన్యు చెబుతున్న దాని ప్రకారం - ఇటీవలి కాలంలో క్రమంగా చైనాలో మహాత్మా గాంధీ, ఆయన ఆలోచనా విధానంపై చాలా మందిలో ఆసక్తి పెరుగుతోంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








