గర్భనిరోధక మాత్రలు వాడితే మహిళకు మగ లక్షణాలు వస్తాయా?

గర్భనిరోధకాలతో పురుష లక్షణాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జరియా గోర్వెట్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అవాంఛిత గర్భం రాకుండా ఉండేందుకు గర్భనిరోధక మాత్రలు ఉపయోగిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. గర్భ నిరోధక మాత్రలు వేసుకోవడం వల్ల మహిళలు స్వేచ్ఛగా సెక్స్ ఆస్వాదించగలుగుతారు.

వీటిని ఉపయోగించడం వల్ల వారికి గర్భం వస్తుందనే ఆందోళన ఉండదు. గర్భధారణలో హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఆ హార్మోన్లను గర్భనిరోధక మాత్రలు అడ్డుకుంటాయి.

కానీ, గర్భనిరోధక మాత్రలు తీసుకునే చాలా మంది మహిళలకు తెలియని విషయం ఒకటి ఉంది. ఒక గర్భ నిరోధక మాత్రలో మహిళలు 8 రకాల హర్మోన్లు తీసుకుంటారు. ఈ 8 హార్మోన్లలో కొన్ని మహిళల్లో పురుష లక్షణాలు ప్రేరేపిస్తాయి.

గర్భనిరోధక మాత్రల్లో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు ఉంటాయని చెబుతారు. కానీ నిజానికి, ఈ మాత్రలు వేటిలోనూ సహజంగా వచ్చే హార్మోన్లు ఉండవు. వాటికి బదులు హార్మోన్ల సింథటిక్ వెర్షన్‌ను నింపుతారు. అవి సహజ హార్మోన్ల కంటే ఎక్కువ సమర్థంగా పనిచేసేలా ఉంటాయి.

ప్రతి గర్భనిరోధక మాత్రలో ఒక లాంటి సింథటిక్ ఈస్ట్రోజన్, ఎథినిల్ ఈస్ట్రడియాల్, ప్రొజెస్టెరాన్ ఉంటాయి. ఎథినిల్ ఈస్ట్రాడియాల్ ప్రతి నెల గర్భాశయంలో అండం పెరగకుండా ఆపుతుంది.

ఇక ప్రొజెస్టెరాన్ గర్భాశయ ద్వారం దగ్గర దళసరి పొర ఏర్పడేలా చేస్తుంది. దానివల్ల గర్భాశయంలోకి వీర్యం వెళ్లే మార్గం మూసుకుపోతుంది.

అనుకోకుండా ఏవైనా అండాలు గర్భాశయం లోపలికి చేరుకున్నా అవి అక్కడ పెరగలేవు. విఫలమై నెలసరి సమయంలో రక్తంతోపాటూ బయటికి వచ్చేస్తాయి. ఇక్కడి వరకూ ఆ హార్మోన్లు సంతృప్తికరంగానే పనిచేస్తాయి. తమ పనులు పూర్తి చేస్తాయి.

కానీ, ఇటీవల జరిగిన ఒక రీసెర్చిలో గర్భనిరోధక మాత్రలతో మనం తీసుకునే ఆర్టిఫిషియల్ హార్మోన్లతో మన శరీరంలో ఉండే సహజ హార్మోన్లకు సమన్వయం కుదరడం లేదని తేలింది. మనం ఇంటర్నెట్లో గర్భనిరోధక మాత్రలు వేసుకునే మహిళల అనుభవాలు వింటే, వారిలో కనిపించిన ప్రభావం మనల్ని విస్మయానికి గురి చేస్తుంది.

ఒక మహిళ తన ముఖంపై పురుషుల్లా వెంట్రుకలు వచ్చాయని చెబితే, మరో మహిళ తన ముఖంపై చర్మం చాలా మందంగా మారిందని అన్నారు. ఇంకో మహిళ తన ముఖమంతా మొటిమలతో నిండిపోయిందని చెప్పారు.

గర్భనిరోధకాలతో పురుషు లక్షణాలు

శరీరంలో కనిపించే మార్పులు

2012 వచ్చిన ఒక రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం అమెరికాలో 83 శాతం మంది మహిళలు ఇలా ప్రొజెస్టెరాన్ ఉండే మాత్రలను వేసుకుంటున్నట్టు తేలింది. వాటిని పురుషుల హార్మోన్లతో తయారు చేస్తారు.

పురుషుల టెస్టోస్టెరాన్ హార్మోన్లు ఉపయోగించే ఆ మాత్రల పేరు 'నండ్రోలోన్'.

ఈ హార్మోన్ పురుషుల సంతానోత్పత్తి వ్యవస్థను వృద్ధి చేస్తుంది. అందుకే మహిళలు ఈ హార్మోన్‌ను మాత్రల రూపంలో తీసుకున్నప్పుడు, వారి శరీరంలో కూడా పురుషుల్లా మార్పులు రావడం ప్రారంభమవుతుంది.

ఆస్ట్రియాలోని సాల్జ్‌బర్గ్ యూనివర్సిటీలో ఉన్న న్యూరో సైంటిస్టు బెలిండా ప్లెట్జెర్ "ఈ హార్మోన్ కండరాలు బలంగా మారడానికి సాయం చేస్తుంది. అందుకే వీటిని బాక్సర్లు, వెయిట్ లిఫ్టర్లు ఉపయోగిస్తారు" అని చెప్పారు.

గర్భనిరోధకాలతో పురుష లక్షణాలు

ఫొటో సోర్స్, Getty Images

2015లో ప్రముఖ హెవీ వెయిట్ చాంపియన్ బాక్సర్ టైసన్ ఫ్యూరీ ఈ హార్మోన్ తీసుకోవడం వల్ల పరీక్షల్లో దొరికిపోయాడు. ఆయనపై రెండేళ్ల నిషేధం కూడా విధించారు.

గర్భనిరోధక మాత్రల వల్ల కలిగే నష్టం గురించి పరిశోధకులకు చాలా ముందు నుంచే తెలుసు. 40, 50, 60వ దశకాల్లో మహిళలు గర్భస్రావం కాకుండా కాపాడుకోడానికి ఏండ్రోజెనిక్ అయిన నోరథిండ్రోన్ హార్మోన్ ఉపయోగించేవారు.

ఈ హార్మోన్ తీసుకోవడం వల్ల గర్భస్రావాలు ఆగిపోయాయి. కానీ, మహిళలకు మరో సమస్య ఎదురైంది. అంటే వారి శరీరంపై మచ్చలు రావడం, ముఖంపై వెంట్రుకలు పెరగడం మొదలైంది. కొంతమందికైతే గొంతు కూడా మారిపోయింది. ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరికి పురుష జననావయవాలు(వృషణాలు) ఉన్న ఆడపిల్లలు పుట్టేవారు. తర్వాత శిశువులకు సర్జరీ చేసేవారు.

అయితే, ఇప్పుడు తయారు చేస్తున్న మాత్రల్లో ఏండ్రోజెనిక్ ప్రొజెస్టెరాన్ చాలా తక్కువ. అంతే కాదు, పురుష లక్షణాలు తగ్గిపోయేలా మిగతా హార్మోన్లను సింథటిక్ ఈస్ట్రోజెన్‌తో కలుపుతున్నారు.

గర్భనిరోధకాలతో పురుష లక్షణాలు

ఫొటో సోర్స్, Getty Images

మాత్రలతో మెదడుపై ప్రభావం

మొటిమలు, అవాంఛిత రోమాలు రాకుండా ఆపడానికి కూడా సింథటిక్ ప్రొజెస్టెరాన్ ఉపయోగిస్తారు. అయితే దీనివల్ల హార్మోన్ల సమతౌల్యం దెబ్బతినే ప్రమాదం ఉందని చాలా మంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మన శరీరం అంతా ఏండ్రోజెన్ రిసెప్టర్ ఉంది. ముఖ్యంగా చెమట ఉత్పత్తి, శరీరంపై వెంట్రుకలు పెరిగే గ్రంథుల దగ్గర ఏండ్రోజెన్ రిసెప్టర్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే, చాలా మంది మహిళలకు ఈ మాత్రలు వేసుకున్న తర్వాత చెమటలు పడుతాయి. వారిలో అవాంఛిత రోమాల ఫిర్యాదులు కూడా ఉంటాయి. ఇలాంటి స్టెరాయిడ్ల ప్రభావం మెదడుపై కూడా పడుతుంది.

అబ్బాయిల్లో ఏండ్రోజెన్ యవ్వనంలో ఏర్పడుతుంది. మెదడును రీమోడల్ చేయడం అనేది దాని లక్ష్యం. అమ్మాయిల్లో కూడా ఇదే వయసులో పురుషుల్లో ఉండే టెస్టోస్టెరాన్ ఏర్పడుతుంది. కానీ, అది చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. దాని ప్రభావంతో కొన్ని అంగాలు కుంచించడం, కొన్ని పెద్దవి కావడం జరుగుతుంది.

గర్భనిరోధకాలతో పురుషు లక్షణాలు

ఫొటో సోర్స్, Getty Images

మాత్రల రూపంలో హార్మోన్లు మింగడం వల్ల కలిగే చెడు ప్రభావాల గురించి ప్రొఫెసర్ ప్లెట్జర్ చాలా కోణాల్లో పరిశోధనలు చేశారు. కానీ గత 50 ఏళ్ల నుంచీ గర్భనిరోధక మాత్రలు ఉపయోగిస్తుండడంతో, వాటివల్ల మెదడుపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకోడానికి ఆయన 8 ఏళ్ల క్రితమే రీసెర్చ్ ప్రారంభించారు.

ఈ రీసెర్చిలో ఏండ్రోజెనిక్ ప్రొజెస్టెరాన్ మాత్రలు వేసుకుంటున్న మహిళల్లో మాటల జ్ఞానం బలహీనం అయినట్టు గుర్తించారు. వాళ్లు కొత్త పదాలను ఆలోచించలేకపోయారు. దానికి బదులు తిరుగుతూ ఉండే వస్తువులను వారు త్వరగా గుర్తించేవారు. అంటే, అలాంటి స్థితి పురుషుల్లోనే కనిపిస్తుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పురుషులు మహిళల కంటే తక్కువ మాట్లాడతారు. తమ చుట్టూ ఉండే పరిస్థితులను త్వరగా అంచనా వేస్తారు.

ఇలాంటి హార్మోన్ల మాత్రలు వేసుకోవడం వల్ల కొంతవరకూ మహిళల మెదడు పురుషుల్లా పనిచేస్తుందని ఈ పరిశోధన ద్వారా తెలిసింది.

గర్భనిరోధకాలతో పురుష లక్షణాలు

ఫొటో సోర్స్, Getty Images

20వ శతాబ్దంలో అతిపెద్ద విప్లవం

2015లో చేసిన ఒక పరిశోధనలో యాంటీ ఏండ్రోజెనిక్ ప్రొజెస్టెన్ ఉన్న మాత్రలను మార్కెట్లో విడుదల చేశాక, వాటి ఫలితాలు చాలా మెరుగ్గా ఉన్నాయని, అంతకు ముందున్న పరిస్థితిలో మార్పు వచ్చిందని తెలిసింది.

వాటిని ఉపయోగించడం వల్ల మహిళల్లో పురుషుల మార్పులు రాలేదు. కానీ వాటి వల్ల కూడా మెదడుపై ప్రభావం పడేది. సుదీర్ఘ కాలంపాటు వాటిని తీసుకుంటే, మెదడులోని కొన్ని భాగాలపై వాటి ప్రభావం కొనసాగుతుంటుందని తేలింది.

అయితే, నోటిద్వారా తీసుకునే హార్మోన్ కాంట్రాసెప్టివ్స్ వల్ల మహిళల ప్రవర్తనలో, మెదడుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకునేందుకు పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఏది ఏమైనా, దీన్ని 20వ శతాబ్దంలో అతిపెద్ద విప్లవంగా అభివర్ణించడంలో తప్పు లేదు.

గర్భనిరోధకాలు మహిళలకు అవాంఛిత గర్భం గురించిన భయం లేకుండా లైంగిక సుఖాన్ని ఆస్వాదించే అవకాశం అందించాయి. కానీ, ప్రతి వస్తువుకూ మంచి, చెడు అనే రెండు కోణాలు ఉంటాయి. ఏదైనా అతిగా ఉపయోగిచడం అనేది కచ్చితంగా నష్టమే కలిగిస్తుంది.

(బీబీసీ ఫ్యూచర్‌లో ఇంగ్లిష్ కథనం చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)