నెదర్లాండ్స్: గర్భిణులకు వయాగ్రా, 11 మంది శిశువులు మృతి

మాత్రలు

ఫొటో సోర్స్, Getty Images

నెదర్లాండ్స్‌లో ఓ అధ్యయనంలో భాగంగా గర్భిణులకు వయాగ్రా ఇచ్చారు. అయితే వారిలో ప్రసవం అనంతరం 11మంది శిశువులు చనిపోయారు. దీంతో ఈ అధ్యయనాన్ని వెంటనే ఆపేశారు.

పిండం సక్రమంగా అభివృద్ధి చెందని గర్భిణులకు ఈ మాత్రలు ఇచ్చారు. వీటి ప్రభావం వారికి పుట్టబోయే పిల్లల ఎదుగుదలపై ఉంటుందా? అన్న అంశంపై అధ్యయనం చేశారు.

కానీ వయాగ్రా వల్ల రక్త ప్రసరణలో మార్పులు వస్తాయి. ప్రసరణ వేగం పెరుగుతుంది. ఈ రక్త ప్రసరణలో జరిగిన మార్పు.. పిల్లల ఊపిరితిత్తులకు హాని కలిగించి ఉండొచ్చు.

అయితే.. పిల్లల మరణాలకు అసలు కారణం తెలుసుకోవడానికి మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇతర దేశాల్లోనూ అధ్యయనాలు

ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ దేశాల్లో ఇలాంటి అధ్యయనాలు జరిగాయి. వాటిలో వయాగ్రా వాడటం వల్ల ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదు. కానీ ఫలితం కూడా కనిపించలేదు.

2010లో.. ఇలాంటి ఔషధ ప్రయోగాన్ని కేవలం అధ్యయనాలకే పరిమితం చేయాలని పరిశోధకులు చెప్పారు.

పిండం ఎదుగుదల.. మాయ (ప్లేసెంటా) అభివృద్ధి చెందడంపై ఆధారపడి ఉంటుంది. మాయ సరిగా అభివృద్ధి చెందని పక్షంలో అండం ఎదుగుదల ఉండదు.

ఇది చాలా క్లిష్టమైన సమస్య. ప్రస్తుతానికి ఈ సమస్యకు ఎలాంటి వైద్యం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు తక్కువ బరువుతో పుడతారు. వారు బతికేందుకు తక్కువ అవకాశాలు ఉంటాయి.

గర్భిణి

ఫొటో సోర్స్, Getty Images

డమ్మీ మాత్రలు

ఈ తాజా అధ్యయనం 2020 సంవత్సరం వరకూ జరగాల్సి ఉంది. ఈ అధ్యయనాన్ని ఆమ్‌స్టర్‌డామ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌తోపాటుగా, నెదర్లాండ్స్‌లోని 11 హాస్పిటల్స్‌లో నిర్వహించారు.

మొత్తం మహిళల్లో 93 మందికి సిల్డెనఫిల్ (వయాగ్రాలో ఉండే ఔషధం) ఇచ్చారు. తక్కిన 90 మంది గర్భిణులకు ఎలాంటి ఔషధ విలువలు లేని డమ్మీ మాత్రలు ఇచ్చారు.

ప్రసవం తర్వాత, 20 మంది శిశువుల ఊపిరితిత్తుల్లో సమస్యలు ప్రారంభమయ్యాయి. వీరిలో ముగ్గురు శిశువులు డమ్మీ మాత్రలు వాడిన తల్లులకు పుట్టారు. తక్కిన 17 మంది సిల్డెనఫిల్ వాడిన తల్లులకు పుట్టారు. ఈ 17 మందిలో 11 మంది పిల్లలు ఊపిరితిత్తుల సమస్యలతోనే మరణించారు.

ఇలాంటి అధ్యయనాన్ని ఇంగ్లండ్‌లో చేసినపుడు అందులో పాల్గొన్న యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూల్ ప్రొఫెసర్ జార్కో ఆల్ఫిరెవిక్ మాట్లాడుతూ సిల్డెనఫిల్.. గర్భస్థ శిశువుల ఎదుగుదలను ప్రభావితం చేయలేదని అన్నారు. నెదర్లాండ్స్‌ అధ్యయనంలో జరిగిన పరిణామం అస్సలు ఊహించలేదని అన్నారు.

''ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ దేశాల్లో జరిగిన సిల్డెనఫిల్ అధ్యయనాల్లో ఇలాంటి సమస్యలు తలెత్తలేదు. ఈ అంశంపై మరింత లోతుగా అధ్యయనం జరగాల్సి ఉంది'' అని ఆల్ఫిరెవిక్ అన్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)