‘‘నా కొడుకుని చంపేయాలని నాపై ఒత్తిడి తెచ్చారు...’’

కెన్యా వికలాంగ చిన్నారులు

వైకల్యంతో జన్మించిన చిన్నారులు ప్రపంచంలో చాలా దేశాల్లో వివక్షను ఎదుర్కుంటున్నారు. అయితే కెన్యాలో పరిస్థితి మరీ దారుణం. చాలా ప్రాంతాల్లో వైకల్యంతో పుట్టిన పిల్లలను చంపెయ్యాలంటూ వారి తల్లులను ఒత్తిడి చేస్తున్నారని ఒక స్వచ్ఛంద సంస్థ అంటోంది.

డిజెబిలిటీ రైట్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ కొంతమంది తల్లులను ఇంటర్వ్యూ చేసింది. వైకల్యంతో పిల్లలు పుడితే తమ కుటుంబీకులు దాన్నొక అవమానంగా భావిస్తారని వారంటున్నారు. కెన్యాలో అంగవైకల్యం గల పిల్లల జీవితాలపై బీబీసీ ఆఫ్రికా కరెస్పాండెంట్ ఆన్ సోయ్ అధ్యయనం చేశారు.

కష్టాలతో నిండిపోయిన జీవితం ఈ పిల్లాడిది. వైకల్యంతో బతుకుతోన్న ఈ పిల్లాడి పేరు మేషాక్ కిప్చుంబా. ఎంత మంచి చికిత్స అందించినా ఇతని జీవితం మాత్రం కష్టంగానే సాగుతోంది.

వీడియో క్యాప్షన్, ‘‘నా కొడుకుని చంపేయాలని నాపై ఒత్తిడి తెచ్చారు...’’

కెన్యాలోని గ్రామీణ ప్రాంతంలో వైకల్యంతో జన్మించడం శాపం లాంటిది. అటువంటిది కిప్చుంబా ఇంకా బతికుండడమే అతడి అదృష్టం. అతని బంధువులకు కుదిరితే గనుక అతను శిశువుగా ఉన్నప్పుడే చంపేసేవారు.

‘‘నన్ను ఇంట్లో నుంచి తరిమేశారు. నా స్నేహితురాలు నాకు ఆశ్రయం కల్పించింది. కానీ మూడు వారాల తరువాత, ఆమె నా బిడ్డ తినే ఆహారంలో యాసిడ్ పోసి చంపెయ్యమని సలహా ఇచ్చింది. నేను నా బిడ్డను చంపుకోదలుచుకోలేదు. అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోయాను’’అని కిప్చుంబా తల్లి ఫ్లోరెన్స్ చెబెట్ చెప్పారు.

అప్పటి నుంచి ఫ్లోరెన్స్ ఎన్నో కష్టాలు పడ్డారు. అయితే ఈ దేశంలో ఫ్లోరెన్స్ ఒక్కరే కాదు. ఆమె లాంటి మహిళలు మరెందరో ఉన్నారు. గ్రామీణ కెన్యాలో మహిళలు వైకల్యంతో పుట్టే పిల్లలను చంపెయ్యాలనే ఒత్తిళ్లను ఎదుర్కుంటున్నారు.

కెన్యా వికలాంగ చిన్నారులు

అయితే ఒత్తిళ్లను ఎంతమంది ఎదిరిస్తున్నారు, ఎంతమంది తలొగ్గుతున్నారన్న విషయం తెలీదు. శిశుహత్యల మూలాలు మాత్రం కెన్యాలో చాలా పురాతనమైనవి.

‘‘మా పెద్దలు ఎన్నో చిత్ర హింసలు పెట్టేవారు. సాధారణ జీవితం గడపలేరని భావించి శిశువులను చంపేసేవారు. శిశువును బయట పడేసేవారు. పస్తులుంచి చంపేసేవారు. ఆ తరువాత పాతిపెట్టేవారు’’అని టింఫైయాన్ ఎనోలే కాయిపా అనే మహిళ వివరించారు.

అయితే దీన్ని వ్యతిరేకించే వాళ్లు తమ పిల్లలను తమ దగ్గర ఉంచుకునే వారు కాదు. నైరోబిలోని ‘కంపాషనేట్ హ్యాండ్స్’ ఒక శిశు సంరక్షణ కేంద్రం.

‘‘ఒక డే కేర్ కేంద్రం మొదలుపెడదామని ముందర భావించాను. కానీ ఒక్క వారంలోనే పదకొండు మంది అనాథ పిల్లలు చేరారు. నెల రోజుల్లోనే ఈ సంఖ్య 30కి చేరుకుంది’’ అని కంప్యాషనేట్ హ్యాండ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనే ఎంజేరి తెలిపారు.

కెన్యా వికలాంగ చిన్నారులు

ఈ చిన్నారుల తల్లిదండ్రులు తిరిగి రాలేదు. తల్లిదండ్రులు వదిలేసిన పిల్లల సంఖ్య ప్రస్తుతం ఇక్కడ 86. అయితే ఇక్కడి పరిస్థితులు వారి ఆరోగ్యాన్ని మరింత దెబ్బ తీస్తాయని నిపుణులు అంటున్నారు.

ప్రతి నెలా తన లాంటి పరిస్థితులు ఎదుర్కున్న కొందరు మహిళలను ఫ్లోరెన్స్ కలుస్తారు. వారిలో ఒకరు లైడియా. తన బిడ్డ మణికట్టులో సూదులు గుచ్చాలని ఆమెను ఒత్తిడి చేశారు. ఆలా చేస్తే నెమ్మదిగా బిడ్డ చనిపోతుంది. అలా చేస్తే ఎవరికీ తెలియదని కూడా అన్నారని ఆమె చెబుతున్నారు.

ఈ మహిళలందరూ ఇప్పుడు ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)