''పోరాడండి, మీకు సాయం వస్తోంది''- ఇరాన్ నిరసనకారులకు ట్రంప్ భరోసా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డేవిడ్ గ్రిట్టెన్, పాల్ ఆడమ్స్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఇరాన్‌లో భద్రతా దళాలు నిరసనలపై కఠినంగా వ్యవహరిస్తుండటంతో దేశవ్యాప్తంగా 2,000 మందికి పైగా మరణించినట్లు ఒక మానవ హక్కుల సంస్థ తెలిపింది.
ఈ నేపథ్యంలో ఇరానియన్లకు సహాయం ‘చేయనున్నట్లు’ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.
అనేక ప్రాంతాలలో ఇప్పటికీ ఇంటర్నెట్ నిలిపేసి ఉంది.
అయినప్పటికీ, గత 17 రోజుల్లో 1,850 మంది నిరసనకారులు, ప్రభుత్వంతో అనుబంధంగా ఉన్న 135 మంది వ్యక్తులు, 9 మంది పౌరులు, మరో 9 మంది పిల్లల మరణాలను ధ్రువీకరించినట్లు అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూజ్ ఏజెన్సీ (హెచ్ఆర్ఏఎన్ఏ) తెలిపింది.
నిరసనల్లో దాదాపు 2,000 మంది మరణించారని, కానీ మరణాలు ‘ఉగ్రవాదుల’ వల్ల సంభవించాయని ఇరాన్ అధికారి ఒకరు రాయిటర్స్‌తో అన్నారు.


ఫొటో సోర్స్, EPA
భారీ మూల్యం చెల్లించాలి: ట్రంప్
మంగళవారం సాయంత్రం ఇరాన్ పరిస్థితిపై జరిగే సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పాల్గొనబోతున్నారు. మరణించిన వ్యక్తుల కచ్చితమైన సంఖ్య ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
‘‘హత్యలు చాలా తీవ్రంగా కనిపిస్తున్నాయిగానీ, మాకు ఇంకా కచ్చితమైన సంఖ్యలు తెలియవు" అని ట్రంప్ వైట్‌హౌస్‌కు వెళుతూ విలేఖరులతో అన్నారు. పూర్తి గణాంకాలు తెలిసిన తర్వాత, అమెరికా ‘తదనుగుణంగా వ్యవహరిస్తుంది’ అన్నారు.
అంతకుముందు మంగళవారం, ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఇరాన్ నాయకులు హత్యలకు ‘భారీ మూల్యం చెల్లించాలి’ అని పోస్టు చేశారు. మరోవైపు, నిరసనలు కొనసాగించాలని ఆయన ప్రజలను ప్రోత్సహించారు.
"నిరసనకారులను చంపడం ఆగే వరకు నేను ఇరాన్ అధికారులతో అన్ని సమావేశాలను రద్దు చేశాను. సహాయం వస్తోంది. మిగా" అని రాశారు ట్రంప్.
'మిగా'(MIGA) అంటే అమెరికాలోని ఇరాన్ ప్రతిపక్ష గ్రూపులు ఉపయోగించే ‘మేక్ ఇరాన్ గ్రేట్ ఎగైన్’ అనే నినాదానికి సంక్షిప్త రూపం.
ఇరాన్‌పై సైనిక, ఇతర చర్యలను ట్రంప్ పరిశీలిస్తున్నారు. ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై ఇప్పటికే 25 శాతం సుంకాన్ని ప్రకటించారాయన.
ఇరాన్‌లోని 31 ప్రావిన్సులలోని 180 నగరాలు, పట్టణాలకు నిరసనలు వ్యాపించాయని సమాచారం.

ఫొటో సోర్స్, BBC Persian
'మృతుల సంఖ్య పెరగొచ్చు'
గత గురువారం నుంచి నిరసనలు మరింత తీవ్రమయ్యాయి. భద్రతా దళాలూ అదే రీతిలో స్పందించాయి. ఇంటర్నెట్, కమ్యూనికేషన్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది.
నిరసనల సమయంలో కనీసం 2,003 మంది మరణించినట్లు హెచ్ఆర్ఏఎన్ఏ మంగళవారం ధృవీకరించింది. మరో 779 మరణాల రిపోర్టులను కూడా తనిఖీ చేస్తున్నట్లు తెలిపింది.
"మేం ఆందోళనలో ఉన్నాం. ఈ సంఖ్య ఇంకా తక్కువేనని మేం ఇప్పటికీ నమ్ముతున్నాం" అని హెచ్ఆర్ఏఎన్ఏ డిప్యూటీ డైరెక్టర్ స్కైలార్ థాంప్సన్ అసోసియేటెడ్ ప్రెస్‌తో అన్నారు.
నార్వేకు చెందిన ఇరాన్ హ్యూమన్ రైట్స్ (ఐహెచ్ఆర్), కనీసం 734 మంది నిరసనకారుల మరణాలను ధృవీకరించినట్లు తెలిపింది.
ఈ గణాంకాలు ఇరాన్‌లోని 10 శాతం కంటే తక్కువ ఆసుపత్రుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఉన్నాయని ఐహెచ్ఆర్ డైరెక్టర్ మహమూద్ అమిరీ-మొగద్దం ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో అన్నారు. మరణించిన వారి వాస్తవ సంఖ్య వేలల్లో ఉంటుందని అభిప్రాయపడ్డారు.
సుమారు 2,000 మంది మరణించారని చెప్పిన ఇరాన్ అధికారి వాటి వివరాలు ఇవ్వలేదని రాయిటర్స్ తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
ఆసుపత్రులలో 'యుద్ధ వాతావరణం'
బీబీసీతో సహా అంతర్జాతీయ మీడియా ఇరాన్ లోపలి నుంచి రిపోర్ట్ చేయలేకపోవడంతో అసలు ఎంతమంది మరణించారన్నది అంచనావేయడం కష్టంగా మారింది.
ఆన్‌లైన్‌లో షేర్ చేసిన వీడియోలు...తెహ్రాన్‌లోని ఫోరెన్సిక్ సెంటర్‌లో ప్రజలు తమ బంధువుల మృతదేహాల కోసం వెతుకుతున్నట్లు చూపిస్తున్నాయి. బీబీసీ ఈ వీడియోలలో దాదాపు 180 మృతదేహాలను, బాడీ బ్యాగులను లెక్కించింది. సోమవారం షేర్ చేసిన మరొక వీడియోలో దాదాపు 50 మృతదేహాలు కనిపించాయి.
తెహ్రాన్‌లోని ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయని రిపోర్టులు చెబుతున్నాయి.
"చాలా ఆసుపత్రులు యుద్ధభూమిలా మారాయి. సామగ్రి కొరత ఉంది, రక్తం కొరత ఉంది" అని తెహ్రాన్‌లోని ఒక సహోద్యోగి నుంచి తనకు సందేశం వచ్చినట్లు లండన్‌లో నివసిస్తున్న ఇరానియన్ ఆంకాలజిస్ట్ ప్రొఫెసర్ షహ్రామ్ కొర్దాస్తి మంగళవారం బీబీసీతో చెప్పారు.
రెండు, మూడు ఆసుపత్రులలోనే వందలాది మంది గాయపడిన లేదా చనిపోయిన వారిని తీసుకొచ్చినట్లు అక్కడి వైద్యులు చెప్పారన్నారు.
భవనాలు కాలిపోయాయని, సాధారణ జీవితం పూర్తిగా అస్తవ్యస్తంగా ఉందని వివిధ నగరాల్లోని ప్రజలు చెబుతున్నారు.
కాగా, లాంగ్ రేంజ్ మిసైల్స్ దాడులు, సైబర్ ఆపరేషన్లు సహా విస్తృత శ్రేణి రహస్య, సైనిక సాధనాలపై అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు వివరణ ఇచ్చినట్లు అమెరికా రక్షణ అధికారులు బీబీసీ యూఎస్ భాగస్వామి సీబీఎస్ న్యూస్‌తో సోమవారం రాత్రి తెలిపారు.
మరోవైపు, ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉందని, అయితే అమెరికా ఆ మార్గాన్ని ఎంచుకుంటే సైనిక చర్యకు కూడా సిద్ధంగా ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి అన్నారు. "విదేశీ మద్దతు ఉన్న ఉగ్రవాదులు" నిరసనలలోకి చొరబడిన హింసకు కారణమవుతున్నారని ఆయన ఆరోపించారు.
విదేశీ శత్రువులు అశాంతిని ప్లాన్ చేస్తున్నారని ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ సైతం ఆరోపించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














