కుక్కలను ఆయుధంగా వాడి సామ్రాజ్యాలను ఎలా జయించారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డారియో బ్రూక్స్
- హోదా, బీబీసీ వరల్డ్
సుమారు ఐదువందల ఏళ్ల కిందట ప్రీ-హిస్పానిక్ మూలవాసులపై ఆధిపత్యం సాధించేందుకు స్పానిష్ అన్వేషకులు యూరప్ నుంచి కొన్ని ఆయుధాలను తీసుకు వచ్చారు. అవి కత్తులు, విల్లంబులు, తుపాకులు, గుర్రాలంతటి శక్తిమంతమైన శునకాలు.
స్పెయిన్ సాగించిన అనేక దండయాత్రలలో స్పానిష్ అలానో, జర్మన్ బులెన్‌బైసర్ వంటి భయంకరమైన శరీర నిర్మాణం గల కుక్కలు కూడా ఉన్నాయి. వీటిని కేవలం వసతుల రక్షణ, కాపలా కోసమే కాకుండా స్థానిక మూలవాసులపై దాడుల కోసం వినియోగించారు.
‘ఇంకా సామ్రాజ్యం’పై సాగిన దండయాత్రలో స్థానికులను భయపెట్టడానికి ఈ కుక్కలను వ్యూహాత్మకంగా ఉపయోగించారు. ‘ఇంకా సామ్రాజ్య’ ప్రజలకు చిన్నవి, మనుషులతో మాలిమి అయ్యే కుక్కల గురించి మాత్రమే తెలుసు. కానీ ఇలా దాడి చేసే స్వభావం కలిగిన కుక్కుల గుంపులను చూసి వారు ఆశ్చర్యానికి, భయానికి గురయ్యారు.

‘‘కుక్క పరిమాణం, దాని శిక్షణ, అలాగే దాన్ని నడిపించే వ్యక్తి. ఈ మూడు కలిపి కుక్క ఒక ఆయుధంలా మారింది’’ అని రచయిత, పెరూ సైన్యానికి చెందిన కర్నల్ కార్లోస్ ఎన్‌రికే ఫ్రెయిరే బీబీసీకి వివరించారు.
స్పానిష్ సేనలతో కలిసి పెరూ ఆక్రమణ యుద్ధంలో పాల్గొన్న దళాలకు చెందిన కుక్కల గుంపులకు శిక్షణనిచ్చి, రక్షణ బాధ్యతలు నిర్వహించిన ఓ డాగ్ హ్యాండ్లర్ గురించి ఆయన తాజా నవల 'ల్యాండ్ ఆఫ్ డాగ్స్'లో వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
టుంబెస్ జనాభాను తుడిచిపెట్టేసిన శునకాలు
స్పానిష్ సైన్యంలో కుక్కల వినియోగంపై చాలా తక్కువ పత్రాలు, ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అప్పటి కళాఖండాల్లో కూడా వాటి చిత్రీకరణ అరుదుగానే ఉంది.
వాయువ్య పెరూలోని టుంబెస్ నగరాన్ని సందర్శించినప్పుడు ఈ విషయంపై ఆసక్తి ఏర్పడిందని ఫ్రెయిరే చెప్పారు. ఆ సమయంలో ఆయన జువాన్ డి బెటాంజోస్, బార్టోలోమే డి లాస్ కాసాస్ వంటి అప్పటి చరిత్రకారుల రచనలను చదివారు. వీరిద్దరూ స్పానిష్‌లే అయినప్పటికీ స్థానిక సంస్కృతిని లోతుగా అధ్యయనం చేసి,ఆక్రమణ సమయంలో జరిగిన దురాగతాల గురించి కూడా వివరించారు.
"వారు ఈ కుక్కల గురించి మాట్లాడతారు, వాటి పేర్లు, వాటి లక్షణాలను కూడా వివరించారు. ఈ కుక్కలు టుంబెస్‌కు చేరుకుని అక్కడ జనాభాను తుడిచిపెట్టాశాయి" అని ఫ్రెయిరే రాశారు.
చారిత్రక సంఘటనల ఆధారంగా రాసిన తన కల్పిత నవలలో, తోమాస్ డి జెరెజ్ అనే వ్యక్తి బాల్డోమెరో అనే కుక్కకు శిక్షకుడిగా మారిన వైనాన్ని వివరిస్తారు.
అయితే అమెరికా ఖండాన్ని తొలిసారి అన్వేషించిన కాలంలోనే సేనాపతి వాస్కో నూనెజ్ డి బాల్బోవా వద్ద కూడా కుక్కలు ఉండేవి. వాటిలో లియోన్సికో అనే స్పానిష్ మాస్టిఫ్ కూడా ఒకటి.
లియోన్సికో శునకం బెసెరిలో జాతికి చెందిన భయంకరమైన కుక్క. ఇది సేనాపతి వాస్కో నూనెజ్ డి బాల్బోవా హిస్పానియోలా ద్వీపం, ప్రస్తుత ప్యూర్టోరికో ప్రాంతాలలో చేసిన దండయాత్ర సమయంలో ఆయనతోపాటే ఉంది.
16వ శతాబ్దపు మొదటి భాగంలో అమెరికా ఖండంలోని భూభాగాల అన్వేషణ, ఆక్రమణల సమయంలో కుక్కలకు చాలా ప్రాముఖ్యం ఉండేదని ఈ వృత్తాంతం చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
యుద్ధంలో ఎప్పటినుంచి?
అమెజాన్ ప్రాంత అన్వేషణకు స్పెయిన్ దేశస్థులు తమతో పాటు రెండువేల కుక్కలను తీసుకెళ్లారు. ‘ఇంకా సామ్రాజ్యాం’పై దండయాత్రకు నాయకత్వం వహించిన వారిలో ప్రాన్సిస్కో పిజారో ఒకరు. ఆయన తొలిసారిగా అడుగుపెట్టిన ప్రాంతాలలో టుంబెస్ కూడా ఒకటి.
‘‘జనం అనుకున్నట్టుగా వారి వద్ద పెద్దగా గుర్రాలు లేవు. అలాగే తుపాకుల వాడకం కూడా తక్కువగానే ఉంది’’ అని ఫ్రెయిరే వివరించారు.
‘‘తుపాకులు, కత్తులు, గుర్రాలు వెళ్ళలేని చోటుకు, కుక్కలు వెళ్ళేవి" అని ఆయన అన్నారు.
యూరప్ నుంచి తెచ్చిన భారీగా, దూకుడుగా ఉండే శిక్షణ పొందిన కుక్కలను స్థానిక మూలవాసులపై విడిచిపెట్టేవారు.
"ఈ స్పానిష్ కుక్కలు చాలా పెద్దవి. అందుకే స్థానిక ప్రజలు వీటిని సింహాలనుకున్నారు" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కుక్కల గుంపులను ఉపయోగించడం కేవలం 'ఇంకా సామ్రాజ్యాన్ని’ వశం చేసుకోవడానికి మాత్రమే పరిమితం కాలేదు. కరీబియన్, మధ్య అమెరికా, మెసోఅమెరికా లాంటి అనేక చోట్ల కూడా ఈ పద్ధతి అమల్లో ఉండేది.
మూలవాసుల ప్రతిఘటనను అణచివేయడానికి, శిక్షించడానికి కుక్కలను ఉపయోగించారు.
'ది మాగ్నిఫిసెంట్ లార్డ్ అలోన్సో లోపెజ్, మేయర్ ఆఫ్ శాంటా మారియా డి లా విక్టోరియా అండ్ ఇండియన్ డాగ్ కిల్లర్' అనే పుస్తకాన్ని నేషనల్ అటానమస్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికో ప్రచురించింది.
"పదహారవ శతాబ్దం మధ్యలో, ధూమపానం, విగ్రహారాధన, సైతానును ప్రార్థించడం, మతపరమైన వస్తువులను గౌరవించకపోవడం క్రైస్తవ ధర్మాన్ని అవమానించడం, చర్చి పరిశుభ్రతను పట్టించుకోకపోవడంవంటి కారణాలను చూపుతూ కువాట్ల్ డి అమిత్తాన్ అనే వ్యక్తిని కుక్కలతో చంపించి అనంతరం కాల్చివేయాలనే శిక్ష విధించారు" అని ఆ పుస్తకంలో ఉంది.
చరిత్రకారుడు మిగెల్ లియోన్ పోర్టిల్లా 'ది డెస్టినీ ఆఫ్ ది వర్డ్' అనే పుస్తకంలో ప్రస్తుత మెక్సికోలోని స్థానికుల కథనాలను రాశారు.
"వారి కుక్కలు చాలా పెద్దవి. వాటి దవడలు కంపిస్తుంటాయి, కళ్ళు మండుతున్నట్టు పసుపు రంగులో ఉండేవి. అవెప్పుడూ ప్రశాంతంగా లేవు. ఊపిరి తీసుకుంటూ పరుగెత్తుతాయి, నాలుక బయటకు వేలాడుతుంటుంది. వాటి శరీరాలపై చిరుతపులిలా రంగురంగుల మచ్చలు ఉంటాయి" అని ఒక కథనం పేర్కొంది.
తన 'ల్యాండ్ ఆఫ్ డాగ్స్' రచనను పెరూ నేపథ్యంలో కేంద్రీకరించాలని నిర్ణయించుకున్నట్టు ఫ్రెయిరే చెబుతారు. ప్రాచీన కాలానికి చెందిన కఠినమైన కథలను నియంత్రితంగా చెప్పడం అవసరమని ఆయన భావించారు.
"ఈ పుస్తకంలో హింస వర్ణనాత్మకంగా ఉంటుంది, కానీ పాఠకులు పుస్తకం మూసివేసి ‘ఇదెంత భయంకరంగా ఉంది’ అనుకునే స్థాయిలో కాదు, ఒక సమతుల్యత అవసరం" అని రచయిత పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆక్రమణలు పూర్తయ్యాక కుక్కలను ఏం చేశారు
రాజ్యాలను గెలిచి, జనాభాపై ఆధిపత్యం సాధించాక, ఈ కుక్కలతో పెద్దగా పనిలేకుండా పోయింది. కాలక్రమేణా అవి స్పెయిన్ వాసులకు తలనొప్పిగా మారాయి.
బానిస కార్మికులు సహా వారికి మరికొంతమంది కార్మికులు అవసరమయ్యారు. అందుకే మూలవాసులను తుడిచిపెట్టేయడం సాధ్యం కాలేదు. ఈ పరిస్థితిలో కుక్కల ఉనికి, వాటి దూకుడు మరింత సమస్యగా మారింది.
దీంతో మరిన్ని సమస్యలు రాకుండా కుక్కలను నిర్మూలించమని అమెరికాలోని వివిధ సేనాధిపతులకు స్పెయిన్ రాజ్యం లేఖలు పంపిందని ఫ్రెయిరే వివరించారు. ఈ సమస్య స్పానిష్‌లకు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉందని కూడా వాటిలో హెచ్చరించారు.
"వాటిని విడిచిపెట్టడం వల్ల అవి గుంపులుగా మారి, చివరకు స్పానిష్‌లతో పాటు స్థానిక ప్రజలపై కూడా దాడి చేస్తున్నాయని వారు గమనించారు. అందుకే కుక్కల వల్ల కలిగే హానిపై రాణి ఆదేశాలు జారీ చేశారు " అని రచయిత తెలిపారు.
"కుక్కతో పాటు దాన్ని నడిపించిన సైనికుడికి మధ్య చాలా సన్నిహిత బంధం ఉంటుంది," అని ఫ్రెయిరే అన్నారు.
దీంతో, రాజాజ్ఞలు ఉన్నప్పటికీ, కొందరు తమకు ఇష్టమైన కుక్కలను వదిలేయడాన్ని బాధాకరంగా భావించారు.
స్థానిక భూభాగాల్లో స్పానిష్ పాలన స్థిరపడిన తరువాత, యుద్ధ ఆయుధాలుగా తమ పాత్రను కుక్కలు క్రమంగా కోల్పోయాయి. మూలవాసులను లోబర్చుకోవడంలో ఓ ఆయుధంగా కీలక పాత్ర పోషించిన వాటి జ్ఞాపకం కూడా మసకబారిపోయింది.

ఫొటో సోర్స్, Alfaguara
అయితే, ఎన్నో సంవత్సరాల పాటు శిక్షణ ఇవ్వడం, కలిసి యుద్ధం చేయడం వల్ల, శిక్షకులకు తమ కుక్కలతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. ఈ అనుబంధం 'ల్యాండ్ ఆఫ్ డాగ్స్' కథలో కూడా కనిపిస్తుంది.
"ఈ కుక్కకు, వాటిని పెంచిన సైనికుడికి మధ్య మంచి బంధం ఏర్పడింది" అని ఫ్రేయర్ పేర్కొన్నారు.
దీంతో రాజశాసనాలు ఉన్నప్పటికీ, కొందరికి తమ ప్రియమైన కుక్కలను వదిలిపెట్టడం అసాధ్యంగా అనిపించింది.
గిరిజన ప్రాంతాలలో స్పానిష్ పాలన బలపడటంతో, కుక్కలు క్రమంగా యుద్ధ ఆయుధాల హోదాను కోల్పోయాయి. స్థానిక ప్రజలను బానిసలుగా మార్చడంలో వాటి పాత్ర కూడా మెల్లగా మరచిపోయారు.
క్రమంగా వాటి పాత్ర భద్రత, సహాయానికి మాత్రమే పరిమితమైంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














