బొద్దింకలు : భూమిపై ఎప్పుడు పుట్టాయి, తలతెగినా ఎలా బతుకుతాయి?

బొద్దింకలు, చరిత్ర

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మన ఇళ్లలో కనిపించే బొద్దింకలు కోట్ల సంవత్సరాలుగా భూమిపై సంచరిస్తున్నాయి.
    • రచయిత, భరత్ శర్మ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బొద్దింక. కొందరికి భయం. మరికొందరికి అసహ్యం. ఈ నిశాచర జీవులు ఎక్కువగా చీకటి పడగానే బయటకు వస్తుంటాయి. ఇల్లంతా తిరుగుతూ ఆహార పదార్థాల మీద కూడా చేరుతూ ఉంటాయి. ఎక్కవగా వంటగదిలో కనిపిస్తుంటాయి. గోడల పగుళ్లలోంచి చూస్తుంటాయి.

ఈ బొద్దింకలు డైనోసార్ల కంటే ముందు నుంచి భూమ్మీద ఉన్నాయని ఎంతమందికి తెలుసు? అంతేకాదు, తల తెగినా బొద్దింకలు బతికే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఇంతకీ వీటి చరిత్ర ఏంటి? డైనోసార్ల కాలం నుంచి బొద్దింకలు ఎలా మనుగడ సాగిస్తున్నాయి? ప్రపంచవ్యాప్తంగా 4,500 కంటే ఎక్కువ రకాల బొద్దింకలు ఉన్నాయి. కానీ, కేవలం 30 జాతులు మాత్రమే మానవ నివాసాలలో కనిపిస్తాయి. బొద్దింకలు బ్లాటోడియా క్రమానికి చెందినవి, ఇందులో చెదపురుగులు కూడా ఉన్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బొద్దింకలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచంలో 4500 కంటే ఎక్కువ రకాల బొద్దింకలు ఉన్నాయి.

భూమిపై ఎంతకాలంగా ఉంటున్నాయి?

ఈ బొద్దింకలు శతాబ్దాల నాటివి. అవి డైనోసార్ల కంటే ముందే ఉన్నాయి, నేటికీ ఉన్నాయి. భూమిపై ఉన్న పురాతన కీటకాలలో ఒకటిగా వీటిని పరిగణిస్తారు. శిలాజ ఆధారాలు కూడా బొద్దింకలు 'కార్బోనిఫెరస్ కాలం' నాటివని సూచిస్తున్నాయి. కానీ, ఈ కాలం ఎప్పటిది? ఇది 35 కోట్ల సంవత్సరాల నాటిది. అంటే బొద్దింకలు 35 కోట్ల సంవత్సరాల కిందటివి.

దిల్లీ విశ్వవిద్యాలయంలోని కిరోరి మాల్ కళాశాలలో జంతుశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నవాజ్ ఆలం ఖాన్ దీని గురించి వివరించారు.

"బొద్దింకల గురించి మీరు తెలుసుకోవలసిన మొదటి విషయం ఏమిటంటే.. అవి డైనోసార్ల కంటే పాతవి. మనం వాటి గతం గురించి చర్చిస్తున్నామంటే, మెసోజోయిక్ యుగం గురించి మాట్లాడుతున్నట్లు. ఆ కాలంలో డైనోసార్లు ఉన్నాయి" అని డాక్టర్ ఖాన్ బీబీసీతో చెప్పారు.

"ఈ యుగంలో డైనోసార్ల స్వర్ణయుగం జురాసిక్ కాలం. అంతకుముందు, పురాతన జీవం, జంతువుల ఆవిర్భావాన్ని చూసిన కార్బోనిఫెరస్ కాలం ఉంది. బొద్దింకలు ఆ సమయంలో కూడా ఉన్నాయి. అవి దాదాపు 30-35 కోట్ల సంవత్సరాల కిందట ఉన్నాయి, నేటికీ ఉన్నాయి" అన్నారాయన.

మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయంలో జంతుశాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దుష్యంత్ కుమార్ చౌహాన్ కూడా దీనిని ధ్రువీకరిస్తున్నారు.

"బొద్దింకలు డైనోసార్ల కంటే కూడా పాతవి, వాటిని అకశేరుకాల సమూహంలో ఉంచారు. సకశేరుకాలు వాటి తర్వాత వచ్చాయి. సకశేరుకాలు అంటే వెన్నెముక కలిగిన జంతువులు. డైనోసార్ల కంటే ముందే బొద్దింకలు ఉన్నాయి. ఇతర జీవులు వాటి తర్వాత ఉనికిలోకి వచ్చాయి" అన్నారు దుష్యంత్ కుమార్.

కానీ, బొద్దింకలు ఎందుకంత ప్రత్యేకం?

డాక్టర్ నవాజ్ ఆలం ఖాన్ చెబుతున్న దాని ప్రకారం, భూమిపై కోట్లాది సంవత్సరాలుగా చాలా మార్పులు సంభవించాయి. పర్యావరణం, వాతావరణం, పరిస్థితులన్నీ మారిపోయాయి. ఈ మార్పుల కారణంగా, అనేక జీవులు అంతరించిపోయాయి లేదా కనుమరుగయ్యాయి. దీనికి ఉదాహరణ డైనోసార్‌లు.

"డైనోసార్‌లతో పాటు అనేక ఇతర జీవులు అదృశ్యమయ్యాయి. కానీ, బొద్దింకల విషయంలో అలా జరగలేదు. కాలానికి అనుగుణంగా మారుతూ వచ్చాయి. కానీ, అవి చాలా చిన్నవి. అంతేకాదు, వాటి భౌతిక నిర్మాణంలో కూడా పెద్దగా మార్పు లేదు" అన్నారు నవాజ్ ఆలం ఖాన్.

బొద్దింక

ఫొటో సోర్స్, Getty Images

'తల తెగినా ఎలా బతుకుతుంది?'

బొద్దింక శరీరం మూడు భాగాలుగా విభజితమైంది: తల, థొరాక్స్, ఉదరం. తల, ఉదరం మధ్యనుండే భాగాన్ని థొరాక్స్ అంటారు.

అలాగే, మనం ముందు భాగంలో చూసే రెండు యాంటెన్నా లాంటి భాగాలు దాని ఇంద్రియ అవయవాలు. అంటే, వీటి సహాయంతో అవి పర్యావరణాన్ని, వాటి చుట్టూ ఉన్న వస్తువులను గ్రహిస్తాయి.

"బొద్దింక శరీరంపై మనం చూసే ముదురు గోధుమ రంగు షెల్‌ను ఎక్సోస్కెలిటన్ అంటారు. ఇది చాలా బలంగా ఉంటుంది. కైటిన్‌తో తయారవుతుంది. కైటిన్‌ అనే పదార్థంతోనే మన చేతి గోళ్లు కూడా తయారవుతాయి. ఈ ఎక్సోస్కెలిటన్‌ను బొద్దింక బాహ్య కవచంగా పిలుస్తారు. ఇది బొద్దింక శరీరాన్ని రక్షిస్తుంది, సురక్షితంగా ఉంచుతుంది. పర్యావరణ మార్పులు, శత్రువుల నుంచి రక్షిస్తుంది" అని డాక్టర్ దుష్యంత్ కుమార్ చౌహాన్ అన్నారు.

బొద్దింక తల తెగిపోయినా జీవించగలదని అంటున్నారు. కానీ, ఇదెలా సాధ్యం?

మానవులకు శరీరాన్ని నియంత్రించే మెదడు ఉన్నట్లే, బొద్దింకలకు గ్యాంగ్లియన్లు ఉంటాయని డాక్టర్ నవాజ్ ఆలం ఖాన్ చెప్పారు. అయితే, అవి బొద్దింక తలలోనే కాదు, శరీరంలోని వివిధ భాగాలలోనూ ఉంటాయని చెప్పారు. వాటి శరీరంలోని అనేక నరాలు కలిసి గ్యాంగ్లియన్లను ఏర్పరుస్తాయన్నారు. బొద్దింక తల థొరాక్స్, ఉదరంలోనూ గ్యాంగ్లియన్లు ఉంటాయని చెప్పారాయన.

బొద్దింక తలలోని గ్యాంగ్లియన్‌ను సుప్రేసోఫాగియల్ గ్యాంగ్లియన్ లేదా సబ్‌ఎసోఫాగియల్ గ్యాంగ్లియన్ అంటారు. ఇవి, కలిసి మెదడు విధులను నిర్వహించగలవు, కాబట్టి వాటిని బొద్దింక మెదడు అంటారు.

"ఒక బొద్దింక తల తెగిపోతే, దాని థొరాక్స్ గ్యాంగ్లియన్, ఉదర గ్యాంగ్లియన్ స్పందించి శరీరాన్ని నియంత్రించడం ప్రారంభిస్తాయి. ఈ పరిస్థితిలో అది ఒక వారం వరకు జీవించగలదు. మానవులు ముక్కు లేదా నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. కానీ బొద్దింకలకు వాటి శరీరంలో స్పిరకిల్స్ అనే చిన్న రంధ్రాలుంటాయి. ఇవి వాటి శ్వాసకోశ వ్యవస్థగా పనిచేస్తాయి. వాటి ద్వారా శ్వాస తీసుకుంటాయి. స్పిరకిల్స్ శరీరంలోని వివిధ భాగాలలో ఉంటాయి. అందుకే తలలు తెగినా బొద్దింకలు మనుగడ సాగిస్తాయి" అని డాక్టర్ నవాజ్ ఆలం ఖాన్ వివరించారు.

అది తల లేకుండా శ్వాస తీసుకోగలిగితే, వారమే ఎందుకు బతుకుతుంది?

"ఒక బొద్దింక ఆహారం లేకుండా ఒక నెల రోజులు జీవించగలదు. కానీ, నీరు లేకుండా ఒక వారం మాత్రమే బతకగలదు. ఎందుకంటే దాని తల తెగితే, దానికి నోరు ఉండదు. ఆ సందర్భంలో, అది నీరు తాగలేదు" అని డాక్టర్ నవాజ్ ఆలం ఖాన్ వివరించారు.

బొద్దింక

ఫొటో సోర్స్, Getty Images

రాత్రిపూటే ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయి?

బొద్దింకలు పగటిపూట తక్కువగా, రాత్రిపూట ఎక్కువగా కనిపిస్తుంటాయి, ఎందుకు?

బొద్దింకలు నాక్టోర్నల్ జీవులు, అంటే అవి రాత్రిపూట చురుకుగా ఉంటాయి. పగటిపూట చీకటి, తేమతో కూడిన ప్రదేశాలలో దాక్కుంటాయి. ఆహారం, నీటి కోసం రాత్రిపూట బయటకు వస్తాయి.

డాక్టర్ దుష్యంత్ కుమార్ చౌహాన్ దీని గురించి వివరిస్తూ, "మీరు తరచుగా వంటగది, బాత్రూమ్‌లలో బొద్దింకలను చూస్తారు. కారణం.. ఆహారం, తేమ. అవి వ్యర్థాలను తింటాయి. అందుకే ఆ ప్రదేశాలలో తరచుగా కనిపిస్తాయి" అన్నారు.

"అవి వెలుగును ఇష్టపడవు, చీకటిలో చురుకుగా ఉంటాయి. మీరు వాటిని పగటిపూట చూసినా, వీలైనంత త్వరగా చీకటి మూలకు పారిపోవడానికి ప్రయత్నిస్తాయి" అన్నారు దుష్యంత్ కుమార్.

" మొత్తం 4,500 రకాల బొద్దింకలలో దాదాపు 30 మన మధ్యనే నివసిస్తున్నాయి. అవి ఎక్కువగా తేమ ఉన్న ప్రాంతాల్లో నివసిస్తాయి. వంటగదిలో ఆహారం, బాత్రూంలో తేమ కోసం వస్తుంటాయి" అని డాక్టర్ నవాజ్ ఆలం ఖాన్ వివరించారు.

బొద్దింక

ఫొటో సోర్స్, Getty Images

'పరిశుభ్రత అవసరం'

చివరగా, అతి ముఖ్యమైన ప్రశ్న: బొద్దింకలు రాకుండా ఏం చేయాలి, ఎందుకంటే పదే పదే ప్రయత్నించినప్పటికీ అవి తిరిగి వస్తూనే ఉంటాయి.

"సిట్రస్ పండ్లలో లిమోనిన్ ఉంటుంది. కొన్నిసార్లు మనకు ఒక నిర్దిష్ట వాసన నచ్చదు. అది మనల్ని బాధపెడుతుంది. అదేవిధంగా, బొద్దింకల విషయంలో లిమోనిన్. అందుకే దీనిని వాణిజ్యపరంగా లభించే ఉత్పత్తులలో బొద్దింకలను తరిమికొట్టడానికి ఉపయోగిస్తారు" అన్నారు ఖాన్.

  • ఆహారం, తేమతో కూడిన వాతావరణం ఉన్నచోట బొద్దింకలు వృద్ధి చెందుతాయని, పరిశుభ్రత పాటిస్తే అవి రావని నిపుణులు సూచిస్తున్నారు.
  • తిన్న ప్లేట్లను వెంటనే కడగాలి. మిగిలిపోయిన ఆహారాన్ని వెంటనే బయట పడేయాలి.
  • ఇంట్లో చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలి. మీరు ఉపయోగించే చెత్త డబ్బాలు మూసివేయదగినవిగా ఉండాలి. వాటిని రాత్రిపూట ఇంటి బయట పెట్టాలి.
  • బొద్దింకలు కిటికీలు, తలుపుల ద్వారా ప్రవేశించవచ్చు. కాబట్టి అవసరం లేనప్పుడు వీటిని మూసివేయాలి.
  • అట్ట పెట్టెలపై శ్రద్ధ వహించండి. ఆ పెట్టెలను చెక్క గుజ్జుతో తయారు చేస్తారు. బొద్దింకలకు ఇవి అద్భుతమైన ఆహారం.
  • బొద్దింకలు చాలా వరకు డిష్ వాషర్ల నుంచే ఇళ్లలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి, రాత్రి పూట దానిపై ఏదైనా కప్పి ఉంచితే బెటర్.
  • బొద్దింకలను బయటకు పంపేందుకు స్ప్రేలు, జెల్‌లను ఉపయోగిస్తారు. అయితే, ఏరోసోల్‌ల ఉపయోగం మనుషులకు కూడా హానికరమే.

అలా చేసినా కొన్ని బొద్దింకలు తిరిగి వస్తాయి, ఎలా?

"ఎందుకంటే బొద్దింకలు పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి, ప్రతిఘటిస్తాయి. అందుకే అవి లక్షలాది సంవత్సరాలుగా ఇబ్బందికర, మారుతున్న పరిస్థితులలో కూడా జీవించి ఉన్నాయి" అని ఖాన్ అన్నారు.

అణుదాడి జరిగినా బొద్దింకలు చనిపోవా?

బొద్దింకల జీవిత కాలం గురించి మాట్లాడుకుంటే అది వాటి రకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.

కొన్ని రకాల బొద్దింకలు 150 నుంచి 170 రోజులు జీవిస్తాయి. మరికొన్ని ఏడాదివరకు బతుకుతాయని డాక్టర్ చౌహాన్ వివరించారు. ‘‘జర్మన్ బొద్దింక సగటు జీవితకాలం 150-170రోజులు. ఆడ బొద్దింకలు కొంచెం ఎక్కువకాలం అంటే 180రోజుల దాకా జీవిస్తాయి’’ అని చెప్పారు.

అయితే అణుబాంబు దాడులు జరిగితే ఎవరూ జీవించే అవకాశం ఉండదు, కానీ బొద్దింకలు మాత్రం బతుకుతాయని చెబుతుంటారు. ఇదెంతవరకు నిజం?

‘‘అది నిజం కాదు. అణుబాంబు దాడి సమయంలో జరిగే పేలుడికి ఇతర ప్రాణులాలనే బొద్దింకలు కూడా మరణిస్తాయి. అయితే అణుధార్మికతను తట్టుకునే శక్తి బొద్దింకలకు 15రెట్లు ఎక్కువగా ఉంటుందనేది నిజం. కాకపోతే అణుదాడి జరిగిన చోట అవి బతకలేవు’’ అని చౌహాన్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)