ఈ కీటకాలను తింటే ఆరోగ్యానికి మంచిదా? సింగపూర్ ఏమంటోంది?

తేలు రసం

ఫొటో సోర్స్, Getty Images

మిడతలు, గొల్లభామలు, పేడపురుగులు, బొద్దింకలు సహా 16 రకాల కీటకాలను వండుకుని తినొచ్చని, వాటి విక్రయాలు జరుపుకోవచ్చంటూ సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ (ఎస్ఎఫ్ఏ) అనుమతులు ఇచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 2,100కిపైగా తినడానికి పనికొచ్చే కీటకాలు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఈ కీటకాల్లో చాలా ముఖ్యమైన విటమిన్స్, ఖనిజాలు ఉన్నాయని చెబుతున్నారు.

‘‘ప్రొటీన్ వనరుల విషయంలో కీటకాలు విస్మరణకు గురయ్యాయి. పైగా వాతావరణ మార్పులతో పోరాడటానికి ఇదొక మార్గం’’ అని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ 2022 నాటి నివేదిక చెబుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

కీటకాల సాగుతో ఎంతో మేలు..

‘‘మనిషి తినదగిన కీటకాలు ఆరోగ్యవంతమైనవి. వాటిల్లో మంచి పోషక పదార్థాలు, ప్రొటీన్లు ఉంటాయి. అంతేకాదు, అవి మనకు అందుబాటులో ఉంటాయి. ఎక్కువగా దొరుకుతాయి కూడా’’ అని పరిశోధకులు చెబుతున్నారు.

ప్రపంచంలో కీటకాల సంఖ్య 10 క్వింటిలియన్ (ఒకటి పక్కన 18 సున్నాలు ఉంచితే వచ్చే సంఖ్య) దాకా ఉంటుందని అంచనా.

కీటకాల పెంపకం ద్వారా వెలువడే కర్బన ఉద్గారాలు కూడా చాలా తక్కువ. చెప్పాలంటే.. ప్రపంచవ్యాప్తంగా మానవ కార్యకలాపాల వల్ల వెలువడే మొత్తం కర్బన ఉద్గారాల్లో ఒక్క వ్యవసాయం నుంచే 25% విడుదల అవుతున్నాయి.

వ్యవసాయంతో పోలిస్తే, కీటకాల సాగు ద్వారా చాలా తక్కువ కర్బన ఉద్గారాలు వెలువడతాయి.

ఏఏ దేశాలలో కీటకాలను తింటారు?

మెక్సికోలోని కొన్ని ప్రాంతాలలో గొల్లభామలతో చేసిన వంటకాలను వడ్డించే సంప్రదాయం ఉంది.

థాయ్‌లాండ్, కంబోడియా లాంటి అగ్నేయాసియా దేశాలలో చీమలు, చిమటలు, సాలీళ్ళను లాగించడం సాధారణమే.

భారత్‌లోనూ కొన్ని ప్రాంతాల్లో తొలకరి వర్షాలు పడగానే పుట్టల్లోంచి బయటికి వచ్చే ఉసిళ్లను వేయించుకుని తింటారు.

ఇప్పుడీ దేశాల జాబితాలో సింగపూర్‌ కూడా చేరింది. తమ వంటకాల్లో కీటకాలను కూడా చేర్చుకుంది.

చాలా రకాల కీటకాలను ఆహార పదార్థాలుగా ఊహించుకోవడానికే కొందరు ఇష్టపడరు. వెంటనే ‘యాక్...’ అనే ఫీలింగ్ వస్తుంది. అవి మురికిగా ఉంటాయని, రోగాలను వ్యాప్తి చేస్తాయనే భావన ఉంటుంది.

కానీ, 2017 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది ప్రజలు తమ సంప్రదాయంలో భాగంగా కీటకాలను తింటున్నారని ఒక అంచనా. ఇప్పుడిప్పుడే పాశ్చాత్య దేశాల్లో దీని గురించి చర్చ జరుగుతోంది.

నెదర్లాండ్స్, ఆఫ్రికాల్లో కీటకాల పెంపకం ప్రారంభమైంది. కీటకాలే అసలైన సూపర్ ఫుడ్ అని మనుషులు తినగలిగే కీటకాల వ్యాపారి షామి రాడియా అన్నారు.

‘‘కీటకాలు అసలైన సూపర్ ఫుడ్. వాటిల్లో ప్రొటీన్, మినరల్స్, అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. వాటిని తినడంలో అర్థం ఉంది’’ అని ఆమె చెప్పారు..

మాంసాహారం తినడం కంటే కీటకాలను తినడం పర్యావరణానికి మంచిది. వీటికి జీవ వ్యర్థాలను ఆహారంగా ఇవ్వవచ్చు. జంతువుల పెంపకంతో పోలిస్తే.. కీటకాల పెంపకానికి తక్కువ స్థలం, తక్కువ నీరు అవసరం అవుతుంది.

సాధారణంగా జంతువులు బలంగా తయారవ్వడానికి ఎక్కువ దాణా లేదా ఆహారం అవసరం.

ఉదాహరణకు ఏదైనా జంతువు కేజీ బరువు పెరగాలంటే దానికి 8 కేజీల దాణా అవసరం. కానీ, కీటకాలు అలా కాదు. వాటి రక్తం వేడిగా కాకుండా చల్లగా ఉండటంతో, సగటున 2 కిలోల ఆహారానికి 1 కిలో ‘కీటక ద్రవ్యరాశి’ వస్తుంది.

కీట‌కాల‌కు పెరుగుతున్న డిమాండ్‌

ఆఫ్రికా, ద‌క్షిణ అమెరికా, ఆసియా దేశాల్లో సుమారు 2,000 ర‌కాల కీట‌కాలను తింటుంటారు. థాయిలాండ్‌లో అయితే కీట‌కాల పెంప‌కం ఓ ప‌రిశ్ర‌మ‌గా అభివృద్ధి చెందుతోంది. 20,000 ఫారాలు ఉన్నాయి. థాయిలాండ్‌ ఏటా 7,500 ట‌న్నుల కీట‌కాల‌ను ఉత్ప‌త్తి చేస్తోంది.

అయితే ఐరోపా, అమెరికాలలో కీట‌కాల‌ను తిన‌డానికి చాలా మంది ఇంకా వెనకాడుతున్నారు. అద్భుత‌మైన రుచి, ప‌ర్యావ‌ర‌ణ‌, పోషఖ ప్ర‌యోజ‌నాలు ఉన్న‌ప్ప‌టికీ వాటిపైపు చూడ‌డం లేదు.

అయితే యూకేలో కీట‌కాలు తినాల‌ని భావించే వారు ముందుగా కీచురాళ్లు, మీల్ వార్మ్‌ల‌తో మొద‌లు పెట్టాల్సి ఉంటుంద‌ని యూకేలోని ఆక్స్‌ఫ‌ర్డ్ బ్రూక్స్ యూనివ‌ర్సిటీకి చెందిన కన్జ్యూమ‌ర్ సైకాల‌జీ, మార్కెటింగ్ విభాగాల రీసెర్చ‌ర్ ఇంద్రొనీల్ ఛ‌ట‌ర్జీ సూచించారు. ఎందుకంటే గ్రాస్‌హాప‌ర్స్‌ క‌న్నా అవే రెడీగా దొరుకుతాయి.

‘‘స‌ప్ల‌య్ చైన్‌లో ఇబ్బందులు ఉన్నాయేమో.. గ్రాస్‌హాప‌ర్స్ ల‌భ్య‌త త‌క్కువ‌గా ఉంది. వాటిని ప్ర‌స్తుతం యూకేలో పెద్ద‌యెత్తున పెంచ‌డం లేదు. అందువ‌ల్ల వాటిని కొనుగోలు చేయ‌డం క‌ష్టంగా ఉంది’’ అని ఛ‌ట‌ర్జీ వివ‌రించారు.

మరోవైపుచాలా దేశాల్లో అడ‌వుల్లాంటి వాతావ‌ర‌ణం సృష్టించి వైల్డ్ హార్వెస్టింగ్ పేరుతో విస్తృతంగా కీట‌కాల‌ను పెంచడంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇప్ప‌టికే వాతావ‌ర‌ణంలోని మార్పులు, తెగుళ్లు, పురుగుమందుల కార‌ణంగా వాటి ఉనికికి ముప్పు ఏర్ప‌డింది. ఇలాంటి సంద‌ర్భంలో వాటిని ఆహారంగా వినియోగించుకుంటూ పోతే ఒత్తిడి పెరుగుతుందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.

2050 నాటికి తిండి దొరకదా?

2050 నాటికి ప్రపంచ జనాభా 970 కోట్లకు చేరుకుంటుందని ఓ అంచనా. అంతటి జనాభాకు సరిపడా ఆహారం కావాలంటే, ప్రస్తుతం ఉన్న ఆహార ఉత్పత్తి రెట్టింపు కావాలి.

మరోవైపు మాంసాహారం మాని, దాని ద్వారా వచ్చే ప్రొటీన్లను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, పురుగులను తినడం.. మీకు ఇబ్బంది అనిపిస్తే కీటకాలని అని పిలుద్దాం. అలా కీటకాలను తినడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే ఆహారలోటును భర్తీ చేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)