గొడ్డు మాంసం కన్నా మిడతలను తినడానికే ఇష్టపడతాను.. ఎందుకంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పాస్కల్ క్వెసిగా
- హోదా, బీబీసీ ఫ్యూచర్
ఉగాండాలోని మా కుటుంబం నివసించే ఇంటి చుట్టూ ఉండే గాలి ఓ ప్రత్యేక వాసనతో నిండిపోయింది. అది బీఫ్‌ను కాల్చినప్పుడు వచ్చే వాసనకన్నా భిన్నమైనదేమీ కాదు.
అది 2020 డిసెంబరు. నా సోదరి మాగీ .. గ్రాస్ హాపర్(మిడత)లను వేపుతోంది.ఆకుపచ్చగా ఉండే ఆ మిడతలను అలా వేయిస్తుంటే అవి మరింత కరకరలాడేలా మారుతున్నాయి.
ఘాటైన కమ్మని వాసన వస్తోంది. ఎంతగా వేపుతుంటే అంతగా వాసన వస్తోంది.
వేపుతున్నప్పుడు సుర్రుమంటూ సన్నని శబ్దం, ఆవిరి వస్తోంది. వాటిని పెనం నుంచి తీస్తున్నప్పుడు నాకు నోరూరడం మొదలైంది. ఆ రుచికరమైన స్నాక్‌ను తినకుండా ఉండలేకపోయాను.
గ్రాస్ హాపర్‌ల వేపుడు తినడం ఇది నాకు తొలిసారి ఏమీ కాదు. చిన్నతనంలో వీటిని తరచూ తినేవాడిని. ఉగాండాలో గ్రాస్ హాపర్‌లను బలవర్థక ఆహారంగా భావిస్తారు. అందరూ ఇష్టపడే చిరుతిండి కూడా.
2000 సంవత్సరంలో ఓసారి నేను తొలిసారి గ్రాస్ హాపర్‌లను పట్టుకొన్నాను. ఇవన్నీ తూర్పు ఆఫ్రికాలోని లేక్ విక్టోరియా చుట్టూ పెరుగుతుంటాయి. రాత్రంతా గుంపులుగుంపులుగా మంచు బిందువులతో నిండిన గడ్డిలో తిరుగుతుంటాయి.
ఓ సూర్యోదయం వేళ పశ్చిమ ఉగండాలోని హోయిమాలో ఉన్న మా ఇంటికి సమీపంలో ఉండే చిన్న గుట్ట ఎక్కాను. అక్కడి ఉండే గడ్డి వద్దకు వెళ్లాను. నా టీనేజీ స్నేహితులు నాతో వచ్చారు. గడ్డిలోని ఆ కీటకాలను పట్టుకుంటూ రోజంతా గడిపాను. చివరకు ఓ సంచినిండా వాటిని నింపుకొని ఇంటికి తిరుగుముఖం పట్టాను. ఆ క్షణం చాలా గర్వపడ్డాను. పెనం మీదకు ఏదో దొరికిందన్న సంతోషం.
గ్రాస్ హాపర్స్ వాసన ప్రతిసారీ నాకు క్రిస్మస్‌ను గుర్తుకు తెస్తుంటుంది. ఎందుకంటే కీటకాల పంటకు అదే అనుకూలమైన సమయం. నవంబరు నాటి తడి కాలం.. జనవరిలో ఉండే పొడి కాలానికి మారే సమయం ఇవి పెరగడానికి అత్యంత అనుకూలం.
క్రిస్మస్‌లో నేను బీఫ్ తినడం కన్నా గ్రాస్‌హాపర్స్ తినడానికే ఇష్టపడతాను. ఎందుకంటే వాటి రుచి అంటే నాకు చాలా ఇష్టం.
సుమారు 22 ఏళ్ల అనంతరం ఈ ఏడాది జూన్‌లో నాలో ఈ ఇంటి రుచుల జ్ఞాపకాలు మెదిలాయి. అందుకే నాకు ఇష్టమైన గ్రాస్‌హాపర్స్ స్నాక్స్‌ను మరోసారి చేయాలని అనుకున్నాను.
భోజనంలో మాంసం బదులు కరకరలాడే ఈ కీటకాలను తీసుకుంటే ఎలా ఉంటుంది? అసలు ఇలాంటి ప్రయోగం బాగుంటుందా? అన్న ఆలోచన కలిగింది.
ఈ కీటకాలను తినడం వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయన్న మాటను నేను విన్నాను.
ప్రోటీన్ అందించే ప్రధాన వనరుగా గ్రాస్‌హాపర్స్‌నే స్వీకరిస్తే గ్రీన్ హౌస్ గ్యాస్‌లకు కారణమ్యే కార్బన్ ఫుట్ ప్రింట్‌ను ఎంతవరకు తగ్గించగలుగుతానన్న ఊహ కూడా కలిగింది.
నేనిప్పుడు ఉగాండా రాజధాని కంపాలాలో ఉంటున్నాను. ఇది జనసమ్మర్థమైన నగరం. గ్రాస్‌హాపర్స్ వాలడానికి గడ్డి జాగాలే ఉండవు.
ఉగాండాలో రెండు గ్రాస్‌హాపర్ సీజన్లు ఉంటాయి. మే-జూన్ మధ్య ఒకటి, డిసెంబరు-జనవరి మధ్య ఇంకొకటి వస్తుంది. ఈ సమయంలో ఆఫ్రికాలోని గడ్డి నేలలు, పొదల మధ్య భారీ సంఖ్యలో గుంపులుగుంపులుగా తిరుగుతుంటాయి.
రుచికరమైన ఈ కీటకాల కోసం కంపాలా వాసులు వీధి వ్యాపారులపై ఆధారపడుతుంటారు.
ఆ వెండర్లు గ్రాస్‌హాపర్స్‌ను ట్రాప్ చేసి పట్టుకుంటారు. వాటిని ఆకర్షించడానికి ముందుగా ప్రకాశవంతమైన విద్యుత్ లైట్లను వెలిగిస్తారు. అనంతరం పచ్చగడ్డిని కాల్చుతారు. దాని నుంచి వచ్చే పొగ కారణంగా ఆ కీటకాలకు మత్తు ఆవహిస్తుంది. తరువాత అవి ఎగురుకుంటూ వచ్చి అక్కడ ఉండే ఐరన్‌షీట్ల మీద పడి, చివరకు వాటి కింద పెట్టిన ఖాళీ ఆయిల్ డబ్బాల్లోకి జారిపోతాయి.

ఫొటో సోర్స్, Getty Images
గ్రాస్ హాపర్ల అమ్మకం చాలా బూమింగ్ బిజినెస్‌లాంటిది. ప్రతి సీజన్‌లో వీటిని అమ్మే వ్యాపారులతో కంపాలా వీధులు నిండిపోతాయి. ప్రతి సీజన్‌లో వారు 760,000 ఉగాండియన్ షిల్లింగులు (సుమారు రూ. 15,850) సంపాదిస్తారు.
రెక్కలు, కాళ్లూ తీసిన గ్రాస్ హాపర్లతో నింపిన ఒక ప్లాస్టిక్ కప్‌ను నేను 20,000 ఉగాండియన్ షిల్లింగులకు (సుమారు రూ. 417) కొన్నాను.
ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ప్రయోగం మొదలు పెట్టాను. వాటిని శుభ్రంగా కడిగాను. పొడిగా ఉన్న పెనంలో వేసి స్టౌ మీద పెట్టాను. నూనె వేయకుండా తక్కువ మంటపై వేయించడం ప్రారంభించాను. పెనం మీద మూత పెట్టాను. మాడిపోకుండా ఉండడానికి మధ్యమధ్యలో మూత తీసి వాటిని గరిటెతో అటూఇటూ కదిపాను. దాదాపు 20 నిమిషాల పాటు ఇలా చేశాను.
గంట తరువాత గ్రాస్‌హాపర్ల వేపుడు నుంచి సన్నని శబ్దం రావడం ప్రారంభమయింది. వాటి రంగు ఆకుపచ్చ నుంచి పసుపుపచ్చకు మారుతోంది. వాటిలోని కొవ్వు బయటకు వచ్చింది. అందుకే వాటిని వేపడానికి ప్రత్యేకంగా నూనె వాడాల్సిన అవసరం రాలేదు.
ఇదే సమయంలో వాటి నుంచి బీఫ్ వాసన రావడం ప్రారంభమైంది. కలుపుతున్న ప్రతిసారీ ఆ వాసన మరింత ఘాటుగా మారింది. ప్రతి అయిదు నిమిషాలకు ఒకసారి, అంటే అవి గోల్డెన్ బ్రౌన్ రంగులో మారే వరకు కలుపుతునే ఉన్నా. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కారం పొడి, ఉప్పు వేశాను.
వాటిలోని కొవ్వు పూర్తిగా బయటకు వచ్చి పూర్తిగా మాడిపోయే వరకు వాటిని వేపుతునే ఉన్నా. అనంతరం అవి కరకరలాడేలా కనిపించాయి. పెనం మీద అటూ ఇటూ తిప్పుతున్నప్పుడే ఆ సౌండ్లు వినిపించాయి. మరో 30 నిమిషాల తరువాత అవి చాలా క్రంచీగా మారాయి. ఇక తినేయడమే తరువాయి.
గ్రాస్‌హాపర్ల గొప్పతనం ఏమిటంటే వాటిని ఇతర ఆహారాలతో కలిపి తినొచ్చు. కోడి రెక్కల కూర, ఫ్రెంచ్ ఫ్రైస్ మాదిరిగా మిగతావాటితో పాటు వీటినీ తినొచ్చు.
నాలుగు రోజుల పాటు చేసిన ప్రయోగాల్లో నేను వాటిని కర్ర పెండలం, బంగాళదుంపలు, అన్నం, ఉడకబెట్టిన అలసందలతో కలిపి తిన్నాను.
ఒక కప్పు గ్రాస్‌హాపర్స్ ధర బీఫ్‌తో పోల్చితే కాస్త ఎక్కువే. కేజీ గ్రాస్‌హాపర్ల ధర 13,000 ఉగాండా షిల్లింగులు (సుమారు రూ. 271) ఉంటుంది. అయితే ఒకే ఒక్క కప్పు గ్రాస్‌హాపర్లను మూడుసార్లు భోజనంలో ఉపయోగించుకోవచ్చు.
రెండో రోజున నేను బంగాళదుంపలతో కలిపి గ్రాస్ హాపర్లను తీసుకున్నాను. సాధారణంగా బంగాళదుంపలను మాంసం, ఉడకబెట్టిన చిక్కుళ్లతో కలిపి తింటారు. వెరైటీగా నేను గ్రాస్‌హాపర్స్ పాటు తిన్నాను.
మూడునాలుగు రోజుల్లో గ్రాస్‌హాపర్లు అన్నం, ఉడికబెట్టిన అలసందలకు తోడయ్యాయి.
నావరకయితే గ్రాస్‌హాపర్లు పాప్‌కార్న్‌లాంటివి. ఎందుకంటే పాప్‌కార్న్ తినకూడదని నేను ఎప్పుడూ అనుకోను. ఎంత తిన్నా బోర్ కొట్టదు.
బీఫ్ తరచూ తింటుంటే అది రుచీపచిలేనిదిగా అనిపిస్తుందన్నది నా వ్యక్తిగత అనుభం. అదే గ్రాస్‌హాపర్స్ అయితే వరుసగా నాలుగు రోజుల పాటు తిన్నా నా ఆకలి తీరినట్టు అనిపించదు.
అయితే దీంట్లో సవాళ్లు లేకపోలేదు. కరకరలాడే గ్రాస్‌హాపర్స్‌ను వారం రోజుల పాటు తింటే మూడో రోజు నుంచే నమలలేక దడవలు నొప్పిపెడుతాయి. వాటిలోని ఉప్పదనం కారణంగా విపరీతంగా దాహమేస్తుంది.
గ్రాస్‌హాపర్ల వేపుడుకు నేను అనుకున్నదానికన్నా ఎక్కువ సమయమే పట్టింది. అప్పడు అనిపించింది వీటిని తయారు చేయడానికి నా సిస్టర్స్ ఎంత శ్రమ పడేవారో అని.
అయితే వాటిని వేపడం పెద్ద క్లిష్టమైన ప్రక్రియ ఏమీ కాదు. ఉత్సుకత కలిగించే టాస్క్ కూడా కాదు. సాధారణంగా వంటలు చేయడానికి ముందు నేను పుస్తకాలు చూస్తుంటాను.దీనికి అలాంటి అవసరమేమీ లేదు. వేపుడులో నేను కేవలం ఉల్లిపాయ ముక్కలు, కారం పొడే వాడుతా. ఇంకెలాంటి ఇతర దినుసులూ అవసరం లేదు. ఎందుకంటే గ్రాస్‌హాపర్లే స్వభావ సిద్ధంగా రుచికరమైనవి.

ఫొటో సోర్స్, Getty Images
సుస్థిర ప్రొటీన్లు
గ్రాస్‌హాపర్లను అధిక ప్రొటీన్లు ఉన్న సుస్థిర స్నాక్ ఐటంగా గుర్తిస్తుంటారు. టాంజానియాలోని సోకైన్ యూనివర్సిటీలో కీటక శాస్త్ర పరిశోధకుడు లియోనార్డ్ ఆల్ఫోన్స్ అభిప్రాయం ప్రకారం తూర్పు ఆఫ్రికాలో పౌష్టికాహారం, ఆహార భద్రత, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. సుస్థిర ఆహార వనరుగా వీటిని ఏడాది పొడవునా పెంచవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
"తినడానికి అనువుగా ఉండే గ్రాస్‌హాపర్లకు ఉగాండాలో చాలా విలువ ఉంది. వాటి అమ్మకం ఒక ఆదాయ వనరుగా ఉంటోంది. తగిన మాస్ రేరింగ్ ప్రొటోకాల్స్ ప్రకారం అభిలషణీయ స్థాయిలో పెంచి ఏడాది పొడవునా సరఫరా చేయగలిగితే తూర్పు ఆఫ్రికాలో న్యూట్రిషన్, ఆహార భద్రత, జీవనోపాధి మెరుగవుతాయి " అని ఆల్ఫోన్స్ వివరించారు.
న్యూట్రిషనల్ విలువల విషయానికి వస్తే పొడవు కొమ్ముల గ్రాస్‌హాపర్స్ (ఉగాండాలో వీటిని ఎన్ సెన్సెనే అని అంటారు)లో 34-45% ప్రొటీన్లు, 42-45% కొవ్వులు, 4-6% పీచుపదార్థాలు ఉంటాయి. కీటకాల్లో సాధారణంగా విటమిన్లు, అమినో ఆసిడ్లు పుష్కలంగా ఉంటాయి.
వీట వల్ల సుస్థిర ప్రయోజనాలు ఉన్నాయి. సంప్రదాయ వ్యవసాయంతో పోల్చితే కీటకాల పెంపకానికి తక్కువ భూమి, ఇంధనం, నీరు అవసరమవుతుంది. ముఖ్యంగా కర్బన ఉద్గారాలు చాలా తక్కువగా ఉంటాయి.
యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఎడింబరోలో గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ విభాగంలో సీనియర్ రీసెర్చర్‌గా పనిచేస్తున్న పీటర్ అలెగ్జాండర్ అంచనాల ప్రకారం నా ప్రధాన ప్రోటీన్ వనరుగా బీఫ్ బదులు గ్రాస్‌హాపర్స్‌ను మార్చుకుంటే నా ఆహారంలోని కర్బన ఉద్గారాలను ఒక దశాంశంమేర తగ్గించుకోగలుగుతాను. " మనం తినడానికి వేటిని ఎంచుకుంటున్నామో వాటిపైనే ఉద్గారాలు ఆధారపడి ఉంటాయి " ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రపంచ వ్యాప్తంగా వినియోగిస్తున్న మాంసాన్ని సగానికి తగ్గించి వాటి బదులు మీల్‌వార్మ్స్, కీచురాళ్లు (క్రికెట్స్) ను తీసుకుంటే వ్యవసాయ భూమి అవసరాన్ని మూడో వంతు మేర తగ్గించవచ్చు.
అంటే 1,680 మిలియన్ హెక్టార్లను వ్యవసాయం నుంచి మళ్లించవచ్చు. ఇది బ్రిటన్ వైశాల్యానికి 70 రెట్లు అధికం.
ఎడిన్‌బరా విశ్వవిద్యాలయానికి చెందిన అలెగ్జాండర్, ఇతర పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయింది.
మనం ఒక జంతువుకు ఎంత ఆహారం పెడుతున్నాం, ఇది తిరిగి ఆహారం రూపంలో తిరిగి ఎంత ఇస్తోంది అన్నలెక్కను ఫుడ్ కన్జర్వేషన్ రేట్ అంటారు.
ఒక నిర్ణీత మొత్తంలోని ప్రొటీన్ ను అందించడానికి కీచురాళ్లు పశువుల కన్నా ఆరు రెట్లు తక్కువగా మేతను తీసుకుంటాయి. గొర్రెలకన్నా నాలుగు రెట్లు తక్కువ, పందులు, కోళ్లకన్నా రెండు రెట్లు తక్కువ మేత అవసరమవుతుంది.
ఇతర పశుగణాలతో పోల్చినప్పుడు కీటకాల పెంపకం ద్వారా విడుదలయ్యే గ్రీన్ హౌస్ గ్యాస్‌లు చాలా తక్కువ. ఎందుకంటే పశువులు, దాణా రవాణా చేయడం ద్వారానే 18% వరకు ఉద్గారాలు ఉంటున్నాయి. ఉదాహరణకు కీచురాళ్లు ఆవులకన్నా 80% తక్కువగా మీథేన్‌ను విడుదల చేస్తాయి. అమ్మోనియాను పందులకన్నా 8-2 రెట్లు తక్కువగా ఉత్పత్తి చేస్తాయి. నెదర్‌ల్యాండ్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ వాజెంజెన్ కు చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయింది.
భూతాపానికి కారణమయ్యే ప్రబలమైన వాయువుల్లో మీథేన్‌ను ప్రధానమైనదిగా గుర్తిస్తారు. 20 ఏళ్ల వ్యవధిలో CO2 కన్నా 84 రెట్లు అధికంగా గ్లోబల్ వార్మింగ్‌పై ప్రభావం చూపుతుంది.
అమ్మోనియా కాలుష్యాల కారణంగా నేల క్షార గుణాన్ని సంతరించుకుంటుంది. భూగర్భ జలాలు కలుషితమవుతాయి. జీవావరణ వ్యవస్థ దెబ్బతింటుంది.
వృక్షాలు, జంతువుల ద్వారా వచ్చే ఆర్గానిక్ వ్యర్థాలను కీటకాలు తింటాయి. ఈ వ్యర్థాలు కుళ్లడం ద్వారా విడుదలయ్యే ఉద్గారాలను ఆ మేరకు తగ్గించగలుగుతాయి. అంతేకాకుండా ప్రతి కేజీ ఆహారం కారణంగా వచ్చే ఉద్గారాలను మొత్తమ్మీద తగ్గిస్తాయి.
యూఎస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బనా-ఛాంపెయిన్‌లో వ్యవసాయం, ఆహార సరఫరాపై వాతావరణ మార్పుల ప్రభావం అనే అంశంపై పరిశోధనలు చేస్తున్న అతుల్ జైన్ మాట్లాడుతూ " ప్రొటీన్లు అధికంగా ఉండే కీటకాల కారణంగా వచ్చే ఉద్గారాల తీవ్రత.. ఇతర జంతు ఆధారిత ఆహారం కన్నా ఎన్నో రెట్లు తక్కువగా ఉంటుందని నేను ఒప్పుకొంటాను. అయితే బీఫ్, ఇతర ఆహార పదార్థాల మాదిరిగా కీటకాలు ఓ పరిశ్రమ స్థాయిలో ఉత్పత్తి కావడం లేదు. అందువల్ల వృక్ష ఆధారిత, జంతు ఆధారిత ..ఎలాంటి ఆహారం కానీయండి..వాటి ద్వారా విడుదలయ్యే గ్రీన్ హౌస్ గ్యాస్‌లను పోల్చి చూడడం సరికాదని అనుకుంటున్నా" అని చెప్పారు
మరి, ఇన్ని ప్రయోజనాలు ఉన్నందున ఆ కీటకాలను విస్తృతంగా పెంచడానికి అవకాశం ఉందా?
దీనిపై ఎంటోసెన్స్ అనే అమెరికా కంపెనీ ప్రెసిడెంట్ బిల్ బ్రాడ్‌బెంట్ సమాధానం ఇచ్చారు. అమెరికన్ల రోజువారీ ఆహారంలో ఈ ఖాద్య కీటకాలు ఉండేలా చూసేందుకు మిషన్ తరహాలో పనిచేస్తుండడం గమనార్హం.
"జంతువులతో పోల్చితే కీటకాలను పెంచడం చాలా సులువు. మీ ఇంటి బేస్‌మెంట్‌లోనే ఇన్‌సెక్ట్ ఫార్మ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంట్లోనూ పెట్టుకోవచ్చు. కొద్ది రోజుల్లోనే మీ దగ్గర మిలియన్ల కొద్దీ కీటకాలు ఉంటాయి " అని ఆయన చెప్పారు.
మాంసానికి బదులు కీటకాలను తీసుకోవడమన్నది ఎప్పటికీ జరగకపోవచ్చు. కానీ అది ప్రముఖమైన ప్రత్యామ్నాయ ప్రోటీన్ వనరుగా మాత్రం ఉండనుంది. ఎందుకంటే ప్రపంచంలో జనాభా నింతరం పెరుగుతుండడంతో ఆహార కొరతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పుడు ఇవే ఆధారమవుతాయి అని బ్రాడ్‌బెంట్ అభిప్రాయపడ్డారు.
ఉదాహరణకు ఒక కేజీ మంచి క్వాలిటీ ఉన్న జంతు ప్రొటీన్ తయారు కావాలంటే వాటికి ఆరు కిలోల వృక్ష సంబంధ ప్రొటీన్‌ను మేపాల్సి ఉంటుంది.
ఎరువులు, పశువుల దాణా ధరలు పెరగడం ద్వారా వ్యవసాయ వ్యయాలు అధికమవుతాయన్న అంచనాలు ఉన్నాయి. అందువల్ల 2050 నాటికి బీఫ్, పోర్క్, పౌల్ట్రీల ధరలు 30% మేర పెరిగే అవకాశం ఉంది. వాతావరణంలో మార్పులు, వ్యవసాయ ఉత్పాదకత తగ్గిపోనుండడం వంటి కారణాలతో వాటి ధరలు అదనంగా 18-21% మేర పెరగనున్నాయి. ఆహారం ధరలు పెరగనుండడంతో ప్రత్యామ్నాయ ప్రోటీన్ వనరుల కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఏర్పడింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆహారంగా కీటకాలకు పెరుగుతున్న డిమాండ్
ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆసియా దేశాల్లో సుమారు 2,000 రకాల కీటకాలను తింటుంటారు. థాయిలాండ్‌లో అయితే కీటకాల పెంపకం ఓ పరిశ్రమగా అభివృద్ధి చెందుతోంది. 20,000 ఫారాలు ఉన్నాయి. ఏటా 7,500 టన్నుల కీటకాలను ఉత్పత్తి చేస్తోంది.
అయితే యూరోప్, యూఎస్‌ల్లో కీటకాలను తినడానికి చాలా మంది ఇంకా వెనుకాడుతున్నారు. అద్భుతమైన రుచి, పర్యావరణ, పోషఖ ప్రయోజనాలు ఉన్నప్పటికీ వాటిపైపు చూడడం లేదు. వారి ఆహారంలో కార్బన్ ఫుట్ ప్రింట్‌ను తగ్గించడానికి ఉన్న అవకాశాలను కోల్పోతున్నారు.
నేను 2019-2021 మధ్య యూకేలో ఉన్నప్పుడు ఎడిబుల్ గ్రాస్‌హాపర్స్ సంపాదించడానికి ఎంత కష్టపడ్డానో. 2021 డిసెంబరులో ఉగాండాలోని నా మిత్రులు గ్రాస్‌హాపర్ సీజన్ రాక సందర్భంగా జరుపుకొన్న సంబరాల ఫొటోలను నా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నోరూరించే ఆ వంటకాల ఫొటోలను చూశాక గ్రాస్‌హాపర్స్‌పై నా ఇష్టం మరింత పెరిగింది.
ఈ ఉగాండియన్ వంటకం రచులు నన్ను తూర్పు, పశ్చిమ లండన్, లీడ్స్ వరకు తీసుకెళ్లాయి. అయితే ఎక్కడా ఎలాంటి గ్రాస్‌హాపర్ కూడా దొరకలేదు.
అయితే యూకేలో కీటకాలు తినాలని భావించే వారు ముందుగా కీచురాళ్లు, మీల్ వార్మ్‌లతో మొదలు పెట్టాల్సి ఉంటుందని యూకేలోని ఆక్స్‌ఫర్డ్ బ్రూక్స్ యూనివర్సిటీకి చెందిన కన్జ్యూమర్ సైకాలజీ, మార్కెటింగ్ విభాగాల రీసెర్చర్ ఇంద్రొనీల్ ఛటర్జీ సూచించారు. ఎందుకంటే గ్రాస్‌హాపర్స్‌కన్నా అవే రెడీగా దొరుకుతాయి.
‘‘సప్లయ్ చైన్‌లో ఇబ్బందులు ఉన్నాయేమో.. గ్రాస్‌హాపర్స్ లభ్యత తక్కువగా ఉంది. వాటిని ప్రస్తుతం యూకేలో పెద్దయెత్తున పెంచడం లేదు. అందువల్ల వాటిని కొనుగోలు చేయడం కష్టంగా ఉంది’’ అని ఛటర్జీ వివరించారు.
మరోవైపుచాలా దేశాల్లో అడవుల్లాంటి వాతావరణం సృష్టించి వైల్డ్ హార్వెస్టింగ్ పేరుతో విసృతంగా కీటకాలను పెంచుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే వాతావరణంలోని మార్పులు, తెగుళ్లు, పురుగుమందుల కారణంగా వాటి ఉనికికి ముప్పు ఏర్పడింది. ఇలాంటి సందర్భంలో వాటిని ఆహారంగా వినియోగించుకుంటూ పోతే ఒత్తిడి పెరగనుంది.
తినదగ్గ కీటకాల పెంపకం అన్న రంగంలో స్పెషలైజ్ చేస్తూ యూరోప్, యూఎస్‌ల్లో చాలా కంపెనీలు ఏర్పాటవుతున్నాయి.
యూకే విషయానికి వస్తే వేల్స్‌లోని సెయింట్ డేవిడ్స్‌లో మొట్టమొదటిసారిగా బగ్ ఫారం పేరుతో ప్రప్రథమ ఎడిబుల్ ఇన్సెక్ట్ ఫారం ఏర్పాటయింది. ఇక్కడ చాలా రకాల ఇన్‌సెక్ట్ స్నాక్స్‌ను అమ్ముతుంటారు.
కీచురాళ్లతో చేసిన చాక్లెట్ కుకీలు, స్పైస్డ్ ఆరెంజ్, లివర్ బ్రెడ్ బఫెలో ఇన్సెక్ట్ బిస్కట్లు అమ్ముతుంటారు. కీచురాళ్ల పొడి, ఇంట్లో వండుకోవడానికి వీలుగా పచ్చి క్రికెట్లను కూడా విక్రయిస్తారు.
ఈ స్నాక్స్‌ను చిన్న పిల్లలు తినేలా ప్రోత్సహిస్తే వీటికి మరింత ఆదరణ పెరుగుతుందని బగ్ ఫారం నమ్ముతోంది.
‘‘ప్రత్యేకంగా చూస్తే పిల్లలు చాలా ఓపెన్‌మైండ్‌తో ఉంటారు. దీర్ఘకాలంలో వారి దృక్పథంలో మార్పు తీసుకు రావాలంటే వారితో కలిసి పనిచేయాల్సి ఉంటుందని మేం నమ్ముతున్నాం. ఎందుకంటే భవిష్యత్తు షాపర్లు వారే" అని బగ్ ఫారంలో పనిచేస్తున్న ఎలినార్ ఫిలిప్ చెప్పారు.
బగ్ పారం కొత్త రకాల వంటకాలను అభివృద్ధి చేసింది. ఇన్‌సెక్ట్, ప్లాంట్ ప్రోటీన్లను కలిపి వెక్సో అనే తినుబండారాన్ని తయారు చేసింది.
దీన్ని రుచి చూపించడానికి 2019లో పైలట్ ప్రాజెక్టు కింద వేల్స్‌లోని 200 మంది బడి పిల్లలకు బెలొనెసే సాస్‌తో కలిపి అందజేసింది. రుచి చూడడానికి ముందు వెక్సోను స్కూల్ లంచ్‌లోకి తీసుకెళ్తామని 27% మంది విద్యార్థులు చెప్పారు. తిన్న తరువాత మాత్రం దాన్ని ఎంచుకుంటామని 57% మంది తెలిపారు. " మేం నమ్ముతున్నాం..ఎడిబుల్ ఇన్సెక్ట్ , వెక్సోలను తినడాన్ని యువత నేర్చుకొని, వాటిని తమ కుటుంబాల కోసం కొనడం ప్రారంభిస్తే రానున్న రోజుల్లో వారు తప్పకుండా ఒకటి చెబుతారు: 'ఓ యా, ఇన్‌సెక్ట్స్: జస్ట్ అవి మరో రకం ఆహారం' అని అంటారు " అని ఫిలిప్ చెప్పారు.
బగ్స్‌ను తినడానికి మొహమాట పడే వారికి మరో మార్గం ఉందని బగ్ పారం చెబుతోంది. వాటిని బాగా వేపి పొడి చేసి దానిని ఇతర పదార్థాలతో కలిపి తీసుకోవడం ద్వారా అలాంటి వారిని ఆకట్టుకోవచ్చు.
ఎడిబుల్ ఇన్సెక్ట్ గురించి తన బ్లాగ్ బగిబుల్ ద్వారా ప్రాచుర్యం కలిగిస్తున్న అలే మూర్ ప్రతి రోజూ ఉదయం కీటక పొడిని ఉపయోగిస్తుంటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకొనే ప్రొటీన్ షేక్‌లో క్రికెట్ పౌడర్‌ను కలుపుతుంటానని ఆమె చెప్పారు.
" బయో ఎవైలబిలిటీ, ఇతర న్యూట్రియెంట్లు, నిల్వ చేయడం, పొడిదనంలాంటి లక్షణాల దృష్ట్యా ఈ పొడి రూపమే మంచింది " అని ఆమె చెప్పారు. "అయితే ఎక్కువ మొత్తంలో తీసుకోవాలని మాత్రం నేను సిఫార్సు చేయను" అని అన్నారు.
యూఎస్‌లో ఇన్సెక్ట్ పార్మ్స్ నిర్మాణం, నిర్వహణ వ్యవహారాలను చూసే చౌపాల్ ఫార్మ్స్ అనే కంపెనీలో మూర్ చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. 2012లో మెక్సికో పర్యటనకు వెళ్లినప్పుడు ఆమె తొలిసారిగా గ్రాస్‌హాపర్స్‌ను రుచి చూశారు.
"అవంటే చాలా ఉత్సుకత కలిగింది. వాటిని తినాలని అనుకున్నా. చాలా రుచికరమైనవని అనిపించాయి. నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. నేనిప్పడు పూర్తి సమయం బగ్స్‌తోనే గడుపుతున్నా" అని వివరించారు.
యూరోప్, యూఎస్‌లలో కీటకాలను ఆహారంగా స్వీకరించడం క్రమేణా పెరుగుతుందని ఆమె ఆశాభావంతో ఉన్నారు. "చాలా పెద్దయెత్తున పరిశోధన కొనసాగుతోంది. ఇన్సెక్ట్ ఇండస్ట్రీ శీఘ్రమైన ప్రగతిని చూస్తోంది" అని ఆమె చెప్పారు.
ఆలోచనలు మారడం ప్రారంభమయింది. ఖాద్య కీటకాలకు డిమాండ్ పెరుగుతోంది. 2027 నాటికి ఎడిబుల్ ఇన్సెక్ట్ ల మార్కెట్ 4.63 బిలియన్ డాలర్లు (3.36 బిలియన్ పౌండ్లు)కు చేరే అవకాశం ఉంది.
ఎడిబుల్ ఇన్సెక్ట్ అమ్మకం ఇప్పుడు కేవలం కొన్ని ప్రత్యేకమైన స్టోర్స్‌కే పరిమితం కాలేదు. యూరోపియన్ సూపర్ మార్కెట్ చెయిన్ అయిన కేరేఫోర్, సెయిన్స్‌బరీల్లో వీటి నిల్వలు కనిపిస్తున్నాయి.
యూఎస్‌లోని ఫాస్ట్ ఫుడ్ చెయిన్ వేబ్యాక్ బర్గర్స్‌లోని మెనూలో క్రికెట్ మిల్క్ షేక్ ఒక ఐటంగా ఉంటోంది.

ఫొటో సోర్స్, Ton Koene/Alamy
మీకు ఇప్పుడిప్పుడే ఎడిబుల్ ఇన్సెక్ట్ లను కొనాలన్న ఆలోచన లేనప్పటికీ, మీరు ఇప్పటికే వాటిని తింటున్నట్టే. అనుకోకుండా మీ ఆహారంలో అవి చేరాయి. మనం తీసుకునే తాజా పళ్లు, కూరగాయల్లో అవి చేరి ఉండొచ్చు. లేదంటూ పాస్తా, కేక్‌లు, బ్రెడ్‌లో పొరపాటున కలిసిపోయి ఉండొచ్చు.
ఏ పదార్థాన్నయినా అసలు తినకూడదని నిర్ణయించడానికి ముందు దాంట్లో ఎంతవరకు కీటక మలినాలు ఉండడాన్ని అనుమతించవచ్చు అన్నదానిపై యూఎస్‌కు చెందిన ద ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) సహనశక్తి స్థాయిలను సూచించింది.
ఉదాహరణకు 100 గ్రాముల చాక్లెట్ బార్‌లో 60 ఇన్‌సెక్ట్ ఫ్రాగ్మెంట్స్ ఉండొచ్చు. (మొత్తం కీటకం కాదు..దాంట్లోని కొన్ని భాగాలు) అంతకుమించితే ఎఫ్‌డీఏ నియంత్రణ చర్యలు తీసుకుంటుంది.
ప్రతి 50 గ్రాముల గోధుమ పిండిలో 75 వరకు ఇన్‌సెక్ట్ ఫ్రాగ్మెంట్స్ ఉండడాన్ని భరించవచ్చు. 225 గ్రాములలో 225 వరకు, మాక్రోని, నూడిల్స్‌లో 225 వరకు కీటక భాగాలు ఉండొచ్చు.
"ఇవన్నీ పంట కోతల సమయంలోనే అందులో ప్రవేశిస్తాయి. అందువల్ల అందులోని ప్రతి కీటక భాగాన్నీ తీయాలని అనుకోవడం వృథా శ్రమ" అని ఫిలిప్ చెప్పారు.
మరో ముఖ్యమైన విషయానికి వస్తే.. కొన్ని రకాల అంజీరా చెట్లు పరాగ సంపర్కం కోసం ఫగ్ వాస్ప్‌లుగా పిలిచే కొన్ని ప్రత్యేక తరహా కందిరీగలపై ఆధారపడుతాయి. అవి వాటి కాయలో ప్రవేశించి అందులో గుడ్లు పెట్టి అక్కడే చనిపోతాయి. ఆ అంజీర చెట్లు ఉత్పత్తి చేసే ఎంజైమ్ ఫిసిన్ కారణంగా వాటి శరీర భాగాలు వెంటనే అందులో జీర్ణమయిపోతాయి. చివరకు ఆ వాస్ప్ గుర్తేలేవీ అందులో ఏమాత్రం కనిపించవు.
అలాంటప్పుడు ఈ అంజీరా పళ్లను తినవచ్చా అన్నది వీగన్‌లలో చర్చకు దారి తీసింది.
అయితే, అంజీరా పండులో కరకరలాడేలా ఉండే ఆ స్వభావం వాస్ప్‌ల శరీరం వల్ల వచ్చింది కాదు. వాటి విత్తనాల వల్ల కలిగినది.
ఆధునిక సూపర్ మార్కెట్లలో చాలా చోట్ల ప్రస్తుతం వాస్ప్‌ల సాయంతో పరాగ సంపర్కానికి నోచుకోని అంజీరాలనే అమ్మతున్నారు.
తెలియకుండా తినే వ్యవహారాన్ని పక్కన పెడితే కీటకాలు తినడం విషయమై విస్తృతంగా వ్యాపించిన అసహ్యతను తొలగించాల్సిన అవసరం ఉందని చాలా మంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పర్యావరణంపై తక్కువ ప్రభావం చూపుతూ ప్రతి ఒక్కరికి మరింత బలవర్థక ఆహారం అందించాలన్న ద్వంద్వ లక్ష్యాలపై ప్రపంచం ఆశలు పెట్టుకుంటే ఆ దురభిప్రాయాన్ని మార్చుకావాల్సి ఉంటుంది.
ఈలోగా నేను మాత్రం నా ఫేవరేట్ స్నాక్‌ను ఎంజాయ్ చేయడానికి రానున్న గ్రాస్ హాపర్ సీజన్ కోసం ఎదురు చూస్తూ ఉంటా.
ఇవి కూడా చదవండి:
- మీర్ సుల్తాన్ ఖాన్: ఒక భారతీయ సేవకుడు బ్రిటన్ సామ్రాజ్య చెస్ ఛాంపియన్ ఎలా అయ్యాడు?
- మనీషా రూపేటా: పాకిస్తాన్లో డీఎస్పీ అయిన తొలి హిందూ మహిళ
- ఎలాన్ మస్క్: అఫైర్ వివాదంలో టెస్లా అధినేత
- పాకిస్తాన్ ఆదాయంలో 40 శాతం వడ్డీలకే... ఈ దేశం మరో శ్రీలంక అవుతుందా?
- మంకీపాక్స్: 'జననేంద్రియాలపై కురుపులు... దుస్తులు ధరిస్తే తట్టుకోలేనంత మంట'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



















