స్పెయిన్: పాడుబడిన వెండి గనిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రిస్టల్ నిధి... శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరిచిన జియోడ్

పల్పీలోని జియోడ్‌లో మిలా కరాటెరో

స్పెయిన్‌లోని అల్మీరా ప్రావిన్సు పల్పీలో ఒక పాడుబడిన వెండి గని ఉంది. ఆ గనిలో ఒక నిధి ఉంది. విలువైన లోహాలతో తయారైన నిధి కాదు అది. ప్రపంచంలోనే అతిపెద్దదైన జియోడ్ (రాతి డొల్ల) ఇక్కడ దాగి ఉంది. సహజమైన క్రిస్టల్స్ (స్పటికాలు)తో ఏర్పడిన ఈ జియోడ్ శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరిచింది.

మిలా కరాటెరో ఒక జియాలజిస్ట్, పల్పీ జియోడ్ సమన్వయకర్త కూడా. జియోడ్ అంటే ఒక రాతి లోపల ఏర్పడిన డొల్ల అని ఆమె వివరించారు. ఈ రాతి డొల్ల మొత్తం క్రిస్టల్స్‌తో ఆవరించి ఉంటుందని ఆమె చెప్పారు.

గుహ లోపలికి వెళ్లిన ఆమె భారీ క్రిస్టల్స్ ఉన్న ప్రదేశంలో కూర్చున్నారు. జియోడ్ గురించి పూర్తిగా అర్థం అయ్యేలా చెప్పేందుకు అక్కడే ఉన్న ఒక చిన్న రాయిని తీసుకొని దాన్ని రెండు ముక్కలుగా చేశారు. ఆ రాయి కూడా డొల్లలాగా ఉండి దాని లోపల కూడా చిన్న చిన్న స్పటికాలు కనిపించాయి.

''నా వెనుకాల ఉన్నదీ, నా చేతిలో ఉన్నదీ ఒక్కటే. కాకపోతే ఇది చిన్న పరిమాణంలో ఉంది. నా వెనుక పెద్ద ఆకారంలో ఉన్నాయి'' అని ఆమె వివరించారు.

పల్పీ జియోడ్ 8 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల ఎత్తు, 2 మీటర్ల లోతు ఉంది. ''జియోడ్‌ల విషయానికొస్తే నిర్వచనం పరంగా ఇప్పటివరకు కనుగొన్న వాటిలో ఇదే పెద్దది'' అని మిలా చెప్పారు.

క్రిస్టల్

అయితే, మెక్సికోలోని నైకా గుహలో కూడా ఇలాంటి క్రిస్టల్ అద్భుతమే ఉంది. నైకాలోని స్పటికమృత్తికలు 15 మీటర్ల పొడవు ఉంటాయి. పల్పీ గని స్పటికాలు 2 మీటర్లే ఉంటాయి. కానీ, నైకా గుహ అంతా జియోడ్‌లకు బదులుగా స్పటికాలతో కప్పి ఉంటుందని ఆమె వివరించారు.

స్పెయిన్‌లోని ఈ జియోడ్‌ను మినా రికా గనులను తవ్వే వ్యక్తులు (మైనర్లు) గుర్తించారు. మినా రికా అనేది ఒక వెండి గని. 1873 నుంచి 1969 వరకు ఈ గని ఉనికిలో ఉంది. ఆ తర్వాత 1999లో భూగర్భ శాస్త్రవేత్తలు మళ్లీ దీన్ని గుర్తించి ప్రపంచం దృష్టిలోకి తెచ్చారు.

''గనుల్లో పనిచేసేవారు ఈ రాళ్లను పేల్చినప్పుడు ఒక జియోడ్‌ను గుర్తించారు. జియోడ్‌లో క్రిస్టల్స్‌ను చూసి వారు నిరాశ చెందారు. ఎందుకంటే క్రిస్టల్స్‌ను తొలిగించడానికి అదనంగా శ్రమించాల్సి ఉంటుంది. పైగా వాటి బరువు కూడా ఎక్కువ. వాటి వల్ల ఎలాంటి లాభం లేదు అని వారు అనుకున్నారు'' అని ఆమె చెప్పారు.

శాస్త్రవేత్తలు ఇప్పటికీ దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు నీటి లోపల ఉండేదని వారు నమ్ముతున్నారు. ఒక సమయంలో సంభవించిన అగ్నిపర్వత కార్యకలాపాల వల్ల అవక్షేప శిలలు విచ్ఛిన్నం చెంది వాటిలో వేడి ద్రవాలు నిండిపోయాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ద్రవాలు చల్లబడి క్రిస్టల్స్‌గా మారడం ప్రారంభించాయని వారు అంటున్నారు.

క్రిస్టల్

పల్పీలోని అన్‌హైడ్రేట్ (రాళ్లను ఏర్పరిచిన మినరల్) అనేది సుమారు 250 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్ల కాలం నాటిదని జియాలజిస్టులు కనుగొన్నారు.

అయితే, జిప్సం క్రిస్టల్స్ వయస్సుపై వారు అనిశ్చితిలో ఉన్నారు. వాటిలో అతి తక్కువ మలినాలు ఉండటంతో వాటి వయస్సును కనుక్కోవడంలో వారు ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఈ క్రిస్టల్స్, 20 లక్షల సంవత్సరాల కిందటే పెరగడం ప్రారంభించాయని వారు అంచనా వేస్తున్నారు.

''స్పటికం ఎంత నెమ్మదిగా పెరిగితే... దాని పరిమాణం అంత పెద్దదిగా ఉంటుంది, అది అంత పరిపూర్ణంగా ఉంటుంది'' అని కరాటెరో చెప్పారు.

2019లో ప్రజల సందర్శన కోసం ఈ గనిని తెరిచారు. దీనికంటే ముందు అందులోని శిథిలాలను తొలిగించి, కొన్ని భద్రతాపరమైన చర్యలు తీసుకున్నారు. అత్యవసర సమయంలో బయటకు వెళ్లేందుకు 42 మీటర్ల మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేశారు.

క్రిస్టల్

ఈ గనిని ప్రజల సందర్శన కోసం సిద్ధం చేస్తున్నప్పుడు అంతకుముందు ఇక్కడ పని చేసిన వారి చెప్పులు, జాకెట్లు, బీర్ బాటిళ్లు, సిగరెట్లు.. గోడలపై రోజూవారీ పని నివేదికలు కనిపించాయి.

ఇప్పటివరకు లక్ష మందికి పైగా ఈ జియోడ్‌ను సందర్శించారు. అక్కడి క్రిస్టల్స్‌ భద్రత కోసం కరాటెరో బృందం జాగ్రత్తగా గనిలోని ఉష్ణోగ్రత, కార్బన్ డయాక్సైడ్, తేమ శాతాలను పర్యవేక్షిస్తుంది.

''మానవుల వల్ల వచ్చే కార్బన్ డయాక్సైడ్ కంటే కూడా తేమ కారణంగానే క్రిస్టల్స్‌కు హాని కలుగుతుంది. ఎందుకంటే, క్రిస్టల్స్‌పై తేమ ఒక పొరలాగా పేరుకుపోతే అవి వాటి పారదర్శకతను కోల్పోతాయి'' అని ఆమె వివరించారు.

అయితే పల్పీలోని క్రిస్టల్స్‌కు ఉండే పారదర్శక గుణాన్ని చూసి సందర్శకులు, శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు.

''వీటిని చూసినప్పుడు నాకేం అనిపించిందో మాటల్లో చెప్పలేదు. ఇవి వర్ణనాతీతం. ఎందుకంటే, వీటి దగ్గరకు రాగానే మనమెంత చిన్నవాళ్లమో మనకు అర్థమవుతుంది. ప్రకృతి మనకోసం ఏం తయారు చేసిందో చూడండి'' అంటూ కరాటెరో ఆశ్చర్యపోయారు.

వీడియో క్యాప్షన్, విదేశాలను తలదన్నే ఎన్నో టూరిస్ట్ స్పాట్‌లు విశాఖ జిల్లాలో.. చూశారా మీరు..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)