‘ఇస్లాం పవిత్ర నగరం’ మక్కాలో ప్రవేశించి వీడియో తీసిన ముస్లిమేతర జర్నలిస్ట్.. ఈయన ఎవరు? ఎందుకు వెళ్లారు?

ఫొటో సోర్స్, CHANNEL 13 NEWS
సౌదీ అరేబియాలో హజ్ యాత్రకు ప్రసిద్ధి చెందిన మక్కాలోకి ముస్లిమేతర వ్యక్తి ప్రవేశించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మక్కాలోకి ప్రవేశించిన వ్యక్తి ఇజ్రాయెల్‌కు చెందిన జర్నలిస్ట్ కావడం విశేషం.
మక్కాను ముస్లింలు అత్యంత పవిత్ర ప్రదేశంగా భావిస్తారు. ముస్లిమేతరులు ఇక్కడికి రావడం నిషేధం. అందుకే ఇజ్రాయెల్ జర్నలిస్ట్, మక్కాలోకి ప్రవేశించడం కేవలం సౌదీ అరేబియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపింది.
మక్కాలోకి ప్రవేశించడానికి ఆయనకు సహాయపడిన వ్యక్తి, సౌదీ అరేబియా పౌరుడు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
అసలు ఏం జరిగింది?
ఇజ్రాయెల్‌లోని 'చానెల్ 13'కి చెందిన టీవీ జర్నలిస్ట్ గిల్ తమ్రి, ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో ఆయన మక్కాలోకి వెళ్లినట్లు కనిపిస్తుంది.
ఆయన మక్కాకు వెళ్లడమే కాకుండా అక్కడ పవిత్ర ప్రదేశంగా పరిగణించే మౌంట్ అరాఫత్ పర్వతాన్ని కూడా ఎక్కారు. హజ్ యాత్ర సందర్భంగా యాత్రికులు, అరాఫత్ దగ్గరకు వెళ్తారు.
గిల్ తమ్రి యాత్రకు సౌదీ అధికారుల అనుమతి లేదు. అయినప్పటికీ, ఆయన అక్కడికి వెళ్లారు. పైగా ఆయన ఇజ్రాయెల్‌కు తిరిగి వెళ్లిన తర్వాత 'చానెల్ 13' దీనికి సంబంధించిన వార్తను కూడా ప్రసారం చేసింది.
యాత్ర తర్వాత గిల్ క్షమాపణ చెప్పారు. ''మత సహనాన్ని పెంపొందించడానికి మక్కా, ఇస్లాం సౌందర్యాన్ని ప్రపంచానికి చూపించాలి అనుకున్నాను'' అని ఆయన చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుతం ఎలాంటి దౌత్యపరమైన సంబంధాలు లేవు. అయితే, గత కొన్నేళ్లుగా బంధాలను ఏర్పరచుకునేందుకు ఇరు దేశాల మధ్య ప్రయత్నాలు జరుగుతున్నాయి.
గతవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, సౌదీ అరేబియాకు వెళ్లారు. ఆయన పర్యటన కోసం చాలామంది ఇజ్రాయెల్ జర్నలిస్టులు విదేశీ పాస్‌పోర్టులతో సౌదీ అరేబియాలో ప్రవేశించారు.
జర్నలిస్ట్ గిల్ తామ్రీకి తాను ఏమి చేస్తున్నాననే దానిపై స్పష్టత ఉంది. వీడియో తీస్తూ మక్కా ప్రాముఖ్యాన్ని ఆయన స్పష్టంగా వివరించారు. ఇక్కడికి వచ్చిన తొలి ఇజ్రాయెల్ జర్నలిస్టును తానేనని, ఇలా వీడియో చేసిన వ్యక్తిని కూడా తానేనని ఆయన చెప్పారు.
సౌదీ ప్రెస్ ఏజెన్సీ ప్రకారం, అరెస్టు అయిన వ్యక్తి, గిల్ తామ్రీకి రోడ్డు మార్గంలో మక్కా చేరుకోవడానికి సహాయం చేశారు. ఇలా చేయడం అంటే అక్కడి చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమే.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఇజ్రాయెల్ జర్నలిస్టును ఆ ఏజెన్సీ అమెరికన్ పౌరుడిగా పేర్కొంది. ఈ అంశం గురించి మక్కా పోలీసు ప్రతినిధి మాట్లాడుతూ... ''సౌదీ అరేబియాకు వచ్చేవారు ఇక్కడి చట్టాలను కచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా రెండు పవిత్ర మసీదుల్లో, ఇతర పవిత్ర స్థలాల విషయంలో నిబంధనలు అనుసరించాలి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం'' అని అన్నారు.
మక్కాలోకి ప్రవేశించిన జర్నలిస్ట్ గిల్ తమ్రిపై చట్టపరమైన చర్యలను మొదలు పెట్టారు.

ఫొటో సోర్స్, CHANNEL 13 NEWS
వీడియోలో ఏముంది?
బీబీసీ ఉర్దూ ప్రకారం, గిల్ తమ్రి తన కారులో ప్రయాణించడం వీడియోలో కనిపిస్తుంది. వారితో పాటు ఒక స్థానిక గైడ్ కూడా ఉన్నారు. ఆయన ముఖానికి మాస్క్ ఉన్న కారణంగా ఆ వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపించలేదు.
భద్రతా తనిఖీల అనంతరం సౌదీ అరేబియా పోలీసులు తమను మక్కాకు అనుమతించారని ఆయన వీడియోలో చెప్పారు.
వీడియాలో ఆయన ఇంకా మాట్లాడుతూ... ''సౌదీ అరేబియా చట్టాల ప్రకారం, ముస్లిమేతరులు ఇక్కడికి రావడం నిషేధం. నేను ఇక్కడికి రావడం అసాధ్యం. కానీ, నేనొక మంచి వ్యక్తిని కలిశాను. ఆయన ప్రాణాలను పణంగా పెట్టి నన్ను మక్కాకు తీసుకెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ పోలీసులు నన్ను ఆపితే, నా స్నేహితులను కలిసేందుకు వెళ్తున్నానని వారికి చెబుతా. మక్కా వైపు వెళ్తోన్న ఈ రోడ్ల పక్కన 'ముస్లిమేతరులకు ప్రవేశం లేదు' అనే బిల్‌బోర్డులను మీరు చూడొచ్చు'' అని ఆయన అన్నారు.
ఇంతలో చెక్ పోస్ట్ రావడంతో ఆయన తన కెమెరాను కింద దాచిపెట్టారు.
మౌంట్ అరాఫత్ చేరుకున్న తర్వాత ఇది చట్టవ్యతిరేకం అని గైడ్ ఆయనతో అన్నారు. మాట్లాడేటప్పుడు ఆయన ఇబ్బందిగా భావించారు.
అయినప్పటికీ గిల్, కెమెరా వైపు చూస్తూ... ''కేవలం ముస్లింలు మాత్రమే ఇక్కడికి రాగలరు. ఇప్పటివరకు ఇజ్రాయెల్ జర్నలిస్టులు ఎవరూ ఇక్కడ నుంచి ప్రసారం చేయలేదు. మేం మౌంట్ అరాఫత్ చేరుకున్నాం. పర్వతం పైకి వెళ్తుండగా కిందకు వెళ్లిపోమని గైడ్ నన్ను హెచ్చరించారు. 'వీరిద్దరు ముస్లింలేనా' అని అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారని ఆయన నాతో చెన్నారు. వెంటనే మేం కారు దగ్గరికి వెళ్లిపోయాం. ఆ నగరం నుంచి బయటకు వచ్చాం'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
సోషల్ మీడియాలో విమర్శలు
చానెల్ 13లో గిల్ తమ్రి వీడియో ప్రసారం అయిన వెంటనే, ప్రపంచవ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది.
దీనికి సంబంధించి 'ఎ జ్యూ ఇన్ మక్కా గ్రాండ్ మసీద్' అనే హ్యాష్ ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండ్ అయింది.
సామాజిక మాధ్యమాల్లో కూడా దీనిపై ప్రజలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
''నా ప్రియమైన ఇజ్రాయెల్ మిత్రులారా... మీ జర్నలిస్టుల్లో ఒకరు, ఇస్లాం పవిత్ర నగరంలోకి ప్రవేశించారు. సిగ్గు లేకుండా అక్కడి వీడియో తీశారు. ఇస్లాంను చానెల్ 13 అవమానించింది'' అని సౌదీ అరేబియాకు చెందిన ఒక సామాజిక కార్యకర్త, సోషల్ మీడియాలో రాశారు.

ఫొటో సోర్స్, ANTOINE GYORI/CORBIS VIA GETTY IMAGES
ఇజ్రాయెల్ ఏమంటోంది?
వీడియో విడుదల అయ్యాక, గిల్ తమ్రితో పాటు చానెల్ 13.. ప్రపంచం నలుమూలల నుంచి విపరీతంగా విమర్శలు ఎదుర్కొంది. ఈ విషయం ఇజ్రాయెల్ ప్రభుత్వం వరకు వెళ్లింది.
దీనిపై ఇజ్రాయెల్ ప్రాంతీయ సహకార మంత్రి ఇసావి ఫ్రెజ్ స్పందించారు. ''దీనికి నేను క్షమాపణ కోరుతున్నా. ఇది ఒక పిచ్చి నిర్ణయం. రేటింగ్ కోసం అలాంటి వార్తలు ప్రసారం చేయడం ప్రమాదకరమైన, బాధ్యత లేని చర్య'' అని ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
ఒకవైపు అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య సంబంధాలు మెరుగయ్యే సంకేతాలు కనబడుతున్నాయి. మరోవైపు చానెల్ 13, గిల్ తమ్రి చర్యల కారణంగా ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి.
ఇవి కూడా చదవండి:
- ‘ముస్లింలు మైనారిటీలుగా ఉన్న దేశాలకు వెళ్లి పిల్లల్ని కనండి’ అని పాకిస్తాన్ మంత్రి ఎందుకు అన్నారు?
- పైడి జైరాజ్: తెలుగు నేల నుంచి తొలి పాన్ ఇండియా స్టార్
- 'నా మీసాలు నా ఇష్టం' అంటూ మీసం మెలేస్తున్న మహిళ
- న్యూడ్ ఫొటోషూట్‌లో పాల్గొన్న హీరో, ‘‘దుస్తులు వేసుకుని మళ్లీ రా’’ అంటూ యూజర్ల ట్రోలింగ్
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణజింక: గోదావరి వరదల్లో చిక్కుకున్న వీటిని ఆదుకునేది ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














