ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణజింక: గోదావరి వరదల్లో చిక్కుకున్న వీటిని ఆదుకునేది ఎవరు?

కృష్ణ జింక

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

గోదావరి వరదలు జనజీవనానికే కాదు, జంతుజాలానికి కూడా కష్టం తెచ్చాయి. అతి భారీ వరదలు రావడంతో ఈ ఏడాది గోదావరి తీరం తల్లడిల్లిపోయింది. అక్కడి కృష్ణజింకలు కూడా కకావికలమయ్యాయి.

అధికారిక జంతువుగా ఉన్నప్పటికీ కృష్ణజింకలను కాపాడలేక పోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలోనూ2020లో ఇలాగే వరదలు వచ్చినప్పుడు ఇలాగే జింకలు కొట్టుకుని పోయాయి.

గోదావరి లంకల్లో కనిపించే ఈ కృష్ణ జింకల విషయంలో అటవీశాఖ వన్యప్రాణి విభాగం సమగ్ర చర్యలు చేపట్టాలని జంతుప్రేమికులు కోరుతున్నారు. ప్రస్తుతానికి గోదావరి శాంతిస్తున్నప్పటికీ ఆగస్టులో మరోసారి భారీ వరదలకు అవకాశం ఉన్నందున వేగంగా స్పందించాలని ఆశిస్తున్నారు.

కృష్ణ జింకను పట్టుకున్న కుక్కలు

ఫొటో సోర్స్, Vikaspatil

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

లంకల్లో కృష్ణ జింకలు ఎందుకుంటాయి?

కృష్ణజింకలకు అనేక ప్రత్యేకతలున్నాయి. అవి సహజంగా విశాలమైన పచ్చిక మైదానాలలో జీవిస్తుంటాయి. గుంపులుగా సంచరిస్తూ ఉంంటాయి. వివిధ రకాల గడ్డిని ఆహారంగా తీసుకుంటాయి. కొన్ని రకాల పండ్లు కూడా తీసుకుంటాయి.

గోదావరి పయనంలో సహజంగా వందల లంకలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా భద్రాచలం దాటి తర్వాత గోదావరి స్వరూపం మారుతుంది. అందులోనూ ప్రస్తుతం పోలవరం నిర్మాణానికి దిగువన విశాలంగా ప్రవాహం సాగుతుంది. ఆ క్రమంలో నది మధ్యలో అనేక లంకలు ఏర్పడ్డాయి. కాలక్రమంలో కొన్ని లంకలు విస్తరిస్తుండగా, మరికొన్ని ప్రవాహ తాకిడి సహా వివిధ కారణాలతో కనుమరుగైన నేపథ్యం కూడా ఉంది.

ఆ గోదావరి లంకల్లో కొన్నింటిని స్థానికులు వినియోగంలోకి తెచ్చుకున్నారు. వివిధ రకాల పంటలు పండించడం, కొన్ని లంకల్లో నివాసాలు కూడా ఏర్పాటు చేసుకుని అక్కడే జీవించడానికి అలవాటుపడ్డారు. ఇక ఎవరూ ఉపయోగించని లంకలు కూడా ఉండడంతో అందులో పచ్చిక బయళ్లు మధ్య కృష్ణ జింకలు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి.

ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన ఉన్న లంకల్లో అనేక చోట్ల ఈ కృష్ణజింకల సందడి ఏడాది పొడవునా స్థానికులకు కనిపిస్తూ ఉంటుంది. రెండు, మూడు నెలల పాటు ఉధృతంగా కనిపించే నదీ ప్రవాహ వేళలు తప్ప మిగిలిన సమయమంతా వాటి నివాసానికి అనువుగా ఉండడంతో కృష్ణ జింకలు పెద్ద సంఖ్యలోనే సంచరిస్తూ ఉంటాయని స్థానికులు చెబుతుంటారు.

కృష్ణ జింక

ఫొటో సోర్స్, Facebook/Vemparala Venkata Subrahmanyam

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఎలా వచ్చాయి?

గోదావరి లంకల్లోకి కృష్ణ జింకలు ఎలా వచ్చాయనే అంశంపై భిన్నమైన అభిప్రాయాలున్నాయి. అందులో ఒకటి ఎగువ నుంచి వరదల సమయంలో కొట్టుకువచ్చి లంకల్లో చేరడంతో అనువుగా ఉన్న ప్రాంతం కాబట్టి అక్కడే కొనసాగుతున్నాయన్నది ఓ వాదన అంటూ అమలాపురానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్.రమేశ్ బీబీసీకి తెలిపారు.

కృష్ణజింకల గుంపు అందరినీ ఆకట్టుకుంటుంది. చెంగుచెంగున దూకుతూ అవి పరుగులు పెడుతుంటే చాలామంది ఆస్వాదిస్తారు. గోదావరి లంక వాసులకు అలాంటి దృశ్యాలు చాలా సందర్భాల్లో కనిపిస్తాయి.

సాధారణంగా కృష్ణ జింకల్లో మగ జాతికి శరీర పైభాగం నలుపు లేదా ముదురు గోధుమ రంగులో కనిపిస్తుంది. ఆడ కృష్ణ జింకలు మాత్రం లేత గోధుమ రంగులో ఉంటాయి. వీటికి కొమ్ములుండవు.

ఇతర జంతువుల మాదిరిగా దట్టమైన అడవుల్లో ఇవి ఎక్కువగా కనిపించవు. అభయారణ్యాలు, చిత్తడి అడవులు ఈ కృష్ణ జింకలకు అనువుగా ఉంటాయి. లంక భూములను అవి ఆశ్రయించడానికి ఇదో కారణం. నేపాల్, పాకిస్తాన్ దేశాల్లోనూ ఇవి కనిపిస్తాయి. ఏపీలోని గోదావరి లంకలో ఎక్కువగా చూడవచ్చు. కృష్ణానది లంకలతో పాటుగా కర్నూలు సహా వివిధ ప్రాంతాల్లోని మైదాన అరణ్యాలలో అక్కడక్కడా కృష్ణ జింకల సంతతి ఉంది.

ఈ కృష్ణజింకలను ఇండియన్ కంగారూస్ అని కూడా కొందరు అని కూడ అంటుంటారు. స్థానికంగా నల్లజింకలు అని పిలుస్తుంటారు.

రాష్ట్ర విభజన తర్వాత కృష్ణజింకను అధికారిక జంతువుగా నిర్ధారణ చేస్తూ 2018లో ఉత్తర్వులు వెలువడ్డాయి. వివిధ అధికారిక చిహ్నాలను ఖరారు చేసిన సమయంలోనే కృష్ణజింకకు ఈ హోదా ఇచ్చారు. అధికార హోదా ఉన్న జంతువు పరిరక్షణ విషయంలో ప్రభుత్వం తగిన శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవనే విమర్శలున్నాయి.

ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ వన్యప్రాణి విభాగం తాజాగా కృష్ణజింకల సంఖ్య నిర్ధరణ కోసం ఓ సర్వే ప్రారంభించింది. ధవళేశ్వరం బ్యారేజ్‌కు ఎగువన ఉన్న లంకలతో పాటుగా దిగువన వివిధ నదీ పాయల మధ్యలోని లంకల్లో వాటిని గుర్తించిన అధికారులు గత వారమే సర్వే ప్రారంభించారు.

ఇటీవల గోదావరి వరదల సందర్భంగా పెద్ద సంఖ్యలో కృష్ణజింకలు ఇబ్బందులకు గురి కావడంతో అటవీశాఖలో కదలికవచ్చినట్టు కనిపిస్తోంది. వాటిలో ఒక జింక పొట్టిలంక వద్ద కుక్కల దాడిలో చనిపోవడం విమర్శలు వచ్చాయి. వరద నీటి ప్రవాహం కారణంగా కడియపులంక సమీపంలో మరో రెండు జింకలు చనిపోవడం కలకలం రేపింది. కొందరు స్థానికులు వాటిని రక్షించే ప్రయత్నం చేసినా ప్రాణాలు కాపాడలేకపోయారు.

దేశవ్యాప్తంగా రాజస్థాన్, హరియాణ, కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో 25వేల వరకూ కృష్ణజింకలు ఉంటాయని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. ఏపీలో ఈ సర్వే తర్వాత వాటి సంఖ్య మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.

కృష్ణ జింకలు

ఫొటో సోర్స్, Facebook/Vemparala Venkata Subrahmanyam

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

మేలు చేసిన లంకలే ముప్పు తెస్తున్నాయి..

గోదావరిలో సహజసిద్ధంగా ఏర్పడిన లంకలు కృష్ణజింకలకు అన్ని రకాలుగా అనువుగా మారాయి. లంకల్లో చెట్ల కింద ఉండే ఇసుక తిన్నెల్లో జింకల సంతానోత్పత్తికి అనువైన వాతావరణం వుంది. అక్కడ లభించే పశుగ్రాసం వాటికి మంచి ఆహారం. తిరిగేందుకు ఈ ప్రాంతం విశాలంగా అనువుగా ఉంటుంది.

కానీ, గోదావరికి ఏటా వరదలు సీజన్‌లో లంకలు మునిగిపోయే ముప్పు ఉంటుంది. అందులోనూ ఈ ఏడాది జులైలోనే భారీ వరద ప్రవాహం రావడంతో దాదాపుగా లంకలన్నింటా వరద నీరు చేరింది. పల్లపు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. దాంతో ఆ లంకలనే నివాసాలుగా మార్చుకున్న కృష్ణజింకలకు గతంలో ఎన్నడూ లేని పెద్ద కష్టం వచ్చింది.

ఈ వరదల సమయంలో పలు చోట్ల లంకల నుంచి సురక్షిత ప్రాంతాలకు చేరేందుకు ప్రయత్నిస్తూ కృష్ణజింకలు జనం కంటపడ్డాయి. కొన్ని జింకలు నేరుగా రోడ్డు మీదకు వచ్చేసిన సమయంలో కుక్కలు వాటిపై దాడి చేయడం మూలంగా ఓ జింక ప్రాణం కోల్పోయిందని డీఎఫ్ఓ సెల్వం తెలిపారు. మరో రెండు జింకలను పరిరక్షించి, అటవీశాఖ ఆధ్వర్యంలోకి తీసుకున్నామని ఆయన బీబీసీకి తెలిపారు.

అరుదైన జంతువుని కాపాడలేమా?

కృష్ణజింకల సంఖ్య వేగంగా తగ్గిపోతూ అరుదైన జాతుల్లో ఒకటిగా మారిపోతోందని వనరక్ష మిత్ర అవార్డు గ్రహీత చిలుకూరి శ్రీనివాసరావు బీబీసీతో అంటున్నారు.

'వన్య ప్రాణుల సంరక్షణ సమితికి పట్టడం లేదు. ఈ ఏడాది వరద గరిష్ట స్థాయి వరదల మూలంగా వందల సంఖ్యలో జింకలు దయనీయ స్థితిలో జల సమాధి అవుతున్నాయి. వరద నీటిలో అవి విగతజీవులుగా మారుతున్న దృశ్యం కన్నీళ్లు పెట్టిస్తోంది’’ అని శ్రీనివాసరావు అన్నారు.

ప్రాణరక్షణ కోసం ఊళ్ల మీదకొచ్చిన కొన్ని జింకలకు రక్షణ కరువయ్యిందని, రోడ్లమీద భారీ వాహనాల కిందపడి కూడా ప్రమాదాలకు బలైపోతున్నాయని ఆయన వెల్లడించారు.

‘‘వన్య ప్రాణుల సంరక్షణ సమితి గోదారి తీరాన అక్కడక్కడా హోర్డింగులు పెట్టి చేతులు దులుపుకుంది తప్ప సంరక్షణా చర్యలు పెద్దగా కనిపించడంలేదు. అసలు గోదావరి లంకల్లో ఎన్ని జింకలున్నాయనే గణాంకాలు కూడా యంత్రాంగం దగ్గర లేకపోవడం నిజంగా నిర్లక్ష్యమే. వరదలే కాకుండా వీటికి వేటగాళ్ల బెడదా ఉంది’’ అంటూ ఆయన వివరించారు శ్రీనివాస రావు. కృష్ణజింకల పరిరక్షణ విషయంలో అలసత్వం వీడాలని ఆయన అధికార యంత్రాంగాన్ని కోరారు.

కృష్ణజింకను తరుముతున్న కుక్క

ఫొటో సోర్స్, Pitam Chattopadhay

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

చట్ట ప్రకారం కఠిన శిక్షలు

వన్య ప్రాణుల సంరక్షణ కోసం రూపొందించిన చట్టాలన్నీ కృష్ణజింకలకు వర్తిస్తాయి. 1972 వన్య ప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం ఎవరైనా వన్యప్రాణులను వేటాడినా, హింసించినా, ఆపద తలపెట్టినా నేరం అవుతుంది. దీని ప్రకారం ఆరేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా పడుతుంది. సమస్త జీవులను సంరక్షించే 'జీవవైవిధ్య చట్టం కూడా'2002 నుంచి అమల్లోకి ఉంది.

‘‘చట్టాలున్నప్పటికీ వాటిని అమలు చేయకపోవడమే పెద్ద సమస్య. అధికార జంతువుకే ఇంత పెద్ద అవస్థ బాధాకరం. వాటి ఉనికిని సంరక్షించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. గోదావరి లంకల్లో ఇంకా జింకలు ఎన్ని మిగిలి ఉన్నాయనేది డ్రోన్‌ ద్వారా సర్వే నిర్వహించాలి’’ అని జంతు ప్రేమికుడు కనుమూరి విశ్వనాథ రాజు కోరుతున్నారు.

జింకలు మసిలే చోట చుట్టుపక్కల ఉన్న ఇసుకతో ఎత్తు మేటలు వేస్తే ఆపద సమయంలో జింకలు ఈ సంరక్షణ కేంద్రాల్లో ప్రాణాలు నిలుపుకుంటాయని ఆయన సూచించారు.

‘‘జింకల నివాస ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలి. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వాటిని నిరంతరం పర్యవేక్షించాలి. లంకల్లో జింకల వేటగాళ్లపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని ఆయన కోరారు.

వరదల్లో చిక్కుకున్న కృష్ణ జింకలు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, గోదావరి వరదల్లో చిక్కుకున్న కృష్ణ జింకలు

కృష్ణ జింకల పరిరక్షణ ప్రయత్నాలు జరుగుతున్నాయని అటవీశాఖ అధికారి సెల్వం బీబీసీకి తెలిపారు. వరదల సమయంలో కృష్ణ జింకల గురించి సమాచారం అందగానే స్పందించామని ఆయన తెలిపారు.

‘‘ వరదల సమయంలో ప్రమాదంలో ఉన్న రెండు జింకలను మేం రక్షించాం. మరో రెండు జింకలు చనిపోతే వాటిని మా సిబ్బంది పూడ్చారు. జింకలను బంధించడం సాధ్యం కాదు. అవి ఒడ్డుకి చేరినప్పుడు కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. మా సంరక్షణలో ఉన్న వాటిని కూడా మళ్లీ లంకల్లోకి పంపిస్తాం. గొర్రెలు, మేకలు ఓ చోట ఉంటాయి. వాటిని కాపాడేందుకు అవకాశం ఉంది కాబట్టి సహాయక బృందాలకు అవకాశం వచ్చింది. జింకలు అలా సాధ్యం కాదు’’ అంటూ ఆయన వివరించారు.

‘‘వన్యప్రాణులకు ఎవరు ఆపద తలపెట్టినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. కఠిన చర్యలు తప్పవు. వరదల్లో రక్షించిన రెండు జింకలను, వరదలు తగ్గగగానే మళ్లీ వాటి ప్రాంతాల్లో వదిలేస్తాం. సర్వే తర్వాత వాటిని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతాం’’ అన్నారాయన.

వీడియో క్యాప్షన్, వీర్‌మహాన్.. భారత్‌ నుంచి WWE పోటీల్లోకి ప్రవేశించిన తాజా సంచలనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)