Maharashtra: 10 తులాల బంగారం పోయింది.. ఎలుకల సాయంతో ఎలా పట్టుకున్నారంటే

ఎలుకలు

ఫొటో సోర్స్, SANJAY KANOJIA

    • రచయిత, షాహిద్ షేక్
    • హోదా, బీబీసీ కోసం

పోయిన వస్తువులను వెతికిపెట్టడంలో పోలీసులకు శునకాలు సాయం చేయడం మీకు తెలిసే ఉంటుంది. కానీ, ఇక్కడ ఎలుకలు పోలీసులకు సాయం చేశాయి.

ఎలుకల వెనుక వెళ్లిన పోలీసులకు పోయిన బంగారు నగలు దొరికాయి.

మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని దిండోశీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆరే కాలనీకి చెందిన సుందరి పలనివేల్ ఇటీవల తమ కుమార్తెకు పెళ్లి చేశారు.

పెళ్లి సమయంలో తీసుకున్న అప్పులను తీర్చడానికి ఆమె తన పది తులాల నగలను తనఖా పెట్టాలని అనుకున్నారు.

నగలను ఒక సంచిలో పెట్టి సుందరి బ్యాంకుకు బయలుదేరారు. అయితే, అదే సమయంలో ఇంట్లో మిగిలిన వడాపావ్‌లను కూడా ఎవరైనా యాచకులకు ఇచ్చేద్దామని ఆమె అనుకున్నారు.

వీడియో క్యాప్షన్, లక్షల రూపాయల బంగారాన్ని పారేసుకుంటే... ఎలుకలు తెచ్చిచ్చాయి

బ్యాంకుకు వెళ్లే దారిలో ఓ యాచకురాలిని సుందరి చూశారు. దీంతో ఆమెకు వడాపావ్‌లు పెట్టిన సంచి ఇచ్చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి సుందరి బ్యాంకుకు వెళ్లిపోయారు.

అయితే, బ్యాంకుకు వెళ్లిన తర్వాత నగలను కూడా ఆ వడాపావ్ పెట్టిన సంచిలోనే పెట్టినట్లు సుందరి గుర్తించారు. వెంటనే ఆమె ఆ యాచకురాలు ఉండే చోటుకు వెళ్లి వెతికారు. కానీ, ఆమె కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

ఈ ఘటనపై దిండోశీ పోలిస్ స్టేషన్‌లో ఆమె కేసు నమోదు చేశారు. పోలీస్ అధికారి సూరజ్ రౌత్ నేతృత్వంలోని పోలీసుల బృందం ఆ యాచకురాలు కనిపించిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించింది. వాటి సాయంతో ఆమెను పట్టుకోగలిగారు. అయితే, వడాపావ్‌లు బాగా ఎండిపోవడంతో వాటిని అక్కడే చెత్తకుప్పపై పడేశానని ఆమె చెప్పారు.

సుందరి పలనివేల్
ఫొటో క్యాప్షన్, సుందరి పలనివేల్

వెంటనే ఆ చెత్తకుప్ప పరిసరాలను పోలీసులు గాలించారు. కానీ, వారికేమీ దొరకలేదు. దీంతో ఆ చెత్తకుప్ప పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు.

ఎలుకలు ఆ సంచిని ఈడ్చుకుంటూ వెళ్లినట్లు వాటిలో కనిపించింది.

దీంతో అక్కడే ఉన్న ఎలుకలను పోలీసులు గమనించారు. వాటి వెనుకే కాలువ వైపు వెళ్లడంతో అక్కడే వడాపావ్‌ల సంచి కనిపించింది. ఆ సంచిలో బంగారు నగలు అలానే ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, డ్రగ్స్, బాంబులను పోలీస్ డాగ్స్ ఎలా గుర్తిస్తాయి? వాటికి ఎలాంటి శిక్షణ ఇస్తారో చూడండి..

ఆ నగలను తీసుకొచ్చి సుందరికి పోలీసులు అప్పగించారు. ఆ నగల విలువ సుమారు రూ. 5 లక్షల ఉంటుందని సబ్-ఇన్‌స్పెక్టర్ చంద్రకాంత్ ఘార్గే చెప్పారు.

‘‘ఆ నగలు దొరక్కపోయుంటే.. నేను బతికుండేదాన్ని కాదు. పోలీసులు చాలా కష్టపడి వాటిని వెతికిపెట్టారు. వారికి ధన్యవాదాలు చెప్పాలి’’అని సుందరి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)