అమెరికా: నీళ్లలో మెదడును తినేసే అమీబా... కొళాయి నీరు వాడొద్దంటూ అధికారుల వార్నింగ్

కొళాయి నీరు

అమెరికాలోని టెక్సస్ రాష్ట్రం లేక్ జాక్సన్ ప్రాంత ప్రజలు కొళాయి నీటిని వాడొద్దని అక్కడి అధికారులు కోరారు. మెదడును తినేసే ప్రాణాంతక సూక్ష్మజీవులతో నీరు కలుషితమైందన్న అనుమానాల నేపథ్యంలో ఈ సూచన చేశారు.

సుమారు 27 వేల మంది ప్రజలు నివసించే లేక్ జాన్సన్ ప్రాంతంలో తాము సరఫరా చేస్తున్న నీరు 'నేగ్లెరియా ఫోలరీ' అనే ఒక రకం అమీబాతో కలుషితమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఈ అమీబాతో కలుషితమైన నీరు ముక్కు ద్వారా శరీరంలోకి వెళ్లినప్పుడు అవి ప్రాణాంతకంగా మారుతాయి.

అమెరికాలో ఈ రకం అమీబా సోకడం అరుదే. 2009, 2018 మధ్య కాలంలో ఇలాంటివి 34 కేసులు గుర్తించారు.

టాయిలెట్ ఫ్లష్ చేయడానికి తప్ప దేనికీ వాడొద్దు

టెక్సస్‌లోని ఎనిమిది ప్రాంతాలకు తొలుత ఈ హెచ్చరికలు చేశారు. తాము సరఫరా చేసిన కొళాయి నీటిని టాయిలెట్ ఫ్లష్ చేయడానికి తప్ప ఇంక దేనికీ వాడొద్దని అధికారులు కోరారు. అయితే.. శనివారం సాయంత్రానికి ఈ హెచ్చరికలను కేవలం లేక్ జాక్సన్ ప్రాంతానికే పరిమితం చేశారు. మిగతా ప్రాంతాలవారు ఆ నీటిని వాడుకోవచ్చని చెప్పారు.

లేక్ జాక్సన్‌ ప్రస్తుతం సరఫరా అయిన నీరు అంతా తొలగించేవరకు.. కొత్త నీటి నమూనాలు పరీక్షించి సురక్షితం అని తేల్చేవరకూ ఎవరూ ఆ నీటిని వాడరాదని 'టెక్సస్ కమిషన్ ఆఫ్ ఎన్విరానమెంటల్ క్వాలిటీ' చెప్పింది.

ఇదంతా జరగడానికి ఎంతకాలం పడుతుందని అప్పుడే చెప్పలేమంది.

ఇంతకీ ఏమిటీ నేగ్లెరియా ఫోలరీ

నేగ్లెరియా ఫోలరీ అనేది ఒక రకం అమీబా. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. అమెరికాలోని దక్షిణ రాష్ట్రాల్లో గతంలో ఇది సోకిన కేసులు గుర్తంచినట్లు 'ది సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్'(సీడీసీ) పేర్కొంది.

కలుషిత నీటిని తాగినంత మాత్రాన ఇది సోకదని.. అలాగే ఒకరి నుంచి మరొకరికి ఇది సోకదని సీడీసీ వెల్లడించింది.

ఇది సోకినవారిలో జ్వరం, వికారం, వాంతులు, మెడ పట్టేసినట్లు ఉండడం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది సోకినతరువాత సరైన చికిత్స అందకపోతే వారం రోజుల్లో చనిపోతారని సీడీసీ పేర్కొంది.

ఈ ఏడాది అమెరికాలో ఇంతవరకు ఫ్లోరిడాలో ఒక కేసు నిర్ధరణైంది. అప్పుడు అధికారులు వెంటనే అప్రమత్తమై ప్రజలెవరూ ముక్కు ద్వారా నీరు శరీరంలోకి వెళ్లకుండా చూసుకోవాలని కోరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)