మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్లో ఏముంది.. రైతులకు లాభమా, నష్టమా? ఎవరేమంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
కేంద్రం ప్రభుత్వం దేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి గతేదాడి తొలుత మూడు ఆర్డినెన్సులను, తర్వాత వాటి స్థానంలో బిల్లులను తెచ్చింది. అవి పార్లమెంటు ఆమోదం పొంది చట్టాలయ్యాయి.
2020 సెప్టెంబర్ 15వ తేదీన ఒక బిల్లు, 17వ తేదీన మిగతా రెండు బిల్లులు లోక్‌సభలో ఆమోదం పొందాయి.
వీటిని వ్యతిరేకిస్తూ బీజేపీ మిత్ర పక్షం, ఎన్డీయే కూటమిలోని పార్టీ శిరోమణి అకాలీదళ్ నేత, కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ అప్పుడే తన పదవికి రాజీనామా చేశారు.
అసలు ఏమిటీ మూడు బిల్లులు.. ఈ బిల్లుల్లో ఏముంది? రైతులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు? శిరోమణి అకాలీదళ్, మరికొన్ని ఇతర పార్టీలు కానీ, రైతుల సమస్యలు, హక్కుల కోసం పోరాడే సంస్థలు కానీ చెబుతున్న అభ్యంతరాలేమిటి?

ఫొటో సోర్స్, Getty Images
ఆర్డినెన్సుల నుంచి చట్టాలుగా..
1) నిత్యవసర సరకుల(సవరణ) బిల్లు (ది ఎసెన్షియల్ కమోడిటీస్(అమెండమెంట్) బిల్ 2020)
2) 'రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార(ప్రోత్సాహక, సులభతర) బిల్లు' (ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్(ప్రమోషన్, ఫెసిలిటేషన్) బిల్)
3) 'రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద బిల్లు-2020(ది ఫార్మర్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్ - 2020)
ఈ మూడు బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేశారు. పంజాబ్, హరియాణాలలో ఈ ఆందోళనలు ఎక్కువగా జరిగాయి. ఈ ఆర్డినెన్సులకు వ్యతిరేకంగా 2020 ఆగస్టులోనే పంజాబ్ అసెంబ్లీ తీర్మానం చేసింది.
నిత్యవసర సరకుల(సవరణ) బిల్లు
దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న నిత్యవసర సరకుల చట్టం - 1955కి ఇది కొన్ని సవరణలతో వస్తుంది.
నిత్యవసర సరకుల జాబితాలో ఉన్న వస్తువుల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వాణిజ్యాల నియంత్రణాధికారం కేంద్రానికి దఖలు పరుస్తుందీ చట్టం.
వ్యవసాయరంగంలో పోటీ, రైతుల ఆదాయం పెంచడానికి ఉద్దేశించిన చట్టంగా ఆర్డినెన్సులో పేర్కొన్నారు.
వినియోగదారుల ప్రయోజనాలు రక్షిస్తూనే నిత్యవసరాలపై నియంత్రణ వ్యవస్థను సరళీకరించడం దీని ఉద్దేశమని ఆర్డినెన్సులో ఉంది.
ఆహార ఉత్పత్తులపై నియంత్రణ: కొన్ని రకాల ఆహార పదార్థాలు, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులు వంటివి నిత్యవసరాలుగా పేర్కొనడానికి ఈ చట్టం కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది. అలాంటి నిత్యవసరాల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వాణిజ్యాన్ని నియంత్రించడానికి, నిషేధించడానికి కేంద్రానికి అధికారం ఉంటుంది.
యుద్ధం, దుర్భిక్షం, ధరలు విపరీతంగా పెరిగిపోవడం, ప్రకృతి విపత్తులు వంటి అసాధారణ పరిస్థితులు తలెత్తినప్పుడు తృణధాన్యాలు, పప్పులు, బంగాళాదుంపలు, ఉల్లి, నూనెగింజలు, నూనెలు వంటి ఆహారవస్తువులలో వేటి సరఫరానైనా నియంత్రించే అధికారాన్ని కేంద్రానికి ఇస్తుందీ చట్టం.
నిల్వ: ఏదైనా నిత్యవసర వస్తువును ఒక వ్యక్తి ఎంత పరిమాణంలో నిల్వ చేసుకోవచ్చనే నియంత్రణ విధించే అధికారమూ కేంద్రానికి కల్పిస్తుందీ చట్టం. దీనికి ధరల పెరుగుదలను ప్రాతిపదికగా తీసుకుంటారు. దీనికి అయిదేళ్ల సగటు ధరతో కానీ, లేదంటే ఏడాది కిందట ధరతో కానీ పోల్చి పెరుగుదల స్థాయిని అంచనా వేసి నిర్ణయం తీసుకుంటారు. ఉద్యాన ఉత్పత్తులైతే 100 శాతం ధర పెరిగిన పక్షంలో నిల్వపై నియంత్రణ విధించే అవకాశం ఉంటుంది. పాడవని వ్యవసాయ ఉత్పత్తులకైతే 50 శాతం ధర పెరిగితే నిల్వపై నియంత్రణ విధించే అవకాశం ఉంటుంది.
అయితే, ఆయా వ్యవసాయ వస్తువుల వేల్యూ చైన్ పార్టిసిపెంట్‌లకు ఈ నిల్వ పరిమితి వర్తించదు.
అంటే పంట పండించేవారి నుంచి ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, గోదాం, రవాణా, పంపిణీదారు వరకు ఎవరికీ వర్తించదు.
ఈ నియంత్రణలు, నిల్వ పరిమితులు ప్రజాపంపిణీ వ్యవస్థకు వర్తించవు.
'రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార(ప్రోత్సాహక, సులభతర) బిల్లు'
వ్యవసాయ మార్కెట్లను నియంత్రించే మార్కెట్ కమిటీల ప్రాదేశిక సరిహద్దులతో సంబంధం లేకుండా దేశంలో వేర్వేరు రాష్ట్రాల మధ్య, రాష్ట్రాల్లో జిల్లాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి ఇది అవకాశం కల్పిస్తుంది.
మార్కెట్ కమిటీల సరిహద్దులు దాటి విక్రయించే వ్యవసాయ ఉత్పత్తులపై రాష్ట్రాలు కానీ, స్థానిక ప్రభుత్వాలు కానీ ఎలాంటి పన్నులు వేయడానికి, ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదు.
ఎలక్ట్రానిక్ ట్రేడింగ్: నిర్దేశిత వాణిజ్య ప్రాంతంలో రాష్ట్రాల వ్యవసాయ మార్కెట్ కమిటీల నియంత్రణలోకి వచ్చే ఉత్పత్తుల ఎలక్ట్రానిక్ వర్తకానికి(ఈ-వర్తకం) ఇది అనుమతిస్తుంది.
ఆన్‌లైన్ క్రయవిక్రయాల కోసం ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ వేదికను ఏర్పాటు చేయొచ్చు. పాన్ కార్డు ఉన్న కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, రిజిస్టర్డ్ సొసైటీలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, వ్యవసాయ సహకార సంస్థలు ఏవైనా ఇలాంటి ఆన్‌లైన్ వర్తక వేదికను ఏర్పాటు చేయొచ్చు.
'రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద బిల్లు-2020
కాంట్రాక్ట్ ఫార్మింగ్: ఏ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించయినా పంట వేయడానికి ముందే రైతు, కొనుగోలుదారు ఒప్పందం కుదుర్చుకునే వీలు కల్పిస్తుందీ చట్టం.
ఈ ఒప్పందాలు కనిష్ఠంగా ఒక పంటకాలం నుంచి అయిదేళ్ల వరకు చేసుకోవచ్చు.
వ్యవసాయ ఉత్పత్తుల ధర: ఒప్పందంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరను పేర్కొనాలి. ధర నిర్ణయ ప్రక్రియను ఒప్పందంలో రాయాలి.
మూడంచెల వివాద పరిష్కార విధానం: ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్‌లో తలెత్తే సమస్యల పరిష్కారానికి మూడంచెల వ్యవస్థ సయోధ్య(కన్సిలియేషన్) బోర్డ్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, అప్పీలేట్ అథారిటీ ఉంటుంది.
ఏదైనా వివాదం తలెత్తితే మొదట బోర్డు పరిధిలో సయోధ్యకు ప్రయత్నిస్తారు. అక్కడ పరిష్కారం కాకుంటే 30 రోజుల తరువాత సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌ను సంప్రదించొచ్చు.
సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీలేట్ అథారిటీని సంప్రదించొచ్చు.
అప్పీలేట్ అథారిటీగా ఐఏఎస్ స్థాయి అధికారులు ఉంటారు.
ఏ స్థాయిలోనైనా రైతుకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే రికవరీ కోసం వ్యవసాయ భూమిని తీసుకోవడానికి ఈ చట్టం అంగీకరించదు.
అయితే, ఈ మూడు చట్టాలు రైతుకు మేలు చేసేలా కనిపించినా ఏమాత్రం ప్రయోజనకరం కావని.. వర్తకులు, బహుళ జాతి కంపెనీల గుప్పిట్లో రైతులు చిక్కుకునేలా చేస్తాయని విపక్షలు, రైతుల ప్రయోజనాల కోసం పోరాడే సంస్థలు వాదిస్తున్నాయి. సన్నకారు రైతులను కష్టాల్లోకి నెడతాయని, ఈ చట్టాల వల్ల రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయని కూడా అంటున్నారు.
అదే సమయంలో.. ఇదంతా రాజకీయ వ్యతిరేకతే కానీ రైతుల నుంచి వ్యతిరేకత లేదన్న అభిప్రాయమూ బలంగా వినిపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
విపక్షాలు, రైతు సంఘాల అభ్యంతరాలేమిటి?
ఈ బిల్లులతో వ్యవసాయ రంగంలో భారీ సంస్కరణలు చేపట్టినట్లవుతుందని బీజేపీ చెబుతుండగా విపక్షాలు సహా ఆ పార్టీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ కూడా ఆ వాదనను వ్యతిరేకిస్తున్నాయి.
ఈ బిల్లులు ఆమోదం పొంది చట్టరూపం దాల్చితే చిన్న, సన్నకారు రైతులు చితికిపోతారని పార్టీలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
ఈ క్రమంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకె, బీఎస్పీ సహా కొన్ని పార్టీలు ఈ బిల్లులను వ్యతిరేకించాయి.

ఫొటో సోర్స్, facebook/jayaprakashnarayan
మూడూ రైతులకు మేలు చేసేవే: డా. జయప్రకాశ్ నారాయణ్
రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ఈ వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రయోజనం కలిగించేవేనని ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ జనరల్ సెక్రటరీ, విశ్రాంత ఐఏఎస్ డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ అన్నారు.
బీబీసీతో మాట్లాడిన ఆయన ఈ కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తాయన్నది వివరించారు. ఈ చట్టాలపై రైతుల నుంచి కంటే రాజకీయంగానే వ్యతిరేకత కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
''ఆహార ధాన్యాల సేకరణ ఎక్కువగా ఉన్న పంజాబ్, హరియాణాల్లో రైతులు ఆందోళన చేస్తున్నా వారి వెనుక రాజకీయ పార్టీలు ఉంటున్నాయి. కనీస మద్దతు ధర ఉండదని, ప్రొక్యూర్‌మెంట్ ఆగిపోతుందని చెబుతూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారు కొందరు. కానీ, ఈ మూడు చట్టాల్లో రైతుకు నష్టం చేసేది ఒక్కటి కూడా లేదు. పూర్తి ప్రయోజనం అందించలేకపోయినా గతంతో పోల్చితే ఈ మూడు చట్టాలు రైతులకు ఎంతోకొంత మేలు చేసేవే'' అన్నారాయన.
''1991 నుంచి వచ్చిన ఆర్థిక సంస్కరణలు చూస్తే.. పారిశ్రామిక రంగంలో లైసెన్సులు, పర్మిట్లు ఇవ్వడంలో సంక్లిష్టతలు తొలగిస్తూ అధికారస్వామ్యాన్ని తగ్గించేలా తీసుకొచ్చిన సంస్కరణలు.. వాణిజ్య రంగంలోనూ కొంతమేర సంస్కరణలు వచ్చాయి. కానీ, ఈ దేశంలో 50 శాతం మందికి ఆదాయాన్నిచ్చే వ్యవసాయ రంగానికి సంబంధించి మౌలికమైన మార్పులు తెచ్చే సంస్కరణలు రాలేదు.
చాలామంది ఆర్థికవేత్తలు, వ్యవసాయ రంగంలో విధాన మార్పులు సూచిస్తున్నవారు చెబుతున్నదొక్కటే.. అది ఈ రంగాన్ని సరళీకరించడం. రైతు పంటకు ధర దక్కేలా ఏర్పాట్లు చేయాలన్నది ప్రధానమైన డిమాండ్. ఈ మూడు సంస్కరణలు కొంతవరకు ఆ దిశగా ఉపయోగపడతాయ''న్నారు ఆయన.
''మార్కెట్ యార్డ్ గుత్తాధిపత్యం తగ్గించడం ప్రధానమైనది. ధర ఉంటే మార్కెట్ యార్డులోనే అమ్ముకోవచ్చు.. లేదంటే, ఎక్కడ ధర ఉంటే అక్కడకు తీసుకెళ్లి విక్రయించుకునే వెసులుబాటు వస్తోందిప్పుడు.
నిత్యవసర వస్తువుల చట్టం పేరుతో ఇంతకాలం రైతులకు నష్టం జరిగేది. ధర పెరగ్గానే నియంత్రణ మొదలవుతుంది.. దాంతో రైతులకు గిట్టుబాటు ఉండదు. ధర పెరిగినప్పడు ఇంతగా స్పందించే ప్రభుత్వాలు ధర తగ్గినప్పుడు రైతు గురించి ఆలోచించవు. తమ గొంతు వినిపించగలిగే పట్టణ ప్రాంత వినియోగదారుల కోసమే తప్ప రైతుల కోసం పాత నిత్యవసరాల చట్టం ఎన్నడూ ఉపయోగపడలేదు.
నిజానికి ఆ చట్టాన్ని తొలగించాలి.. అయితే, కనీసం అందులో మార్పులు చేయడంతో రైతుకు ఎంతోకొంత మేలు జరుగుతోంది.
కాంట్రాక్ట్ ఫార్మింగ్ విషయానికొస్తే రైతుకు అన్యాయం జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఈ చట్టం చేశారు. రేటు నిలబడేలా ఇది తోడ్పడుతుంది'' అన్నారు జయప్రకాశ్ నారాయణ్.

ఫొటో సోర్స్, Getty Images
బియ్యం, గోధుమలే కాదు.. అన్ని పంటలకూ ప్రాధాన్యం దక్కాలి
''బియ్యం, గోధుమలను ప్రభుత్వం పెద్ద ఎత్తున సేకరిస్తోంది. కానీ, ఈ రెండూ దేశంలో అవసరానికి మించి ఉన్నాయి.ఏటా 8 కోట్ల టన్నుల ధాన్యం ప్రభుత్వం దగ్గర మూలుగుతోంది.
పప్పులు, వంట నూనెల కొత మన దేశంలో ఉంది. వీటిని ప్రపంచంలో అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నది భారతే.
ఇలాంటి పరిస్థితి పోయి పంటల విషయంలో సమతుల్యతకు ఈ చట్టాలు అవకాశమిస్తాయి.
ప్రభుత్వంలో ఎవరున్నారు.. ప్రధానమంత్రి ఎవరున్నారది ముఖ్యం కాదు.. ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందా.. రైతులకు లాభమా కాదా అన్నది చూడాలి.. రాజకీయాలు చేయడం సరికాదు.
ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ సులభతరం చేయడం వల్ల కూడా రైతులకు మార్కెట్ మెరుగుపడుతుంది''.

ఫొటో సోర్స్, Getty Images
చేయాల్సింది ఇంకా చాలా ఉంది
''ఈ సంస్కరణలతో కూడా పూర్తిగా వ్యవసాయంలో విప్లవమేమీ రాదు.. మౌలికమైన సంస్కరణలు తేవాలి. కనీస మద్దతు ధరను పక్కనపెట్టి.. బియ్యం, గోధుమల సేకరణ కాలక్రమంలో తగ్గించాలి. ప్రత్యామ్నాయంగా పేదలకు డబ్బులు ఇస్తే వారికి కావాల్సింది మార్కెట్లో కొనుక్కుంటారు.
రిటైల్ చెయిన్స్ పెద్ద ఎత్తున రావడం కూడా అవసరమే. ఇప్పుడు రైతుకు వినియోగదారుడికి మధ్య ఆరేడు స్థాయుల్లో దళారీలు ఉంటారు. ప్రస్తుత వ్యవస్థ వల్ల వినియోగదారుడు కొనే ధరలో రైతుకు దక్కేది 25 శాతం కూడా ఉండదు. కొన్ని పంటలకైతే ఈ వ్యత్యాసం ఇంకా ఎక్కువగా ఉంది.
రిటైల్ చెయిన్లు ఎక్కువగా వస్తే వినియోగదారుడు, రైతు మధ్య ఉన్న వ్యవస్థలు తగ్గి రైతుకు అదనపు ధర వస్తుంది.
స్టోరేజి వస్తువుల, ప్రాసెసింగ్ వ్యవస్థ అంతా మెరుగుపడుతుంది. గ్లోబల్ మార్కెట్ రీచ్ కూడా పెరుగుతుంది'' అని జయప్రకాశ్ నారాయణ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
'రైతు అమ్మే పంటకు ధర ఉండదు.. వినియోగదారుడికి చౌకగా దొరకదు'
వ్యవసాయ సంస్కరణల పేరుతో కేంద్రం తీసుకొస్తున్న చట్టాలు రైతులను తీవ్రంగా నష్టపరుస్తాయని, వినియోగదారులపైనా ధరల భారం మోపుతాయని రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు కన్నెగంటి రవి కుమార్ అన్నారు.
'బీబీసీ'తో ఆయన మాట్లాడుతూ ''దేశంలో నూటికి 70 మంది ఇంకా పేదరికంలో ఉన్న ఇలాంటి సమయంలో ఆహార భద్రత కోణంలో ఆహార వస్తువుల ధరలపై నియంత్రణ అవసరం ఉన్న మాట వాస్తవమే. ధరలు పెరగకుండా చూస్తూ ప్రజాపంపిణీ వ్యవస్థలో ఇప్పుడు ఇస్తున్న దినుసులే కాకుండా మరిన్ని అందిస్తూ, మరింత మందికి అందేలా చేయగలిగితే ప్రయోజనం ఉంటుంది. ప్రజాపంపిణీ వ్యవస్థను, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాల్సిన తరుణంలో అందుకు భిన్నంగా మరింత బలహీనపర్చేలా ఈ బిల్లులు తీసుకొస్తున్నారు.
వీటివల్ల రైతులకు జరిగే మేలు ఏమాత్రం ఉండదు. కార్పొరేట్ సంస్థలకే ఇవి మేలు చేస్తాయి'' అన్నారు. దేశంలో ఎక్కడి వ్యవసాయ ఉత్పత్తిని ఎక్కడైనా అమ్ముకోవచ్చని ఈ చట్టం అవకాశం ఇస్తున్నా ఎంత మంది రైతులు ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి విక్రయించగలరని ఆయన ప్రశ్నించారు. కేవలం కార్పొరేట్, బహుళ జాతి కంపెనీలు.. వాటి ఏజెంట్లు రైతుల నుంచి కొనుగోలు చేసి ఆ తరువాత రాష్ట్రాలు దాటిస్తూ వ్యాపారం చేసుకుంటాయని చెబుతూ ఈ బిల్లులు చట్టరూపం దాల్చితే కలిగే పరిణామాలేమిటో వివరించారు.
ఇప్పటికే నూనెగింజలు, నూనెలు, పప్పుధాన్యాలు వంటి ఉత్పత్తులు కార్పొరేట్ల గుత్తాధిపత్యంలో ఉన్నాయని.. ఇకపై దేశంలోని అన్ని వ్యవసాయ ఉత్పత్తులకీ అదే గతి పడుతుందని అన్నారు.
''ఇంతవరకు వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ రాష్ట్రాల పరిధిలో ఉండేది. వరదలు, తుపాన్లు వచ్చినప్పుడు.. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు దిగుబడులు తగ్గి సొంత అవసరాలకే పంట ఉత్పత్తులు చాలని పరిస్థితి ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ఉత్పత్తులు తమ సరిహద్దులు దాటకుండా నియంత్రణ విధించే వెసులుబాటు ఉండేది. కొత్త చట్టాలలో ఆ అవకాశం లేదు. దేశమంతటా ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అలాంటప్పుడు రాష్ట్రాలు తమ సొంత ప్రయోజనాలు కాపాడుకోలేని స్థితికి చేరుకుంటాయి'' అంటూ ఇందులోని లోటుపాట్లను విశ్లేషించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘వన్ నేషన్ వన్ మార్కెట్ వినసొంపైన కుట్ర’
అయితే, ఈ 'వన్ నేషన్ వన్ మార్కెట్' అనేది వినడానికి బాగానే ఉన్నా ఆచరణలో వర్తకులు, కార్పొరేట్లకు తప్ప సాధారణ రైతులకు ఏమాత్రం ప్రయోజనం కలిగించదని చెప్పారు.
నిజంగా రైతులకు లాభం చేకూర్చాలనే ఉద్దేశమే కనుక ఉంటే మార్కెటింగ్ సదుపాయాలు పెంచి, ప్రభుత్వమే అన్ని పంటలను సరైన మద్దతు ధరకు కొనుగోలు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. కొన్ని రాష్ట్రాల్లో కనీస మద్దతు ధరలు లేవని.. కేంద్రం, కొన్ని రాష్ట్రాలు కనీస మద్దతు ధరలు ప్రకటించినా వాటికి చట్టబద్ధత లేదని.. అవి ప్రకటనలకే పరిమితమవుతున్నాయి తప్ప రైతులకు ఆ ధర దక్కడం లేదని చెప్పారు.
కనీస మద్దతు ధర అమలు కాకపోతే దానికి ఎవరు బాధ్యులు, కనీస మద్దతు ధర పొందడానికి రైతు కోర్టును ఆశ్రయించే అవకాశాలు లేవని.. కనీస మద్దతు ధర అనేది కేవలం సలహా ధరగా మాత్రమే ఉంటోందని చెప్పారు.
''కొత్త చట్టాలు అమలులోకి వస్తే వినియోగదారుల మార్కెట్ కంపెనీల నియంత్రణలోకి వెళ్తుంది. రైతులు సంఘటితంగా లేరు.. రైతు సహకార సంఘాలు కూడా బలహీనంగా ఉన్నాయి.. పెట్టుబడి, వసతుల కొరత వంటివి రైతులను, సంఘాలను వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చట్టాలు ఎన్ని అవకాశాలు కల్పించినా వాటిని రైతులు ఉపయోగించుకోలేరు సరికదా వారికి బదులు కంపెనీలు ఉపయోగించుకుంటాయి'' అన్నారు కన్నెగంటి రవి కుమార్.

ఫొటో సోర్స్, Getty Images
కాంట్రాక్ట్ ఫార్మింగ్ వెర్రితలలు
కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఎలా వెర్రితలలు వేస్తుందో.. రైతులను కంపెనీలు ఎలా దోచుకుంటున్నాయో.. ఎలా వారిపై కేసులు పెడుతున్నాయో గుజరాత్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో చూశామని.. భవిష్యత్తులో ఇలాంటివి ఇంకా పెరిగిపోతాయని అన్నారు.
తమకు పేటెంట్ ఉన్న బంగాళ దుంప రకాలను ఇతర రైతులు పండిస్తున్నారంటూ గత ఏడాది పెప్పికో గుజరాత్‌లో రైతులపై కేసులు పెట్టడాన్ని ఆయన ఉదహరించారు.
సంస్థలతో చేసుకునే ఒప్పందాల్లో ఏముందో రైతులందరూ పూర్తిగా అవగాహన చేసుకోలేరని.. ఈ ఒప్పందాలు నేరుగా రైతు, సంస్థ మధ్య జరుగుతాయని.. మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, మార్కెట్ కమిటీలు కానీ ఏమీ ఉండవని.. అలాంటప్పుడు రైతు మోసపోవడానికి అవకాశాలు ఎక్కువని చెప్పారు.
ఇక ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పేరుతో పాన్ కార్డ్ ఉన్న ఎవరైనా ఈ-వర్తకం చేసుకోవచ్చన్నది వినడానికి బాగానే ఉన్నా ఎంత శాతం మంది రైతులకు అలాంటి సాంకేతిక అవగాహన ఉంటుందన్న ప్రశ్న వినిపిస్తుంది. దీనికంటే ఇప్పటికే ఉన్న ఈ-నామ్ వ్యవస్థను మెరుగుపరిచి రైతులకు మేలు కలిగేలా చేయాలని సూచిస్తున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కొత్త చట్టాలు వస్తే వ్యవసాయ ఉత్పత్తులు, రైతులు అంతా కార్పొరేట్ల కబ్జాలోకి వెళ్లిపోతాయని.. ఇది మొత్తంగా ఆహారభద్రతకు ముప్పు తెస్తుందని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ దేశంలో రైతుల సమస్యలు తీర్చడానికి మోదీ కొత్తగా ఏమీ చేయనవసరం లేదని.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేస్తే చాలని అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ నేషనల్ కన్వీనర్ అవిక్ సాహా అన్నారు.
కార్పొరేట్ సంస్థల చేతికి ఆహార వస్తువులు పూర్తిగా చేరితే ప్రజలకు అవి అందుతాయి కానీ ధరలు మాత్రం ఆ కార్పొరేట్ సంస్థలు నిర్ణయించినట్లుగా ఆకాశాన్నంటుతాయని అన్నారు.
రైతుల మేలుకే: బీజేపీ
వ్యవసాయ బిల్లులు మూడూ పూర్తిగా రైతులు, వినియోగదారుల మేలు కోసమేనని బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు.
దేశంలో ఎక్కడైనా తమ ఉత్పత్తులు విక్రయించుకునే అవకాశం ఉండడం రైతులకు ప్రయోజనకరమని.. ఈ-వర్తకం కూడా చేసుకోవచ్చని పాన్ కార్డ్ ఉంటే చాలని చెబుతున్నారు.
కాంగ్రెస్, ఇతర విపక్షాలు ఈ బిల్లులపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, రైతులను తప్పుదారి పట్టిస్తోందని బీజేపీ నాయకులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజీనామా చేసిన హర్‌సిమ్రత్ కౌర్ ఎవరు
శిరోమణి అకాలీదళ్‌కు చెందిన హర్ సిమ్రత్ కౌర్ బాదల్ మోదీ ప్రస్తుత ప్రభుత్వంలో కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తూ రాజీనామా చేశారు. పంజాబ్‌లో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన ఆమె 2009లో పంజాబ్‌లోని భటిండా నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన ఆమె ఆ తరువాత 2014, 2019లోనూ వరుసగా అదే నియోజకవర్గం నుంచి గెలిచారు.
2014లో మోదీ మంత్రివర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2019లో అదే శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఆమె భర్త సుఖ్‌బీర్ సింగ్ బాదల్ శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఫిరోజ్‌పూర్ నుంచి ఆయన లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
సుఖ్‌బీర్ సింగ్ బాదల్ గతంలో పంజాబ్ ఉప ముఖ్యమంత్రిగా, వాజపేయీ ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేయగా ఆయన తండ్రి ప్రకాశ్ సింగ్ బాదల్ నాలుగుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ఇవి కూడా చదవండి:
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
- తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం: మీ భూమి సమస్యకు ఎవరి దగ్గరకు వెళ్లాలి? మీ భూమి మీదేనని అధికారికంగా ఎవరు చెప్తారు?
- రైతన్న రిటైర్మెంట్: వ్యవసాయ విరమణ సన్మానం చేసిన కుమారులు
- కోవిడ్ చికిత్సకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు పని చేస్తుందా? హాస్పిటల్ నిరాకరిస్తే ఏం చేయొచ్చు?
- వ్యవసాయం: కనీస మద్దతు ధరల గురించి యువత తెలుసుకోవాల్సింది ఏంటి?
- వారంలో ఆరు రోజులు సబ్‌రిజిస్ట్రార్.. ఆదివారం వ్యవసాయ కూలీ
- ఒక పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చైనా-అమెరికా-కెనడా సంబంధాలను ఎలా మార్చిందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














