వ్యవసాయానికి సాయం చేస్తున్న మొదటి ప్రభుత్వం మోదీదేనా?

మోదీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రవీణ్ కాసం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

2019 బడ్జెట్‌లో భాగంగా కేంద్రప్రభుత్వం 'ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' పథకాన్ని ప్రకటించింది. అందులో భాగంగా 5ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు సంవత్సరానికి 6వేల రూపాయలు ఇస్తామని తాత్కాలిక ఆర్థిక శాఖ మంత్రి పియూష్ గోయెల్ తెలిపారు.

ఈ పథకం ద్వారా కేంద్రంపై సంవత్సరానికి రూ.75వేల కోట్ల భారం పడనుందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. అయితే ఇలాంటి పథకాన్నే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 'రైతు బంధు' పేరుతో 2018లో ప్రారంభించారు.

కేంద్రప్రభుత్వ పథకంలో, 2హెక్టార్ల లోపు భూమి(5 ఎకరాలు) ఉన్న రైతులు లబ్దిదారులు అవుతారు. ఈ రైతులకు సంవత్సరానికి రూ.6వేల రూపాయలను మూడు విడతల్లో వారివారి ఖాతాల్లో జమ చేస్తారు.

ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 12కోట్ల మంది రైతులు లబ్ది పొందుతారని, ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకం అమలవుతుందని కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తెలిపారు.

ఫిబ్రవరి 1న పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే, రైతుబంధు పథకాన్ని పోలిన పథకాన్ని కేంద్రం కూడా ప్రవేశపెట్టబోతోందని మీడియాలో ఊహాగానాలు వచ్చాయి.

తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేసిన 6నెలల తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి, విజయం సాధించింది. రైతుబంధు పథకాన్ని, తాము సాధించిన విజయంగా కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది.

‘‘తెలంగాణలో రైతుబంధు పథకం పట్ల రైతాంగం హర్షం వ్యక్తం చేసింది. ఈ పథకం రైతుల ఆదాయానికి ఒక భరోసా ఇస్తుందని, వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తోట్పాటును అందిస్తుంది’’ అని కేంద్ర ఆర్థిక మండలి మాజీ సెక్రటరీ అరవింద్ సుబ్రమణియన్ అన్నారు.

ఈ పథకం అన్ని రాష్ట్రాల్లో ఆచరించదగినదని, దేశవ్యాప్తంగా అమలు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు రాసిన వ్యాసంలో ఆయన అభిప్రాయపడ్డారు.

బడ్జెటట్

ఫొటో సోర్స్, Getty Images

ఏమిటీ 'రైతుబంధు పథకం'?

తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకమే రైతు బంధు పథకం.

ఈ పథకంలో భాగంగా ఎకరానికి రూ.4 వేల చొప్పున రెండు దఫాలుగా (ఖరీఫ్, రబీ సీజన్) రైతులకు ఎనిమిది వేల రూపాయిలను చెక్ రూపంలో పంపిణీ చేస్తుంది. అయితే, 2018 అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 2018 మే10న కరీంనగర్‌ జిల్లా శాలపల్లి-ఇందిరానగర్‌ గ్రామంలో ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఈ పథకం కోసం 2018-19 సంవత్సరానికిగాను బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అలాగే, పథకం అమలు కోసం వ్యవసాయశాఖ ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేసింది.

అర్హులు ఎవరు?

సాగుభూమి ఉన్న ప్రతీరైతు ఈ పథకానికి అర్హులే. గరిష్ట భూ పరిమితి అనే నిబంధనలు ఏమీ లేవు. భూమి లేని వ్యవసాయ కూలీలు, కౌలు రైతులకు ఈ పథకం వర్తించదు.

ఈ పథకం అమలు కోసం అర్హులైన దాదాపు 58 లక్షల మంది రైతులకు కొత్త పాసు పుస్తకాలను తయారు చేసి అందించారు.

ఈ పథకం అమలుకోసం ప్రభుత్వం వ్యవసాయ, ఆర్థిక, బ్యాంకింగ్, రాష్ట్ర సమాచార శాఖ అధికారుల అధ్యక్షతన రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశారు.

8 బ్యాంకుల ద్వారా ఈ చెక్కుల పంపిణీ జరుగుతోంది. పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న రైతులకే ఈ సాయం అందిస్తారు.

చెక్కులపై పట్టాదారు(లబ్ధిదారు) పేరు , ఆధార్ నెంబర్, వయసు, పాస్‌బుక్ నెంబర్, రెవెన్యూ విలేజ్, మండలం, జిల్లా, సాయం మొత్తం తదితర వివరాలు నమోదు చేస్తారు.

రైతు

ఫొటో సోర్స్, Getty Images

చెక్కులపై రైతు బంధు పథకం పేరును కూడా ముద్రిస్తారు. చెక్కు చెల్లుబాటు కాలం మూడు నెలలు మాత్రమే ఉంటుంది. తర్వాత కొత్త చెక్కు తీసుకోవాల్సి ఉంటుంది. రైతులకు ఇప్పటికే రెండు సార్లు నగదు బదిలీ చేశారు.

''రైతులకు పెట్టుబడి భారంగా ఉంది. ఆ భారాన్ని కూడా పంచుకోవాలని నిర్ణయించాం. అందుకే ఈ చారిత్రక నిర్ణయం ప్రకటిస్తున్నాం. రాష్ట్రంలోని 55 లక్షల మంది రైతులున్నారు. దాదాపు 25 లక్షల టన్నుల ఎరువులను వాడుతున్నారు. వారందరికి ఎకరానికి రూ.4 వేల రూపాయల చొప్పున రెండు దఫాలుగా ఎరువుల కొనుగోలుకు ప్రభుత్వ సహాయంగా అందిస్తాం'' అని ఈ పథకం ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాకు వెల్లడించారు.

లోపాలున్నాయా?

రైతులకు మద్దతిచ్చే అత్యున్నత పథకం ఇదేనని ఒక వైపు ప్రభుత్వం చెబుతుంటే పెద్ద రైతులకే దీని వల్ల ఎక్కువ లబ్ధి చేకూరుతోందని, కౌలు రైతులను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తక్కువ భూమి, అసలు భూమి లేని రైతులకు దీని వల్ల పెద్దగా ఉపయోగం లేదని అంటున్నాయి.

ప్రభుత్వం చెబుతోన్న గణాంకాల ప్రకారం గరిష్ట భూములు ఉన్న రైతులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ పథకం కింద లబ్ధిపొందుతున్న 90% మంది రైతులు చిన్న, సన్నకారు రైతులే.

  • 2 ఎకరాల్లోపు భూకమతాలు ఉన్న రైతుల సంఖ్య 42 లక్షలు (దాదాపు 90%)
  • 5 ఎకరాల్లోపు ఉన్నవి 11 లక్షలు
  • 5 నుంచి 10 ఎకరాలున్న రైతులు 4.4 లక్షలు
  • 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతుల సంఖ్య 94,000
  • 25 ఎకరాల కంటే ఎక్కువ 6488
ఉల్లిపాయల బస్తాలపై రైతులు

ఫొటో సోర్స్, Getty Images

ఎన్నికల్లో ప్రముఖంగా..

ఈ పథకం ప్రారంభించిన ఆరు నెలలకు అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లింది.

ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా రైతుబంధు పథకాన్ని టీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలో రైతుబంధు పథకం నగదును రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది.

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంది. గ్రామీణ నియోజకవర్గాల్లో అత్యధిక సీట్లను సాధించింది.

రైతు బంధు పథకం తమకు ఎన్నికల్లో బాగా ఉపయోగపడిందని పార్టీ ప్రతినిధులు చెప్పారు.

ఇదే మార్గంలో మరిన్ని రాష్ట్రాలు

తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు పథకంవైపు ఇతర రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే ఇదే తరహా పథకాన్ని ఒడిశా, జార్ఖండ్ ప్రభుత్వాలు కొన్ని మార్పులతో ప్రవేశపెట్టాయి.

ఒడిశాలో 'కృషక్‌‌‌‌‌‌‌‌ అసిస్టెన్స్‌‌‌‌‌‌‌‌ ఫర్‌ లైవ్లీహుడ్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ ఇన్‌కమ్‌ ఆగ్మెంటేషన్‌' (కాలియా) పేరిట రైతు బంధు తరహ పథకాన్ని ప్రవేశపెట్టారు.

ఇందుకోసం బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లను కేటాయించారు. ఈ పథకాన్ని రాష్ట్రంలోని 30లక్షల మంది చిన్న, సన్నకారు రైతులకు వర్తింపజేస్తామని సీఎం నవీన్‌ పట్నాయక్‌‌‌‌‌‌‌‌ ప్రకటించారు.

పథకంలో భాగంగా ఏటా ప్రతి రైతులకు రెండు విడతలుగా రూ. 10వేల పెట్టుబడి సాయం అందజేస్తామన్నారు.

రైతు సంఘం

ఫొటో సోర్స్, Getty Images

అలాగే కౌలు రైతులు, కూలీలు కూడా దీని పరిధిలోకి వస్తారని తెలిపారు. కాలియా పథకం ద్వారా రాష్ట్రంలోని 92శాతం మంది అన్నదాతలకు లబ్ధి చేకూరుతుందని నవీన్‌ పట్నాయక్‌‌‌‌‌‌‌‌ చెప్పారు.

‌‌‌‌జార్ఖండ్ ప్రభుత్వం కూడా ఏడాదికి ఎకరాకు రూ. 5వేల చొప్పున రైతులకు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం 5 ఎకరాల వరకు పరిమితి విధించింది. ఈ పథకానికి రూ. 2250 కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌ ప్రకటించారు.

ముఖ్యమంత్రి కృషి యోజన కింద దీన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తామన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 22.76 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు.

పశ్చిమ బెంగాల్ కూడా ఇదే తరహా పథకాన్ని ప్రకటించింది. ఎకరానికి రూ. 5 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం కింద ఏటా రైతులకు అందిస్తామని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

రైతు బంధు పథకం ఇతర రాష్ట్రాలు అమలు చేస్తుండటంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు.

'ఈరోజు తెలంగాణ ఏం చేస్తుందో.. రేపు ఇండియా దాన్ని అనుసరిస్తుంది. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలు ఇప్పటికే రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్నాయి. ఇపుడు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడుతోంది. కేసీఆర్ నాయకత్వంలో రూపొందిన ఈ పథకాలను మిగతా రాష్ట్రాలు ఫాలో కావడం ఆనందంగా ఉంది' అని తెలిపారు.

రైతుబంధుపై ప్రశంసలు

రైతుల అభివృద్ధి కోసం ప్రపంచంలో అమలు చేస్తున్న 20 వినూత్న పథకాలలో రైతుబంధు, రైతుబీమా పథకాలు ఒకటిగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది.

మద్దతు ధర, రుణమాఫీకి బదులుగా రైతులకు పెట్టుబడి సహాయం అందించడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుందని వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)