అధిక దిగుబడే వ్యవసాయ సంక్షోభానికి కారణమా!

ఫొటో సోర్స్, Press Trust of India
- రచయిత, సౌతిక్ బిస్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతదేశంలో అన్నదాతలు మరోసారి పోరుబాట పట్టారు.
మహారాష్ట్రలో రైతులు మహాపాదయాత్ర చేపట్టారు.
సుమారు 50వేల మంది రైతులు దేశఆర్ధిక రాజధాని ముంబైలో నిరసన తెలిపారు.
గతేడాది జూన్ నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న రైతుల ఆగ్రహం ఇప్పుడు తీవ్రరూపం దాల్చింది.
గతేడాది జూన్‌లోనూ మహారాష్ట్ర రైతులు ఆందోళనలు చేశారు.
రోడ్లపై పాలు పారబోసి నిరసన తెలిపారు. మార్కెట్ల బంద్ పాటించారు. కూరగాయాలు తీసుకొచ్చే వాహనాలపై కొందరు దాడులు చేశారు.
మధ్యప్రదేశ్‌లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
అప్పట్లో పోలీసులు-రైతుల ఘర్షణలో ఐదుగురు అన్నదాతలు మృతి చెందడంతో పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు.
గతేడాది మేలో తెలుగు రాష్ట్రాల్లోనూ రైతులు ఆందోళనలు చేపట్టారు. మద్దతు ధర లేక మిర్చి పంటకు నిప్పు పెట్టారు.
రైతులు ప్రధానంగా రెండు డిమాండ్లు చేస్తున్నారు.
1. అన్ని రకాల రైతు రుణాలు మాఫీ చేయడం.
2. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం.
వ్యవసాయ సంక్షోభానికి కారణాలు ఎన్నో!
చిన్న కమతాలు, కరవు, అనావృష్టి, సరైన నీటి సౌకర్యాలు, ఆధునిక సాగు పద్దతులు లేకపోవడం వంటి సమస్యలతో భారత వ్యవసాయ రంగం దశాబ్దాలుగా ఇబ్బంది పడుతోంది.
దేశ జనాభాలో సగం మంది వ్యవసాయ రంగంలోనే పనిచేస్తున్నారు.
కానీ దేశ జీడీపీలో వ్యవసాయం రంగం ద్వారా వచ్చేది కేవలం 15శాతమే.
ప్రస్తుత సంక్షోభానికి చాలా కారణాలు ఉన్నాయి.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో వర్షాలు సంవృద్ధిగా కురిశాయి. పంటల దిగుబడి భారీగా పెరిగింది.
ఉత్పత్తి పెరగడంతో ఉల్లి, ద్రాక్ష, సోయా, మెంతి, మిర్చి ధరలు భారీగా పతనమయ్యాయి.
పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా సఫలం కాలేకపోయింది.
పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలోనూ ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోలేకపోయింది.

ఫొటో సోర్స్, AFP
అధిక దిగుబడి వ్యవసాయ సంక్షోభానికి ఎందుకు కారణమైంది?
తాజా వ్యవసాయ రంగ సంక్షోభానికి నోట్ల రద్దు ఒక కారణమని కొందరు చెబుతున్నారు.
నోట్ల రద్దు సమయంలో రైతులు వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు తీసుకుని పంటలు వేశారు. అప్పులు చేసి ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేశారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక గ్రామీణ వ్యవహారాలు, వ్యవసాయ రంగం ఎడిటర్ హరీష్ దామోదరన్ చెప్పారు.
గతంలోకంటే ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. వర్షాలు సంవృద్ధిగా కురవడంతో పంట దిగుబడి కూడా పెరిగింది.
కానీ ఆ పంటలను కొనేందుకు వ్యాపారుల వద్ద సరైన నగదు లేదు అని దామోదర్ అభిప్రాయపడ్డారు.
అయితే, నగదు కొరతను భూతద్దంలో చూపిస్తున్నారంటూ కొందరు మహారాష్ట్ర వ్యాపారులు చెబుతున్నారు.
ఈసారి మంచి దిగుబడి వచ్చింది. అందులో సందేహం లేదు. కానీ చెక్కులు, ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నగదు చెల్లించి పంటను చాలా మంది వ్యాపారులు కొనుగోలు చేశారు అని మనోజ్ కుమార్ జైన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
పంట నిల్వ చేసుకునే సదుపాయం లేదు
పంటను నిల్వ చేసేందుకు సరైన గోదాములు లేకపోవడం కూడా సంక్షోభానికి కారణమని వ్యవసాయ నిపుణులు అశోక్ గులాటీ అన్నారు.
ఉదాహరణకు ఉల్లిలో 85శాతం నీరు ఉంటుంది. ఉల్లి త్వరగా బరువు తగ్గిపోతుంది.
వ్యాపారులు రైతుల నుంచి ఉల్లి కొనుగోలు చేసి షెడ్‌లలో నిల్వ చేస్తారు.
వాతావరణ సరిగా ఉంటే 3 నుంచి 5 శాతం ఉల్లి గోదాముల్లోనే వృధా అవుతుంది.
ఒకవేళ ఉష్ణోగ్రతలు పెరిగితే ఉల్లి ఎండిపోతుంది. 25 నుంటి 30 శాతం బరువు తగ్గిపోతుంది.
ఆధునిక శీతల గిడ్డంగుల్లో ఉల్లిని చెక్క పెట్టెల్లో 4 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తారు. అందుకే పంట వృధా 5శాతం కంటే తక్కువగా ఉంటుంది.
నిల్వ చేసినందుకు కిలో ఉల్లికి కేవలం రూపాయి మాత్రమే ఖర్చు అవుతుంది.
ఒక్కోసారి ఉల్లి గరిష్ట ధరకు చేరినప్పుడు ప్రభుత్వాలే సబ్సిడీ కింద ఉల్లి సరఫరా చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. కొన్నిచోట్ల పోలీసులతో బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన ఘటనలు ఉన్నాయి.
రైతులు, వినియోగదారులు, కోల్డ్ స్టోరేజ్ వ్యాపారులు అందరూ సంతోషంగా ఉండే వ్యవస్థ రావాలని డాక్టర్ గులాటి అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Reuters
వ్యవసాయ విధానాలు మారాలి
ఉత్తరప్రదేశ్‌లో ఉన్న 7000 కోల్డ్ స్టోరేజీల్లో ఎక్కువగా బంగాళాదుంపలనే నిల్వ చేస్తారు.
పండ్లు, కూరగాయలు త్వరగా చెడిపోతాయి. ప్రభుత్వం లేదా వ్యాపారులు సరైన సమయంలో వాటిని కొనుగోలు చేయకపోతే రైతులకు నష్టం తప్పదు.
భారతదేశంలో ఆహార ప్రాసెసింగ్ అనుకున్నంత వేగంగా సాగడం లేదు. మొత్తం పండ్లు, కూరగాయల్లో కేవలం 5శాతం మాత్రమే ప్రాసెసింగ్ జరుగుతోంది.
పైగా గతేడాది ఉన్న ధరల ఆధారంగా రైతులు పంటలు సాగుచేస్తారు.
గతేడాది ఏ పంటకైతే ఎక్కువ ధర ఉంటుందో దాన్నే సాగు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు.
వర్షాలు సంవృద్ధిగా పడితే పంట దిగుబడి పెరుగుతుంది.
సరఫరా పెరగడంతో డిమాండ్ తగ్గిపోతుంది. ఫలితంగా ధరలు కూడా పడిపోతాయి.
రైతులు పంటను కొన్ని రోజులు అట్టిపెట్టుకుని, ఆ తర్వాత ఎంతోకొంత ధరకు అమ్ముకుంటున్నారు.
అందుకే గతేడాది ధరలను నమ్ముకుని సాగు చేయవద్దని గులాటీ సూచిస్తున్నారు.
భారత దేశంలో వ్యవసాయ విధానాలు తప్పనిసరిగా మారాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- దండి మార్చ్: గాంధీతో కలిసి నడిచిన తెలుగు వ్యక్తి ఎవరు?
- మరణంతో మెదడు పోరాడుతుందా? చనిపోయే ముందు ఏం జరుగుతుంది?
- ఏ సెల్‌ఫోన్‌తో ఎంత ప్రమాదం?
- తెలంగాణ: మళ్లీ ‘మిలియన్ మార్చ్’ వేడి.. ఎందుకు?
- పుతిన్‌ను సవాల్ చేస్తున్న మహిళా జర్నలిస్టు!
- జిన్‌పింగ్: ఇక జీవితాంతం చైనా అధ్యక్షుడు!
- ‘ట్రంప్‌కి ఆ ప్రమాదాలు తెలుసు’
- దళితులమని మమ్మల్ని హీనంగా చూస్తున్నారు: తెలంగాణలో సర్పంచి ఆవేదన
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








