తెలంగాణ: మళ్లీ ‘మిలియన్ మార్చ్’ వేడి.. ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images/FB
- రచయిత, ప్రవీణ్ కాసం
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఏడేళ్ల కిందట తెలంగాణ ఉద్యమంలో భాగంగా టీజేఏసీ నిర్వహించిన 'మిలియన్ మార్చ్'లో ఇప్పటి అధికార టీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించింది. తెలంగాణ ఏర్పడిన నాలుగేళ్ల తర్వాత అదే టీజేఏసీ ‘మిలియన్ మార్చ్’ స్ఫూర్తి సభను ఎందుకు నిర్వహించాలనుకుంది? దానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు?
మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక ఘట్టంగా మిలియన్ మార్చ్‌ను అభివర్ణిస్తుంటారు.
తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు 2011 మార్చి 10న ప్రత్యేక రాష్ట్రానికి మద్దతిచ్చిన అన్ని రాజకీయ పార్టీలు ట్యాంక్ బండ్ వేదికగా జరిగిన ఈ ఉద్యమంలో పాల్గొన్నాయి.
ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మిలియన్ మార్చ్‌లో కీలక పాత్ర వహించారు.
మిలియన్ మార్చ్ జరిగి ఏడేళ్లు పూర్తయ్యాయి. నాడు మిలియన్ మార్చ్‌లో కీలకంగా వ్యహరించిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది.
ఆ ఉద్యమానికి పిలుపునిచ్చిన టీజేఏసీ ఇప్పుడు రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో ఉద్యమ త్యాగాలు, లక్ష్యాలను గుర్తు చేసుకునే ఉద్దేశంతో మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభను ట్యాంక్ బండ్‌పై నిర్వహించాలని తలపెట్టినట్లు టీజేఏసీ చెప్తోంది. దీనికి ప్రజాసంఘాలు, వామపక్షపార్టీలు మద్దతు తెలిపాయి.

ఫొటో సోర్స్, facebook/talanganajac
'అది పోలీసుల నిర్ణయం'
అయితే, ట్యాంక్ బండ్ నగరంలోని కీలక ప్రాంతమని, శాంతి భద్రతల సమస్య తలెత్తుందని ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా ప్రజాసంఘాల నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు.
తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌ను తార్నాకలోని ఆయన నివాసం నుంచి మిలియన్ మార్చ్ సభకు బయలుదేరుతుండగా అరెస్టు చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
సీపీఐ నాయకుడు చాడ వెంకటరెడ్డిని పార్టీ కార్యాలయంలోనే అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభపై టీఆర్ఎస్ అధికార ప్రతినిధి కర్నె ప్రభాకర్ బీబీసీతో ఫోన్‌లో మాట్లాడుతూ,
'ఈ సమావేశానికి అనుమతి ఇవ్వకపోవడం పోలీసు యంత్రాంగానికి సంబంధించిన నిర్ణయం. దీనిలో ప్రభుత్వం, పార్టీ ప్రమేయం ఏమీ లేదు' అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, facebook/telanganajac
'ఉద్యమంతో అధికారంలోకి వచ్చి ఉద్యమిస్తే నేరం అంటోంది'
''ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన పార్టీ ఇప్పుడు ఉద్యమాలు చేసిన వారిని నేరస్తులుగా చూస్తోంద''ని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
ప్రభుత్వం మిలియన్ మార్చి స్ఫూర్తి సభకు అనుమతి ఇవ్వకుండా అరెస్టులు చేయడంపై ఆయన బీబీసీతో ఫోన్‌లో మాట్లాడారు.
'మిలియన్ మార్చ్ తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమం చేసిన ఒక చారిత్రక ఘటన. ఇలాంటి సందర్భాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి. కానీ, మిలియన్ మార్చ్ స్ఫూర్తి సమావేశానికి అనుమతి నిరాకరించడం ద్వారా పాలకులు ఉద్యమ లక్ష్యాలను మరిచిపోయార'ని కోదండరాం పేర్కొన్నారు.
ఈ సమావేశానికి అనుమతి నిరాకరించడానికి పోలీసులు చూపిన కారణాలు హాస్యాస్పదంగా, తెలంగాణ ఉద్యమకారులను అవహేళన చేసే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు.
'గతంలో మిలియన్ మార్చ్ సందర్భంగా విధ్వంసం, హింస చెలరేగాయంటున్నారు. ఈ మాటలు వింటుంటే తెలంగాణ ఉద్యమం నుండి అధికారంలోకి వచ్చిన నాయకులేనా ఇప్పుడు పాలిస్తున్నది అనే అనుమానం కలుగుతోంది. ఇప్పుడు మేం తలపెట్టింది మిలియన్ మార్చ్ కాదు. కేవలం మిలియన్ మార్చ్ స్ఫూర్తితో తలపెట్టిన సమావేశం మాత్రమే' అని కోదండరాం పేర్కొన్నారు.
ఉద్యమాలతో అధికారంలోకి వచ్చిన పార్టీ ఇప్పుడు ఉద్యమాలు అంటే భయపడుతోందని అన్నారు. మిలియన్ మార్చి స్ఫూర్తి సభను ప్రభుత్వం అడ్డుకున్నా దాని లక్ష్యాలు నెరవేరాయని, ప్రజలు నాటి ఘటనను గుర్తు చేసుకునేలా విజయం సాధించామని కోదండరాం చెప్పారు.

ఫొటో సోర్స్, facebook/chada venkat reddy
'ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం'
''తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ కీలక ఘట్టం. నాటి స్ఫూర్తిని, ఉద్యమ లక్ష్యాలను గుర్తు చేసుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నా'మని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి బీబీసీతో అన్నారు.
ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకుండా నిరంకుశంగా వ్యవహరించిందని ఆయన చెప్పారు.
'మిలియన్ మార్చ్ ఘట్టంలో కేసీఆర్ పెద్దన్నలా వ్యవహరించారు. ఇప్పుడు నాటి కార్యక్రమాన్ని గుర్తు చేసుకునేలా స్ఫూర్తి సభను పెట్టుకుంటే అనుమతి కూడా ఇవ్వడం లేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఏర్పడిన పార్టీ.. ఉద్యమ స్ఫూర్తితో కొనసాగుతామని చెబుతోన్న పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఉద్యమాలను అణచివేస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తోంద'ని ఆయన అన్నారు.
మిలియన్ మార్చి స్ఫూర్తి సభలో పాల్గొనాలని అన్ని పార్టీలను ఆహ్వానించామని, సీఎం కేసీఆర్‌కు తాను స్వయంగా లేఖ రాశానని చాడ చెప్పారు.
''నాలుగేళ్ల తర్వాత మిలియన్ మార్చి స్ఫూర్తి సభను ఎందుకు నిర్వహిస్తున్నారనడం సరికాదు. నాటి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేర్చాలని, అప్పటి త్యాగాలను గుర్తు చేయాలని దీనికి రూపకల్పన చేశాం'' అని ఆయన వివరించారు.
'టీజేఏసీ రాజకీయం చేస్తోంది'
అయితే.. మిలియన్ మార్చ్ స్పూర్తి సభ పేరుతో టీజేఏసీ రాజకీయం చేస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ విమర్శించారు.
ఆయన బీబీసీతో ఫోన్‌లో మాట్లాడుతూ, కోదండరాం తాను పెట్టబోతున్న పార్టీ కోసమే మిలియన్ మార్చ్‌స్ఫూర్తి సభను తెరమీదకు తీసుకొచ్చారని పేర్కొన్నారు.
'రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మిలియన్ మార్చ్ ఎందుకు గుర్తుకొచ్చింది? గత నాలుగేళ్లు ఎందుకు ఇలాంటి సభలు నిర్వహించలేదో కోదండరాం చెప్పాలి' అని ఆయన ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










