ప్రెస్ రివ్యూ: కూలీ డబ్బులూ దిల్లీ నుంచే రావాలా?: కేసీఆర్

ఫొటో సోర్స్, kcr/Facebook
‘‘దేశానికి నిజమైన సమాఖ్య వ్యవస్థ రావాలి. అధికారాలు రాష్ట్రానికి అప్పజెప్పాలి. కేంద్రం వద్ద పరిమిత అధికారాలు ఉంటేనే దేశం బాగుపడుతుంది’’ అని అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నట్లు ‘ఈనాడు’ దినపత్రిక కథనం ప్రచురించింది.
ఈనాడు కథనం ప్రకారం.. ‘‘కేంద్రం రైతులకు చేసింది ఏముంది? అందరికీ జీతాలు పెంచుతారు. సబ్బులు, నూనెలు, చక్కెర ధరలు పెరుగుతాయి. రైతు పండించే ధాన్యం మద్దతు ధర మాత్రం పెరగదు. ఏమన్నా మాట్లాడితే జైల్లో పెడతామంటారా? రైతు సమస్యల గురించి ఆవేదనతో మాట్లాడినా తప్పేనా?‘‘ అని కేసీఆర్ ప్రశ్నించారు. దేశమంతా కాంగ్రెస్సేతర, భాజపాయేతర పార్టీలకు ప్రత్నామ్నాయం కోసం ఎదురు చూస్తోందని.. ప్రజల దీవెనలతో దేశానికి మార్గనిర్దేశనం చేస్తానని పేర్కొన్నారు. తెలంగాణ సాధించినట్లుగానే ఈ లక్ష్య సాధనలో వంద శాతం విజయం సాధిస్తానన్నారు.
లక్షల మైళ్ల ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలవుతుందని, తెలంగాణలో మొదలైన ప్రస్థానం దేశాన్ని చుట్టుముడుతుందన్నారు. కాంగ్రెస్, భాజపాల పాలనతో దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు. త్వరలోనే ఏకాభిప్రాయం ఉన్న నేతలతో మాట్లాడతానని, ఆర్థిక నిపుణులు, శాస్త్రవేత్తలు, రైతులతో చర్చించి ఎజెండా రూపొందిస్తానని చెప్పారు. సీఎం కేసీఆర్ నిర్ణయానికి మద్దతు తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలను ఉద్దేశించి ఆయన ఆదివారం ప్రగతి భవన్ ప్రాంగణంలో ప్రసంగించారు.
''70 సంవత్సరాల ప్రయాణం సాగించిన తర్వాత దేశం ఎటుపోతోంది? దేశంలో నెలకొన్న పరిస్థితులు ఏంటి? అని ఆలోచిస్తే నాకే ఆశ్చర్యంగా ఉంది. దేశంలో రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? మనకు నీళ్లు లేవా అంటే 70 వేల టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. నీటి వాటాలు తేల్చరు. సమస్యలు పరిష్కరించరు. దేశంలో 3.20 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. దేశం వాడుకుంటోందా? అంటే అదీ లేదు. అనేక ప్రయివేటు విద్యుత్తు సంస్థలను ఝార్ఖండ్‌లో మూసేశారు. రెండో పక్క కొన్ని రాష్ట్రాల్లో చీకట్లున్నాయి’’ అని పేర్కొన్నారు.
''కృష్ణా, గోదావరి నదీ జలాల లెక్కలు తేల్చడానికి 2004లో బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ వేశారు. 14 ఏళ్లయింది. ఇప్పటికీ తేల్చలేదు. నది నీళ్ల పంపిణీకి ఇన్నేళ్లు కావాలా? లెక్కల్లేవా? గేజ్‌లు లేవా? ఇలాంటి దిల్లీనా ప్రజలకు కావాల్సింది?’’ అని కేసీఆర్ ప్రశ్నించినట్లు ’ఈనాడు’ కథనం వివరించింది.

ఫొటో సోర్స్, ktr/Facebook
కాబోయే సీఎం కేటీఆర్!
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి.. దేశానికి నాయకత్వం వహిస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో రాష్ట్రానికి కాబోయే సీఎం ఎవరనే ప్రశ్న అన్ని వర్గాల్లోనూ ఉత్పన్నమవుతోందని.. ఇందుకు సమాధానంగా అందరి చూపు ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ వైపు మళ్లుతోందని ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఒక కథనం ప్రచురించింది.
‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రకారం.. కాబోయే సీఎం కేటీఆర్ అనే చర్చ టీఆర్‌ఎస్ వర్గాల్లోనూ నడుస్తోంది. కేసీఆర్ హస్తినకు వెళ్లే ఆసక్తిని వ్యక్తీకరించిన మేరకు సీఎంగా కేటీఆర్‌కు మార్గం సుగమం అయినట్లేననే అంశం ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తోంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నిర్ణయం జరిగిన నేపథ్యంలో 2014 సాధారణ ఎన్నికలు జరిగాయి. విభజన జరిగిన అదే ఏడాది జూన్ 2న కేసీఆర్ ముఖ్యమంత్రిగా టీఆర్‌ఎస్ తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తనయుడు కేటీఆర్‌ను ఆయన తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచే ఇటు ప్రభుత్వంలో, అటు టీఆర్‌ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాతి స్థానం కేటీఆర్‌దేననే ముద్ర క్రమంగా బలపడుతూ వస్తోంది. అందుకు తగిన భూమికను కేసీఆర్ ఒక పద్ధతి ప్రకారం సిద్ధంచేస్తూ ముందుకు సాగుతున్నారనే అభిప్రాయాన్ని పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో కేటీఆర్ ప్రాధాన్యాన్ని పెంచడం, ప్రభుత్వ, ప్రైవేటు ప్రముఖులు ఎవరైనా తనను కలిసే ప్రయత్నం చేస్తే.. చాలాసార్లు మంత్రి కేటీఆర్ వద్దకు పంపించడాన్ని వారు గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ, పార్టీ పదవుల ఖరారులో మంత్రి కేటీఆర్ సిఫారసులకు పెద్దపీట వేస్తున్నారు. ఆయన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏ నిర్ణయమూ జరగడంలేదని కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చివరికి టీఆర్‌ఎస్ విజయం సాధించిన గ్రేటర్ ఎన్నికల్లో కేటీఆర్ సారథ్యంలో మిగిలిన నేతలు పనిచేయటం కూడా ఆయన నాయకత్వం ఉద్దీపన కోసమేనని చెబుతున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళితే.. కేటీఆర్ సీఎం కావటం లాంఛనమేనని అంటున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎస్పీ, బీఎస్పీ సర్దుబాట!
బీజేపీ కొట్టిన వరుస దెబ్బలకు ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయ వ్యూహాలు పూర్తిగా మారిపోతున్నాయని.. అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో బద్ధ శత్రువులుగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ)లు లోక్‌సభ ఉపఎన్నికల్లో పైకి చెప్పకపోయినప్పటికీ లోలోపల సర్దుబాటు చేసుకుంటున్నాయని ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక కథనం ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం.. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య రాజీనామా చేయడంతో గోరఖ్‌పూర్, పుల్పూర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. మార్చి 11న ఇక్కడ ఉపఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఆదివారం లక్నోలో మీడియాతో మాట్లాడుతూ ఈ రెండు లోక్‌సభ స్థానాల్లో తాము అభ్యర్థులను నిలుపబోమని వెల్లడించారు. బీజేపీని ఓడించే స్థితిలో ఉన్న అభ్యర్థులకు తమ కార్యకర్తలు మద్దతు ఇస్తారని చెప్తూ పరోక్షంగా ఎస్పీకి సహకరిస్తామని తెలిపారు.
‘‘నేను మీకు స్పష్టత ఇవ్వదల్చుకున్నా.. బీఎస్పీకి ఏ రాజకీయ పార్టీతో పొత్తు లేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ పొత్తుపై వస్తున్న కథనాలు నిజంకాదు. బీజేపీకి వ్యతిరేకంగా బలమైన అభ్యర్థులకు మద్దతు ఇస్తాం. గోరఖ్‌పూర్, పుల్పూర్ లోక్‌సభ ఉపఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులను నిలుపదు’’ అని ఆమె పేర్కొన్నారు.
రాజ్యసభ ఎన్నికల గురించి మాయావతి మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు మా వద్ద రాజ్యసభకు పోటీచేసేంత సంఖ్యాబలం లేదు. ఎస్పీ మాకు మద్దతు ఇస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి మేం మద్దతు ఇస్తాం. రాజ్యసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో మా ఓట్లు కావాలని కాంగ్రెస్ భావిస్తే.. వారు యూపీలో మా అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది’’ అని స్పష్టంచేశారు.
మొత్తంమీద యూపీలో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ కలయిక ద్వారా ప్రతిపక్షాలకు చెందిన ఇద్దరు అభ్యర్థులను రాజ్యసభకు పంపే అవకాశం ఉంటుంది. తన రాజ్యసభ అభ్యర్థికి పోను మిగిలిన ఎస్పీ ఎమ్మెల్యేల ఓట్లు బీఎస్పీకి పడితే మాయావతి మళ్లీ రాజ్యసభకు వెళ్లేందుకు వీలవుతుంది. తాజా పరిణామాలను పరిశీలిస్తే బీజేపీకి వ్యతిరేకంగా 2019 ఎన్నికల్లో యూపీలో మహాకూటమి ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు స్పష్టమవుతున్నది.
దీంతోపాటు కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చేవిధంగా మాట్లాడాల్సిన వారితో మాట్లాడుతున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించడం పలువురు ఆయనకు మద్దతిస్తుండటంతో మూడోకూటమిపై విశ్లేషణలు మొదలయ్యాయని ‘నమస్తే తెలంగాణ’ కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, Omar Abdullah/Facebook
దేశ విభజనకు కారణం నెహ్రూనే: ఫరూక్ అబ్దుల్లా
దేశ విభజనకు జవహర్‌లానెహ్రూనే కారణమని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ‘సాక్షి’ దినపత్రిక ఒక కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం.. శనివారం జమ్మూలోని షేర్-ఎ-కశ్మీర్ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఫరూక్ మాట్లాడారు.
'దేశ విభజనకు మహ్మద్ అలీ జిన్నా కారణం కాదు.. అప్పటి జాతీయ నేతలు జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్‌లే కారణం. ముస్లింలకు మైనారిటీ హోదా ఇచ్చేందుకు ఈ ముగ్గురు నేతలు అంగీకరించకపోవటమే విభజనకు దారి తీసింది. మొదట్లో జిన్నా పాకిస్తాన్ కావాలని అడగలేదు.’
‘ముస్లింలకు, సిక్కులకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించటంతో ప్రత్యేక దేశం డిమాండ్ వైపు జిన్నా మొగ్గు చూపటానికి దారి తీసిందని నేను భావిస్తున్నాను. లేకుంటే దేశం విడిపోయేది కాదు.. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లు ఉండేవికావు, భారత్ మాత్రమే ఉండేది' అని తెలిపారు.
మతాన్ని రాజకీయాల్లో వాడుకోవటాన్ని ఆయన ఖండించారు. మతం ఆధారంగా దేశాన్ని విభజించవద్దని ఆయన బీజేపీని కోరారు. ఇది దేశ అభివృద్ధికి, ఐక్యతకు, శాంతికి విఘాతం కలిగిస్తుందని చెప్పారు.
దేశ విభజనకు కారకులెవరనే అంశంపై గత కొన్నేళ్లుగా సర్వత్రా చర్చ సాగుతోంది. పాకిస్తాన్ విడిపోవటానికి నెహ్రూ కారణమని కొందరు.. కాదు, జిన్నానే కారణమని మరికొందరు వాదిస్తున్నట్లు ‘సాక్షి’ కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, loksatta.org
జేఎఫ్‌సీ తేల్చిన లెక్క.. ఏపీకి రావల్సింది ఇంత!
విభజన చట్టం సరిగ్గా లేకపోవడం వల్లే ఏపీ తీవ్రంగా నష్టపోతుందని లోక్‌సత్తా అధినేత, జేఎఫ్‌సీ సభ్యులు జయప్రకాశ్ నారాయణ పేర్కొన్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఒక కథనం ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం.. తమ దగ్గరున్న లెక్కల ప్రకారం ఇప్పటి వరకు రాష్ట్రానికి రావలసినవి రూ.74,540 కోట్లు అని జేపీ తెలిపారు.
2014 - 15 సంవత్సరానికి రెవెన్యూ లోటును ఇంకా భర్తీ చేయలేదన్నారు. రూ.10,225 కోట్లు రావాలని చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా పన్నులు కట్టాల్సి వస్తుందని.. దీని వల్ల ఏపీ రూ.3,825 కోట్ల మేరకు నష్టపోయిందని ఆయన చెప్పినట్లు ‘ఆంధ్రజ్యోతి’ కథనం వివరించింది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








