తెలంగాణ: ఉద్యోగం వస్తదా? రాదా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వేణుగోపాల్ బొల్లంపల్లి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒకవైపు నిరుద్యోగులు కొలువుల కోసం కొట్లాడటం తప్పా? అని తెలంగాణ జేఏసీ ప్రశ్నిస్తోంది. మరోవైపు ప్రభుత్వం మాత్రం 1.12 లక్షల ఉద్యోగాలను ఇస్తామని పదేపదే చెబుతోంది. మరి నిరుద్యోగులు ఎందుకు ఆందోళన చేస్తున్నట్లు?
తెలంగాణ ప్రభుత్వం 2019కల్లా 1.12 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతోంది.
ఇటీవల బీబీసీ న్యూస్ తెలుగు నిర్వహించిన ఫేస్‌బుక్ లైవ్లో ఐటీ మంత్రి కేటీఆర్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు.
కానీ ప్రభుత్వాన్ని తాము నమ్మడం లేదని ప్రతిపక్షాలతోపాటు నిరుద్యోగులు చెబుతున్నారు.
తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది.
తెలంగాణ ప్రభుత్వ గణాంకాల ప్రకారమే రాష్ట్రంలో 8.4 లక్షల మందికిపైగా నిరుద్యోగులున్నారు.
తెలంగాణలో నిరుద్యోగ రేటు జాతీయ సగటు కన్నా తక్కువగా ఉన్నా, సమస్య మాత్రం తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు తెలంగాణలో 25 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
కానీ అదే అసెంబ్లీలో ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వం కేవలం 16 వేల ఉద్యోగాలే ఇచ్చిందని పేర్కొన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
మేం కొట్లాడేది అందుకే..
ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని చెబుతుండగా కొందరు నిరుద్యోగులు నమ్మడం లేదు.
నీళ్లు.. నిధులు.. నియామకాల కోసం రాష్ట్రాన్ని సాధించుకున్నాక నియామకాలు లేకపోతే కొట్లాడక ఏం చేస్తామని ప్రశ్నిస్తున్నారు.
వరంగల్‌కు చెందిన 36 ఏళ్ల రమేశ్ బీబీసీతో మాట్లాడుతూ.. ప్రభుత్వం మూడున్నరేళ్లపాటు తాత్సారం చేయడం వల్ల తనకు 12 లక్షల రూపాయల నష్టం వచ్చిందని పేర్కొన్నారు.
ప్రైవేటు ఉద్యోగం మానేసి.. డీఎస్సీకి ప్రిపేర్ అవడం వల్ల ఆ మేరకు నష్టపోయినట్లు వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
డీఎస్సీ.. డీఎస్సీ అని రాజకీయ ప్రకటనలు చేసిన టీఆర్ఎస్ నేతలు వాటి అమల్లో ఏమాత్రం చిత్తశుద్ధి చూపడం లేదని, అందుకే కొట్లాడాల్సి వస్తోందని రమేశ్ చెప్పారు.
ఉస్మానియా విద్యార్థులు బీబీసీ తెలుగు ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడుతూ.. ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉద్యోగాలు భర్తీ చేయనందువల్ల విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
సురేశ్ అనే విద్యార్థి మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రభుత్వాన్ని నమ్మే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. మరో విద్యార్థి నగేశ్ .. విద్యార్థులు ఒత్తడికి గురవుతున్నారు. వెంటనే లక్షా 12 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
పీహెచ్‌డీ విద్యార్థి శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉద్యోగాలు లేక.. ఇళ్లకు వెళ్లలేక చనిపోతున్నారు కానీ.. పోలీసులు ఆరోపిస్తున్నట్లు చదువులో వెనుకబడి కాదన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చంటిబిడ్డనూ వదలి ప్రిపేరైనా..
జనగామ జిల్లాకు చెందిన దివ్య అనే అభ్యర్థి మాట్లాడుతూ- తాను ఉద్యోగం కోసం చంటిపాపను వదిలి ప్రిపేర్ అయినా ప్రభుత్వం ఆశించినంతగా నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశ చెందానని తెలిపారు.
‘ఇప్పటికే రెండేళ్లుగా ఖాళీగా ఉన్నాం. వీళ్లు ఉద్యోగాలు ఇవ్వకుంటే.. చూస్తూ ఉండలేం కదా. తెలంగాణ రాగానే లక్ష ఉద్యోగాలు ఇస్తమన్నరు. ఇప్పటివరకు కొన్ని వేల ఉద్యోగాలే ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ లక్ష అంటున్నారు..’ అని వ్యాఖ్యానించారు.
ఏటా ఉద్యోగ ప్రకటనలు లేకుంటే ఇక కొట్లాడక ఏం చేస్తామని ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో ఉద్యోగాల తీరు..
2015-16 వార్షిక నిరుద్యోగ నివేదిక ప్రకారం.. తెలంగాణలో వ్యవసాయ ఆధారిత రంగమే ప్రధాన ఉపాధి వనరు. దీని తర్వాతి స్థానంలో సేవలు, పారిశ్రామిక రంగాలు ఉన్నాయి.
54 శాతం మంది కార్మికులు వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉన్నారు. సేవల రంగంలో 28 శాతం మంది ఉన్నారు.
రాష్ట్రం నిరుద్యోగ రేటు 2.7 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 1.2 శాతం, పట్టణ ప్రాంతాల్లో 6.1 శాతం మేర నిరుద్యోగం ఉంది.
ఇది జాతీయ సగటు 3.7 శాతంతో పోల్చితే 1 శాతం తక్కువ.

ఫొటో సోర్స్, Getty Images
నిరుద్యోగులు ఎంత మంది?
తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే చేసినపుడు 8.4 లక్షల మంది తాము ఏ కొలువూ చేయడం లేదని తెలిపారు.
నిరుద్యోగం వల్ల వీరు ఇలా చెప్పి ఉండొచ్చని సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ 2017 నివేదిక పేర్కొంది. దీని ప్రకారం రాష్ట్రంలో కనీసం 8.4 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు అంచనాకు రావొచ్చు.
రాష్ట్రంలో పని చేయదగిన వయసున్న వారిలో రెండు శాతం మంది వలస కూలీలుండగా, మరో రెండు శాతం మంది చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. డ్రైవర్లు మూడు శాతం మంది, బీడీ కార్మికులు నాలుగు శాతం మంది ఉన్నారు.
సొంతంగా సేద్యం చేస్తున్న వారు 11 శాతం మంది ఉన్నారు.
వీరు కాకుండా 23 శాతం మంది వ్యవసాయ కూలీలు ఉండగా, 31 శాతం మంది రోజు వారీ కూలీకి వెళ్తున్నారు. ఏడు శాతం మంది ఏ ఉపాధీ లేక నిరుద్యోగులుగా ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.
కేవలం 6 లక్షల మంది మాత్రమే సంప్రదాయ వృత్తుల్లో ఉన్నారు.
మరి నైపుణ్యాలు?
2012-2022 మధ్యలో రాష్ర్టానికి 50.9 లక్షల మంది నిపుణుల అవసరం ఉన్నట్టు జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ అభిప్రాయపడింది.
తెలంగాణ ప్రభుత్వ నివేదిక మాత్రం ప్రస్తుతం అంత పెద్ద ఎత్తున నైపుణ్యం ఉన్న కార్మికులు అందుబాటులో లేరని తెలిపింది.
ప్రస్తుతం నైపుణ్య అభివృద్ధికి సరిపడా మౌలిక వసతులు కూడా లేవని ప్రభుత్వ నివేదిక వివరించింది.
ఇవి కూడా చదవండి:
- మహాత్మా గాంధీ చివరి రోజు ఎలా గడిచిందంటే..
- హెచ్ఐవీ.. ఎయిడ్స్: చైనాలో 14 శాతం పెరిగిన కొత్త కేసులు
- ఈ ఉద్యోగాలు కొన్నాళ్లు సేఫ్
- ఎన్నికల ముందు ఇచ్చే ఉద్యోగ హామీలు తీరవెందుకు?
- డ్రెస్‌కోడ్.. వారానికోసారి బట్టల్లేకుండా!
- మూడీస్ రేటింగ్‌తో మోదీ ప్రతిష్ఠ పెరుగుతుందా?
- ఇంటర్వ్యూకు వెళ్తున్నారా? ఈ ఐదు విషయాలు గుర్తుంచుకోండి!
- మహిళల ఉద్యోగాలను ఆటోమేషన్ మింగేస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








