ఏప్రిల్ 5లోగా స్పష్టత ఇస్తారా? మా వాళ్లను రాజీనామా చేయమంటారా?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఫొటో సోర్స్, YS Jaganmohan Reddy/Facebook

    • రచయిత, అంజయ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు వైకాపా అధినేత జగన్ తన పార్టీ కార్యాచరణ ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ 5లోగా ప్రత్యేక హోదాపై స్పష్టత ఇవ్వకపోతే తమ పార్టీ పార్లమెంటు సభ్యులు రాజీనామా చేస్తారని వెల్లడించారు.

2018-19 కేంద్ర బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి మొండిచేయి చూపించిందంటూ ప్రజల్లో పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఎన్డీయేలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ సైతం మోదీ సర్కారు తీరుపై ధిక్కార స్వరం వినిపించింది. టీడీపీ ఎంపీలు పార్లమెంటు లోపల, బయట నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఇరుపార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

మరోవైపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ప్రత్యక్ష కార్యాచరణకు దిగబోతున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న లెక్కల్లో వాస్తవం ఎంతుందో తేల్చేస్తామన్నారు.

అందుకోసం లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌‌లతో కలిసి జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ (జేఎఫ్‌సీ) ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, JANASENA / FACEBOOK

ఇలా అన్ని వర్గాలూ కేంద్రంపై దాడి చేసేందుకు పిడికిలి బిగిస్తున్న నేపథ్యంలో వైకాపా అధినేత జగన్ కూడా తన పార్టీ కార్యాచరణ ప్రకటించారు.

"వైఎస్ఆర్‌సీపీకి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యం. మరోసారి చెబుతున్నా, ప్రత్యేక హోదా ఏపీ హక్కు. 2018 ఏప్రిల్ 5లోగా ప్రత్యేక హోదా ఇవ్వడంపై స్పష్టత ఇవ్వకపోతే వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంటు సభ్యులు రాజీనామా చేస్తారు" అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విటర్‌లో వెల్లడించారు.

జగన్ ట్వీట్

ఫొటో సోర్స్, Twitter

ఇద్దరూ ఏకమైతే దిల్లీ దిగివస్తుంది

జగన్ ప్రకటనపై సీనియర్ పాత్రికేయులు డానీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రజల ముందుకు వచ్చి తన విధానాన్ని వివరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జగన్, చంద్రబాబు ఏకమై పోరాటం చేస్తే కేంద్రం నిమిషాల్లో అమరావతికి కదిలి వస్తుందన్నారు.

"ఏపీకి ఏప్రిల్ 5 లోగా ప్రత్యేక తరహా హోదా ఇవ్వకపోతే తమ ఎంపీలు రాజీనామా చేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రకటించడాన్ని అందరూ ఆహ్వానించాలి. పార్లమెంటులో తమ ఎంపీలు రాష్ట్రం కోసం పోరాటం చేస్తుంటే జగన్ కేంద్ర ప్రభుత్వంతో లాలూచీ పడుతున్నారని ఇటీవల టీడీపీ ప్రచారం చేస్తోంది.

ఈ నేపథ్యంలో జగన్ ప్రకటన రాజకీయ లాంగ్ జంప్ లాంటిది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వంద అడుగులు ముందు నిలబెట్టింది.లోక్‌సభలో గల్లా జయదేవ్ ప్రసంగంతో టీడీపీ కొంచెం వేడి పుట్టించింది. కానీ శివప్రసాద్ పూనకం నాటకంతో ఈ వ్యవహారాన్ని టీడీపీ ఆషామాషీగా తీసుకుందని తేలిపోయింది.ఇంత కీలక సమయంలో చంద్రబాబు గత వారం రోజులుగా మౌనంగా ఉండిపోవడం చారిత్రక నేరం. ఇప్పుడయినా చంద్రబాబు అజ్ఞాతవాసం నుంచి బయటికి వచ్చి ఏపీ మీద కేంద్రం తీరుపై తన వైఖరి ఏంటో ప్రజలకు చెప్పాలి!జగన్, చంద్రబాబు ఏకమై పోరాటం చేస్తే నిమిషాల్లో దిల్లీ కదిలి అమరావతికి వస్తుంది.అలా కలవడానికి సిధ్ధం కాకుంటే చంద్రబాబు ఉత్తర కుమారునిగా మిగిలిపోతారు" అని డానీ అభిప్రాయపడ్డారు.

చలసాని శ్రీనివాస్

ఫొటో సోర్స్, srinivas.chalasani.56/FB

రాజీనామాలొద్దు..

అయితే, ఎంపీలు రాజీనామా చేయొద్దని, పార్లమెంటులో ధైర్యంగా పోరాడాలని ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు.

‘ఎంపీలు ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఈ మాట గతంలోనూ చెప్పాను. ఇప్పుడూ అదే చెబుతున్నా. పార్లమెంటులో కొట్లాడితేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది. ఇది తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే. ఎంపీలందరూ ధైర్యంగా పార్లమెంటులో మోదీ ముందు నిలబడి కొట్లాడాలి’.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)