ఏ ముఖ్యమంత్రిపై ఎన్ని క్రిమినల్ కేసులు?

- రచయిత, ప్రవీణ్ కాసం
- హోదా, బీబీసీ తెలుగు
దేశంలోని 35 శాతం మంది ముఖ్యమంత్రులు నేరాభియోగాలు ఎదుర్కొంటున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి మొత్తం 31 మంది ముఖ్యమంత్రులలో 11 మంది ఏదో ఒక క్రిమినల్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నవారే.
26 శాతం సీఎంలపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక తెలిపింది. ఎన్నికల అఫిడివిట్‌లో స్వయంగా ముఖ్యమంత్రులు పేర్కొన్న వివరాల ఆధారంగానే ఏడీఆర్ ఈ నివేదికను విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌పై అత్యధికంగా 22 కేసులున్నాయి. వీటిలో 3 క్రిమినల్ కేసులు. ఈ జాబితాలో 11 కేసులతో కేరళ సీఎం పి.విజయన్ రెండో స్థానంలో ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రెండు కేసులున్నాయి. ఇందులో ఒకటి క్రిమినల్ కేసు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎలాంటి క్రిమినల్ కేసులూ లేవు.
ధనిక సీఎం చంద్రబాబు... పేద సీఎం మాణిక్ సర్కార్
అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో అత్యంత ధనిక సీఎంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిలిచారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నాలుగో స్థానంలో ఉన్నారు. చంద్రబాబు మొత్తం ఆస్తుల విలువ రూ.177 కోట్లు. ఆ తర్వాతి స్థానాల్లో అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమాఖండూ (సుమారు రూ.129 కోట్లు), పంజాబ్ సీఎం అమరిందర్‌సింగ్ (రూ.48 కోట్లు) ఉన్నారు.
రూ.15 కోట్ల ఆస్తులతో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు.
దేశంలో అత్యంత పేద సీఎంగా త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ నిలిచారు. ఆయన మొత్తం ఆస్తులు సుమారు రూ.26 లక్షలు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుమారు 30 లక్షల ఆస్తులతో పేద సీఎంల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు.

ఫొటో సోర్స్, Adr
టాప్ 4 ధనిక ఎంపీలు తెలుగువాళ్లే
16వ లోక్‌సభకు ఎన్నికైన సంపన్న ఎంపీల జాబితాలో తొలి నాలుగు స్థానాల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వాళ్లే ఉన్నారు. ఏడీఆర్ నివేదిక ప్రకారం.. రూ.683 కోట్ల ఆస్తులతో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా తొలిస్థానంలో నిలిచారు.
రెండో స్థానంలో టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.528 కోట్లు. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు ఉన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ఎన్నికైన బుట్టా రేణుక జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. ఆమె ఆస్తుల విలువ రూ. 242 కోట్లు.
చట్టసభలకు ఎన్నికవుతున్న ధనికుల సంఖ్య ఇటీవల బాగా పెరుగుతోందని ఏడీఆర్ తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త రాకేశ్ రెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధులపై ఈ కేసులున్నంత మాత్రాన వారిని నేరస్తులుగా పరిగణించలేమని, వీటిలో కొన్ని రాజకీయప్రేరేపితంగా, మరికొన్ని ఇతర వివాదాల కారణంగా నమోదయ్యే కేసులు కూడా ఉంటాయని ఆయన తెలిపారు.
నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు
- 31 మంది సీఎంలలో 25 మంది కోటీశ్వరులున్నారు. అంటే దాదాపు 81 శాతం మంది కరోడ్‌పతి సీఎంలే.
- అందరు ముఖ్యమంత్రుల ఆస్తులను సగటుగా తీస్తే దేశంలోని ముఖ్యమంత్రులందరి సగటు ఆస్తి రూ.16.18 కోట్లు.
- రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్న ముఖ్యమంత్రులు ఇద్దరున్నారు.
- మొత్తం 31 మంది సీఎంలలో 11 మంది ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులున్నాయి.
- 20 మంది ముఖ్యమంత్రులపై ఎలాంటి కేసులూ లేవు.
సుప్రీం కోర్టు ఏం చెప్పింది?
ప్రజాప్రతినిధులపై కేసులు ఉంటే వాటిని సత్వరమే విచారించాలని ఇందుకోసం ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు గతంలో తీర్పునిచ్చింది. ఈ మేరకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై కేంద్రానికి సూచించింది.
సుప్రీం తీర్పుననుసరించి కేంద్ర హోం శాఖ 24 జూన్ 2014న రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలంటూ లేఖ కూడా రాసింది.

ఫొటో సోర్స్, Rakeshreddy
''పారదర్శకత, సత్వర విచారణ అవసరం‘
ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణలో జాప్యం జరగడం ప్రజాస్వామ్యానికి మంచిదికాదని ఏడీఆర్ సంస్థ తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త డి. రాకేశ్ రెడ్డి బీబీసీకి చెప్పారు. విచారణలో జాప్యం జరగడం వల్ల తాము నేరం చేసినా ఏమీ కాదనే ధీమా నేతల్లో పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
''తాము ఓటు వేసే ప్రజాప్రతినిధుల గురించి ప్రజలు పూర్తిగా తెలుసుకోవాలి. అలాగే, ప్రజాప్రతినిధులు ఎంత పారదర్శకతతో ఉన్నారనేది తెలియాలి. ఈ ఉద్దేశాలతోనే ఏడీఆర్ ఇలాంటి నివేదికలను విడుదల చేస్తోందని’’ ఆయన పేర్కొన్నారు.
దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తులు, వారిపై ఉన్న అభియోగాలపై తొలిసారిగా ఇలాంటి నివేదికను విడుదల చేశామని చెప్పారు. చట్టసభలకు ఎన్నికైన ధనవంతుల సంఖ్య ఇటీవల బాగా పెరుగుతోందని తమ పరిశీలనలో తేలిందన్నారు.
''దేశంలోని చాలా మంది ప్రజాప్రతినిధులపై కేసులున్నాయి. అంతమాత్రాన వారు నేరస్తులని చెప్పడం లేదు. కానీ, వారిపై ఉన్న కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సాక్షాత్తు సీఎంలపై ఉన్న కేసుల్లోనే తీర్పు రావడానికి ఏళ్ల సమయం పడితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి'' అని రాకేశ్ ప్రశ్నించారు.
ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను ఏడాదిలోపే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని గతంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలు కూడా విడుదల చేసిందని ఆయన చెప్పారు. కానీ, ఇప్పటి వరకు చర్యలు మాత్రం కనిపించడం లేదని రాకేశ్‌రెడ్డి అన్నారు.
ఇవి కూడా చదవండి:
- చరిత్రలో మహిళలు: ఒక ఆటతో ఓటుహక్కును ఎలా సాధించుకున్నారు?
- విదేశాంగ విధానం: భారత్ తోడు పెళ్లికూతురేనా?
- పెన్షన్‌కు భరోసా లేదు.. బతుక్కి భద్రత లేదు!
- అభిప్రాయం: మహిళలతో బాలీవుడ్ బంధం ఎలాంటిది?
- ఏది 'సెక్స్', ఏది 'రేప్'?
- సెక్స్‌కూ గుండెపోటుకు సంబంధముందా?
- ఒకచోట ఉండే మహిళలకు పీరియడ్స్ ఒకేసారి వస్తాయా?
- '18 ఏళ్ల లోపు వయసున్న భార్యతో సెక్స్ అత్యాచారమే'
- పోర్న్ స్టార్ మియా మాల్కోవా సన్నీ లియోనిని మించి పోతారా!
- ఇంటర్వ్యూ: హెబ్బార్స్ కిచెన్ సృష్టికర్త ఈవిడే
- అల్లం, తేనె.. నెక్స్ట్ కండోమ్ ఫ్లేవర్ ఏం రావొచ్చు?
- అధ్యయనం: ‘కోపం వస్తే కోప్పడండి.. నవ్వొస్తే నవ్వండి.. ఏదీ దాచుకోవద్దు’
- అనుమానం లేదు.. ఆడవాళ్లే శక్తిమంతులు!
- సోషల్ మీడియా: మీకు లాభమా? నష్టమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








