మరో 'దాణా' కేసులో లాలూకు ఐదేళ్ల శిక్ష

ఫొటో సోర్స్, Somnath Sen/BBC
జైలులో ఉన్న బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌కు దాణా కుంభకోణానికి సంబంధించిన మరో కేసులో కోర్టు దోషిగా ప్రకటిస్తూ ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.
ఈ కేసులో లాలూతో పాటు మరో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ జగన్నాథ్ మిశ్రాకు కూడా కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించారు.
చాయిబాసా సర్కారీ ఖజానా నుంచి రూ. 33.67 కోట్లు అక్రమంగా తీసుకున్నారన్న కేసులో రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ఎస్ఎస్ ప్రసాద్ ఈ తీర్పు వెలువరించారు.
జనవరి 10న ఈ కేసు విచారణ పూర్తయింది. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రాలతో పాటు మొత్తం 56 ముద్దాయిలుగా ఉన్నారు.
అంతకు ముందు జనవరి 6న ఇదే కుంభకోణంలో భాగంగా దేవ్‌ఘర్ ఖజానా నుంచి అక్రమంగా డబ్బులు డ్రా చేసిన కేసులో లాలూ ప్రసాద్‌కు కోర్టు మూడున్నరేళ్ల శిక్ష విధించింది.
నిరుడు డిసెంబర్ 23న ఆ కేసులో కోర్టు ఆయనను దోషిగా ప్రకటించింది. ప్రస్తుతం లాలూ ప్రసాద్ రాంచీలోని బిర్సా ముండా జైలులో ఉన్నారు.

ఫొటో సోర్స్, NIRAJ SINHA/BBC
అసలేంటీ కేసు?
చాయిబాసా కుంభకోణం 21 ఏళ్ల కిందటిది. ఈ కేసులో సీబీఐ మొత్తం 76 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
కేసు విచారణ జరుగుతున్న క్రమంలో వీరిలో 14 మంది మరణించారు. ముగ్గురు ప్రభుత్వ సాక్షులుగా మారారు. ఒక వ్యక్తి తీర్పుకు ముందే నేరాన్ని ఒప్పుకున్నారు.
నకిలీ బిల్లులు సృష్టించి చాయిబాసా ప్రభుత్వ ఖజానా నుంచి అక్రమంగా డబ్బులు డ్రా చేశారంటూ సీబీఐ ఆరోపించింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








