పూడిమడకలో లక్షలకోట్ల విలువైన గ్రీన్ హైడ్రోజన్ హబ్...ఏడాది తర్వాత ఏ స్థితిలో ఉంది?- బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంఖుస్థాపన చేసి ఏడాది పూర్తయింది.
గత ఏడాది జనవరి 8న జరిగిన ఈ శంఖుస్థాపన కార్యక్రమంలో ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు.
పూడిమడకలో రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడితో 1200 ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్టుతో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ప్రపంచ అగ్రగామిగా భారత్ మారుతుందని కేంద్రం చెబుతోంది. భారత్‌లో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2021లో ప్రారంభమైంది.
ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిన తర్వాత మీడియాలో ఏపీకి మహర్దశ, విశాఖకు ఉజ్వల భవిత, గేమ్ చేంజర్ ప్రాజెక్ట్, ఏపీ భవిష్యత్ ఇంధన రూపురేఖలను మార్చగలిగే గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు అంటూ అనేక కథనాలు వెలువడి ఏడాది పూర్తయింది.
ఈ నేపథ్యంలో...ఈ ప్రాజెక్టు పురోగతి ఎలా ఉంది? ఇప్పటి వరకు ఏ పనులు జరిగాయి? ఈ ప్రాజెక్టుతో తమ జీవితాలు మారిపోతాయాని ఎదురు చూస్తున్న స్థానికులు ఏమంటున్నారు? ప్రాజెక్టుకు పేరెంట్ కంపెనీ ఎన్టీపీసీ ఏం చెబుతోంది? అన్నవాటిపై బీబీసీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.


ఏపీ రూపురేఖలు మార్చే ప్రాజెక్ట్: ఏపీ ప్రభుత్వం
దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్‌టీపీసీకి చెందిన అనుబంధ సంస్థ ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (NGEL), ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APIIC) మధ్య 2024, ఫిబ్రవరి 20న ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో "ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్"ను అనకాపల్లి జిల్లా, అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామం సమీపంలో ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 1,200 ఎకరాల భూమిని కేటాయించారు.
దేశంలో ఫాసిల్ (శిలాజ) ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి, పర్యావరణ హితమైన ఇంధనల వైపు మళ్లడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశంగా ఎన్టీపీసీ పేర్కొంది.
ఈ ప్రాజెక్టును రాష్ట్రానికి ‘గేమ్ చేంజర్’గా ప్రభుత్వం అభివర్ణించింది. ఈ హబ్ ద్వారా సుమారు 60 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 60 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఏపీ ప్రభుత్వం చెబుతుండగా...ప్రత్యక్షంగా సుమారు 57 వేల ఉద్యోగావకాశాలు వస్తాయని ఎన్టీపీసీ తన వెబ్‌సైట్లో పేర్కొంది.
దేశంలోనే తొలి అతి పెద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఇదే కావడం వల్ల, దీనికి అనుబంధంగా అనేక పరిశ్రమలు ఏర్పడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. అలా జరిగితే ఉమ్మడి విశాఖ జిల్లాకు ఇది కీలక ఆర్థిక కేంద్రంగా మారే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే, ఇంత ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టు ఇప్పటికీ ప్రారంభ దశ దాటలేదనే విమర్శలు ఉన్నాయి.

‘మాకు ఆశ ఉంది.. ’
పూడిమడక సమీపంలో ఈ ప్రాజెక్టు కోసం సుమారు 1200 ఎకరాల భూమిని ఏపీఐఐసీ గుర్తించి...అప్పగించింది. దాని చుట్టూ రక్షణ గోడ నిర్మించారు.
ప్రాజెక్టు స్థలంలోకి రాకపోకలు సాగించేందుకు ఆ గోడకు ఒక గేటును ఏర్పాటు చేశారు. ఆ గేటుకి వంద మీటర్లు దూరంలో రెండు కంటైనర్ బాక్సులు, ఒక పాక కనిపిస్తాయి. రాకపోకలను పర్యవేక్షించేందుకు సెక్యూరిటీ సంస్థను నియమించారు. ఏడాది కాలంగా ఈ ప్రాజెక్టు వద్ద కనిపించే దృశ్యాలు ఇవే.
అయితే, ప్రధాని శంకుస్థాపన చేసి ఏడాది గడిచినా.. ఈ ప్రాజెక్టు ఎక్కడ ముందుకు కదిలినట్లు, పనులు జరుగుతున్నట్లు కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు.
"అచ్యుతాపురం సెజ్‌లో ఫార్మా కంపెనీలే ఎక్కువగా ఉన్నాయి. వాటితో కాలుష్యం, అడపాదడపా పేలుళ్లు సంభవించడం ఇక్కడ మాములే. కానీ...ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కాలుష్యం లేకుండా ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి ఫ్యాక్టరీ మా ప్రాంతంలో వస్తుండటంతో...అది మాకు ఉద్యోగాలను, ఉపాధి అవకాశాలను కల్పిస్తుందనే ఆశ మొదలైంది" అని లాలంకోడూరు నివాసి అప్పారావు బీబీసీతో అన్నారు.
"ఏడాదైనా ఏ పనులు జరిగాయో మాకు అర్థంకావడం లేదు. ఆ రోజు ఏ గేటు, గోడ ఉన్నాయో...ఇప్పుడు అవే ఉన్నాయి. ఒక్క ఇటుక కూడా పేర్చలేదు" అని స్థానికుగు నరసింహలు బీబీసీతో అన్నారు.
అనుకున్న సమయానికి ఈ సంస్థ ప్రారంభమైతే...తమ ప్రాంతం అభివృద్ధి చెంది...తమ జీవితాలు బాగుపడతాయనే ఆశ ఉందన్నారు

ఫొటో సోర్స్, Hindustan ship yard
గత ఏడాది ఏం జరిగిదంటే...
ఆంధ్రప్రదేశ్‌లోని పూడిమడక గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లో కీలక విద్యుత్ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ టెండర్లు ఆహ్వానించింది. ఈ టెండర్‌కు సంబంధించిన వివరాలు, షెడ్యూళ్లు, బిడ్ విధానాలు ఎన్‌టీపీసీ ఈ-ప్రోక్యూర్‌మెంట్ పోర్టల్స్‌లో అందుబాటులో ఉంచింది.
ఆధునిక గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాలకు నిరంతర, అవాంతరాలు లేని విద్యుత్ సరఫరా అందించడమే ఈ సబ్‌స్టేషన్ ప్రధాన లక్ష్యం.
వ్యూహాత్మక ప్రాంతాల్లో గ్రిడ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ద్వారా, ఎనర్జీ రెజీలియన్స్‌ను పెంచడం, పారిశ్రామిక స్థాయిలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని వేగవంతం చేయడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.
ఏడాదిలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభం, పురోగతి ఎలా ఉందనే విషయంపై బీబీసీ ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సూర్యనారాయణతో మాట్లాడింది.
"ప్రాజెక్‌కి శంకుస్థాపన జరిగి ఏడాదైంది. ప్రస్తుతం ప్రాజెక్టులోని వివిధ పనులను నిర్వహించేందుకు అనుమతులు తీసుకుంటున్నారు. ప్లానింగ్, ఇన్ ఫ్రా, పర్యావరణం వంటి అనుమతులు పొందే పనులు జరుగుతున్నాయి. ఈ పనులన్నీ ఎన్టీపీసీ చూసుకుంటుంది" అని సూర్యనారాయణ బీబీసీతో చెప్పారు.

ఎన్టీపీసీ ఏం చేస్తుందంటే...
అనకాపల్లి జిల్లా పూడిమడకలో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎన్టీపీసీ సింహాద్రి చెప్పిన వివరాల ప్రకారం ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనేది ఎన్టీపీసీ అనుబంధ సంస్థ.
నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది పని చేస్తోంది. అనకాపల్లి జిల్లాలోని పూడిమడక వద్ద సముద్రపు నీటి నుంచి గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది.
సముద్రపు నీటి ప్రాసెసింగ్ కోసం, ఎన్టీపీసీ (థర్మల్ పవర్ ప్లాంట్) తక్కువ కర్బన ఉద్గారాలు వెలువరించే డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంది. డీశాలినేషన్ అంటే నీటిలోని ఖనిజ లవణాలను తొలగించడం.
సముద్రపు నీటిని తక్కువ ఖర్చుతో హైడ్రోజన్ తయారీకి ఉపయోగించే శుద్ధి చేసిన అత్యంత స్వచ్ఛమైన నీరుగా ఈ ప్రక్రియ మారుస్తుంది. దీనినే హైడ్రోజన్-గ్రేడ్ వాటర్ అంటారు.
గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి భారత్‌లో శుద్ధి చేసిన నీటి కొరత ఉన్నందున సముద్రపు నీరు, మురుగు నీటిని కూడా ఉపయోగించి వాటి నుంచి హైడ్రోజన్ ఉత్పత్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తోంది.
‘‘ఈ ప్రాజెక్ట్‌లో ఫేజ్-1ను 2026 చివరికి పూర్తి చేయాలని లక్ష్యం. ఈ ఫేజ్‌లో అనుమతులు, ప్రధాన మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి పెడతాం. ఫేజ్-2లో ఉత్పత్తి విస్తరణ చేపడతాం. పూర్తి స్థాయి కార్యకలాపాలు 2032 నాటికి ప్రారంభమయ్యేలా ప్రణాళిక రూపొందించాం. దానికి తగిన విధంగానే గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి’’ అని ఎన్టీపీసీ-సింహాద్రి అధికారులు బీబీసీతో చెప్పారు.

‘గ్రీన్ హైడ్రోజన్‌లో నెంబర్ వన్.. ’
ఏపీని 2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిని చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఏపీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అడ్వయిజరీ బోర్డు కో-చైర్మన్ కె. విజయానంద్ చెప్పారు.
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ద్వారా పూడిమడక వద్ద ఏర్పాటవుతున్న హైడ్రోజన్ ప్రాజెక్టు ద్వారా 20 గిగావాట్ రెన్యువబుల్ ఎనర్జీ సామర్థ్యంతో రోజుకు సుమారు 1500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి కృషి జరుగుతోందని అన్నారు.
గ్రీన్ హైడ్రోజన్‌ను స్థానికంగా ఉన్న స్టీల్ ప్లాంట్లు, ఎరువుల తయారీ పరిశ్రమలు, ఓడరేవులు పెద్ద ఎత్తున వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

గ్రీన్ హైడ్రోజన్ అంటే?
శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా, పూర్తిగా కర్బన రహితంగా ఉపయోగించగల ఇంధనమే గ్రీన్ హైడ్రోజన్. భారతదేశాన్ని గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2021లో రూ. 22 వేల కోట్లతో 'నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్'ను ఆమోదించింది.
ఈ మిషన్ లక్ష్యాల ప్రకారం, 2030 నాటికి కనీసం ఐదు మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసి దేశీయ అవసరాలను తీర్చడమే కాకుండా, ఉత్పత్తిని 10 మిలియన్ టన్నుల వరకు పెంచి ఎగుమతులు చేయాలని కేంద్రం భావిస్తోంది. కర్బన ఉద్గారాలను తగ్గించి స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని పెంచడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశ్యం.
విండ్ లేదా సోలార్ వంటి పునరుత్పాదక శక్తితో నీటిని విద్యుద్విశ్లేషణ చేయడం ద్వారా హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విభజిస్తారు. ఈ ప్రక్రియలో ఉపయోగించే విద్యుత్తు కూడా పునరుత్పాదక వనరుల నుంచే రావడంతో, ఇది పూర్తిగా కాలుష్య రహిత ఇంధనంగా పరిగణిస్తారు.

ప్రయోజనాలు..
2030 నాటికి దేశవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ద్వారా రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు, సుమారు 6 లక్షల ఉద్యోగాలు రావచ్చని ఆంధ్ర విశ్వవిద్యాలయం రసాయన విభాగం ప్రొఫెసర్ జి. నాగేశ్వరరావు తెలిపారు.
"గ్రీన్ హైడ్రోజన్ నీటి నుంచే తయారవుతుంది. దీనివల్ల ఉత్పత్తి అయ్యే వ్యర్థం కూడా నీరే కావడం వల్ల ఇది పూర్తిగా కర్బన రహితం. సముద్రపు నీటి నుంచీ ఉత్పత్తి చేయవచ్చు, దీన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచవచ్చు. వాహనాలకు ఇంధనంగా కూడా దీన్ని వినియోగించే అవకాశం ఉంది"
"అంతేకాకుండా, ఏటా రూ.లక్ష కోట్ల విలువైన చమురు దిగుమతులను తగ్గించడంతో పాటు, సుమారు 50 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను నియంత్రించవచ్చని కేంద్రం అంచనా వేస్తోంది" అని ఆయన తెలిపారు.
పూడిమడక గ్రీన్ హైడ్రోజన్ హబ్ నుంచి ఎలక్ట్రోలైజర్లు, ఫ్యూయల్ సెల్స్ తయారీతో పాటు అనుబంధ పరిశ్రమలు, టెస్టింగ్, ఇంక్యుబేషన్ సదుపాయాలు ఏర్పడి, గ్రీన్ అమోనియా , గ్రీన్ మిథనాల్ వంటి ఉత్పత్తులు కూడా తయారై ఎగుమతులకు దోహదపడతాయని ఆయన వివరించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














