ఫ్రెంచ్ యూనివర్సిటీలో గూఢచారులకు ప్రత్యేక పాఠాలు

గూఢచారులు, శిక్షణ, స్పై, ఇంటెలిజెన్స్, ఆర్ధికరంగం, మాదక ద్రవ్యాలు, అవినీతి
ఫొటో క్యాప్షన్, ఈ కోర్సు 20 ఏళ్ల ప్రాయంలోని విద్యార్థులను, ఫ్రెంచ్ గూఢచారులను కూడా ఆకర్షిస్తోంది.
    • రచయిత, క్రిస్ బాక్మాన్
    • హోదా, పారిస్

తాను పాఠాలు చెప్పే కోర్సకు హాజరయ్యే విద్యార్థులలోని చాలామంది అసలు పేర్లు తనకు తెలియవని విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జావియర్ క్రెట్టీజ్ తెలిపారు. విద్యా ప్రపంచంలో ఇదో అసాధారణ విషయం. కానీ ప్రొఫెసర్ క్రెట్టీజ్ పని కూడా అలాంటిదే.

ఆయన ఫ్రాన్స్ గూఢచారులకు శిక్షణ ఇస్తారు.

"కోర్సు నేర్చుకోవడానికి వచ్చేవారి నేపథ్యం నాకు చాలా అరుదుగా మాత్రమే తెలుస్తుంది. పైగా వారు నాకు చెప్పే పేర్లు నిజమైనవా కాదా అనే సందేహం ఉంటుంది" అంటారు ప్రొఫెసర్ క్రెట్టీజ్.

ఈ కోర్సు నేర్చుకోవడానికి సాధారణంగా ఇరవై ఏళ్ల వయసున్నవిద్యార్థులతో పాటు, రోజువారీ విధులకు హాజరయ్యే ఫ్రెంచ్ ప్రభుత్వ గూఢచారులు కూడా వస్తారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మీరో గూఢచారుల పాఠశాల నెలకొల్పాలనుకుంటే పారిస్ శివార్లలోని సైన్సెస్ పో సెంట్-జర్మేస్ క్యాంపస్ మీకో నమూనాగా ఉపయోగపడుతుంది.

రద్దీగా ఉండి, ఏదో కోల్పోయినట్టుండే రహదారుల పరిసరాలలోని పాత భవనాలు, భయపెట్టే పెద్ద మెటల్ గేట్లతో ఈ ప్రాంతం ఏదో రహస్యాన్ని దాచుకునట్టుగా కనిపిస్తుంటుంది.

ఈ యూనివర్సిటీ ఓ ప్రత్యేకమైన కోర్సు ద్వారా 20 ఏళ్ల వయసున్న విద్యార్థులను, సాధారణంగా 30 నుంచి 50 ఏళ్ల మధ్య వయసుండే ఫ్రెంచ్ సీక్రెట్ సర్వీస్ సభ్యులను ఒకచోటకు చేర్చుతుంది.

ఈ కోర్సు పేరు డిప్లొమా ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ గ్లోబల్ థ్రెట్స్. 2015లో పారిస్‌లో ఉగ్రవాదుల దాడుల తరువాత ప్రభుత్వం పెద్దఎత్తున ఫ్రెంచ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో నియామాకాలు జరిపింది. తదుపరి ఈ కోర్సును ఏర్పాటు చేయాల్సిందిగా యూనివర్సిటీని అభ్యర్థించింది.

కొత్త గూఢచారులకు శిక్షణ ఇవ్వడంతోపాటు, ప్రస్తుత ఏజెంట్లకు నిరంతర శిక్షణ ఇవ్వడానికి ఒక కొత్త కోర్సును రూపొందించమని ఫ్రాన్స్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలలో ఒకటైన సైన్సెస్ పోను ప్రభుత్వం కోరింది.

పెద్ద పెద్ద ఫ్రెంచ్ కంపెనీలు కూడా తమ భద్రతా సిబ్బందిని కోర్సులో రిజిస్టర్ చేయించడానికి, యువ గ్రాడ్యుయేట్లను వెంటనే నియమించుకోవడానికి ఆసక్తి చూపించాయి.

గూఢచారులు, శిక్షణ, స్పై, ఇంటెలిజెన్స్, ఆర్ధికరంగం, మాదక ద్రవ్యాలు, అవినీతి
ఫొటో క్యాప్షన్, ఆర్థిక నేరాలను ఎదుర్కోవడం గూఢచారులకు ఇప్పుడు కీలకమైన పని అని ప్రొఫెసర్ జేవియర్ క్రెట్టీజ్ అన్నారు.

ఈ డిప్లొమాను నాలుగు నెలల పాటు 120 గంటల క్లాస్‌వర్క్‌తో రూపొందించారు. ప్లేసుమెంట్‌లో ఉన్న విద్యార్థులు , గూఢచారులు ఈ కోర్సుకు దాదాపు 5వేల యూరోలు (సుమారు రూ.4,80,000) చెల్లించాల్సి ఉంటుంది.

హానికర అంశాలు ఎక్కడున్నా గుర్తించి, వాటిని ఎలా నిర్వీర్యం చేయాలో నేర్పించడమే ఈ కోర్సు ముఖ్య లక్ష్యం. వ్యవస్థీకృత నేరాల అర్థశాస్త్రం, ఇస్లామిక్ జిహాదిజం, వ్యాపార నిఘా సేకరణ, రాజకీయ హింస వంటి కీలక పాఠాలు బోధిస్తారు.

"నేను వాళ్లకి నేర్పే పాఠం ఇంటెలిజెన్స్, టెక్నాలజీపై ఎక్కువగా ఆధారపడటం. కానీ ఒక తరగతికి హాజరు కావడానికి, అలాగే విద్యార్థులతో మాట్లాడటానికి ముందు ఫ్రెంచ్ సెక్యూరిటీ సర్వీసెస్ నన్ను తనిఖీ చేస్తుంది" అని ప్రొఫెసర్ జేవియర్ క్రెట్టీజ్ అన్నారు.

"విద్యార్థుల్లో ఒకరైన 40 ఏళ్ల రోజర్ అనే వ్యక్తితో నేను మాట్లాడాను. ఆయన చాలా స్పష్టంగా, తాను ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ అని, పశ్చిమ ఆఫ్రికా అంతటా తన కస్టమర్లకు సలహాలు ఇస్తానని, అక్కడి కస్టమర్లకు రిస్క్ అసెస్‌మెంట్‌లను అందించడానికి ఈ కోర్సులో చేరానని చెప్పారు" అని ఆయన తెలిపారు.

"ఫ్రెంచ్ రహస్య సర్వీసులు ఇటీవల చాలా విస్తరించాయి. ఇప్పుడు "ఇన్నర్ సర్కిల్" అని పిలిచే విభాగంలో సుమారు 20వేలమంది ఏజెంట్లు ఉన్నారు" అని పొలిటికల్ రాడికలైజేషన్‌ను బోధించే ప్రొఫెసర్ క్రెట్టీజ్ చెప్పారు.

"ఇది రెండు భాగాలుగా ఉంటుంది. మొదటిది డీజీఎస్ఈ – విదేశీ అంశాలను పరిశీలించే సంస్థ, ఇది బ్రిటన్ ఎమ్I6 లేదా అమెరికా సీఐఏకి సమానం. రెండోది డీజీఎస్ఐ – ఫ్రాన్స్‌లోని అంతర్గత ముప్పులను చూసే సంస్థ, ఇది అమెరికా ఎమ్I5, ఎఫ్‌బీఐ కి సమానం" అని ఆయన చెప్పారు.

కానీ ఇది కేవలం ఉగ్రవాదం గురించి మాత్రమే కాదని ఆయన అంటున్నారు.

"రెండు ప్రధాన భద్రతా సంస్థలు ఉన్నప్పటికీ, మనీలాండరింగ్‌లో ప్రత్యేకత కలిగిన నిఘా సంస్థ ట్రాక్‌ఫిన్ కూడా ఉంది. ఇది మాఫియా కార్యకలాపాలపై దృష్టి సారిస్తుంది’’ అని ఆయన తెలిపారు.

ఈ కోర్సులోని ఇతర లెక్చరర్లలో ఒకప్పుడు మాస్కోలో ఉన్న డీజీఎస్ఈ అధికారి, లిబియాకు చెందిన మాజీ ఫ్రెంచ్ రాయబారి, ట్రాక్‌ఫిన్ నుంచి ఒక సీనియర్ అధికారి ఉన్నారు. ఫ్రెంచ్ ఇంధన దిగ్గజం ఈడీఎఫ్ భద్రతా అధికారి కూడా ఒక మాడ్యూల్‌ను నిర్వహిస్తున్నారు.

డిప్లొమాపై ప్రైవేట్ రంగం ఆసక్తి పెరుగుతూనే ఉందని చెబుతున్నారు. పెద్ద కంపెనీలు..ముఖ్యంగా రక్షణ, ఏరోస్పేస్ రంగంలో, అలాగే ఫ్రెంచ్ లగ్జరీ వస్తువుల సంస్థలు కూడా, నిరంతర సైబర్ భద్రత, గూఢచర్య బెదిరింపులు, విధ్వంసాన్ని ఎదుర్కొంటున్నందున విద్యార్థులను నియమించుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాయి.

"ఈ ఏడాది ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు కోర్సులో చేరారు. వారిలో ఆరుగురు గూఢచారులు. వారిని మీరు కూడా గుర్తించవచ్చు. ఎందుకంటే వారు తరగతి విరామాలలో, మిగతా విద్యార్థులకు దూరంగా ఉంటారు. నేను వారి వద్దకు వెళ్లినప్పుడు అంత సంతోషంగా ఏం కనిపించరు " అని ప్రొఫెసర్ క్రెట్టీజ్ తెలిపారు.

"వారేంచేస్తారో స్పష్టంగా చెప్పకుండా,ఈ కోర్సు ఆఫీసు వర్క్ నుంచి ఫీల్డ్ వర్క్‌కు తొందరగా పదోన్నతి పొందేందుకు ఉపయోగపడుతుందని ఒకరంటారు. మరొకరు ఈ కళాశాల వాతావరణంలో ఉండటం వల్ల తనకు కొత్త ఆలోచనలు వస్తున్నాయని అంటారు. వారు హాజరు ఫారమ్‌లో కూడా మొదటి పేర్లతో మాత్రమే సంతకం చేస్తారు" అని ఆయన చెప్పారు.

"కొత్త విద్యార్థులలో ఒకరైన 21 ఏళ్ల అలెగ్జాండర్ హుబర్ట్, యూరప్, చైనా మధ్య పొంచి ఉన్న ఆర్థిక యుద్ధం గురించి లోతుగా అర్థం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పారు.

‘‘జేమ్స్ బాండ్ దృష్టికోణం నుంచి సమాచార సేకరణను చూడటం సరైందికాదు. ఈ ఉద్యోగం ప్రమాదాలను విశ్లేషించడం, వాటిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించడం’’ అని వాలెంటైన్ గైలట్ అనే మరో స్టూడెంట్ చెప్పారు.

గూఢచారులు, శిక్షణ, స్పై, ఇంటెలిజెన్స్, ఆర్ధికరంగం, మాదక ద్రవ్యాలు, అవినీతి
ఫొటో క్యాప్షన్, అలెగ్జాండర్ హుబెర్ట్, వాలెంటైన్ గైలట్‌కు ఈ ఇద్దరు విద్యార్థులను ఫోటో తీసినందుకు బాగా సంతోషించారు .

తరగతిలోని దాదాపు సగం మంది విద్యార్థులు నిజానికి మహిళలే. ఇది సాపేక్షంగా కొత్త పరిణామం అని లెక్చరర్లలో ఒకరైన, గూఢచర్యంలో సాంకేతికతపై నిపుణుడైన సెబాస్టియన్-వైవ్స్ లారెంట్ చెప్పారు.

"ఇంటెలిజెన్స్ సేకరణలో మహిళలు ఆసక్తి చూపడం కొత్త విషయం. మెరుగైన ప్రపంచానికి ఇది దోహదపడుతుందని వారు భావించడమే దీనికి కారణం" అని ఆయన అన్నారు.

"ఈ యువ విద్యార్థులందరిలో ఒక సాధారణ లక్షణం ఉంది. అదేంటంటే వారంతా దేశభక్తులు. 20 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇది కొత్త విషయమే"అని ఆయన చెప్పారు.

గూఢచారులు, శిక్షణ, స్పై, ఇంటెలిజెన్స్, ఆర్ధికరంగం, మాదక ద్రవ్యాలు, అవినీతి

ఫొటో సోర్స్, Sciences Po Saint-Germain

ఫొటో క్యాప్షన్, ఇటీవలి తరగతి ఫోటోలో కొంతమంది విద్యార్థులు కెమెరావైపు కాకుండా వెనక్కి తిరిగి నిలబడటానికే మొగ్గుచూపారు.

ఈ కోర్సులో చేరడానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, ఫ్రెంచ్ పౌరసత్వం తప్పనిసరి. అయితే కొంతమంది ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారిని కూడా చేర్చుకుంటారు.

అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలని ప్రొఫెసర్ క్రెట్టీజ్ అంటున్నారు.

"అద్భుతమైన సీవీలు కలిగిన చాలా ఆకర్షణీయమైన ఇజ్రాయెల్, రష్యన్ మహిళల నుంచి నాకు క్రమం తప్పకుండా దరఖాస్తులు వస్తాయి. కానీ వాటిని వెంటనే చెత్తబుట్టలో వేస్తారు" అని చెప్పారు.

ఇటీవల తరగతికి సంబంధించిన ఒక గ్రూప్ ఫోటో చూస్తే ఆ గూఢచారులు ఎవరో మీరు కనిపెట్టొచ్చు. ఎందుకంటే వారు వెనక్కి తిరిగి నిల్చున్నారని ఆయన అన్నారు.

తాను కలిసిన విద్యార్థులు, ప్రొఫెషనల్ గూఢచారులందరూ శారీరకంగా ఫిట్‌గా, క్రీడాకారుల్లా ఉన్నప్పటికీ, గూఢచారి అంటే జేమ్స్‌బాండ్‌లా సాహసాలతో నిండిన జీవితం అనే అపోహను తొలగించాలనే ఉద్దేశం ప్రొఫెసర్ క్రెట్టీజ్‌కు కూడా ఉంది.

"కొత్తగా రిక్రూట్‌ అయిన వారిలో కొంతమంది మాత్రమే ఫీల్డ్‌లో పనిచేస్తారు. ఎక్కువ మంది ఫ్రెంచ్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు డెస్క్‌కే పరిమితమవుతాయి" అని ప్రొఫెసర్ క్రెట్టీజ్ చెప్పారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)