మహిళా గూఢచారులు: పుతిన్ బిడ్డకు తల్లి కావాలని ఉందన్న కామెంట్ ఆమెకు ఎందుకంత నచ్చింది?

రష్యా గూఢచర్యం, బ్రిటన్, బీబీసీ

ఫొటో సోర్స్, Facebook

ఫొటో క్యాప్షన్, స్వెత్లానా గెంచెవా (ఎడమ) త్స్వెటెంకా దొంచెవా ( కుడి)
    • రచయిత, డేనియల్ డి సిమోన్, క్రిస్ బెల్, టామ్ బీల్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

రష్యా గూఢచార వ్యవస్థలో పని చేస్తూ బ్రిటన్‌లో గూఢచర్యం చేస్తున్న ఇద్దరు మహిళల గురించిన వివరాలు బీబీసీ పరిశోధనలో వెలుగు చూశాయి.

బల్గేరియాకు చెందిన క్వెటలినా గెంచెవా, త్స్వెటెంకా దొంచెవా అనే ఈ ఇద్దరు మహిళలు ఒక స్పై నెట్ వర్క్‌లో పని చేస్తూ, కొందరు వ్యక్తులపై పెట్టిన నిఘాలో పాలుపంచుకున్నారు.

బీబీసీ వీళ్లను సంప్రదించి కొన్ని ప్రశ్నలు అడిగింది. అయితే వారి నుంచి ఎలాంటి సమాచారం లేదు.

ఎయిర్‌పోర్ట్‌లో పని చేస్తున్న గెంచెవాను ఫోన్ ద్వారా సంప్రదించినప్పుడు, ఆమె ఫోన్ లైన్ కట్ చేశారు. తర్వాత బీబీసీ ప్రతినిధి ఆమెకు మెయిల్ పంపారు. అందులో ఆమె బీబీసీ ప్రశ్నలపై తాను ఎలాంటి కామెంట్ చేయాలనుకోవడం లేదని చెప్పారు.

ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉంటున్న దొంచెవాను ఆమె నివసిస్తున్న ఇంటి వద్దే ఆమెను కలిసింది బీబీసీ. అయితే తాను దొంచెవాను కాదంటూ ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈ మహిళలు ఇద్దరు కాకుండా రష్యా తరపున గూఢచర్యం చేస్తూ దొరికిపోయిన మరో ఆరుగురు బల్గేరియన్లు లండన్‌లో కోర్టు విధించే శిక్ష కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ గూఢచారుల నెట్‌వర్క్ అత్యాధునికమైనదని, ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించిందని పోలీసులు చెప్పారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆరుగురు బల్గేరియన్లలో ముగ్గురు తాము రష్యా కోసం పని చేస్తున్నామని చెప్పారు.

దీంతో పాటు ఇంగ్లండ్‌లోని సెంట్రల్ క్రిమినల్ కోర్టు ఈ నెలలో జరిపిన విచారణలో మరో ముగ్గురు దోషులుగా తేలారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ మొత్తం గూఢచార వ్యవస్థను ఆస్ట్రియాకు చెందిన జాన్ మర్సలెక్‌ నడిపిస్తున్నారు. ఆయన గతంలో జర్మనీలో పని చేసేవారు. అప్పుడే రష్యా ఆయనకు గూఢచర్యంలో శిక్షణ ఇచ్చింది.

రష్యన్ గూఢచారుల గురించి పరిశోధించిన జర్నలిస్టులను కూడా మర్సలెక్ నేతృత్వంలోని గ్రూప్ లక్ష్యంగా చేసుకుంది.

ఈ మొత్తం నెట్‌వర్క్ వెనుక పుతిన్ ఉన్నారని తాను భావిస్తున్నట్లు రోమన్ డొబిరోఖొటోవ్ అనే జర్నలిస్టు బీబీసీకి చెప్పారు. యూరప్‌లో రష్యన్ గూఢచారుల తరపున నిఘా నిర్వహిస్తున్న ఇద్దరు మహిళల గురించి కోర్టులో కూడా ప్రస్తావించారు.

డిజిటల్ రీసర్చ్ ద్వారా అంతు చిక్కని ఇద్దరు మహిళలకు సంబంధించిన వివరాలను బీబీసీ గుర్తించింది.

రష్యా గూఢచర్యం, బ్రిటన్, బీబీసీ

ఫొటో సోర్స్, Cvetelina Gencheva/Facebook

ఫొటో క్యాప్షన్, స్వెత్లానా గెంచెవా

మిస్టీరియస్ ఎయిర్‌లైన్ ఉద్యోగి

స్వెత్లానా గెంచెవా బల్గేరియా రాజధాని సోఫియాలో ఉంటున్నారు.

రష్యన్ గూఢచారుల నిఘా పెట్టిన వ్యక్తులు విమానంలో, ఎప్పుడు, ఎక్కడ నుంచి ఎక్కడకు వెళుతున్నారు అనే దానితో పాటు అనేక వివరాలను ఆమె రష్యన్ గూఢచారులకు అందిస్తున్నారు. తన ఉద్యోగాన్ని ఆమె ఇందుకోసం ఉపయోగిస్తున్నారు.

ఆమె అందించిన సమాచారంతో రష్యన్ గూఢచారులు ఆయా వ్యక్తుల పక్క సీట్లలో కూర్చుని వారు ఫోన్లలో టైప్ చేసే సందేశాలు చదవడం, వారి రహస్యాలను కనుక్కునే పని చేస్తున్నారు.

అలా ఒక గూఢచారి రోమన్ డొబ్రోఖొటోవ్ అనే జర్నలిస్ట్ ఫోన్ పిన్ నెంబర్ కూడా కనుక్కున్నారు.

రోమన్ మీద నిఘా పెట్టేందుకు గెంచెవాను బెర్లిన్ పంపించారు. లండన్‌లో దోషులుగా తేలిన ముగ్గురు గూఢచారుల చాట్‌గ్రూప్‌లో ఆమె కూడా ఉన్నారు.

గూఢచర్యం ఆరోపణల్లో ఆర్లిన్ రుసేవ్, బైసెర్ జంబజోవ్, కేటరినా ఇవనోవాను లండన్ కోర్టు దోషులుగా తేల్చింది.

జర్నలిస్ట్ క్రిస్టో గ్రెజెవ్, రష్యా ప్రభుత్వ వ్యతిరేకి కిరిల్ కచుర్ విమాన ప్రయాణ వివరాలతో పాటు మరి కొంత సమాచారాన్ని ముందుగానే సేకరించిన గెంచెవా వాటిని రష్యన్ గూఢచారులకు అందించారు.

గూఢచారులపై క్రిమినల్ కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో గెంచెవాను ‘వెట్కా' అని లేదంటే ‘స్వేటి' అని పిలిచేవారు.

ఫేస్‌బుక్‌ ప్రొఫైల్ ద్వారా గెంచెవాను బీబీసీ గుర్తించింది. ఆమె కేటరీనా ఇవనోవా, బైసర్ దంబజోవ్‌తో చాట్ చేశారు.

ఈ ప్రొఫైల్ పరిశీలించిన తర్వాత ఆమె పౌర విమానయాన సంస్థలో పని చేస్తున్నట్లు బీబీసీ గుర్తించింది.

రష్యా గూఢచర్యం, బ్రిటన్, బీబీసీ

ఫొటో సోర్స్, facebook.com/cvetanka05

ఫొటో క్యాప్షన్, స్వెత్లానా గెంచెవా విమానయాన సంస్థలో పని చేస్తున్నారు.

సమాచారం రష్యన్లకు ఎలా చేరవేశారంటే...

ఓ ట్రావెల్ కంపెనీలో టిక్కెట్ల అమ్మకాల ఏజంట్‌గా పని చేసినట్లు కూడా ఆమె లింక్డిన్ ప్రొఫైల్‌లో ఉంది. ఆమె ఇంటర్నేషనల్ ఏవియేషన్ కన్సల్టెంట్ అనే కంపెనీ యజమాని కూడా అని బల్గేరియన్ సంస్థ చెబుతోంది.

లండన్‌లో దోషులుగా తేలిన ముగ్గురు గూఢచారుల గ్రూపు నాయకుడు రుసేవ్ వద్ద దొరికిన హార్డ్ డ్రైవ్‌లో కొంతమంది విమాన ప్రయాణికుల సమాచారం గురించిన స్క్రీన్ షాట్‌ను గుర్తించారు. దీన్ని విమానయాన పరిశ్రమ ఉపయోగించే అమేడస్ అనే సాఫ్ట్‌వేర్ నుంచి దొంగిలించారు.

ఈ సాఫ్ట్‌వేర్ ఉపయోగించడంలో తనకున్న నైపుణ్యం గురించి గెంచెవా తన లింక్డిన్‌ ప్రొఫైల్‌లో రాశారు.

గెంచెవా గురించి బీబీసీ పరిశోధన చేస్తున్న సమయంలో ఆమె రష్యన్ గూఢచారుల కోసం పని చేస్తున్న విషయం బల్గేరియన్ సెక్యూరిటీ సర్వీస్‌కు తెలుసని తన సమాచారం వెల్లడించడానికి ఇష్టపడని ఓ వ్యక్తి బీబీసీకి చెప్పారు.

గెంచెవా మీద ఇప్పటి వరకు ఎలాంటి నేరారోపణలు లేవు.

గెంచెవా రియల్ ఎస్టేట్ వ్యవహారాల కోసం ఉపయోగిస్తున్న ఫోన్ నెంబర్‌ ద్వారా ఆమెను సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది.

మేం బీబీసీ నుంచి ఫోన్ చేస్తున్నాం, మన సంభాషణ రికార్డు అవుతుందని చెప్పిన వెంటనే ఆమె ఫోన్ కట్ చేశారు. మేము ఎందుకు ఫోన్ చేశామో తెలుసుకునేందుకు కూడా ఆమె ప్రయత్నించలేదు

దీంతో బీబీసీ ఆమె ప్రొఫైల్‌లో ఉన్న ఐడీకి కొన్ని ప్రశ్నలతో కూడిన మెయిల్ పంపించింది. దీనిపై స్పందించిన ఆమె, నో కామెంట్ అని చెప్పారు. తన పేరు ఉపయోగించడానికి బీబీసీకి అనుమతి కూడా ఇవ్వనని అన్నారు.

బల్గేరియన్ భాషలో సమాధానం రాసిన గెంచెవా, తనకు ఇంగ్లిష్ మాట్లాడటం రాదని చెప్పారు.

అయితే ఆమె లింక్డిన్ ప్రొఫైల్‌లో మాత్రం తనకు ఇంగ్లిష్ మాట్లాడంలో పూర్తి స్థాయి నైపుణ్యం ఉందని, డిగ్రీ వరకు తాను ఇంగ్లిష్‌లోనే చదివానని రాసుకున్నారు.

రష్యా గూఢచర్యం, బ్రిటన్, బీబీసీ

ఫొటో సోర్స్, Tsveti Doncheva/Facebook

ఫొటో క్యాప్షన్, స్వెతంకా డొంచెవా

వియన్నాలో మహిళా గూఢచారి

వియన్నాలో ఉంటున్న జర్నలిస్ట్ క్రిస్టో గ్రొచేవ్ మీద డొంచెవా నిఘా పెట్టారు. ఆయన ఉంటున్న ఇంటికి ఎదురుగానే ఆమె రూమ్ తీసుకున్నారు. ఆయన ఇంటి ఫోటోలు తీశారు.

యుక్రెయిన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు డొంచెవాకు డబ్బులు అందాయి. వియన్నాలోని సోవియట్ వార్ మెమోరియల్ వద్ద ఆమె 'స్టిక్కర్లను' అంటించారు. యుక్రెయిన్ మద్దతుదారులను నియో నాజీలుగా చిత్రీకరించడమే ఈ క్యాంపెయిన్ లక్ష్యంగా సాగింది.

ఓల్డ్ బెయిలీ కోర్టులో విచారణ సందర్భంగా "స్వెటీ"గా అభివర్ణించిన డొంచెవా ప్రొఫైల్ ద్వారా బీబీసీ ఆమె వివరాలు తెలుసుకుంది. బీబీసీ పరిశోధనలో తేలిన ఆమె ఐడెంటిటీని వియన్నా అధికారులు ధ్రువీకరించారు.

బ్రిటన్ గూఢచర్యం కేసులో దోషులుగా తేలిన ముగ్గుర్ని ఆమె వియన్నాలో కలిశారు.

డొంచెవా నిఘా పెట్టిన వ్యక్తుల జాబితాలో ఆస్ట్రియా సీనియర్ అధికారులు అనేక మంది ఉన్నారు. ఇందులో ఆస్ట్రియా సీక్రెట్ సర్వీస్ అధిపతి ఒమెర్ హజ్జావి ప్రిష్నర్, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఆనా తాహ్మెర్ ఉన్నారు. ఆనా తాహ్మెర్ రష్యన్ గూఢచర్యం గురించి కథనాలు రాశారు.

డొంచెవా నిరుద్యోగి. ఆమెను 2024 డిసెంబర్‌లో పోలీసులు అరెస్టు చేశారు.

కోర్టు పత్రాలను మొదట ఆస్ట్రియన్ మేగజైన్లు ప్రొఫిల్, ఫాల్టర్ ప్రచురించాయి. తర్వాత వాటిని బీబీసీ పరిశీలించింది.

"ఆమె ఆస్ట్రియాకు హాని కలిగించేలా రహస్యంగా నిఘా పెట్టడం అనే నేరానికి పాల్పడినట్లు బలంగా అనుమానిస్తున్నామని" ఆ పత్రాల్లో ఉంది.

ప్రస్తుతం లండన్ కోర్టు దోషిగా తేల్చిన ఆరుగురిలో ఒకరైన వన్యా గొబెరోవా కోసం తాను గూఢచర్యం చేస్తున్నానని, ఆమె తనకు చాలా కాలంగా స్నేహితురాలని డొంచెవా దర్యాప్తు అధికారులకు చెప్పారు.

గొబెరోవా తనకు కొన్ని ఫోటోలు, పేర్లు, అడ్రస్సులు ఇచ్చారని ఆమె అధికారులకు తెలిపారు.

అరెస్ట్ చేసిన తర్వాత మొదట ఆమె, తనను కొందరు తప్పుదారి పట్టించారని పోలీసులతో చెప్పారు. "వాళ్లు తాము ఒక స్టూడెంట్ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నామని తర్వాత ఇంటర్‌పోల్‌లో పని చేస్తున్నట్లు చెప్పారు" అని ఆమె పోలీసు విచారణలో వెల్లడించారు.

అయితే ఆమె చెప్పిన వివరాలు అసంపూర్తిగా ఉన్నాయని ఆస్ట్రియన్ పోలీసులు తెలిపారు. అలాంటి నమ్మశక్యం కాని కథనాలను ఆమె ఎలా విశ్వసించారో అర్థం కావడం లేదని అన్నారు.

డొంచెవా పని చేస్తున్న ఇంటెలిజెన్స్ గ్రూప్‌ను రష్యన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ తరపున మార్ సలేక్‌, మాస్కో నుంచి నడిపించేవారు. వియన్నా పోలీసులు డొంచెవా ఇంట్లో సోదాలు చేసినప్పుడు లభించిన ఆధారాల్లో, ఆమె మార్‌సలేక్, ఆర్లిన్ రుసేవ్ కోసం పని చేసినట్లు తేలింది.

జర్నలిస్ట్ ఆనా తాహ్మెర్‌ను లక్ష్యంగా చేసుకుని నిఘా పెట్టాలని మర్సలెక్ డొంచెవాకు సూచనలిచ్చారు. తాను తాహ్మెర్ ఇంటి ఫోటోలు తీశానని, ఆమె ఎక్కడకు వెళుతుందో కనిపెట్టి సమాచారం అందించినట్లు డొంచెవా పోలీసుల దర్యాప్తులో చెప్పారు.

రష్యా గూఢచర్యం, బ్రిటన్, బీబీసీ

ఫొటో సోర్స్, Adam Walker/BBC

ఫొటో క్యాప్షన్, ప్రొఫిల్ మేగజైన్ ఎడిటర్ ఆనా తాహ్మెర్‌‌పై రష్యా గూఢచార వర్గాలు నిఘా పెట్టాయి.

‘నాపై గూఢచర్యం జరుగుతోందని తెలుసు’

ఆనా తాహ్మెర్ ప్రస్తుతం ఆస్ట్రియన్ న్యూస్ మేగజైన్ ప్రొఫిల్‌కు ఎడిటర్‌. తనపై గూఢచర్యం జరుగుతుందని ఏడాది కిందటే తనకు తెలుసని ఆమె బీబీసీతో చెప్పారు.

"ఆమె మా ఆఫీసుకు ఎదురుగా ఉన్న ఫిష్ రెస్టారెంట్‌లో కూర్చునేది. నేను కూడా ఆ రెస్టారెంట్‌కు వెళుతుంటాను. అది చాలా ఖరీదైనది. డొంచెవా ఆ రెస్టారెంట్‌కు వెళ్లడానికి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసింది. ఆమెకు ఆ డబ్బులు అందాయి" అని ఆనా తాహ్మెర్ చెప్పారు.

తనతో పాటు మరి కొంతమంది ఉన్నతస్థాయిలో వ్యక్తుల మీద ఆమె గూఢచర్యం చేసిందని అన్నారు.

ఇంకా ఎక్కడెక్కడ తనపై నిఘా పెట్టేవారో తనకు తెలియదని, కొంతమంది వ్యక్తులు తన ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని ఆనా చెప్పారు.

"గూఢచర్యానికి వియన్నా రాజధాని. అయితే గూఢచర్యం చేసినందుకు ఇక్కడ ఎవరికీ ఎలాంటి శిక్షలు పడలేదు. ఈ నగరం వాళ్లకు అనుకూలంగా వ్యవహరిస్తోంది" అని ఆమె అన్నారు.

"నాకు చాలా చిరాగ్గా ఉంది. నిజం చెప్పాలంటే కొంత భయమేస్తోంది కూడా. ఇంట్లో నేను, నా కూతురు మాత్రమే ఉంటాం. జర్నలిస్టులు, రాజకీయ నాయకుల్ని కొంతమంది బెదిరిస్తుంటే, ప్రభుత్వం పట్టించుకోకపోవడం మంచిది కాదు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

రష్యా గూఢచర్యం, బ్రిటన్, బీబీసీ

ఫొటో సోర్స్, Tsveti Doncheva/Facebook

ఫొటో క్యాప్షన్, పుతిన్ బొమ్మ కింద ‘మీరేంటో నేను తెలుసుకోగలను’ అని రాసి ఉన్న టీ షర్ట్ ధరించిన డొంచెవా

పుతిన్ అంటే ఇష్టం

డొంచెవా సోషల్ మీడియాను ఏ స్థాయిలో వాడుతున్నారంటే, ఆమె పెంపుడు పిల్లి పేరిట టిక్‌టాక్ అకౌంట్ తెరిచారు.

2022, 2023లో ఆమె రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోటో ఉన్న టీ షర్టు ధరించిన ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.

ఆ ఫోటో కింద ఓ వ్యక్తి అనేక మంది మహిళలు పుతిన్‌ బిడ్డకు తల్లి కావాలని భావిస్తున్నారని రాస్తే, ఆమె ఆ కామెంట్‌పై స్పందిస్తూ పెదాలు తడుపుకుంటున్న ఎమోజీని పోస్ట్ చేశారు.

వియన్నాలో దొంచేవాతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించినప్పుడు ఆమె తాను దొంచేవాను కాదని చెప్పారు. బీబీసీ అడిగిన ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా ఆమె సమాధానం ఇవ్వలేదు.

వియన్నాలో ఆమెను కలిసేందుకు ప్రయత్నించినప్పుడు ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలో ఉన్న దుస్తుల్ని ధరించి ఉండటాన్ని బీబీసీ గుర్తించింది.

తాను దొంచేవాను కాదని ఆమె బీబీసీతో చెప్పిన 20 నిముషాల తర్వాత ఇంటికి వెళ్లారు. ఆ ఇంటి యజమాని పేరు దొంచేవా అని రికార్డుల్లో ఉంది.

డొంచేవా, గెంచేవాలిద్దరు బ్రిటన్‌లో రష్యా కోసం గూఢచర్యం చేసిన కేసులో దోషులుగా తేలిన ఆరుగురు బల్గేరియన్లతో కలిసి పని చేశారు.

రష్యా గూఢచర్యం, బ్రిటన్, బీబీసీ

ఫొటో సోర్స్, Metropolitan Police handout and social media

ఫొటో క్యాప్షన్, గూఢచర్యం కేసులో లండన్ కోర్టు ఆరుగురు బల్గేరియన్లను దోషులుగా తేల్చింది.

పేర్లు మార్చుకున్న గూఢచారులు

రుసేవ్, మర్సలెక్ మధ్య 80వేల టెలిగ్రామ్ ‌సందేశాలను బ్రిటన్ పోలీసులు పరిశీలించారు. 2023 ఫిబ్రవరికి ముందు ఈ గ్రూపు అనేక ఆపరేషన్లు నిర్వహించినట్లు సందేశాల్లో లభించిన సమాచారం ద్వారా తేలింది. దీంతో పోలీసులు వీరిపై నిఘా పెట్టి పట్టుకున్నారు.

ఈ గూఢచారులు జర్మనీలో అమెరికా శిక్షణ ఇచ్చిన యుక్రేనియన్ సైనికులను కూడా లక్ష్యంగా చేసుకున్నారు.

జర్నలిస్టులు క్రిస్టో గ్రొజెవ్, రోమన్ డొబ్రోఖొటోవ్‌లను కిడ్నాప్ చేసి హత్య చేయాలని రుసేవ్, మర్సలేక్ చర్చించుకున్నారు.

ఈ గ్రూపులో ఆరుగురు బల్గేరియన్లు పోలీసులకు ఆధారాలతో సహా దొరికినా, డొంచెవా, గెంచెవాను మాత్రం పోలీసులు ఇప్పటి వరకు పట్టుకోలేదు. వాళ్లు ఇప్పటి వరకూ ఏ నేరంలోనూ దోషులుగా తేలలేదు.

డొంచెవాను నిర్బంధంలో ఉంచి విచారించాలన్న ఆస్ట్రియన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజ్ఞప్తిని స్థానిక కోర్టు తిరస్కరించింది.

డొంచెవా పారిపోతుందనే భయం అక్కర్లేదని, ఆమె దేశంలోని ప్రజా సమూహంలో కలిసిపోయారని, తన తల్లిని జాగ్రత్తగా చూసుకుంటున్నారని ఆస్ట్రియన్ కోర్టు పత్రాలు తెలిపాయి.

భవిష్యత్‌లో ఆమె వల్ల ముప్పు ఏర్పడవచ్చన్న వాదనను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ కేసులో బ్రిటన్ కోర్టు ఇప్పటికే ఆరుగుర్ని దోషులుగా తేల్చిందని ఆస్ట్రియన్ కోర్టు వ్యాఖ్యానించింది.

తనపై గూఢచర్యం చేసిన వ్యక్తిని కోర్టు ఎందుకు వదిలేసిందో అర్థం కావడం లేదని తాహ్మెర్ చెప్పారు.

డిటెక్టివ్ చెప్పిన ప్రతీ అంశాన్ని కోర్టు విశ్వాసంలోకి తీసుకోకుండా ఉంటే బావుండేదని ఆమె భావిస్తున్నారు.

బ్రిటన్‌లో ఆరుగురు గూఢచారులను స్థానిక పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ, ఇంకా అనేక గ్రూపులు ఇదే పని చేస్తూ ఉండవచ్చని ఆస్ట్రియన్ సీక్రెట్ సర్వీస్ భావిస్తోంది.

గెంచెవా స్వేచ్ఛగా బల్గేరియాకు వెళ్లారు. ఆమె, తనను తాను విమానయాన రంగంలో అనుభవం ఉన్ని నిపుణురాలిగా చెప్పుకుంటున్నారు.

బీబీసీ సంప్రదించిన తర్వాత ఫేస్‌బుక్, లింక్డిన్‌ ప్రొఫైల్స్‌లో ఆమె తన పేరు మార్చుకున్నారు.

ఎయిర్‌లైన్స్ సాఫ్ట్‌వేర్ అమేడస్‌లో ఇప్పటికీ గెంచెవా గురించిన సమాచారం అందుబాటులో ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)