క్రిస్టీన్ గ్రాన్‌విల్: మెరుపులా కదిలే ఈ మహిళా గూఢచారి తన సాహసాలతో అమెరికా అధ్యక్షుడిని కూడా మెప్పించారు.. చివరకు ఎలా చనిపోయారు?

క్రిస్టీన్ గ్రాన్‌విల్

ఫొటో సోర్స్, APIC/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఎంఐ6 సంస్థలో చేరిన తొలి మహిళా గూఢచారి క్రిస్టీన్ గ్రాన్‌విల్
    • రచయిత, టిమ్ స్టోక్స్
    • హోదా, బీబీసీ న్యూస్

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సేవలు అందించిన మహిళా గూఢచారి క్రిస్టీన్ గ్రాన్‌విల్.

ప్రాణాలు కూడా లెక్కచేయకుండా దేశం కోసం యూరప్ వ్యాప్తంగా చేపట్టిన పలు సీక్రెట్ ఆపరేషన్లలో పాల్గొన్నారామె.

లెక్కలేనన్ని సార్లు మృత్యువు అంచులవరకు వెళ్లి, తప్పించుకున్నారు. మరి ఇంతటి సాహసికి సరైన గుర్తింపు లభించిందా? ఎలా చనిపోయారు?

అది 15 జూన్ 1952. లండన్‌లోని షెల్‌బోర్న్ హోటల్. ఆ రోజున బెల్జియం వెళ్లాల్సిన క్రిస్టీన్.. చివరి నిమిషంలో ఇంజిన్ ఫెయిల్యూర్ కారణంగా విమాన సర్వీస్ రద్దు కావడంతో తిరిగి హోటల్‌కు వచ్చారు.

మొదటి ఫ్లోర్‌కు వెళ్తుండగా, ఒక వ్యక్తి ఆమె పేరును పిలుస్తూ, లాబీలోకి దూసుకుని వచ్చారు. ఏవో లేఖలను తిరిగి ఇవ్వాలంటూ అరిచారు.

అతడిని చూసి మెట్లు దిగి, కిందకు వెళ్లిన సమయంలో ఓ కత్తి నేరుగా క్రిస్టీన్ గుండెల్లో దిగింది. రక్తం పైకి చిమ్మింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు క్రిస్టీన్. ఆమెను హత్య చేసింది క్రిస్టీన్ మాజీ ప్రియుడు డెన్నిస్.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఎన్నో ఆపదలను అలవోకగా తప్పించుకున్న క్రిస్టీన్, ఆ సమయంలో మాత్రం చావును తప్పించుకోలేకపోయారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే హోటల్లో, అలాంటి దాడి జరిగి చనిపోవడం విచిత్రమే.

క్రిస్టీన్ గ్రాన్‌విల్

ఫొటో సోర్స్, APIC/GETTY IMAGES

ఎమ్ఐ6 సర్వీస్‌లో చేరిన తొలి మహిళా స్పై

క్రిస్టీన్ అసలు పేరు మరియా క్రిస్టిన జనినా స్కార్‌బెక్. 1908 మే లో పోలెండ్‌లో జన్మించారు క్రిస్టీన్. ఆమె తండ్రి పోలెండ్‌కు చెందిన సంపన్న వర్గానికి చెందినవారు. తల్లి యూదుల మూలాలున్న కుటుంబం నుంచి వచ్చారు.

క్రిస్టీన్ బాల్యం ఎంతో సంతోషంగా గడిచింది. ఆ సమయంలోనే గుర్రపు స్వారీ, షార్ట్ గన్ షూటింగ్.. వంటి ఎన్నో విద్యల్లో ఆరితేరారు. దేనికీ లోటులేకుండా పెరిగారు.

చరిత్రకారులు, రచయిత్రి ‘ది స్పై హూ లవ్డ్, ఏ బయోగ్రఫీ ఆఫ్ క్రిస్టీన్ గ్రాన్‌విల్’ పుస్తకాన్ని రాసిన క్లేర్ ముల్లే మాట్లాడుతూ, “క్రిస్టీన్ చిన్నతనంలో నేర్చుకున్నవే, పెద్దయ్యాక ఆమెకు ఎంతో ఉపయోగపడ్డాయి అని చెప్పారు. బ్రిటీష్ గూఢచారిగా ఆమె మెరుపులాంటి సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు వనరుగా మారాయి” అని చెప్పారు.

సెప్టెంబర్ 1939లో క్రిస్టీన్ తన రెండో భర్తతో పర్యటనలో ఉండగా ఆమె స్వదేశమైన పోలెండ్ నాజీల ఆధీనంలోకి వెళ్లిపోయిందన్న సమాచారం తెలిసింది. వెంటనే ఆ దంపతులిద్దరూ యుద్ధంలో చేరడానికి సిద్ధమయ్యారు. బ్రిటన్‌కు పయనమయ్యారు. క్రిస్టీన్ భర్త పోలెండ్ దౌత్యవేత్త. ఆయన ఫ్రాన్స్‌కు వెళ్లి దళాల్లో చేరగా, గ్రాన్‌విల్ మాత్రం తన సేవలు దేశానికి మరోలా ఉపయోగపడాలని ఆలోచించారు. ఆ ఆలోచనే ఆమెకంటూ చరిత్రలో స్థానం దక్కేలా చేశాయి.

“బ్రిటన్‌కు చెందిన సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అయిన ఎంఐ6లో చేరడానికి ఆమె ఊవిళ్లూరారు. అయితే, ఆ అవకాశం మాత్రం అనుకున్నంత తేలిగ్గా దక్కలేదు” అని చెప్పారు క్లేర్ ముల్లే.

తనను సర్వీస్‌లోకి తీసుకునేందుకు ఏజెన్సీ అధికారులను ఆమె మెప్పించాల్సి వచ్చింది. అందుకు నాజీల ఆధీనంలో ఉన్న పోలాండ్‌కు కరాపాతి పర్వతాల్లో స్కీయింగ్ చేస్తూ ఎలా వెళ్లొచ్చో, అక్కడకు చేరుకుని, నాజీల వ్యూహం, వారి దగ్గర ఉన్న సంపద, ఇతర రహస్య సమాచారం తెలుసుకోవడానికి ఏయే అవకాశాలు ఉన్నాయో వివరిస్తూ, తన ప్రణాళికను వారికి తెలియజేశారు క్రిస్టీన్.

ఆ సమయంలో తూర్పు యూరప్ ప్రాంతం నుంచి పరిమితంగానే రహస్య సమాచారం అందుతున్న కారణంగా, క్రిస్టీన్ గ్రాన్‌విల్‌కు అవకాశం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. అలా సర్వీస్‌లోకి చేరిన తొలి మహిళా గూఢచారి క్రిస్టీన్.

“ఆ తరువాతి కాలంలో పోలెండ్‌లో గూఢచర్యం గగనంగా మారింది. ఆ సమయంలో తన తండ్రికి అక్కడున్న పేరు, తనకున్న పరపతితో ఎంతో విలువైన సమాచారాన్ని ఎంఐ6కు అందజేసి, ఇంటెలిజెన్స్ కమ్యూనిటీలో తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని సంపాదించారు క్రిస్టీన్” అని ముల్లే చెప్పారు.

క్రిస్టీన్ గురించి మాట్లాడుతూ, “ఆమె చాలా భాషలు అనర్గలంగా మాట్లాడగలదు. అందం ఆమెకు కలిసొచ్చే ఆభరణం. కానీ, అంతకుమించిన శక్తి సామర్థ్యాలున్నాయి. ఎవరికంటా పడకుండా ఎలా సరిహద్దులు దాటాలో ఆమెకు బాగా తెలుసు‌ .ప్రమాదకరమైన సాహసాలను చేయడానికి ఏమాత్రం వెనకాడేది కాదు. సిగరెట్లు తాగే అలవాటు లేకపోయినా, సరిహద్దుల మధ్య సిగరెట్లు స్మగ్లింగ్ చేసేది. అలాంటి పనులు కేవలం థ్రిల్ కోసం చేసేది” అని చెప్పారు ముల్లే.

రెండో ప్రపంచ యుద్ధ సమయం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫ్రాన్స్‌లో ఉన్న సమయంలో జర్మన్‌ల బాంబుదాడులకు తరచూ గురయ్యే వసియెక్స్-ఎన్-వెర్కోస్‌లో నివసించేవారు క్రిస్టీన్.

సీక్రెట్ ఆపరేషన్లు..

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఎంఐ6 కోసం హంగేరీ, ఫ్రాన్స్, ఈజిప్ట్ దేశాల్లో పని చేశారు క్రిస్టీన్.

ఎవరూ గుర్తించని రీతిలో సరిహద్దులను దాటారు.

“ఒక్కోసారి ఒక్కో పద్ధతిలో భద్రతా అధికారుల కళ్లుగప్పి, ఆయా దేశాల సరిహద్దులు దాటేవారు. ఓసారి కారు డిక్కీలో దాక్కుని, సరిహద్దు దాటితే, మరోసారి తన భాగస్వాములను ఎంచుకొని, వారి సాయంతో సరిహద్దులు దాటేవారు. ఊహకు అందని వ్యూహాలతో తనకు అప్పజెప్పిన పనులను పూర్తి చేసేవారు” అని ముల్లే చెప్పారు.

ఒకానొక సందర్భంలో సోవియట్ సరిహద్దుల్లో జర్మన్ దళాలు భారీగా మోహరించారన్న సమాచారం ఉన్న మైక్రో ఫిలిం ఆమె చేతికి చెక్కింది. ఆ సమాచారం అప్పటి అధ్యక్షులు విన్‌స్టన్ చర్చిల్‌కు చేరవేయడంలో కీలక పాత్ర పోషించింది క్రిస్టీన్. చర్చిల్ కుమార్తె సారా చెప్పిన దాని ప్రకారం.. క్రిస్టీన్ తనకెంతో ఇష్టమైన గూఢచారి అని చర్చిల్ ఆమెతో అన్నారట.

యుద్ధ సమయంలో రెండుసార్లు జర్మన్ల చేతికి చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారు క్రిస్టీన్.

ఓ సందర్భంలో ఆమె పట్టుబడటం తప్పదని అర్థమైపోయింది. ఆ సమయాన తన నాలుకను తానే కొరుక్కుని రక్తం బయటకు వచ్చేలా చేసి, తనకు టీబీ సోకిందని నమ్మించి, ఆ ఆపద నుంచి తప్పించుకున్నారు.

“ఆమె మెదడు పాదరసం కన్నా చురుగ్గా పనిచేస్తుంది ఆమె ఒక అద్భుతం. మెరుపు లాంటి ఆలోచనలతో కదులుతుంది” అన్నారు ముల్లే. తాను రాసిన పుస్తకంలో క్రిస్టీన్ గురించి ఎంతో గొప్పగా వర్ణించారు.

ఆమె ఎంతో అందంగా ఉంటారని, సరిహద్దుల్లో కాపలా ఉండే కుక్కలను కూడా తన పెంపుడు జంతువులుగా మచ్చిక చేసుకుని, తన పనులు పూర్తిచేసేవారని కూడా రాశారు.

రెండో ప్రపంచ యుద్ధం

ఫొటో సోర్స్, APIC/GETTY IMAGES

జైలు అధికారినే బురిడీ కొట్టించి…

1944లో ఆల్ప్స్ ప్రాంతం మీదుగా జర్మన్ సైన్యం వెళ్తోందన్న విషయాన్ని తెలుసుకున్నారు క్రిస్టీన్. అప్పటికప్పుడు 63 మంది పోలండ్ అధికారులను ఒప్పించి మరీ, ఆ జర్మన్ సైన్యంలోకి పంపి, గందరగోళం సృష్టించారు. వ్యూహాత్మకంగా పథకం రచించి, చివరకు జర్మన్ కమాండర్ లొంగిపోయేలా చేశారు.

అదే రోజున స్పెషల్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ కమాండర్ (ఎస్ఓఈ)గా పనిచేస్తున్న తన ప్రియుడు, మరో ఇద్దరు ఏజెంట్లతో గెస్టపో (జర్మనీ సీక్రెట్ పోలీస్)కు చిక్కారని, వారిని కాల్చి చంపబోతున్నారని సమాచారం చేరింది క్రిస్టీన్‌కు.

ఆ సమయంలో తన ప్రాణాలకు వచ్చే ముప్పును కూడా ఖాతరు చేయకుండా, వారిని కాపాడేందుకు వెళ్లారు. వారిని ఖైదు చేసిన డిగ్నే కారాగారంలోకి ప్రవేశించి, తనను తాను ఫీల్డ్ మార్షల్ మేనకోడలిగా చెప్పుకుని, అక్కడి అధికారిని ముప్పతిప్పలు పెట్టారు. అమెరికన్లు దాడులు చేస్తున్నారని చెప్పి, ఆ ముగ్గురినీ విడిపించారు. ఆ అధికారినే బురిడీ కొట్టించి మరీ వచ్చారు.

ముల్లే మాట్లాడుతూ, “ఆ సమయంలో క్రిస్టీన్ ఆ జైలు అధికారికి చెమటలు పట్టించారు. నిజంగానే ఆమె అధికారి బంధువు అయినట్లుగా ఏమాత్రం బెరుకులేకుండా ప్రవర్తించి, అదే నిజమని నమ్మించారు” అన్నారు.

అలా ముగ్గురు ఏజెంట్ల ప్రాణాలు కాపాడారు.

మహిళా గూఢచారుల వల్ల చాలా ఉపయోగాలుంటాయి అన్నారు ముల్లే.

“ఎందుకంటే దృఢమైన ఓ వ్యక్తి అటూ ఇటూ తిరుగుతున్నాడు అంటే ఎవరికైనా ఇట్టే అనుమానం వస్తుంది. అదే అతనికి బదులుగా ఓ అందమైన యువతీ అక్కడికి వెళ్లిందంటే, ఎవరూ అంతగా పట్టించుకోరు. ముఖ్యంగా కుటుంబంతో వెళ్తున్నట్లుగా వెళ్లి, అండర్ కవర్లో తమకు అప్పగించిన పనులు చేసేందుకు మహిళలకు కాస్త వెసులుబాటు ఉంటుంది” అన్నారు ముల్లే.

తన దేశం కోసం క్రిస్టీన్ తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పోరాటాలు చేశారు. చివరకు ఆమెకు తగిన గౌరవం కూడా లభించలేదు.

“బ్రిటిష్ ఫైల్స్‌లో ఆమెకు సంబంధించి చివరగా ఒక్క ఎంట్రీ మాత్రమే ఉంది. అందులో క్రిస్టీన్ సేవలు అవసరం లేదు” అని రాశారు.

ఆమె మాట్లాడుతూ, “కొంతమంది యుద్ధంలో పోరాడిన అనుభవం లేని వాళ్ళు, యువకులు కూడా ఆమె ఇదంతా నిజంగానే చేసిందా? అని ప్రశ్నిస్తారు. మరికొంతమంది ఆమె అందాన్ని గురించి, తప్పుగా మాట్లాడుతారు. కానీ అదంతా నిజం కాదు అన్నారు“ ముల్లే.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తను నిర్వహించిన ఆపరేషన్ల కారణంగా కమ్యూనిస్టుల అధీనంలో ఉన్న పోలాండ్‌కు వెళ్లలేకపోయారు క్రిస్టీన్. అలా అని యూకేలోనూ ఉండలేని పరిస్థితి తలెత్తింది.

ఆమెకు యూకె ప్రభుత్వం ఇచ్చిన పత్రాల ప్రకారం గడువు పూర్తవడంతో యుకెను వదిలి వెళ్లాల్సి వచ్చింది.

యుద్ధంలో అందించిన సేవలకు గాను ఆమెకు జార్జ్ మెడల్‌తో పాటు ఓబీఈ కూడా బహుకరించాల్సి ఉంది. అయితే తనకు పౌరసత్వం ఇవ్వని కారణంగా అవార్డులు కూడా వద్దని చెప్పి తన నిరసనను వ్యక్తం చేశారు క్రిస్టీన్. చివరికి అవార్డులను స్వీకరించారు.

క్రిస్టీన్ గ్రాన్‌విల్
ఫొటో క్యాప్షన్, క్రిస్టీన్ సమాధి

గుర్తింపునకు దూరమై..

షెల్‌బొర్న్ హోటల్లో తాను యుద్ధభూమిలో చేసిన పనులకు భిన్నంగా, వెయిటర్‌గా పని చేశారు, దుస్తులు విక్రయించారు. ఆ తరువాత ప్రయాణీకుల నౌకలో క్లీనర్‌గా పని చేశారు.

“బ్రిటన్ కోసం ఆమె ఏం చేసిందో మనం తప్పకుండా గుర్తుంచుకొని తీరాలి. యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి ఆమె తన దౌత్యవేత్త అయిన భర్తతో మొదటి తరగతి పాసింజర్ షిప్‌లో బ్రిటన్ కు వచ్చారు. కానీ యుద్ధం ముగిసే సమయానికి ఒక కార్మికురాలిగా మిగిలిపోయారు. ఇదీ ఆమెకు లభించిన గుర్తింపు“ అన్నారు ముల్లే.

ఆ నౌకలో పనిచేస్తున్న సమయంలోను ఆమెకు వివక్ష ఎదురైందని ముల్లే తన పుస్తకంలో రాశారు.

“ఆమె విదేశీ యువతి. అందులోనూ ఆమె మాటతీరు భిన్నంగా ఉంటుంది. ఆ కారణాలతో ఆమెకు తోటి వారి నుంచే వివక్ష ఎదురైంది“ అని రాశారు.

అదే సమయంలో ఆమెకు మద్దతుగా నిలిచిన సహోద్యోగి డెన్నిస్ జార్జ్ ముల్డోనీ ఆమెకు మరింత దగ్గరయ్యారు.

ఇద్దరూ కలిసి జీవితాన్ని మొదలుపెట్టారు. కొన్నాళ్లకే డెన్నిస్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఆ వేధింపులు చివరికి ఆమె ప్రాణాలను తీసేంతవరకు వెళ్లాయి. అదే షెల్‌బోర్న్ హోటల్లో ఆమె విగతజీవిగా మారింది.

“ఆ వ్యక్తి పిలుపు విని కిందకు వచ్చారు క్రిస్టీన్. ఆమె మాజీ ప్రియుడు డెన్నిస్ జార్జ్ పదునైన కత్తితో ఆమె గుండెల్లో నేరుగా గుచ్చాడు. గాయం లోతుగా తగిలి, అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు” అని రాశారు ముల్లే.

ఈ హత్య కేసులో అరెస్ట్ అయిన డెన్నిస్‌కు 10 వారాల తర్వాత ఉరి శిక్షను ఖరారు చేశారు. .

క్రిస్టీన్ హత్య అప్పట్లో ప్రధాన వార్తగా నిలిచింది. కానీ కాలం గడిచే కొద్దీ ఆమె కథను అందరూ మర్చిపోయారు.

ఆమె ఫలానా అంటూ ఒక ప్రాంతానికో, ఒక దేశానికో పరిమితం కాలేదు. అలాంటి సవాళ్ల మధ్యన ఇరుక్కుని కనుమరుగైంది ఆమె చరిత్ర.

“ఆమెకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు. పురుషుడితో సమానంగా పోరాటాలు చేసిన స్త్రీ అయినా, ఎవరూ గుర్తించలేదు. ఆమె ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడుతుందని పోలెండ్ దూరం పెడితే, ఆమె విదేశీ యువతి అని యూకే విస్మరించింది. మొత్తంగా ఈ రెండిటి మధ్యన నలిగిపోయిన ఆమె వీరగాధ ఎవరికీ తెలియకుండా పోయింది. తగిన గుర్తింపు లభించలేదు” అన్నారు ముల్లే.

రచయిత్రి ముల్లే క్రిస్టీన్ సాధించిన విజయాలన్నింటినీ ఒక దగ్గరకు చేర్చేపనిలో ఉన్నారు.

2020లో ఆమె మరణించిన హోటల్ వద్ద శిలాఫలకం ఏర్పాటు చేయగలిగారు. దాంతోపాటు ఓవో హెటల్లోని ఓ గదికి గ్రాన్‌విల్ సూట్ అని పేరుపెట్టేందుకు కృషి చేశారు.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)