జెఫ్రీ ఎప్‌స్టీన్: ‘బాలికలను సెక్స్ ఊబిలో దించడానికి చైన్ రిక్రూట్‌మెంట్ పద్ధతిని వాడారు’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బెర్డ్న్ డెబుస్‌మన్ జూనియర్
- హోదా, బీబీసీ న్యూస్, వాషింగ్టన్
లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసులకు సంబంధించి కోర్టుకు సమర్పించిన పత్రాలను అమెరికా న్యాయస్థానం విడతల వారీగా విడుదల చేస్తోంది.
గురువారం రెండో విడుతలో విడుదల చేసిన కోర్టు పత్రాల్లో జెఫ్రీ ఎప్‌స్టీన్ పదుల సంఖ్యలో మహిళలను తన సముద్ర తీర రిసార్ట్‌లో పని చేయడానికంటూ ఎలా రప్పించారో వివరంగా ఉంది.
ఫ్లోరిడాకు చెందిన డిటెక్టివ్ తాను కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో.. ఆ మ్యాన్షన్‌లో పని చేసేందుకు వెళ్లిన 30 మంది మహిళలతో తాను మాట్లాడినట్లు తెలిపారు. అక్కడ మసాజ్ చేయడానికి, పని చేయడానికి వెళ్లినట్లు చెప్పారని తెలిపారు. వారిలో కొందరికి తమ స్నేహితురాళ్లను తీసుకొస్తే అందుకు తగ్గ డబ్బు ఇస్తానని ఎప్‌స్టీన్ ఆశచూపించి వారి ద్వారా మరికొందరిని రప్పించారని వాంగ్మూలంలో చెప్పారు.
అమెరికా న్యాయస్థానంలోని న్యాయమూర్తి ఆదేశాలను అనుసరించి, జెఫ్రీ మాజీ గర్ల్‌ఫ్రెండ్, జైలు శిక్ష అనుభవిస్తున్న ఘిస్లైన్ మ్యాక్‌వెల్ కేసులో దాఖలైన పత్రాలను బహిర్గతపరిచారు.
తన ప్రియుడు జెఫ్రీ కోసం బాలికలను రవాణా చేసినందుకుగానూ 2022లో ఘిస్లైన్ మ్యాక్స్‌వెల్‌కు జైలు శిక్ష విధించారు.
ఈ కేసు విచారణలో భాగంగా బాధితులు, ఇతర సాక్ష్యుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలతో కూడిన కోర్టు పత్రాల్లో 900 పేజీలు బుధవారం బయటకు వచ్చాయి.
ఆ పత్రాల్లో మైఖేల్ జాక్సన్, మెజీషియన్ డేవిడ్ కాపర్‌ఫీల్డ్ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి.

ఫొటో సోర్స్, WILLIAM J CLINTON PRESIDENTIAL LIBRARY
గొలుసుకట్టు విధానంలో…
ఆ కోర్టు పత్రాల్లో ఫ్లోరిడా డిటెక్టివ్ వాంగ్మూలం ఒకటి. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌కు చెందిన పోలీస్ డిటెక్టివ్ జోసెఫ్ రెకారీ తన వాంగ్మూలంలో 2016లో జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు చెందిన బీచ్‌ఫ్రెంట్ కమ్యూనిటీలోని నివాసానికి వెళ్లిన 30 మంది మహిళలు తనతో మాట్లాడారని చెప్పారు.
మసాజ్ చేయడం, పని చేయడం కోసం తాము వెళ్లినట్లు వారు జోసెఫ్‌కు చెప్పారు. వారిని ఆ ఊబిలోకి దించింది మ్యాక్స్‌వెల్ అని కూడా చెప్పారు.
ఆ 30 మందిలో కేవలం ఇద్దరికి మాత్రమే మసాజ్ చేసిన అనుభవం ఉందని, వారిలో ఎక్కువ మంది బాలికలనేనని చెప్పారు.
జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు అంత భారీ సంఖ్యలో బాలికలను రప్పించడం ఎలా సాధ్యమైంది? అన్న ప్రశ్నకు డిటెక్టివ్ సమాధానం ఇస్తూ, “ఆ నివాసానికి వెళ్లిన ప్రతి బాలికతో ఆమె స్నేహితురాళ్లను కూడా తీసుకురావాల్సిందిగా చెప్పేవారు. కొంతమందికి అందుకోసం డబ్బు కూడా అందేది. మసాజ్ చేయడానికి వెళ్లిన వారితో ఎప్‌స్టీన్ లైంగిక ఆనందం పొందేవారు”అని చెప్పారు.
ఎప్‌స్టీన్‌పై, మ్యాక్స్‌వెల్‌పై బాధితురాలు వర్జీనియా దాఖలు చేసిన పరువునష్టం కేసులో పేర్కొన్న 150 మందికి పైగా వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచాలనేందుకు ఎలాంటి చట్టబద్ధమైన కారణం కనిపించడం లేదని, కోర్టుకు సమర్పించిన పత్రాలను బ్యాచ్‌ల వారీగా బహిర్గతం చేయాలని గత నెలలో న్యాయమూర్తి లొరెట్టా ప్రెస్కా తీర్పు ఇచ్చారు.
ఆ కేసులో పేర్కొన్న వ్యక్తులు న్యాయపరంగా తమ అభ్యంతరాలను తెలుపుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించొచ్చని, ఎప్‌స్టీన్‌తో వారి పేరు చెప్పినంత మాత్రాన తప్పు చేసినట్లు కాదని అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ప్రిన్స్ ఆండ్రూపై లైగింక వేధింపుల ఆరోపణలు..
న్యాయమూర్తి తీర్పులో భాగంగానే బుధవారం, గురువారం విడుదల చేసిన పత్రాల్లో ప్రిన్స్ ఆండ్రూతోపాటు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ల పేర్లు కూడా ఉన్నాయి.
వాటిల్లో బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూ లండన్, న్యూయార్క్, ఎప్‌స్టీన్ ఐలాండ్‌లో ఓ బాలికను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మ్యాక్స్‌వెల్ అలా చేయమని చెప్పినట్లు బాధితురాలి వాంగ్మూలం ఉంది. అయితే, గతంలోనే ఈ ఆరోపణలు తప్పని ఖండించారు అండ్రూ.
బయటకు వచ్చిన కొత్త పత్రాల్లో వర్జీనియా తరపు న్యాయవాది, మాజీ అధ్యక్షుడు క్లింటన్, ఎప్‌స్టీన్, మ్యాక్స్‌వెల్‌లతో స్నేహం ఉంది కాబట్టి, వారు చేస్తోన్న పనులపై “బహుశా ఆయనకు సమాచారం ఉండొచ్చు” అని చెప్పినట్లు ఉంది.
మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ గతంలో దీనిపై స్పందించారు. ఎప్‌స్టీన్‌తో తనకు స్నేహం ఉండడంతో ఆయనతో కలిసి ప్రైవేట్ జెట్‌లో ప్రయాణాలు చేశానని, కానీ, ఆయన పాల్పడిన నేరాలు, తప్పుల గురించి తనకు తెలియదని చెప్పారు.
కోర్టు పత్రాల్లో కూడా క్లింటన్‌పై అభియోగాలేవీ లేవు.
అయితే, తాజాగా విడుదలైన పత్రాల్లో బాధితురాలు క్లింటన్‌పై వర్జీనియా ఆరోపణలు చేసిన వివరాలు ఉన్నాయి.
ఆయన వేనిటీ ఫెయిర్ మ్యాగజీన్ కార్యాలయానికి వెళ్లి, అక్కడి వారితో తన స్నేహితుడు ఎప్‌స్టీన్ సెక్స్ ట్రాఫికింగ్‌కు సంబంధించిన కథనాలు రాయొద్దని హెచ్చరించినట్లు పేర్కొన్నారు.
ఈ ఆరోపణలపై క్లింటన్ ఫౌండేషన్‌ను సంప్రదించింది బీబీసీ.
ఫౌండేషన్ అధికార ప్రతినిధి ఆ ఆరోపణలపై మాట్లాడుతూ.. వానిటీ ఫెయిర్ మాజీ ఎడిటర్ గ్రేడన్ కార్టర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన మీడియా కథనాలను చూపిస్తూ క్లింటన్ అలా బెదిరింపులకు పాల్పడినట్లు ఆధారాలు లేవు అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
అదే ఆరోపణలకు సంబంధించి, వానిటీ ఫెయిర్ మాతృసంస్థ కొండె నాస్ట్ సంస్థను కూడా సంప్రదించింది బీబీసీ.
మరొక ఈమెయిల్‌లో మెయిల్ ఆన్ సండే కోసం పనిచేసిన జర్నలిస్ట్ షరోన్ చర్చర్, గియుఫ్రెల మధ్య జరిగిన ఈ మెయిల్ సంభాషణలు ఉన్నాయి. అందులో వారు వానిటీ ఫెయిర్ మ్యాగజైన్ నుంచి గియుఫ్రె ఫోటో కొనేందుకు వచ్చిన ప్రతిపాదన గురించి రాసుకున్నారు.
జర్నలిస్ట్ చర్చర్ ఆ ఈమెయిల్‌లో గియుఫ్రెకు సలహా ఇచ్చారు. ప్రస్తుతానికి గియుఫ్రె తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులు, ఎలా అందులో చిక్కుకుందనే వివరాలను ఎవరికీ చెప్పొద్దని, ముఖ్యంగా “ఇద్దరు ప్రపంచంలో గుర్తింపు పొందిన రాజకీయ నాయకుల” గురించి చెప్పొద్దని రాశారు.
ఆ ఈమెయిల్‌లో ఇద్దరు ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు మాత్రం పేర్కొనలేదు.
మరో కోర్టు పత్రంలో బాధితురాలిని జేన్ డోయ్‌గా చెప్పారు. ఆమె తనను ఆ ఊబిలోకి దించిన ఎప్‌స్టీన్‌ను గుర్తించింది, అమెరికాలోని పేరొందిన రాజకీయ నాయకులు, ప్రభావశీలురు, వ్యాపారవేత్తలు, విదేశీ అధ్యక్షలు, ప్రముఖ ప్రధాని, ఇతర నేతల లైంగిక అవసరాలను తీర్చాలని బలవంతం చేశారని పేర్కొంది.
కోర్టు పత్రాల్లో పేర్కొన్న జేన్ డోయ్‌ను గతంలో వర్జీనియా గియుఫ్రె పేరుతో మీడియా వ్యవహరించింది.
మ్యాక్స్‌వెల్ తరపు న్యాయవాదులు చేసిన వాదనలకు సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయి. ఒక పత్రంలో ప్రిన్స్ ఆండ్రూ, యూఎస్ అటార్నీ అలన్ డెర్షోవిట్జ్‌లకు వ్యతిరేకంగా కుట్ర పన్నేందుకు జర్నలిస్ట్ చర్చర్ సాయం చేసిందని ఆరోపించారు.
ఆ ఆరోపణలపై చర్చర్‌ను, మెయిల్ ఆన్ సండే పత్రికను బీబీసీ సంప్రదించింది.
తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ, కోర్టు పత్రాలను ముందుగానే విడుదల చేయాలని కోరుతూ డెర్షోవిట్జ్ కోర్టులో మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
గురువారం ఆయన ఫాక్స్ న్యూస్ డిజిటల్‌తో మాట్లాడుతూ.. “ఇంకా విడుదల చేయని స్కోకింగ్ గన్‌లు ఉన్నాయి. అవి కొంతమంది నిందితులు, బాధితుల గురించి ఉంటాయి. విశ్వసనీయత ఏమేరకు ఉందనేది అటుంచితే, కొన్ని దాచిపెట్టినవి ఉన్నాయి. ఎలాంటి పత్రాలూ దాచకూడదు” అన్నారు.
2008లో మైనర్‌ను వ్యభిచారంలోకి దించిన ఆరోపణల కేసులో ఎప్‌స్టీన్ తన నేరాన్ని అంగీకరించారు. దానితోపాటు సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలపై విచారణ కొనసాగుతున్న సమయంలో 2019లో ఆత్మహత్య చేసుకున్నారు.
ఆయనకు సహకరించి, మహిళలను ఆ ఊబిలోకి దింపినందుకు గానూ అరెస్టయిన ప్రముఖ పబ్లిషర్ రాబర్డ్ మ్యాక్స్‌వెల్ కుమార్తె, మాజీ ప్రియురాలు మాక్స్‌వెల్‌పై నేరారోపణ రుజువు కావడంతో 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. జైలు శిక్షపై ఆమె తరపు లాయర్లు అప్పీలుకు ప్రయత్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
- తెలంగాణ: రేవంత్ రెడ్డి చెప్పిన ‘మెగా డీఎస్సీ’ ఎప్పుడు, మొత్తం ఖాళీలెన్ని, రిక్రూట్మెంట్లో ఉన్న చిక్కులేంటి?
- ఎంఫిల్ కోర్సు రద్దు: యూజీసీ ఆదేశంతో విద్యార్థులకు లాభమా, నష్టమా?
- ‘హిట్ అండ్ రన్’ చట్టాన్ని డ్రైవర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పాత చట్టానికి, కొత్త చట్టానికి తేడా ఏమిటి?
- 6 గ్యారెంటీలకు ఎక్కడ, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? రైతు భరోసా, ఉచిత కరెంటు, రూ.4,000 పింఛను పథకాలకు ఎవరు అర్హులు?
- పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్‌లోకి ఎలా వచ్చారు, ఆయనకు ఆ పేరు ఎవరు పెట్టారు, అరెస్ట్ ఎందుకయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














