తెలంగాణ: రేవంత్ రెడ్డి చెప్పిన ‘మెగా డీఎస్సీ’ ఎప్పుడు, మొత్తం ఖాళీలెన్ని, రిక్రూట్మెంట్‌లో ఉన్న చిక్కులేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో గవర్నమెంటు టీచర్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
త్వరలోనే భారీగా టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. మెగా డీఎస్సీగా పిలిచే ఈ భారీ రిక్రూట్‌మెంట్ చుట్టూ ఎన్నో ఆశలతో పాటు చిక్కులూ, అనుమానాలూ ఉన్నాయి.
డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నిర్వహించే టీచర్ ఎంపిక పరీక్షనే షార్ట్ ఫామ్‌లో డీఎస్సీ అంటున్నారు.
ఉపాధ్యాయుల ఎంపికలో ఏ అవకతవకలూ జరగకుండా ఉండడం కోసం కేవలం పరీక్ష తప్ప ఇంటర్వ్యూ లేకుండా డీఎస్సీ వ్యవస్థను 2001 నుంచి నిర్వహిస్తున్నారు.
బీఈడీ, డీఈడీ చదివిన యువత ఈ పరీక్ష ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారా అని ఎదురుచూస్తూ ఉంటారు.

ఫొటో సోర్స్, Getty Images
పదేళ్లలో ఒక్కసారీ జరగని డీఎస్సీ
సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే ప్రాథమిక స్థాయి విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల పాఠాలు చెప్పేవారు, లాంగ్వేజ్ పండిట్ అంటే తెలుగు, హిందీ పాఠాలు చెప్పేవారు, స్కూల్ అసిస్టెంట్ అంటే ఆయా సబ్జెక్టులు ప్రత్యేకంగా చెప్పేవారు, పీఈటీలు.. ఇలా వివిధ రకాల టీచర్లు ఈ పరీక్ష ద్వారానే ఎంపిక అవుతారు.
అయితే, అంత కీలకమైన ఈ పరీక్షను తెలంగాణ ప్రభుత్వం దాదాపు గత 10 ఏళ్ళలో ఒక్కసారి కూడా నిర్వహించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నిరుద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తికి కారణమైన అంశాల్లో ఇది ఒకటి.
అదే సమయంలో టీచర్ ఉద్యోగాలు సహా మొత్తం 2 లక్షల గవర్నమెంటు ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
ఆ క్రమంలోనే డిసెంబరు 30న విద్యా శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి త్వరలో మెగా డీఎస్సీ నిర్వహించాలని అధికారులను ఆదేశించడంతో ఒక్కసారిగా ఈ అంశంపై చర్చ మొదలైంది.
అంతేకాదు, బడి లేని ఊరు ఉండకూడదు అని రేవంత్ చేసిన వ్యాఖ్యలతో టీచర్ నియామకాల సంఖ్య ఇంకా పెరుగుతుందని అభ్యర్థుల్లో ఆశ మొదలైంది.
గత డీఎస్సీకి తెలంగాణ నుంచి లక్షా 72 వేల మంది పోటీ పడ్డారు. ఈసారి ఆ సంఖ్యపెరిగే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
కేసీఆర్ ప్రభుత్వం వేసిన డీఎస్సీ ఏమైంది?
బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే ముందు అంటే 2023 అక్టోబరులో ఒక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ ప్రక్రియ మధ్యలో ఉండగానే ఎన్నికలు వచ్చాయి.
2023 ఆగస్టు వరకూ ఉన్న ఖాళీల ఆధారంగా అప్పుడు 5,089 పోస్టులకు నోటిఫికేషన్ వేసినట్టు చెప్పారు. వాస్తవానికి అప్పట్లో విద్యాశాఖ మంత్రి వర్గ ఉప సంఘానికి ఇచ్చిన నివేదిక ప్రకారం 9,370 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.
కానీ, అప్పటి ప్రభుత్వం పోస్టులను తగ్గించి నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఎన్నికల వల్ల ఆ రిక్రూట్‌మెంటే జరగలేదు.
అదే సందర్భంలో బీఆర్ఎస్ పెద్ద సంఖ్యలో వివిధ వర్గాల కోసం గురుకుల పాఠశాలలు ప్రారంభించింది.
అంటే నేరుగా ఎంపీ, జెడ్పీ, మునిసిపల్ స్కూళ్లు కాకుండా ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్పేర్, ఎస్టీ వెల్ఫేర్ ఇలా ఆయా శాఖల ఆధ్వర్యంలో నడిచే స్కూల్ ప్లస్ హాస్టల్ వ్యవస్థను గురుకులాలు అంటారు.
ఆ గురుకులాలను వందల సంఖ్యలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. వాటిలో డీఎస్సీ ద్వారా అంటే నేరుగా విద్యా శాఖ ద్వారా కాకుండా ఆయా ప్రభుత్వ శాఖలతో తమ డిపార్టుమెంట్లలోని స్కూళ్లకు కావల్సిన టీచర్లను రిక్రూట్ చేసుకుంటారు.
ఈ రిక్రూట్‌మెంట్, డీఎస్సీ ద్వారా జరిగే రిక్రూట్‌మెంట్ ఒకటి కాదు. అంటే, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రభుత్వం గురుకులాల టీచర్లను భర్తీ చేసింది కానీ, ప్రభుత్వ టీచర్లను మాత్రం భర్తీ చేయలేదు.
డిసెంబరులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఈ చర్చ జరుగుతూనే ఉంది. త్వరలోనే డీఎస్సీ వచ్చేలా కృషి చేస్తానని ప్రొఫెసర్ కోదండరామ్ ఒక వేదికపై చెప్పారు.
ప్రభుత్వం కూడా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో మెగా డీఎస్సీ అంశాన్ని చెప్పించింది. త్వరలోనే డీఎస్సీ వేస్తామని గవర్నర్ ప్రకటించారు.
ఆ క్రమంలోనే తాజాగా సీఎం రేవంత్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో, అభ్యర్థులు పరీక్షకు సిద్ధమవుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పోస్టులు ఎన్ని? 10 వేలా, 20 వేలా?
బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో ఒక సందర్భంలో 13 వేల ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పింది. విద్యాశాఖ 9 వేలకు పైగా ఖాళీలు చెప్తే చివరకు 5 వేల పైచిలుకు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు.
అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం 9,800 అంటే దాదాపు పదివేల ఉద్యోగాలు భర్తీ చేయనుందంటూ వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి మొత్తంగా తెలంగాణలో 20,740 ఖాళీలు ఉన్నట్టు విద్యా శాఖ ఉన్నతాధికారుల అంచనా.
తెలంగాణలో మొత్తంగా అనుమతి ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఒక లక్షా 22 వేలు కాగా, ప్రస్తుతం ఒక లక్షా 3 వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు.
మిగిలిన దాదాపు 20 వేల పోస్టులూ భర్తీ చేయాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

అన్ని పోస్టులూ భర్తీచేయాలి: సంఘాలు
తెలంగాణ ప్రభుత్వం మొత్తం 20 వేల పోస్టులను భర్తీ చేయాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
దీనిపై వివిధ సంఘాలు తమ డిమాండ్లను బయట పెట్టాయి.
‘‘ఈ డీఎస్సీ తక్షణమే నిర్వహించాలి. తెలంగాణలో పదేళ్ల నుంచి ఈ పరీక్ష జరగలేదు. అంతేకాదు, మొత్తం 22 వేల పోస్టులు భర్తీ చేయాలి. 2008లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభమైంది. కానీ దానికి ప్రత్యేక టీచర్లను పెట్టలేదు. ఇప్పుడున్న టీచర్లే ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు చెబుతున్నారు. ఇంగ్లిష్ మీడియంలో 13 వేలు, తెలుగు మీడియంలో 9 వేలు కలిపి, మొత్తం 22 వేల పోస్టులు భర్తీ చేయాలి. కానీ ప్రభుత్వం మాత్రం విద్యా హక్కు చట్టం రేషియో ప్రకారం లెక్కలు చెబుతోంది. తాజాగా రిటైర్ అవుతున్న వారిని వాళ్లు గణించడం లేదు’’ అని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు బీబీసీతో అన్నారు.
‘టెట్’ కూడా నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ కోరుతోంది.
ఈ పోస్టుల భర్తీ విషయంలో నిరుద్యోగులు, ఉద్యోగ సంఘాలతో చర్చించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
మొత్తం 24 వేల ఖాళీలతో పాటు అదనంగా ఎయిడెడ్ స్కూళ్ల ఖాళీలు, ఇతర బోధనేతర సిబ్బంది పోస్టులూ భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎప్పటికి పూర్తవుతుంది...
ప్రభుత్వం మెగా డీఎస్సీ విషయంలో ప్రకటనలు చురుగ్గా చేస్తున్నప్పటికీ, వాస్తవంగా అంత వేగంగా రిక్రూట్‌మెంట్ అవుతుందా అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే టెట్ – టీఆర్టీ పరీక్ష నిర్వహించిన తరువాతే ఈ డీఎస్సీ పెట్టాలని కొందరు కోరుతున్నారు. అప్పుడు ఖాళీలు ఇంకా పెరుగుతాయని వారి వాదన.
చాలా కాలంగా టీచర్ల ప్రమోషన్లూ, ట్రాన్సఫర్లూ పెండింగులో ఉన్నాయి. ఆ వ్యవహారం పూర్తయ్యాకే డీఎస్సీ పెట్టాలనీ, ప్రమోషన్ల సంగతి తేలిపోతే అప్పుడు రిక్రూట్మెంట్ సులువు అనేది మరొక వాదన.
ప్రభుత్వంటెట్, ప్రమోషన్ల తరువాతే డీఎస్సీ అంటే మాత్రం మరో ఆరు నెలలు సులువుగా జరిగిపోతుందని విద్యా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
అంతేకాదు, న్యాయపరమైన చిక్కులతోపాటు లోక్‌సభ ఎన్నికలు కూడా ఈ ప్రక్రియకు అడ్డం కావచ్చనేది వారి అనుమానం.
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ లోపు డీఎస్సీ పూర్తి చేయాలని మరికొందరు విద్యార్థులు కోరుకుంటున్నారు.
‘‘వచ్చే జూన్ లో కొత్త విద్యా సంవత్సరం మొదలవుతుంది. కనీసం రాబోయే విద్యా సంవత్సరం నుంచి అయినా పేదలు చదువుకునే పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉండేలా చూడాలి.
ఇప్పటికే రాష్ట్రంలో ఆరు వేల స్కూళ్లు కేవలం ఒకే ఒక టీచర్‌తో నడుస్తున్నాయి. అలా కాకుండా మే లోపు ఈ భర్తీ పూర్తయితే కొత్త విద్యా సంవత్సరం నుంచి కొత్త ఉపాధ్యాయులతో విద్యార్థులకు ఉపయోగం ఉంటుంది’’ అని ఎస్ఎఫ్ఐ నాయకుడు నాగరాజు అభిప్రాయపడ్డారు.
లోక్‌సభ ఎన్నికలు, న్యాయపరమైన చిక్కులు, ప్రమోషన్ల గొడవలూ – వీటన్నింటినీ దాటుకొని ప్రభుత్వం నియామక ప్రక్రియను అభ్యర్థులు ఆశించినట్టు పూర్తి చేయగలుగుతుందా అన్నది చూడాలి.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: గంజాయి సాగు చేయకపోతే బతికేలా లేమని ఆ రైతులు ఎందుకు అంటున్నారు?
- ఆంధ్రప్రదేశ్: పుంజుది దక్షిణ అమెరికా.. పందెం గోదావరి జిల్లాలో
- ‘బతికున్నవారి కంటే శవాలే నయం’.. మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేసే మహిళ
- కాళేశ్వరం ప్రాజెక్ట్: తెలంగాణ మంత్రుల పర్యటనతో తేలిందేమిటి... కుంగిన మేడిగడ్డ బరాజ్ పియర్లను ఏం చేస్తారు?
- 6 గ్యారెంటీలకు ఎక్కడ, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? రైతు భరోసా, ఉచిత కరెంటు, రూ.4,000 పింఛను పథకాలకు ఎవరు అర్హులు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














