ఆంధ్రప్రదేశ్: పుంజుది దక్షిణ అమెరికా.. పందెం గోదావరి జిల్లాలో

Rooster Fights

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగంటే మొదట గుర్తొచ్చేది కోళ్ల పందేలు.

ఏటా కోడి పందేలకు ఆదరణ పెరుగుతోంది. పండుగంటే కోడి పందేలు తప్పనిసరి అన్నట్లు పరిస్థితి మారింది.

కోళ్ల పందేల నిర్వహణపై అభ్యంతరాలు, విమర్శలూ ఉన్నప్పటికీ, పోలీసులు అనుమతులు నిరాకరించినప్పటికీ, సుప్రీంకోర్టు వరకు వెళ్లి అనుమతులు తెప్పించుకున్న సందర్భాలు ఉన్నాయి.

అయితే, పండుగ ఇంకా మొదలుకాక ముందే, అందుకు సన్నాహాలు మొదలైపోయాయి.

హైటెక్ హంగులు, ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో కోడిపందాల కోసం ఆడంబరంగా సిద్ధమవుతున్న బరులు అందుకు సాక్ష్యలుగా మారాయి.

ఇటీవల ఈ కోడిపందాల నిర్వాహకులు మరో అడుగుముందుకేశారు.

కుక్కుటశాస్త్రం పేరుతో నాణ్యమైన లోకల్ కోడిపుంజులను ఎంచుకుని పందేలకు సిద్ధం చేసే స్థాయి నుంచి విదేశీ కోళ్లను సైతం దిగుమతి చేసుకుని రంగంలో దింపే ఏర్పాట్లు చేస్తున్నారు.

పందెం కోళ్లు
ఫొటో క్యాప్షన్, ఉభయ గోదావరి జిల్లాల్లో పందెం కోళ్లకు గిరాకీ పెరిగిందని కోళ్ల పెంపకం దారులు చెప్తున్నారు.

ముఖ్యంగా లాటిన్ అమెరికాలోని పెరూ నుంచి దిగుమతి చేసుకున్న కోళ్లకు మంచి ఆదరణ లభిస్తోందని కూడా అంటున్నారు.

పెరూ జాతి పుంజులను ఈసారి పందాలకు బాగా ప్రాధాన్యతనిస్తున్నట్టు చెబుతున్నారు పెంపకందారులు.

అందుకు అనుగుణంగానే కోడిపందాలకు పుంజులను సిద్ధం చేసే ప్రయత్నమిప్పుడు కుటీర పరిశ్రమగా మారుతోంది.

ఉభయ గోదావరి జిల్లాల్లో పదుల సంఖ్యలో నాటుకోడి పుంజుల పెంపకం కేంద్రాలు దర్శనమిస్తున్నాయి.

కోడిపుంజులు
ఫొటో క్యాప్షన్, ఉభయగోదావరి జిల్లాల్లో కోడిపుంజుల కేంద్రాలు పదుల కొద్దీ ఉన్నాయి.

పదుల కొద్దీ పెంపకం కేంద్రాలు..

కోడిపందేలంటే సంక్రాంతి ముందు ఎవరికి వారు, తాము పెంచుకుంటోన్న కోడిపుంజులను తీసుకుని ఓ చోట చేరి, పుంజుల సామర్థ్యాన్ని అంచనా వేసుకుని పందేలు వేసుకునేవారు.

కానీ ఇప్పుడు కోడిపందేలు అంటే కేవలం పుంజుల సమరంతోనే ఆగడంలేదు. వాటిపై సాగే పందేలు కూడా భారీ మొత్తాలకు చేరాయి.

ఒక్కో కోడిపుంజు మీద ఐదు నుంచి పదిలక్షల రూపాయల వరకు పందేలు కాసే పరిస్థితి రావడంతో పుంజుల ఎంపిక కీలకంగా మారింది.

అందుకు అనుగుణంగా నాణ్యమైన పుంజులను పెంచడమే వృత్తిగా మలచుకుంటున్నారు కొందరు.

నాణ్యమైన కోడిపుంజులను ఎంచుకుని, వాటికి తగిన పెట్టలను కూడా సిద్ధం చేసి, మరింత సమర్థవంతమైన పుంజులను తయారుచేసే ప్రక్రియ ఓ కుటీర పరిశ్రమగా మారుతోంది.

ఉభయ గోదావరి జిల్లాల్లో పదుల సంఖ్యలో కోడిపుంజుల పెంపకం కేంద్రాలు పుట్టుకొచ్చాయి. ఒక్కో చోట వందలాది కోడి పుంజులు సిద్ధమవుతున్నాయి.

సంక్రాంతి సందర్భంగా ఈసారి పెద్ద సంఖ్యలో కోడిపుంజుల అవసరం ఉంటుందన్న అంచనాతో, కోడిపుంజులను సిద్ధం చేస్తున్నారు.

పెరూ కాకి
ఫొటో క్యాప్షన్, పెరూ కాకి

పెరూ జాతి కోళ్లకు క్రేజ్..

కోడిపుంజుల పెంపకం ఇప్పుడు ఉపాధి మార్గంగా మారడంతో అనేక మంది విద్యావంతులు కూడా తమ ఉద్యోగాలకు స్వస్తి చెప్పి రంగంలో దిగుతున్నారు.

మరింత మెరుగైన కోడిపుంజులను సిద్ధం చేసే మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కోడిపుంజుల సామర్థ్యాన్ని తెలుసుకుని, వాటిని దిగుమతి చేసుకునే యత్నం జరుగుతోంది.

గతంలో కూడా సైప్రస్, మంగోలియా వంటి దేశాల నుంచి కొన్ని జాతులను దిగుమతి చేసుకున్నారు.

ప్రస్తుతం లాటిన్ అమెరికాలోని పెరూ జాతి కోళ్లకు మంచి డిమాండ్ ఉండడంతో వాటికే ప్రాధాన్యతనిస్తున్నారు.

పెరూ నుంచి దిగుమతి చేసుకున్న పుంజులను బ్రీడ్‌గా మార్చుకుని, వాటి నుంచి మరిన్ని పుంజులను తయారు చేసే ప్రక్రియ జరుగుతోంది.

ఆ క్రమంలో పెరూ నుంచి వచ్చిన తొలితరం కోళ్లతో పోలిస్తే మూడు, నాలుగు తరాల కోళ్లు మరింత సమర్థవంతంగా కనిపిస్తున్నాయని నిర్వాహకులు అంటున్నారు.

కోడిపుంజులు

'ఆర్డరిస్తే విమానంలో కోళ్లను పంపుతారు'

తూర్పు గోదావరి జిల్లా ద్వారకా తిరుమల ప్రాంతానికి చెందిన డి.ఆంజనేయులు ప్రైవేటు బ్యాంకులో పనిచేసేవారు. తన ఉద్యోగానికి స్వస్తి పలికి, పందెం పుంజుల పెంపకంలో ఉన్నారు.

తనలాగే వందల మంది పందెం కోళ్లను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు బీబీసీతో చెప్పారు ఆంజనేయులు.

ఆయన మాట్లాడుతూ, "పెరూ కోడిపుంజుల కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇస్తే, విమానంలో పంపిస్తారు.

మొదట అవి ఇక్కడి వాతావరణానికి అలవాటుపడేలా చూస్తాం. ఆ తర్వాత మరిన్ని పుంజులను సిద్ధం చేసేందుకు తగిన పెట్టలను ఎంచుకుంటాం.

వాటి గుడ్లను పొదిగించిన తర్వాత వచ్చే కొత్త జనరేషన్ మరింత క్వాలిటీగా వస్తోంది.

కోడి పందేలు

ఫొటో సోర్స్, Getty Images

అలా వచ్చిన మూడో తరం పెరూ పుంజులు ఈసారి పందాల్లో ఎక్కువ ఆకర్షణీయంగా ఉన్నాయి.

వాటి కాళ్లలో బాగా కదలిక ఉంటుంది. బలం కూడా ఎక్కువే.

వేగంగా కదిలి ప్రత్యర్థి పుంజులను చిత్తు చేయగలుగుతున్నాయి. అందువల్ల వాటికి ఎక్కువ గిరాకీ పెరుగుతోంది" అని చెప్పారు.

పెద్ద సంఖ్యలో వెలుస్తున్న పందెం పుంజుల పెంపక కేంద్రాల్లో పలువురికి ఉపాధి కూడా లభిస్తోంది.

కోళ్లకు ఆహారం అందించడం, వాటి ఆరోగ్య పరిస్థితిని గుర్తించి, తగిన మందులు అందించడం, ఇతర జంతువుల బారిన పడకుండా కాపాడడం సహా పలు బాధ్యతలు నిర్వహించేందుకు సిబ్బంది అవసరం ఏర్పడింది.

కోడిపందేలు

ఫొటో సోర్స్, Naresh

ఫొటో క్యాప్షన్, కుక్కుటశాస్త్ర పుస్తకం

కుక్కుట శాస్త్రం ఆధారంగా..

కోడిపుంజుల్లో దేశవాళీ రకాలుగా భావించే డేగ, పచ్చ కాకి, నెమలి, సవళ, రసంగి వంటి రకాలు ప్రధానంగా పోటీలో కనిపిస్తుంటాయి.

రంగులను బట్టి కోళ్లను వివిధ పేర్లతో పిలుస్తారు. అంతేకాకుండా ఏ రకం కోడి ఏ కోడితో, ఏ సమయంలో పందేలకు దిగితే ఫలితాలొస్తాయన్నది కూడా శాస్త్రబద్ధమేనని స్థానికులు చెబుతుంటారు.

కుక్కుటశాస్త్రం తమ తాతల కాలం నుంచి కూడా ఉందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలానికి చెందిన సత్యన్నారాయణ రాజు బీబీసీకి వివరించారు.

నక్షత్రాల ఆధారంగా పందెంకోళ్లను పోటికి ఎంపిక చేస్తామంటున్నారు.

పెరూ పెట్ట
ఫొటో క్యాప్షన్, పెరూ పెట్ట

పుంజు ఖరీదు లక్షల్లో..

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చుక్కా రత్తయ్య తన పామాయిల్ తోటలోని ఐదెకరాల విస్తీర్ణంలో కోడిపుంజుల పెంపకం చేస్తున్నారు.

అదనపు ఆదాయం కోసం ఎదురుచూసే వాళ్లు బాధ్యతగా చేసుకుంటే పందెం కోళ్ల పెంపకంలో ఆదాయానికి ఢోకా ఉండదని ఆయన బీబీసీతో అన్నారు.

కోడి పుంజుల ధర గురించి ఆయన మాట్లాడుతూ "అన్నింటిలోనూ ఇప్పుడు పెరూవియన్ జాతి పుంజులకు డిమాండ్ కారణంగా ఒక్కో పుంజు ఖరీదు లక్ష దాటుతోంది.

సీజన్‌లో బాగా డిమాండ్ ఉంటే పుంజు ఖరీదు మూడు, నాలుగు లక్షల రూపాయలకు కూడా చేరుతుంది" అన్నారు.

పుంజుల పెంపకం కేంద్రాలు సంఖ్య పెరగడంపై ఆయన మాట్లాడుతూ, "పుంజులకు ఉన్న క్రేజ్ కారణంగానే ఇప్పుడు కోడిపుంజుల పెంపకం కేంద్రాలు వెలుస్తున్నాయి.

నేను మొదట ఆటో నడుపుతూ, కూరగాయల వ్యాపారం చేశాను. ప్రస్తుతం కోడిపుంజుల కేంద్రం నడుపుతున్నాను.

నాణ్యమైన మేలు జాతి పందెం కోళ్లను సిద్ధం చేయాలంటే, ఏడాది పొడవునా పని ఉంటుంది.

ప్రస్తుతం మా దగ్గర ఆరుగురు పనిచేస్తున్నారు. 300 వరకూ పుంజులున్నాయి. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు, ఏడు జిల్లాల నుంచి మాకు కస్టమర్లున్నారు" అని బీబీసీతో చెప్పారు చుక్కా రత్తయ్య.

పెరూ జాతి కోడి
ఫొటో క్యాప్షన్, పెరూ జాతి కోడి

కోళ్లకు జీడిపప్పు, పిస్తాలు పెట్టి..

చిన్నపిల్లగా ఉన్నప్పుడే కోళ్లను పరిశీలించి, ఎంపిక చేసిన వాటిని ప్రత్యేకంగా పందెం కోసం సిద్ధం చేస్తారు.

సుమారు ఏడాది దాటిన వయసున్న కోడిపుంజులను ఎంపిక చేసి, వాటికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. సంక్రాంతి కోడిపందేల కోసం సెప్టెంబర్ నుంచే సన్నాహాలు షురూ అవుతాయి.

కోడిపుంజులకు నాణ్యమైన ఆహారం అందిస్తారు. అందులో జీడిపప్పు, బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. కొన్నిచోట్ల కోడి పుంజులకు మటన్ కైమా, కోడిగుడ్డు కూడా ఆహారంగా ఇస్తారు.

సాధారణంగా అందించే రాగులు, గంట్లు, మెరికలు వంటి వాటితోపాటు అదనంగా ఈ ఖరీదైన ఆహారం కూడా కోడిపుంజులకు అందుతోంది.

పౌష్టికాహారంతో పాటుగా రోజూ కసరత్తులు చేయిస్తారు. కోడి పుంజులు స్విమ్మింగ్, రన్నింగ్ చేసేందుకు ఏర్పాట్లుంటాయి.

ఇలాంటి పందేలకు పుంజులను సిద్ధం చేయడానికి కొందరు నిపుణులు కూడా ఉన్నారు.

తగిన కోళ్లను ఎంపిక చేయడం, వాటికి తర్ఫీదు ఇవ్వడం, పందాలకు సిద్ధం చేసి, కోళ్లను పందెం బరిలో నిలిచేందుకు తగ్గట్టుగా సన్నద్ధం చేయడం కోసం నిపుణుల అవసరం పెరుగుతోంది.

రాను రాను అర్భాటంగా మారుతున్న కోడిపందేల్లో, విదేశీ జాతుల కోళ్లకు ప్రాధాన్యత పెరుగుతుండడం విశేషంగా మారుతోంది.

'ఇది అందరికీ సాధ్యం కాదు'

చుక్కా రత్తయ్య మాట్లాడుతూ, "కోడిపుంజులను పందాలకు సిద్ధం చేసే ప్రక్రియ అందరితో సాధ్యం కాదు. ఉదయం నాలుగు గంటల నుంచే వాటికి అవసరమైన ఆహారం అందించడంతో మా రోజువారీ పని మొదలవుతుంది.

ఎక్కడైనా ఒక్కో కోడి కొంత తేడాగా కనిపిస్తే వెంటనే గుర్తించాలి. బ్యాక్టీరియా, వైరస్ ప్రభావాలతో సమస్యలు వస్తుంటాయి. సకాలంలో గుర్తించకపోతే పెద్ద సమస్యే.

అన్ని కోళ్లను ఒకేసారి నష్టపోవాల్సి వస్తుంది. సమయానికి టీకాలు, మందులు అందించాలి. అవసరమైన విటమిన్స్, మినరల్స్ కూడా అందించాలి.

చిన్నపిల్లలను చూసుకున్నట్టుగా సంరక్షిస్తేనే, పుంజులు ఆరోగ్యంగా, పందాల్లో రాణించేందుకు తగ్గట్టుగా తయారవుతాయి" అన్నారు.

పందెం కోళ్లు

పందేల నిర్వహణపై అభ్యంతరాలు..

అయితే, కోడి పందేలకు ఉన్న ఆదరణ సంగతి అటుంచితే, నిర్వహణపై పలు అభ్యంతరాలు ఉన్నాయి. కోడిపందేల కారణంగా పెద్ద మొత్తంలో జూదాలకు ఆస్కారం ఏర్పడుతుందన్న విమర్శలున్నాయి.

అంతేకాకుండా కత్తులు కట్టి కోళ్లను బరిలో దింపడం వల్ల జీవహింస జరుగుతుందన్న వాదన కూడా ఉంది.

ఆ అభ్యంతరాల నేపథ్యంలో పలు సందర్భాల్లో పోలీసులు కోడిపందాలను అడ్డుకుని, నిర్వాహకులపై కేసులు కూడా నమోదు చేస్తుంటారు.

అయితే సంక్రాంతి సందర్భంగా సంప్రదాయ క్రీడగా కోడిపందాలకు అనుమతి ఇవ్వాలన్న డిమాండ్ ఓ వర్గం నుంచి వినిపిస్తోంది.

దీనిపై గతంలో సుప్రీంకోర్టు వరకు వెళ్లి, కోళ్లకు కత్తులు కట్టకుండా పందేలు నిర్వహించుకోవడానికి అనుమతి కూడా తెచ్చుకున్న సందర్భం కూడా ఉంది.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)